#29 How I am coping

October 13, 2020

కష్టాలు కనీసం మూడు రకాలు. అవి- ఒకరికి ఒక కష్టం రావడం - అందరికి ఎదో ఒక కష్టం రావడం - ఒకే కష్టం అందరికీ రావడం ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు. భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు.

కష్టాలు కనీసం మూడు రకాలు. అవి

- ఒకరికి ఒక కష్టం రావడం
- అందరికి ఎదో ఒక కష్టం రావడం  
- ఒకే కష్టం అందరికీ రావడం

ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు.
భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు.

విషాదాన్ని ఒక్కక్కరు ఒకో విధంగా భరిస్తారు. కొందరు పోయిన వారి జ్ఞాపకాలను తలచుకుంటారు. నలుగురితో పంచుకుంటారు. ఇంకొందరు మౌనంగా, ఏకాంతంగా భరిస్తారు.

తల్లితండ్రులు, తోబుట్టువులు, సంతానం పోయినప్పుడు వైరాగ్యం వస్తుందని, లేకపోతే కర్మకాండలు చేయలేరని అంటారు. దానినే శ్మశాన వైరాగ్యం అని కూడా అన్నారు.

కానీ ఆ వైరాగ్యంలో నిర్వేదం ఉంటుంది.

ఒక మహోన్నత వ్యక్తి పోయినప్పుడు నిర్వేదం తగిన ప్రతిస్పందన కాజాలదు.
బాలు గారు గాత్రంతో పాటను, భాషాభిమానంతో తెలుగు మాటను, తన వ్యక్తిత్వం తో విశాల సమాజాన్ని ప్రభావితం చేశారు.

ఆ ప్రభావపు జ్యోతి, నిర్వేదం కాని, సర్వకాల సర్వావస్థలలోనూ ఉండే భావ సమతౌల్యత అనే దీపాన్ని వెలిగించాలి.

ఈ సమతౌల్యాన్నే జ్ఞానులు 'స్థితప్రజ్ఞత' అన్నారు. నిజానికి ఈ స్థితిని సాధించడం, ఒకింత ఆధ్యాత్మిక దృక్పధం ఉన్న భారతీయులందరీ జీవిత లక్ష్యం.

శ్రీ నిసర్గదత్త మహారాజ్ ఇలా అంటారు, “మరణం సంభవించినప్పుడు దేహం మాత్రమే మరణిస్తుంది. జీవితం, చైతన్యం, యథార్థం ఇవేవి మరణించవు. ఇక జీవితమైతే, మరణించిన తర్వాత, మున్నెన్నడూ లేనివిధంగా సజీవంగా ఉంటుంది.”*

ఆ విధంగా ఆలోచిస్తే మనందరమూ చిరంజీవులమే. ఇక బాధ ఎందుకు.
ఇది నమ్మకపోయినా అందరికీ అనుభవైక్యమైన సత్యం ఒకటుంది.
అంతిమంగా, కాలం అన్ని సుఖదుఃఖాలను సమానం చేస్తుంది.

‘దాసు’ కిరణ్
దాసుభాషితం

గమనిక:

Sep 25 నుంచి నేను సాంత్వన కోసం స్వీయ నిర్బంధం లోకి వెళ్లిపోయాను. దిన పత్రికలు, టీవీ చూడలేదు, YouTube, Facebook, Twitter జోలికి వెళ్లలేదు. వాట్సాప్ లో ఈ విషయం మీద వచ్చే ఏ సందేశమూ చూడలేదు. ఆఖరికి దాసుభాషితం క్కూడా విరామం ఇచ్చాను. అందుకనే మీ సందేశానికి ప్రతిస్పందించకపోయుంటే, క్షమించండి.

*మూలం: “అనాయాసంగా ఆత్మజ్ఞానమా” నిసర్గదత్త సంభాషణలు - శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్.

Image Courtesy :