విల్ఫ్రెడో పరేతో.
ఈయన 19-20వ శతాబ్దపు పేరెన్నికగన్న ఆర్ధిక శాస్త్రవేత్తలల్లో ఒకరు.
అప్పటి ఇటలీ దేశంలో భూస్వామ్యాన్ని వివరిస్తూ, 80 శాతం భూమి కేవలం 20 శాతం ప్రజానీకం చేతుల్లో ఉందని సూత్రీకరించాడు.
మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ జాన్ జురాన్ ఈ సూత్రాన్ని వ్యాపార రంగానికి అన్వయిస్తూ,
దాదాపు 80% అమ్మకాలు 20% కొనుగోలుదారుల నుంచే వస్తాయన్నాడు.
దీనికి ఆయన Pareto Principle అని నామకరణం చేసాడు.
రానురాను ఈ సూత్రం అన్ని రంగాల్లోనూ విస్తృతంగా వాడబడటం వల్ల, ఇలా సాధారణీకరించ బడింది.
దాదాపు 80% సంఘటనలను ప్రభావితం చేసేది 20% కారకములే.
ఇలా 80-20 సూత్రీకరణ వల్ల, ఇది 80/20 రూల్ గా కూడా ప్రాచుర్యం పొందింది.
ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకంటే, ‘దాసుభాషితం’ యాప్ ను ఫోన్ లోనుంచి తీసేసేవారిని (Uninstallers), అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఇమెయిల్ పంపిస్తే, పలువురు యాప్ లో ప్రకటనల ‘నాణ్యత’ కారణం అన్నారు.
మీరు గమనించండి, వారు ప్రకటనలు అనలేదు, ప్రకటనల ‘నాణ్యత’ అన్నారు. ఒకరు, ‘దాసుభాషితం’ యాప్ ను మహిళలు, పిల్లలు కూడా ఉపయోగిస్తున్నారు, యాప్ లో వచ్చే కొన్ని ప్రకటనలు వల్ల, ఇబ్బందిగా ఉంటోంది, కొంచెం చూడండి, అంటూ ఒకరు సున్నితంగా సూచిస్తే, మరొకరు, కొంచెం ఘాటుగానే, మీ యాప్ ను వేరే వారికీ పరిచయం చేయలేక పోతున్నాను, అందుకే తీసేస్తున్నాను అన్నారు.
ఇలా చెప్పినది ఏ కొద్దిమందే అయి ఉండవచ్చు కానీ, 80/20 నియమం ప్రకారం, ఇదే ఇబ్బంది వల్ల యాప్ ను Uninstall చేసి మాకు చెప్పని వారు చాలా మందే ఉంటారు. అందుకనే ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాము.
యాప్ లో ప్రకటనలు Google సంస్థ నుంచి వస్తాయి. యాప్ లో ఒక చిన్న కోడ్ చేరిస్తే చాలు. వినియోగదారుల వ్యక్తి చిత్రణ (ప్రొఫైల్) ను బట్టి ఆ సంస్థ ప్రకటనలను చూపిస్తుంది.
యాప్ విడుదల చేసినప్పటి నుంచే అశ్లీల ప్రకటనల అనుమతిని నిరాకరించాము కనుక అటువంటి వాటి ప్రసక్తి ఉండదు, మరి ఏ ప్రకటనలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయని విశ్లేషిస్తే, డేటింగ్ యాప్స్ వంటివని తెలిసింది.
దానితో ఇపుడు ఇంకా కఠినతరమైన యాడ్ కంటెంట్ ఫిల్టర్ ఎంచుకున్నాము. ఇది చేసినప్పట్నుంచి యాప్ కు ఆదాయం 16% తగ్గినా, వినియోగదారులకి మెరుగైన, సురక్షితమైన కంటెంట్ అందించడానికి కట్టుబడి ఉన్నాము. ఇంకా ఏమైనా ప్రకటనలు మీకు అసౌకర్యం కలిగిస్తే తక్షణమే మాకు చెప్పండి. తప్పక పరిశీలిస్తాము.
అంజలీ దేవి
ఆగష్టు 21 ప్రముఖ నటి కీ.శే. అంజలి గారి జయంతి.
అప్పటి గొప్ప నటీమణుల్లో ఒక్కక్కరిది ఒకో విశిష్టత. భానుమతిది బహుముఖ ప్రజ్ఞ అయితే, సావిత్రిది ప్రేక్షకులని కట్టి పడేసే నటన. అంజలీ దేవిది వృత్తి దీర్ఘత.
ఏ వయసులో చేయ వలసిన పాత్రలను ఆమె ఆ వయసులో చేశారు. చాలా. ఏ వయసులో చేయవలసిన పాత్రలను ఆమె ఆ వయసులో చేశారు. చాలా. యవ్వనంలో అనార్కలిగా, ఆ తరువాత లీలావతిగా, సీతగా, వదినగా, తల్లిగా, ఆమె వయసును బట్టి అలరించారు. అంత నిడివి ఉన్న వృత్తి జీవితం, కళాకారులందరికీ రాని అదృష్టం.
ఆమెతో ముఖాముఖీలో కీలుగుఱ్ఱం చిత్రంలో రాక్షస పాత్ర వేయడం ఇష్టం లేకపోతే ఎవరు ఒప్పించింది, ఎన్నడూ చేయనిది, ఏ పాత్ర విషయంలో ప్రేక్షకులు స్వీకరించాలని దేవుళ్ళకు మొక్కుకుంది, తన మనుమరాలు చిత్ర రంగంలోకి వస్తూ వస్తూ ఎందుకు తప్పుకుంది, ఇంకా అప్పటి నటీమణుల్లో పోటీతత్వాన్ని చెప్పకనే చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంటాయి.
తిరుమల చరితామృతం 4వ భాగం
జీతాలు ఇవ్వడంలేదని సైన్యం పని చేయటం మానేసింది. దానికి పరిష్కారం శ్రీ వేంకటేశ్వరుడిని ఈస్టిండియా కంపెనీకి తాకట్టు పెట్టడమా? అవును. అచ్చం అలాగే చేసి కొత్త చరిత్రను సృష్టించుకున్నాడు ఆ ఆర్కాటు కుర్ర నవాబు.
ఇంకా, ఆలయాన్ని నిర్వహించవయ్యా అని అధికారం అప్పగిస్తే, గుప్త నిధుల కోసం ఆలయ ధ్వజ స్థంభం త్రవ్వి శిక్షకు గురైన ఆ మహంతు ఎవరు? తిరుమల ఆలయ చరిత్రకు సంబంధించిన ఇలాంటి విశేషాలు తిరుమల చరితామృతం నాలుగవ భాగంలో మనం తెలుసుకుంటాం.
తిలక్ కథలు 3వ భాగం
వీరా లేచి చంద్రిని రమ్మన్నాడు. చంద్రి వెనకాలే వెళ్ళింది. ఊరవతల పాక దగ్గరకు వెళ్లారు. అక్కడున్న లావుపాటి వాడితో "ఇద్దరికీ సుక్కపొయ్యి" అన్నాడు. అతడు రెండు ముంతలతో కల్లునీ మాంసాన్నీ ఇచ్చాడు.
చంద్రి తాగనంది 'ఛీ ఛీ' అంది. 'తాగు చంద్రీ. లేందే సచ్చిపోతావు" అన్నాడు వీరయ్య. చంద్రి నోట్లో బలవంతంగా పోశాడు. ఇద్దరూ తూలుతూ వచ్చి పొలం గట్టు మీద కూర్చున్నారు.
గుండెలు చిక్కబట్టుకుని చదివించే ఈ సన్నివేశం “సముద్రపు అంచులు" కథలో మనం చూస్తాం.
వినండి తిలక్ కథలు మూడవ చివరి భాగం.