అక్కినేని నాగేశ్వర రావు గొప్ప తెలుగు నటుడు - అనో, నా అభిమాన నటుడు - అనో ప్రారంభిస్తే, ఆయన మీద వ్యాసాన్ని అతి పేలవంగా ప్రారంభించినట్లే.
నటన, నాగేశ్వరరావు జీవితంలో ప్రధానాంశం. ఇది నిర్వివాదాంశం. ఆయన సినిమాలు, పాత్రలు, పాటలు వగైరా గురించి ఇప్పటికే మనకి ఏంతో తెలుసు. అందుకే, ఆయన 83వ జన్మదిన సందర్భంగా రికార్డు చేసిన ముఖాముఖీని నేను సినిమా విశేషాల కోసం వినలేదు. అక్కినేని వ్యక్తిత్వం గురించి ఏం తెలుస్తుందా అని విన్నాను.
ఆ ముఖాముఖీ లో తన్నుకొచ్చిన అంశం, స్వీయాభిజ్ఞ (self-awareness).
ఒక మనిషి స్వీయాభిజ్ఞ కొలమానం మీద, ఏ స్థాయిలో ఉండగలడు అనే ప్రశ్నకి, కొలమానం మీద 10 పరాకాష్ట అయితే, అక్కినేని 9 దగ్గర ఉంటారు. ఆ ఒక్క పాయింట్ కూడా, మనకి తెలియని వారికి వీలుకల్పించటానికే.
మన గురించి మనకి ఎంత ఎరుక ఉంటే, విజయానికి అంత దగ్గరగా ఉంటాం అనే సూత్రాన్ని అక్కినేని జీవితం ఘంటాపధంగా నిరూపిస్తుంది. ముఖ్యంగా మన బలహీనతల గురించి. ఉదాహరణకి చూడండి. మొదట్లో చాలా కాలం ఆయన గొంతు పేలవంగా ఉండేది. నాటకాల్లో వేసే స్త్రీ పాత్రలకి, పాటలకి అది సరిపోయినా, సినిమాల కొచ్చేసరికి అందరూ నవ్వడంతో గొంతును బ్రేక్ చేసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. చిత్రాల్లో పాటలనూ నటీనటులే ఇంకా పాడుకుంటున్న సమయంలో, అంటే కథానాయకులకు ఘంటసాల నేపథ్య గాయకుడుగా పూర్తిగా స్థిర పడకమునుపే, తన గొంతుతో పడే తిప్పలు ఇక ఆపేసి, ఘంటసాలను పూర్తిగా తన రెండో గళం చేసుకున్నారు.
ఆ కారణాన ఘంటసాల అక్కినేనికే అత్యధిక పాటలు పాడారు. అందుకే ఘంటసాల పాట విన్నప్పుడు, అప్రయత్నంగా అక్కినేనే జ్ఞప్తికి వస్తారు. ఈ విషయం కూడా అక్కినేనికి తెలుసు. తన విజయంలో యాభై శాతం పాటలకు దక్కుతుందని, తన మరణానంతరం తనని బతికించేది పాటలే అని ఈ ముఖముఖీ లో అన్నారు.
రెండో ఉదాహరణ. ఆయన రూపం మీద ఆయనకున్న స్పృహ. దానివల్ల ఆయన కొన్ని పాత్రలను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. రాముడు, కృష్ణుడు నటరత్నలోకి పరకాయ ప్రవేశం చేయక ముందే, అక్కినేనికి రాముడు వేషం వేసే అవకాశం ఒక తమిళ చిత్రంలో వచ్చింది. రాముడు మీద నమ్మకం లేకపోయినా, వాల్మీకి ఆజానుబాహుడుగా రాముడిని నిర్మించిన పాత్ర మీద గౌరవంతో ఆ పాత్రను తిరస్కరించారు. తను రాముడు వేషం వేస్తే, మిగిలిన పాత్రలకూ పొట్టి వారినే తీసుకోవాలి కాబట్టి ఆ చిత్రం ‘మరుగుజ్జు రామాయణం’ అయ్యేదని నవ్వేశారు.
విజయాలు వస్తున్నపుడు కూడా ఆయన ఎంత self-awareness తో ఉండేవారో మిస్సమ్మ చిత్రంలో కథానాయకుడు కాని పాత్ర, అదీ కామెడీ పాత్ర ఎందుకు ఎంచుకున్నారు అనే విషయంలో స్పష్టమౌతుంది.
మిస్సమ్మ చిత్రం, గొప్పగా విజయం సాధించిన దేవదాసు తర్వాత వచ్చింది. ఆ చిత్రం తర్వాత సహజంగానే ఆయనకు తాగుబోతు పాత్రలే ఎక్కువగా వచ్చాయి. మామూలు మనుష్యులైతే - దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి - అనే సూక్తిని ఆచరించి, వచ్చిన పాత్రలన్నీ చేసేవారు. కానీ అక్కినేని ఆ దేవదాసు హ్యాంగోవర్ ఎలాగైనా పటాపంచలు చేయాలని, ప్రధాన పాత్ర కాకపోయినా, ఆ పాత్రను అడిగి మరీ వేశారు. తను జీవితంలో అడిగిన పాత్ర ఇదొక్కటేనంటారు అక్కినేని.
Sep 20న అక్కినేని జయంతి సందర్భంగా అందిస్తున్న ఈ ముఖాముఖీ పొరల్లో వెతికితే, ఎన్నో వ్యక్తిత్వ వికాసపు పాఠాలు. పాఠాల కోసం కాకుండా కూడా ఈ ముఖాముఖీని విని ఆనందించవచ్చు. ఎందుకంటే ఈ ముఖాముఖి అంత సరదాగా ఉంటుంది.
అల్పజీవి
అసమర్ధుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, అల్పజీవి - ఇవి తెలుగులో మనోవైజ్ఞానిక రచనలుగా పేరుగడించాయి.
మొదటిది 1947 లో ప్రచురించబడగా, మిగిలిన రెండూ 1952 లో వచ్చాయి.
అంపశయ్య నవీన్ గారు ఈ రచనలని ఇలా నిర్వచించారు.
“ఇలాంటి రచనల ముఖ్య లక్షణం పాత్రల బాహ్య రూపాన్ని కాకుండా మనసుల్ని శోధించటం. ప్రధానంగా పాత్రల మనస్సుల్లో చెలరేగుతున్న సంఘర్షణను చిత్రించటం.”
భాషా, శైలి, శిల్పం, భావ వ్యక్తీకరణ వంటి సాహిత్య అంశాల్ని పక్కనపెడితే, అసలు కథావస్తువు పరంగా ఇటువంటి రచనల వలన లాభమేమిటి అని ఎవరికైనా అనిపించవచ్చు. Afterall who wants to listen to a loser's story.
మనస్తత్వశాస్త్రం చదువుకున్న మా అక్కతో ఈ విషయమే చర్చిస్తే, మన జీవిత అనుభవాలను మనం సినిమాల్లో, రచనల్లో, నాటకాల్లో చూస్తే ‘అరే, ఇది నా జీవితమే’ అనే ఒక వింత అనుభూతి కలుగుతుందని, ఆ అనుభూతికి ఒక చికిత్సా గుణం అంటే ఒక therepeutic character ఉంటుందని, అది చాలా సందర్భాల్లో సాంత్వన కలిగిస్తుందని చెప్పింది.
నిజమే అనిపించింది. ప్రేమ కథా చిత్రాల్లోని సన్నివేశాలు మన జీవితంలో జరిగినవే అయితే మన ఆసక్తి పెరిగి ఆ సన్నివేశాలని ఇంకా ఆస్వాదిస్తాము. అదే విధంగా ఈ రచనల్లో ఇతివృత్తం, కథానాయకుల వ్యక్తిత్వం ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉంటే, వారికి తాము జీవితంలో ఏకాకులం కాదనే ఉపశాంతిని పొందవచ్చు.
ఇప్పటికే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపీచంద్ ‘అసమర్ధుని జీవయాత్ర’ పుస్తకాల శ్రవణ రూపాలను అందిస్తున్న దాసుభాషితం, రావిశాస్త్రి గా పేరుగడించిన, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచన ‘అల్పజీవి’ ని, వారి కుమారుడు రాచకొండ ఉమాశంకర శాస్త్రి గారి సౌజన్యంతో మీకు ఈ వారం అందిస్తోంది.
ఈ శ్రవణ పుస్తక విడుదలతో, తెలుగు మనోవైజ్ఞానిక రచనా త్రయాన్ని మీకు అందిస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాము.
అలాగే అంపశయ్య నవీన్ బాంధవ్యాలు ఆఖరి భాగం కూడా ఈ వారం యాప్ లో విడుదలయ్యింది.