ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ, ఒక సంవత్సరం అయిపోవాలని, ఎన్నడూ కోరుకోనంతగా, బహుశా 2020 గురించి కోరుకుని ఉంటారు. ఏమైతేనేం, వినాయకుడు పాలు తాగడం ఎలా గుర్తుండి పోయిందో, కరోనా కారణంగా 2020 సంవత్సరం అందరికీ అలా గుర్తుండి పోతుంది.
Of course ఈ తేదీలు, నెలలు, సంవత్సరాంతాలు, నూతన సంవత్సరాలు అన్నీ మానవ కల్పితాలు. విధి వీటిని పట్టించుకోదు. అందుకనే నాలుగు శుభాల నడుమ ఓ అశుభం, నాలుగు అశుభాలు మధ్య ఒక మంచి జరుగుతూ ఉంటాయి.
నూతన సంవత్సరం అని పట్టించుకోకుండా ఇంకో సాహితీవేత్తను విధి మనకి దూరం చేసింది. జనవరి 5న శ్రీ వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గారు ఆకస్మికంగా మరణించారు.
*అందరికీ ఇంటిపేర్లు అమరవు. అటువంటప్పుడు వారు రాసిన గొప్ప రచనో, సినిమానో, ఇంటి పేరు అయిపోతుంది. ‘అంపశయ్య’ నవీన్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ఇందుకు ఉదాహరణలు. కానీ వెన్నెలకంటి కి ఆ అవస్థ లేకపోయింది.
‘వెన్నెలకంటి’ అని ఇంటి పేరు ఎలా వచ్చిందో తెలియదుగానీ, ఆయన వ్రాసిన పాటలే కాదు మాటలు కూడా నిజంగా వెన్నెలలే కురిపిస్తాయి. ఈ విషయం ధృవీకరించడానికి, గుణ చిత్రంలో “కమ్మని ఈ ప్రేమ లేఖనే వ్రాసింది హృదయమే”, అనే పాట, దానిలోని మాటలు చాలు.
రాజశ్రీ తరువాత, అనువాద చిత్రాల తెలుగు మాటకు పాటకు చిరునామా అయిపోయారు వెన్నెలకంటి. పైన చెప్పుకున్న గుణ నుంచి, మొన్నటి గజినీలో హృదయం ఎక్కడున్నది వరకు చాలా జనరంజకమైన పాటలు వ్రాసారు ఆయన.
మహర్షి సినిమాలో వెన్నెలకంటి వ్రాసిన “మాట రాని మౌనమిది, మౌనవీణ గానమిది” పాటలో ముక్త పద గ్రస్త అలంకార ఛాయల్ని ఉదహరిస్తూ, “సినిమా పాటకున్న పరిమితుల్లో ఇలాంటి ప్రయోగం ఎంత అపురూపం. అందుకే ఆ పాట మన హృదయ వీణలు మీటుతూనే ఉంది ఈనాటికీ” అన్నారు ట్విట్టర్ మిత్రుడు శ్రీ విజయభాస్కర్.
ఆయనన్నది అక్షరాలా నిజం. నేరు చిత్రాలకన్నా అనువాద చిత్రాలకు మరిన్ని పరిమితులుంటాయి. మహర్షి వంటి తెలుగు చిత్రాలకు, గుణ వంటి అనువాద చిత్రాలకు, రెంటికీ న్యాయం చేసిన కవి శ్రీ వెన్నెలకంటి.
వెన్నెలకంటి కవిత్వమే కాదు, ఆయన విశ్లేషణ కూడా అబ్బురపరుస్తుంది. ఒక పుస్తకం చదివినా, ఒక పాట విన్నా, ఒక సినిమా చూసినా, అందరి కోణం ఒకటైతే, ఆయన చూసే లేదా వినే కోణం మరొకటి.
ఒక ఉదాహరణ.
'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ, జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ',
"పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్లు పోయినోళ్ళు తీపి గురుతులు”
ఈ చరణాలను ఉటంకిస్తూ, పాటకు పల్లవి మాత్రమే ప్రాణం కాదు, చిరకాలం ప్రజల హృదయాల్లో ప్రాణప్రదంగా నిలిచి ఉండే చరణాలూ ఉంటాయనేవారు వెన్నెలకంటి.
ఆయన నిశిత పరిశీలనకు మరో ఉదాహరణ. మాయాబజార్ సినిమాలో లక్ష్మణ శశిరేఖల వివాహానికి ముహుర్తాలు నిశ్చయించే సన్నివేశంలో శంఖు తీర్థులు అనే పురోహితుడు అది దగ్ధయోగమనీ, ఆ ముహూర్తానికి అసలు వివాహమే జరగదనీ చెపుతాడు. పింగళి నాగేంద్రరావు గారు వ్రాసిన ఈ సంభాషణలో చిన్న అనౌచిత్యాన్ని గమనించారు వెన్నెలకంటి. ఎలా అంటే, అది దగ్ధ యోగం, అసలు వివాహమే జరగదు అన్న ముహుర్తానికే ఘటోత్కచుని ఆశ్రమంలో శశిరేఖా అభిమన్యుల వివాహం జరిగింది. దీన్ని, పింగళిగారిని గౌరవిస్తూనే సున్నితంగా వెన్నెలకంటి చెప్పిన తీరు మరచిపోలేనిది.
వారి అకాల మృతికి చింతిస్తూ, ఆయనకు నివాళిగా, గతంలో వారితో జరిపిన ముఖాముఖీ ని ఈ వారం దాసుభాషితం యాప్ లో అందిస్తున్నాము.
ఈ సంభాషణలో,
తన పాటలలో తెలుగు సాహిత్యం, అలంకారాలు ఉపయోగించే విధానం?
మాటల రచయితకి, దర్శకుని ఆలోచనలకి తగ్గట్టు, తాను పాటలు ఎలా రాసేది,
తనను తాను ఉత్తేజపరచుకోడానికి అవలంభించే పద్ధతి
తాను రాసే డబ్బింగ్ పాటలకి ప్రేరణ ఎవరనేది?
ఒక డబ్బింగ్ పాటను మన తెలుగులో కూర్చడానికి ఆయన చేసే ప్రయోగాలు, ఆలోచించే విధానం,
అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో రచయితలకి, మన రచయితలకి దక్కుతున్న గౌరవం గూర్చి,
పూర్వపు కవుల గురించి వివరిస్తూ యువతకు వారు ఇచ్చే సందేశం వంటి అనేక అంశాలున్నాయి.
వినండి, తప్పక ఆనందిస్తారు.
తిరిగి 2020 విషయానికి వస్తే, దాసుభాషితం కు గత సంవత్సరం అన్నీ శుభాలే జరిగాయి. పెట్టుకున్న లక్ష్యాలను దాదాపు అందుకున్నాము. కొన్ని లక్ష్యాలను దాటాము కూడా. ఉదాహరణకు 2020 సంవత్సరంలో శ్రవణ పుస్తకాలు కానీ పాడ్కాస్ట్ లు కానీ 100 విడుదలలు లక్ష్యమైతే 109 విడుదల చేసాము.
సంవత్సరాంతం లో నిర్వహించిన CPB-SPB తెలుగు పోటీ కూడా విజయవంతమవడం సంతృప్తి నిచ్చింది.
ఈ పోటీ కారణంగానే డిసెంబర్ లో విడుదల కావాల్సిన పాలగుమ్మి పద్మరాజు కథలు రెండవ భాగం, విశ్వదర్శనం మూడవ భాగం, Dec 12 శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి వర్ధంతి సందర్భంగా విడుదల కావాల్సిన ముఖాముఖీ సమయానికి విడుదల చేయలేకపోయాము. అవి ఈ వారం ఇతర విడుదలలు.
2021 లో దాసుభాషితం కాంటెంట్ పరంగా, App User Experience పరంగా ప్రగతి సాధించడం మీరు గమనిస్తారు. అన్నిటికంటే ముందుగా 200-300 రూపాయల మధ్య నెలసరి చందాను అందించమని చాలా మంది కోరారు. మా సాంకేతిక బృందం ఇపుడు ఆ పని మీదే ఉంది. త్వరలో విడుదల చేస్తాము.
2021 లో మీకు, మీ కుటుంబానికి, లోకానికి మేలు జరగాలని ఆసిస్తూ.
శెలవు.