1955 లో ఉడన్ ఖొటాల అనే హిందీ చిత్రం విడుదలయ్యింది.
ఈ చిత్రానికి నిర్మాత, సంగీత దర్శకుడు, నౌషాద్. ఇది తమిళ్ లో డబ్ చేయబడి, ‘వాన రథం’ గా విడుదలయ్యింది.
దీనిలో పాటలు హిందీలో లతా మంగేష్కర్ చేత, తమిళంలో రావు బాలసరస్వతి చేత పాడిద్దామని నౌషాద్ ప్రణాళిక. రావు బాలసరస్వతిని బొంబాయికి రప్పించి రెండు పాటలు రికార్డు చేయించారు, బాగా పాడావని నౌషాద్ మెచ్చుకున్నారుట కూడా. కానీ పాటలన్నీ పూర్తికాకుండానే ఆమెను మద్రాస్ తిరిగి పంపించేశారు. చివరికి చిత్రంలో కేవలం ఒక పాట మాత్రమే ఉంది. మిగతావి, తమిళంలో కూడా పాడినది - లతా మంగేష్కర్!
ఈ విషయం చెప్పింది స్వయానా రావు బాలసరస్వతి గారే. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె వయసు 27 సంవత్సరాలు, లతా మంగేష్కర్ వయసు 26. అపారమైన ప్రతిభ, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి, ఆ వయసులో ఉండే దూకుడు తోడై, అన్నిటా ఏకచ్ఛత్రాధిపత్యం చేయాలని లతా భావించి ఉంటారు. కానీ ఆమె ఇతర భాషల్లో పాడిన పాటలకు, ముఖ్యంగా దక్షిణ భారత చిత్రాల్లో పాడిన వాటికి, ఆమె హిందీ పాటలకు వచ్చినంత కీర్తి రాలేదని చెప్పవచ్చు.
రావు బాలసరస్వతి కి హిందీ చిత్రసీమలో ఈ అనుభవం ఎదురైతే, దక్షిణ భాషల చిత్రాల్లో తన సమకాలీనులైన లీల, జిక్కి, జమునారాణి, వసంతకుమారిల మధ్య సుహృద్భావం ఉండేదని, ఎవరికీ నప్పే పాటలు వాళ్ళు పాడేవాళ్ళనీ ఆమె చెప్పారు.
శ్రీమతి బాలసరస్వతి గారితో గతంలో జరిపిన ముఖాముఖీ, Aug 28 న ఆమె జన్మదినం సందర్భంగా సమర్పిస్తున్నది దాసుభాషితం.
ఈ 20 నిముషాల ముఖాముఖీలో, 6 ఏళ్ళ ప్రాయం లో HMV గ్రామోఫోన్ రికార్డు చేసిన కళాకారిణిగా, తొలి తరం లలిత సంగీతం, నేపథ్య గాయనిగా, KL సైగల్ ప్రభావం, కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఎందుకు ముందుకు వెళ్లనిది, ఒక మంచి పాట పుట్టాలంటే కావలసిన ముడి సరకు గురించి చెప్పే విషయాలను, వినండి.
బాంధవ్యాలు 1
ఒక వ్యక్తి సాధారణ పరిచయం ఇలా ఉంటుంది.
వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో దొంగరి నారాయణ, పిచ్చమ్మ దంపతులకు 1941 డిసెంబరు 24న మల్లయ్య జన్మించాడు. పెద్దవాడైన తరవాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ధిక శాస్త్రంలో ఎం ఏ పట్టా పొందాడు. కరీంనగర్, వరంగల్లు కళాశాలల్లో ఉపన్యాస వృత్తి ద్వారా అధ్యాపకుడైనాడు.
అయితే ఆ వ్యక్తి అసాధారణ రచయిత అని చెప్పడానికి, ఇన్ని మాటల అక్కర్లేదు. కేవలం రెండు పదాలు సరిపోతాయి. ఆ రెండు పదాలే అంపశయ్య నవీన్ అనే పేరు.
అయన చిన్నతనంలో వరంగల్లులో జరిగిన 1వ ఆంధ్ర మహాసభను చూశారు. ఆ సభ తొలి రోజున, అలంకరించిన ఎడ్లబండిలో సభా ప్రముఖులను ఉత్సవంగా ఊరేగించి ప్రాంగణానికి తీసుకొచ్చిన సన్నివేశం అయనపై చెరగని ముద్ర వేసింది. అదే సన్నివేశం ఆధారంగా క్రమంగా సాహిత్యంతో పరిచయం ఏర్పరచుకున్నాడు.
1969లో ప్రియ మిత్రుడు వరవరరావు సలహా మేరకు తన పేరును నవీన్ గా మార్చుకున్నారు. అదే సమయంలో, ‘అంపశయ్య’ నవల రాయడం, అది విశేష పాఠకాదరణ సాధించి, 12 ముద్రణలు పొంది, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషలలోకి అనువదింప బడడంతో ‘అంపశయ్య’ నవీన్ గా ప్రసిద్ధులయ్యారు.
దాసుభాషితం, తొలుత ప్రసిద్ధ రచనలంన్నింటినీ శ్రవణీకరించాలనే ఉద్దేశంతో, అంపశయ్య విషయమై నవీన్ గారిని సంప్రదిస్తే, ముందు బాంధవ్యాలు చేస్తే బాగుంటుందని ఆయనే సూచించారు. ఆ సూచనను గౌరవిస్తూ, ఆ నవలను ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తోంది దాసుభాషితం.
'బాంధవ్యాలు', నవీన్ గారి నవలాత్రయంలో మూడవది. మొదటి రెండు, ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’. 1944 నుండి 1995 వరకు తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రకు అద్దం పడతాయి ఇవి. 2004లో కాలరేఖలు కు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది.
'బాంధవ్యాలు' నవలను నాలుగు భాగాలుగా అందిస్తోంది దాసుభాషితం. మొదటి భాగం ఇపుడు యాప్ లో ఉన్నది.
తిరుమల చరితామృతం 5వ భాగం
తిరుపతి శ్రీ గోవిందరాజుల ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే సింహద్వారానికి, గాలిగోపురానికి ఎదురుగా ఒక ఉపాలయం కనిపిస్తుంది. అది ఒకప్పుడు బయటినుంచి దేవాలయమే కానీ గర్భాలయం మాత్రం ఖాళీగా దర్శనమిచ్చేది. విచిత్రంగా ఉన్నప్పటికీ, అందుకు గల కారణాల కోసం చర్రిత్రను పరిశోధించగా, దానిలో ఉన్న మూల మూర్తులను పూర్తిగా మూసివేస్తూ గర్భాలయంలో గోడ కట్టబడి ఉన్నదని తేలింది. ఆ కథేంటి, గోడ కట్టిన తరువాత ఏం జరిగింది? తిరుమల చరితామృతం 77వ అధ్యాయం “700 ఏళ్ళు, గోడ వెనుక దాక్కున్నదేవుడు” లో వినండి.
వికాసం
చివరగా ఒక విషయం. దాసుభాషితం వేదికకు రెండు లక్ష్యాలున్నాయి.
ఒకటి, నేటి తెలుగు సమాజానికి, “మన భాషలో ఇంత గొప్ప సాహిత్యం ఉందా!” అనిపించేలా చేయడం. రెండు, “ఇంగ్లీష్ లో ఉన్న ఆధునిక భావాలను, భాష రాక అర్థంచేసుకోలేని ప్రజలకు, తెలుగులో అందించటం.” ఒకటి ప్రధానంగా వినోదం అయితే, ఒకటి వికాసం.
వికాసంలో ఒక అంశం, పిల్లల్లో నేర్చుకునే క్షమత. చూడడం, వినటం, రాయటం, చేయటం, ఇలా పలు విధాలుగా పిల్లలు నేర్చుకుంటారు. కొందరు కొన్ని పద్దతులపై ఎక్కువ మక్కువ చూపుతారు. కానీ అటుఇటుగా అందరూ ఒక విధానానికి, ఒక curriculum కు స్పందిస్తారు. అయితే కొంతమంది పిల్లలు, సగటు కన్నా తక్కువగా స్పందిస్తారు. వారి తల్లితండ్రులు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు.
నిజానికి, కొన్ని దశాబ్దాలుగా ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పరిశోధన జరిగింది. నేర్చుకోవటంలో ఇబ్బందులు పడే పిల్లలకే కాకుండా, పిల్లలందరిలో నేర్చుకునే సమర్ధతను పెంచటానికి చాలా ఉపాయాలున్నాయి. ఇవి తల్లితండ్రులందరికీ ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి.
కొత్త జాతీయ విద్యా విధానంలో ప్రత్యేక పాఠశాలలను రద్దు చేసినందువల్ల , తల్లి తల్లితండ్రులందరూ, తమ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఏం చేస్తే ఇంకా బాగా నేర్చుకోగలరు అనే అంశాలపై తెలుగులో అవగాహన కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని భావించి, ప్రముఖ రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్, పిల్లలల్లో నైపుణ్యం పెంచడంలో నిపుణులు, శ్రీమతి సుధా మాధవి గారిని, ఒక podcast రూపకల్పన చేయమని కోరాము.
ఆ podcast తో సెప్టెంబర్ లో వికాసం స్రవంతి ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాము.