కాశీ మజిలీ కథలు Vol 1
Kaasi Majilee Kathalu Vol 1
Madira Subbanna Deekshitulu
కాశీ మజిలీ కథలు - తెలుగు వారికి పరిచయం అవసరం లేని సుందర సాహితీ వనం. ఈ సాహిత్య నందనోద్యానవనాన్ని వెలయించిన వారు ఉభయ భాషా పండితుడు, కవి, తన ఇరవయ్యో ఏటనే అష్టావధానాలు చేసి పండితుల మెప్పు పొందిన శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులు. ఆంధ్ర దేశాన్ని ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఆ కాశీ మజిలీ కథలను, అప్పటికీ ఇప్పటికీ భాషలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని సామాన్యులు సైతం చదివి ఆనందించేలా తెలుగు వారందరికీ నిత్య వాడుక భాషలో అందుబాటులోకి తేవాలని రాజమండ్రి కేంద్రంగా ఎనభై ఏళ్లకు పైగా ప్రచురణ రంగంలో ఉంటూ వేలాది పుస్తకాలను ప్రచురించి తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న గొల్లపూడి వీరాస్వామి సన్ సంస్థ వారు సంకల్పించారు. తదనుగుణంగా, తెలుగు భాషా ప్రవీణులు శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఆ కథలను సుమధురమైన సరళ వచనంలో తిరిగి వ్రాయించి పన్నెండు భాగాలలో ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఈ సంపుటాలు గత నాలుగేళ్లుగా విశేషమైన పాఠకాదరణ పొందుతున్నాయి. ఈ కాశీ మజిలీ కథలలోని అసలు విషయానికి వస్తే, విద్యావంతుడైన మణిసిద్ధుడు అనే ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి, కాశీ వెళ్లేందుకు సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోగా, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండటంతో, ఎవరైనా తోడు ఉంటె బాగుంటుందని భావిస్తాడు. ఎందరిని అడిగినా వారు ఏదో ఒక కారణంతో మణిసిద్ధుడితో రావటానికి సిద్ధపడరు. చివరకు శ్రీరంగపురం అనే గ్రామంలో పశువులు కాసుకునే ఒక అనాధ, కోటప్ప తాను వస్తానని, అయితే మార్గం పొడవునా తనకు ఆహ్లాద కరమైన వింత వింత కథలు చెపుతూ అలసట లేకుండా చేయాలని నిబంధన విధిస్తాడు. అందుకు మణిసిద్ధుడు అంగీకరిస్తాడు. అలా ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కథలు చెప్పుకుంటూ మజిలీలు చేసుకుంటూ కాశీ ప్రయాణం చేయటం 'కాశీ మజిలీ కథల' ప్రధాన ఇతివృత్తం.
ఈ కథలలో శృంగారం మొదలుకుని, ప్రేమ, కామం, భక్తి, పురాణాలు, ధర్మం, చరిత్ర, లోక జ్ఞానం, లోక ప్రవృత్తి, వృత్తులు, యాత్రా జీవనం, వైరాగ్యం, వేదాంతం వరకూ ఒకటేమిటి, మానవ జీవితాలకు సంబంధించి స్పృశించని అంశమంటూ లేదు. చదువరులలో వివేకాన్ని కలిగించి విజ్ఞానాన్ని అందించడంతో పాటు వినోద భరితమూ, చిత్ర విచిత్రమూ అయిన వందలాది కథలు, ఉపకథలు, గొలుసు కథలు దీనిలో అంతర్భాగంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉండి, వివిధ కారణాలచేత చదవడం రాని, లేదా చదివే సమయమూ తీరికా, అవకాశమూ లేని పుస్తక ప్రియులకు ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని శ్రవణ రూపంలో తన మొబైల్ యాప్ ద్వారా అందిస్తున్న ఏకైక వేదిక దాసుభాషితం, తెలుగు సాహితీ చరిత్రలో ప్రముఖ స్థానం పొందిన ఈ కాశీమజిలీ కథలను గొల్లపూడి వీరాస్వామి సన్ సంస్థ ఈ తరం అధిపతులు, శ్రీ జి.వి.వి రమణమూర్తి, శ్రీ జి.వి.వి నాగేంద్రకుమార్ సోదరుల సౌజన్యంతో శ్రవణ రూపంలో అందిస్తున్నది. వినండి. కాశీ మజిలీ కథలు. మొదటి సంపుటం. శ్రవణానువాదం గళం కొండూరు తులసీదాస్.
Audio version of the first volume of the famous Kaasi Majilee Kathalu. Written by Pandit Madhira Subbanna Deekshitulu. Re-written by Sri Bhagavatula Subramanyam. Produced by Dasubhashitam for Publishers Gollapudi Veeraswamy Son, Rajahmundry.