ఆకాశమంత
Aakasamantha
Samanthakamani
"ఓర్చుకోవాలి తల్లీ " అనే ఈ సప్తాక్షరాలు, శాపాలై తరతరాల నుంచి ఆడపిల్లల జీవితాల్లో నిర్వేదగానం చేస్తున్నాయి. క్షమయా ధరిత్రి ఇంకా పల్లవిస్తూనే ఉంది. మార్పు అనివార్యం. అత్యంత సహజం. ఓర్పు నుండి నేర్పు వైపు సాగే ప్రస్థానంలో గెలుపు - ఓటమి, పడటం-లేవటం, జీవన పోరాటంలో నిరంతర ప్రక్రియ. రచయిత జీవితమే రచనా వ్యాసంగం వైపు నడిపించింది. ఆర్థిక, సామాజిక ,రాజకీయ అవగాహన, చారిత్రక భౌతిక పరిస్థితులు, తాత్వికచింతన ,శక్తిగా మార్చేందుకు చోదకాలని జీవితానుభవాలు నేర్పాయి నేర్పుతున్నాయి. ఈ నేపథ్యంలో శోధన సాధన లక్ష్యంగా సాగుతున్న జీవనయానంలో ఎదురైన అనుభవాలే ఆకాశమంత కథాంశాలు. స్త్రీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనే శక్తినిచ్చే కథలివి. జీవన పోరాటం తప్ప అనవసరం సౌకుమార్యం, లాలిత్యం,మరో భుజం పై వాలిపోయే మనస్థత్వం ఈ పాత్రల్లో ఉండవు. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన జీవితానికి తానే మార్గం ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కథలన్నీ ఉంటాయి ఎక్కడా, స్త్రీ సౌందర్య వర్ణన ఉండదు మనో నిబ్బరం, ఆత్మస్థైర్యానికి పెద్ద పీట వేయటం ఈ కథలలో ప్రధాన లక్ష్యం. ఈ పాత్రలు పరిపూర్ణమైన స్త్రీలు. ఓటమిని అంగీకరించని అపరాజితలు. అసలా ఆలోచన కూడా ఉండని ధీరోదాత్తలు. "నేర్చుకోవాలి తల్లీ" అని దిశానిర్దేశం చేయడం ఆకాశమంత ప్రత్యేకత. వృత్తిరీత్యా రైల్వే ఉద్యోగిని, ప్రవృత్తి రీత్యా రచయిత అనువాదకురాలు, దర్శకురాలు, కళాకారిణి, సామాజిక కార్యకర్త అయినా డాక్టర్ దుట్టా శమంతకమణి గారి గురించి వారి మాటల్లోనే చెప్పాలంటే "కనుదోయిలో కలలు కరిగి, కన్నీటి సాగరాన్ని ఈది, నీళ్లు రాని కళ్ళకు అధినేత్రినై, అక్షర సేద్యం ఆరంభించిన అమ్మను. భారతీయ రైల్వే నా బ్రతుకు బండి మార్గం, ఆశయాల పందిరిలో సజ్జన సాంగత్యం, ప్రజా కళల నందనం ,సాహితీ పూలవనం, నా స్వప్నం నా గమ్యం."
A collection of short stories by Dr. Samantakamani.