సింగీతం శ్రీనివాసరావు గారి మీద రీసెర్చ్ చేస్తుంటే, ఒక చిక్కొచ్చింది. ఆయన వికీపీడియా పేజీ అంతా లింకుల మయం. చదవడం కొంచెం కష్టంగా ఉన్న ఆయన సాధించిన విజయాలు, పొందిన సత్కారాల వివరాలు అబ్బురపరిచాయి.
సింగీతం గారి చిత్రాలంటే తెలుగు వారికి ఆదిత్య 369, భైరవ ద్వీపం; తమిళులకు మైఖేల్ మదన కామ రాజన్, అపూర్వ సహోదరగళ్; కన్నడ వారికి హాలు జేను, చలిసువ మోడగళు, భాగ్యదా లక్ష్మి బారమ్మ గుర్తొస్తాయి. కానీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుష్పక్, లేదా పుష్పక విమానం.
ఇవన్నీ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు. ఇంకా అనేక చిత్రాలకు రచన, Screenplay, సంగీతం సహకారం అందించారు. భాగ్యదా లక్ష్మి బారమ్మకైతే సంగీత దర్శకత్వం కూడా అందించారు. ఇంత ప్రతిభకు మూలం ఆయన నాటక రంగ నేపథ్యం, సినీ రంగంలో ఎందరో ఉద్దండుల దగ్గర శిష్యరికం.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబరు 21న జన్మించిన శ్రీనివాసరావు గారు, మొదట్లో, ‘భారతి’, ‘స్వతంత్ర’ మొదలైన పత్రికల్లో కథలు, స్కెచ్ లు రాశారు. ఆరోజుల్లో వారు వ్రాసిన భ్రమ, అంత్యఘట్టం, చిత్రార్జున వంటి నాటకాలు అనేక మార్లు ప్రదర్శింప బడటమే కాక పలు నాటకోత్సవాలలో బహుమతులు గెలుచుకున్నాయి. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రార్జున నాటకం పండిట్ జవహర్లాల్ నెహ్రు ప్రశంశలు పొందింది. ఆంగ్లంలోకి అనువదింపబడి అమెరికాతో సహా అనేక దేశాల్లో ప్రదర్శింప బడింది.
నేటి తరం వారికి సింగీతం శ్రీనివాస రావు గారి రచనా కౌశల నిజరూప దర్శనం ఇస్తుంది ఈ వారం సమర్పిస్తున్న క రాజు కథలు.
ఈ 'క' రాజు కథలు చిన్న పిల్లల కథల్లాగా సునిశితమైన హాస్యంతో అతి సరళంగా ఉంటాయి. ప్రతి కథా, లోక ధర్మాన్నీ, లోకం తీరునూ, సమాజ స్వరూపాన్ని సరికొత్త కోణంలో చూపించి విశ్లేషిస్తుంది. చదువరులను ఆలోచింపజేస్తుంది. సరదాగా చదివించి , సరసంగా నవ్వించే కథలే కాదు, సమాజంలోని వైపరీత్యాలను ఎత్తి చూపి 'ఆమ్మో' అని తుళ్ళి పడేట్టు చేసే కథలూ ఉన్నాయి.
మొత్తం 21 కథలున్న ఈ కథా సంపుటాన్ని శ్రవణానువాదం చేసే ఆలోచనతో, గత సంవత్సరాంతంలో శ్రీ శ్రీనివాసరావుగారిని సంప్రదించినపుడు, 'దాసుభాషితం' శ్రవణ పుస్తకాల గురించి తెలుసుకుని, ఎంతో ముచ్చటపడి ఈ కథలు తానే చదువుతానన్నారు "అంతకన్నానా! అలాగే
కానివ్వండి" అన్నాం. ఇంతలో కరోనా కాలం ముంచుకొచ్చి దాదాపు నాలుగు నెలలుగా ఏ ఆలోచనా ఆచరణ దిశగా సాగని దుస్థితి దాపురించింది. దాంతో ఇక లాభం లేదనుకుని వారి అనుమతితో, దాసుభాషితం బృందమే ఈ కథా సంపుటాన్ని శ్రవణీకరించింది.
మా ఈ ప్రయత్నాన్ని వారు ఈ విధంగా ఆశీర్వదించారు.
[పైన ఉన్న వీడియో చూడండి]
ఈ పుస్తకం గురించి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మాకు ఈ పుస్తకాన్ని సూచిందింది దాసుభాషితం శ్రోత, మహారాజపోషకులలో ఒకరైన శ్రీ సుమంత్ గారు. ఈ పుస్తకం అచ్చు కాపీలు కానీ, ‘ఈ’ బుక్ కానీ దొరకడంలేదు. శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్న ఒకే ఒక కాపీని చెన్నై నుంచి కొరియర్ చేసుకుందామని ప్రయత్నిస్తుండగా, సుమంత్ గారే తన వద్దనున్న కాపీని స్వయంగా తెచ్చి మాకు ఇచ్చారు. మహారాజ పోషకుల పేరులో మహారాజు కేవలం అధిక చందా ఇస్తున్నందుకు కాదు. ఇలా తెలుగు భాషకి, సాహిత్యానికి మేము చేస్తున్న కృషికి పలువిధాల ఆజ్యం పోస్తున్నందుకు. సుమంత్ గారు మీకు ధన్యవాదాలు. దాసుభాషితం లో క రాజు కథలు విడుదల అవడం పూర్తిగా మీ కృషే.
డిక్షనరీ
తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసేవారిలో ఇంకొకరు శ్రీ పెద్ది సాంబశివ రావు గారు. వీరు teluguthejam.com ద్వారా భాషకు విశేష సేవ చేస్తున్నారు. ఎన్నో ఈబుక్స్ ను, నిఘంటువులు ప్రచురించారు.. 2019 లో విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో వీరిని మేము కలిసినపుడు వారు ప్రచురించిన నిఘంటువులు గురించి చెప్పారు.
Google Translate, ఆంధ్ర భారతి ఉండగా, ఇంకో నిఘంటువు ఎందుకు అని వారిని అడిగాము. Google Translate కూడా ఉన్న నిఘంటువుల ఆధారం గానే పని చేస్తుందని, ఇప్పుడున్న నిఘంటువులలో వ్యవహారిక పదాలు తక్కువగా ఉన్నాయని అందుకనే నేటి, రాబోయే తరాల తెలుగువారి కోసం సమగ్రంగా 50 వేల పదాలతో తెలుగు > ఇంగ్లీష్, ఇంగ్లిష్ > తెలుగు రూపొందించామని, దానిని ఈబుక్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు.
దీనిని మేము పరీక్షించాము. ఉదాహరణకు a bit అన్న దానికి ఆంధ్రభారతి తునక తండు ముక్క తునియ అని అర్థాలు చెప్తే, Google Translate కొంచెం అని ఒక్క పదాన్నే సూచిస్తుంది. అదే వీరి నిఘంటువులో కొంచెం, కాస్త, చిన్నిముక్క అని అర్థాలిచ్చారు. ఇలా ఎన్నో పదాలకు వీరిచ్చిన నిఘంటువు మరింత సమగ్రంగా ఉన్నట్టు అనిపించింది.
అయితే, ఈబుక్ రూపంలో కన్నా ఒక App గా సెర్చ్ చేసే విధంగా ఉంటె ఇంకా ఉపయుక్తంగా ఉంటుందని, దాసుభాషితం యాప్ లో అందించవచ్చని సూచించాము. వారు వెంటనే ఒప్పుకున్నారు. కానీ కార్యాచరణకు Aug 29 తెలుగు భాష దినోత్సవానికి గాని పునాది పడలేదు.
అయితే ఇంగ్లీష్ > తెలుగు, తెలుగు > ఇంగ్లీష్ లలో ఏది ముందు పెడదాం అనే మీమాంస ఉండటం తో smartphone వాడే వాళ్లను ఎక్కువ ఏది అవసరం అని ట్విట్టర్ పోల్ ద్వారా ప్రశ్నించాం. , ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్ధాలు కావాలని ఎక్కువ మంది చెప్పారు. దీన్ని చూసి పెద్దగా ఆశ్చర్య పడలేదు. ఎందుకంటే తెలుగులో మాట్లాడాలనే ప్రయత్నంలో ఎన్నోసార్లు తెలుగు పదం తెలియక అవస్థలు పడడం, స్వీయానుభవమే.
మొత్తానికి, తెలుగు ప్రజలకు కానుకగా, Sep 9 తెలంగాణ భాష దినోత్సవానికి యాప్ లో విడుదల చేశాము.
ప్రస్తుతానికి 15000 పదాలున్నాయి, త్వరలో 50 వేల పదాలకు, ఆపై తెలుగు పదాలకు ఇంగ్లీష్ అర్ధాల నిఘంటువునూ అందిస్తాము. కాబట్టి, మీరు దాసుభాషితం యాప్ వాడుతుంటే, ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగులో పదం తెలుసుకోవడానికి, యాప్ ను వీడక్కర్లేదు. యాప్ లో ఉన్న సెర్చ్ ఐకాన్ ను నొక్కిన వెంటనే మీకు నిఘంటువు దర్శనమిస్తుంది.
మల్లాది రామకృష్ణ శాస్త్రి
వి ఏ కే రంగరావు గారు ముక్కుసూటి మనిషని అందరికి తెలుసు. అయన మిత్రులు అయన ఒక తిక్కమనిషని, పేరుకు తగ్గట్టే వక్రంగా (Vakranga Rao) మాట్లాడతారని ఆయన ముందే చెప్తారు. అందుకు ఆయన “అవును నా మాటలు 'వక్రంగా రావు' అంటూ అంతే చమత్కారంగా సమాధానమిస్తారు. False హ్యూమిలిటీ false prestige లకు అయన దూరంగా ఉంటారు. అర్హత లేకపోతే మర్యాదకైనా మెచ్చుకోరు. అటువంటి వ్యక్తి, మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రస్తావన రాగానే సున్నితమనస్కులైపోతారు. గురుభావం ఉప్పొంగుతుంది. ఇది నేను స్వయంగా చూసింది. నా తరానికి తెలిసిన ఎందరో హేమాహేమీలైన ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, దాశరథి వంటి వారికి, మల్లాది వారు గురుతుల్యులు.
రచనా పటిమ, పలు భాషా ప్రావీణ్యం, విస్తారంగా చదవడం వల్ల సమకూరిన జ్ఞానసంపద, వీటన్నింటినీ మించి అతి ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనకు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కేవలం 60 వసంతాలు జీవించిన అయన, ఎక్కువ రచనలు చేయలేదు. కానీ చేసినవన్నీ కళాఖండాలే. రాస్తే ఇలా వ్రాయాలి అని చెప్పేవే.
Sep 12 న అయన వర్ధంతి సందర్భంగా, డా.మృణాళిని, మల్లాది గారి గురించి చేసిన విశ్లేషణ మీకందిస్తోంది దాసుభాషితం.
ఈ వారం అంపశయ్య నవీన్ గారి రచించిన బాంధవ్యాలు 3వ భాగం కూడా విడుదలయ్యింది.