#32 ‘ది’ శారద శ్రీనివాసన్

Dasu Kiran
October 24, 2020

నేను చిన్న తరగతులు చదివే రోజుల్లో మా ఇంటికీ నా పాఠశాలకు మధ్య దూరం ఒకటిన్నర కిలోమీటర్లు. తాపీగా నడిస్తే, రావడానికి పోవడానికి ఒక అరగంట పట్టేది. లంచ్ కి ఇచ్చే సమయం 40 నిముషాలు. అంటే మధ్యాహ్న్మ భోజనానికి ఇంటికి వచ్చేంత దగ్గర కాదన్నమాట. అయినా వచ్చేవాడిని. దానికి రెండు కారణాలు...

నేను చిన్న తరగతులు చదివే రోజుల్లో మా ఇంటికీ నా పాఠశాలకు మధ్య దూరం ఒకటిన్నర కిలోమీటర్లు.

తాపీగా నడిస్తే, రావడానికి పోవడానికి ఒక అరగంట పట్టేది. లంచ్ కి ఇచ్చే సమయం 40 నిముషాలు. అంటే మధ్యాహ్న్మ భోజనానికి ఇంటికి వచ్చేంత దగ్గర కాదన్నమాట. అయినా వచ్చేవాడిని. దానికి రెండు కారణాలు. ఒకటి, చిన్న టిఫిన్ డబ్బా లో చల్లగా ఉండే అన్నానికి బదులు, అమ్మ అప్పుడే వేడిగా చేసి కంచంలో వడ్డించే  భోజనము తినడం. రెండోది, రేడియో లో నవలా స్రవంతి కార్యక్రమం వినడం.

మధ్యాహ్నం స్త్రీల కార్యక్రమంలో, ప్రధానంగా స్త్రీ జీవితం కథాంశంగా సాగే నవల మీద 6-7వ తరగతి చదివే పిల్లాడికి ఎందుకు ఆసక్తి ఉంటుందనే ప్రశ్న రావచ్చు. నిజమే, నాది అప్పుడు నవలలో విషయాలు బాగా అర్ధమయి ఆసక్తి కలిగే వయస్సు కాదు. అయితే నేను ఇష్టపడింది నవలను కాదు, చదివే ఆ గొంతును.

ఆమె ‘ది’ శారద శ్రీనివాసన్.

రోజూ ఒక అధ్యాయం చదివేవారనుకుంటా. అధ్యాయం నిడివి అటుఇటుగా 10 నిముషాలు. ఒక్క నిమిషం కూడా మిస్ కాకూడని 15 నిముషాలు పట్టే నడకను పరుగు పరుగున 10 నిమిషాల్లో పూర్తిచేసేవాడిని.

ఆమె చదువుతుంటే, ఆ నవలా సన్నివేశంలో నేనూ ఉన్నానేమో అనిపించేది. ఉదాహరణకు, కథానాయకురాలు భర్త ప్రవర్తనను విశ్లేషించు కుంటుంది, స్వగతంగా. పక్కనే నేనూ ఉంటాను. స్కూల్ యూనిఫామ్ లో, గబా గబా అన్నం తింటూ.

కానీ శారద గారు క్రెడిట్ అంతా రేడియోకే ఇస్తూ ఇలా అంటారు. “కేవలం శబ్ద సూచనతో మీ కల్పనా శక్తిని, ఊహాశక్తిని ఉజ్జీవింపజేసి రేడియో మీ కళ్ళ ముందు బొమ్మ కట్టిస్తుంది. మిగతా ఏ ప్రక్రియా కలిగించలేని ఒక అద్భుతమైన అనుభూతిని కలుగజేస్తుంది” అని.  

“సప్త స్వరాలను సుమధురంగా పలికించే స్వరం. నవరసాలను అలవోకగా వెలువరించే గళం. నాలుగు దశాబ్దాల పాటు తన గొంతు నుంచి జాలువారిన ఉద్వేగ వైవిధ్యంతో తెలుగు శ్రోతలను నవ్వించి, ఏడ్పించి, అలరించి, గికురించిన స్వర వాణి శారద శ్రీనివాసన్” అంటారు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, శారద శ్రీనివాసన్ గారి ‘నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు’ పుస్తకం ముందు మాటలో.  

“ఆ నాలుగు దశాబ్దాలలో, ఆకాశవాణి నుంచి ఆమె గొంతు వినని శ్రోత లేడు. విని, ఆనందించి, అభినందించకుండా ఉన్న శ్రోతా లేడు” అని అయన అన్నది సగం సత్యం మాత్రమే. ఎందుకంటే, ఆ నాలుగు దశాబ్దాల్లోనే కాదు, ఇప్పటికీ ఆమె అభిమానులున్నారు.

దాసుభాషితం ఏటా నిర్వహించే సి పి బ్రౌన్ తెలుగు పోటీలో, గత సంవత్సరం ఒక విజేతగా నిలిచిన ఖమ్మానికి  చెందిన న్యూ ఎరా పాఠశాల డైరెక్టర్ శ్రీ ఐ.వి.రమణ గారు బహుమతి ప్రదానోత్సవ సభలో ప్రసంగిస్తూ శ్రీమతి శారద శ్రీనివాసన్ ను గుర్తుచేసుకున్నారు.

నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు శ్రవణ పుస్తకాన్ని దాసుభాషితం యాప్ ద్వారా అందించడానికి ఆమె అనుమతి కోసం కలిసినప్పుడు ఆమెతో ఈ విషయం చెప్పాము.

ఆమె ఉద్విగ్నులయ్యారు. సర్వీస్ లో ఉన్నప్పుడు అభినందనలు రావడం వేరు, ఉద్యోగ విరమణ చేసి 20 ఏళ్ళ దాటిన తర్వాత కూడా, ఒక వ్యక్తికి అభినందనలు రావడం వేరు.

“నేను రేడియోను కేవలం ఉద్యోగంగా భావించలేదు. And I gave my everything to Radio. ఇన్నేళ్లయినా ఇంకా నా పనిని తలుచుకునేవారు, మీలా వ్యాప్తి చేయలనుకునే వారు ఉన్నారంటే, నా జీవితానికి ఇంకేం కావలి” అన్నారు.

ఆకాశవాణి ప్రసారం చేసిన కార్యక్రమాల్లో అన్నిటిలోను ఏదో ఒక సమయం లో ఏదో ఒక కార్యక్రమంలో శారద గారి గొంతు వినిపిస్తూ ఉండేది. రేడియోలో ప్రవేశించిన కొద్దికాలం లోనే అన్ని సెక్షన్స్ వాళ్ళకి, ఫేవరెట్ ఆర్టిస్ట్ అయి పోయారు శారద. నగరవాణి, కార్మికుల కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం, ఫామిలీ ప్లానింగ్, గ్రామసీమలు ఇలా అన్ని section లకు ఆయా సబ్జెక్టులపై నాటకాలుండేవి. అందులో మెయిన్ రోల్ వేసేందుకు ఆమెనే ఎంచుకొనేవారు.

“ఏ వేషం వేయమన్నా ఇది నాకు రాదని గాని, నాకు తగదనిగాని, నేను చేయలేననిగాని ఎప్పుడూ చెప్పలేదు. అది నా డ్యూటీ అనే కాకుండా, ఏదైనా చేసి ఔననిపించుకోవాలి అనే పట్టుదల నాలో ఉండే” దంటారు శారద.    

శారద శ్రీనివాసన్ మంచి ఆర్టిస్టే కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారు కూడా. పుస్తకంలో తన సీనియర్స్ ను తలుచుకున్నట్టే తన జూనియర్స్ నూ ప్రశంసించిన తీరును బట్టి మనకి ఇది తెలుస్తుంది.

ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వం మాకూ అనుభవం అయింది. Lockdown ఎత్తివేసిన సమయం లో “వచ్చి కలవొచ్చా మేడం” అని మేము ఆమెకు సందేశం పంపాము. ఆమె అంగీకరించారు. ఇంటికి directions ను ఎంత స్పష్టంగా ఇచ్చారంటే, Google Maps వాడాల్సిన అవసరం లేకపోయింది.

అంత లెజెండరీ ఆర్టిస్ట్ ను కలుస్తున్నాము, కొంచెం మంచి పండ్లు తీసుకుని వెళదాం అనే ఆలోచన, Lockdown వలన దుకాణం త్వరగా దొరకక పోవడం, దొరికిన తర్వాత మా అక్కది కాస్త పెద్ద చేయి అవటం వల్ల బుట్టెడు పండ్లు తీసుకుని వెళ్ళేటప్పటికి, చెప్పిన సమయం కంటే చాలా ఆలస్యం అయింది.  

ఎనభై పైబడిన వయసు. అయినా ముఖంలో లో ఏమాత్రం తగ్గని తేజస్సు. అన్ని పళ్ళున్న బుట్టను చూసి, తన వయసున్న వారికి ఒకటో రెండో తీసుకెళ్తే సరిపోతుంది కదా అంటూ మందలించారు,  

ఇల్లు సర్దుతున్నట్టుగా ఉంది. ఆమె విషయం చెప్పారు. తను ఇంకో వారంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కు మారుతున్నట్టు. ఆ హడావిడిలో కాల్స్ వస్తున్నట్టు. మేము directions కోసం ఏ సమయం లోనైనా ఫోన్ చేస్తామని, ఎంగేజ్ వస్తే ఇబ్బంది పడతామని, అందుకే అందరికి తర్వాత చేస్తానని చెబుతున్నట్టు.

ఎంత మంచి మనిషి.

మేము ఆలస్యం చేసినందుకు చాలా సిగ్గుపడ్డాము. సమయ పాలన ఎపుడూ చేయాలనీ, వయసులో పెద్దవారి విషయంలో ఇది మరీ ముఖ్యమనీ తీర్మానించుకున్నాము.

Photo with Smt. Sarada Srinivasan
With Smt. Sarada Srinivasan

 

దాసుభాషితం యాప్ గురించి చెప్పిన్నప్పుడు తనకు స్మార్ట్ ఫోన్ లు యాప్ ల గురించి తెలియదని, ఈ వయస్సులో ఇక తెలుసుకునే అవసరం కూడా లేదని మృదువుగా అన్నారు. కానీ మేము ఏమి చేయదలిచామో అర్థం చేసుకున్నారు. పుస్తకాన్ని అందిస్తూ ఆశీర్వదించారు.

తిరుగు ప్రయాణంలో పుస్తకం అంకిత వాక్యాలు చదవగానే కళ్ళు చెమర్చాయి. అవి ఇలా ఉన్నాయి -

Naa radio anubhavalu ankita vakyalu
Ankita Vakyalu

"నేను చిన్న పిల్లల అమాయకమైన ముద్దు ముద్దు మాటలు వింటూ అనుకునేదాన్ని – “ఈ పిల్లలు ఎందుకు ఇంత తొందరగా పెరిగిపోతారు, ఎంచక్కా అలాగే ఉండకూడదూ” అని. మా పాప నీరద నా కోరిక తీరుస్తూ ఎప్పటికీ అలాగే అమాయకంగా ఉండిపోయింది. తనకి నా గుండె నిండుగా ప్రేమతో, ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్న. చి. నీరదకు ప్రేమతో అమ్మ."

ఆమె జీవితంలో విషాదం ఉన్నదని ఇలా సూచనామాత్రంగా తెలిస్తుంది తప్ప పుస్తకంలో మరెక్కడా కూడా తెలియదు. తన వైయక్తిక విషాదాలకు తావు లేకుండా, సాంస్కృతిక రంగ ప్రయోజనమే తన ధ్యేయంగా ఈ జీవన రేఖల చిత్రణ ఉందంటారు, ఇంకో ముందు మాట వ్రాసిన శ్రీ మునిపల్లె రాజు.  
     
“శారద గారి పుస్తకం ప్రతి పుటలోనూ మనకొక సంగీత/సాహిత్య దీపస్థంభం కనిపిస్తుంది. నలుదెసల చల్లని కాంతులను వెదజల్లుతుంది. గడచిన అర్థశతాబ్ది కాలంలో అలాటి వెలుగులు వెదజల్లిన దీపస్తంభాల వంటి మహామహులు ఎందరో ఎదురౌతారు, ఈ పుస్తకం లో మనకు. ఎంత ఆనందం  కలుగుతుందో” అంటారు శ్రీ పోరంకి దక్షిణా మూర్తి మరొక ముందు మాటలో.

స్వాత్రంత్ర్యానంతరం విలువలున్న సమాజ నిర్మాణం కోసం వ్యవస్థలను ఏర్పాటు చేసారు అప్పటి దార్శనీకులు. అందులో రేడియో ఒకటి. నిజానికి రేడియో, ప్రజలకు చాలా సేవలు అందించడమే కాకుండా, చెవినిల్లు కట్టుకుని పోరి మరీ వాళ్ళను చైతన్యవంతులను చేసింది అంటారు శ్రీమతి శారద.

అయితే రేడియో అంటే ఒక పరికరం కాదు. ఒక వ్యవస్థ. వ్యవస్థ అంటే భవనం కాదు. అందులో పని చేసే వాళ్ళు. మహామహులు. ఉద్దండులు. మన సమాజం ఈ తీరుగా నైనా ఇంకా నిలబడి ఉన్నదంటే, వారు రేడియో ద్వారా అప్పుడు చేసిన సేవ వల్లేనని, వారి గురించి ఇంకో ఉద్దండురాలు మనకి తెలియచెప్పడం మన సుకృతం. వారి గురించి తెలుసుకోవటం అంటే వారికి కృతజ్ఞతలు చెప్పడం.

ఆచార్య ఆత్రేయ ఒక సందర్భంలో ‘ఆ శారదకు వీణ కరమునుందు, ఈ శారదకు వీణ గళము నందు’ అన్నారు. అటువంటి వాచికాభినయ కళావిశారద గారి పుస్తకాన్ని ఇంకొకరు చదవడం కన్నా పెద్ద ఐరనీ ఉండదు. మనకావస్థ కలుగకుండా వారే శ్రవణ రూపంగా కూడా ప్రొడ్యూస్ చేసారు.
   
రేడియో అభిమానులు తప్పక వినవలసిన ‘నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు’ శ్రవణ పుస్తకం ఇపుడు దాసుభాషితం యాప్ లో మీరు వినవచ్చు.

Sarada Srinivasan
Tap to listen
Image Courtesy :