#35 శ్రీపాద – సంప్రదాయ గోదారిని ఎదురీదిన సాహసీకుడు.

Meena Yogeshwar
August 26, 2021

మాకు తాతయ్య వరస అయ్యే మా బంధువులాయన ఒకరు మొదట్నుంచీ మా అన్నయ్య, నేను సాహిత్యంలో చూపించే శ్రద్ధను చూసి వెటకారం చేస్తుండేవారు. ఇవి పక్కన పాడేసి, క్లాసు పుస్తకాలు చదివి, ర్యాంకులు కొట్టి, ఆయన కొడుకులాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేది ఆయన అభిప్రాయం. ఆ క్లాసు పుస్తకాలే చదువుకుని ఉండి ఉంటే ఏదో ఒక ఉద్యోగంలో ఉండేదాన్నేమో. కానీ తెలుగు సాహిత్యంపై నా ప్రేమ, నా కడుపు నింపేది మాత్రమే కాక, గుండెను నింపగలిగిన ఉద్యోగాన్ని చూపించింది.

మాకు తాతయ్య వరస అయ్యే మా బంధువులాయన ఒకరు మొదట్నుంచీ మా అన్నయ్య, నేను సాహిత్యంలో చూపించే శ్రద్ధను చూసి వెటకారం చేస్తుండేవారు. ఇవి పక్కన పాడేసి, క్లాసు పుస్తకాలు చదివి, ర్యాంకులు కొట్టి, ఆయన కొడుకులాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేది ఆయన అభిప్రాయం. ఆ క్లాసు పుస్తకాలే చదువుకుని ఉండి ఉంటే ఏదో ఒక ఉద్యోగంలో ఉండేదాన్నేమో. కానీ తెలుగు సాహిత్యంపై నా ప్రేమ, నా కడుపు నింపేది మాత్రమే కాక, గుండెను నింపగలిగిన ఉద్యోగాన్ని చూపించింది. 

ఈ మే నెలలో దాసుభాషితం సంస్థలో కంటెంట్ మేనజర్‌గా ఉద్యోగ బాధ్యతలను మొదలుపెట్టాను. ఇప్పుడు నేను సాహిత్యం, పుస్తకాలు, రచయితల గురించి తప్ప ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. తమకి మనస్పూర్తిగా నచ్చే ఉద్యోగాన్ని చేసుకోగలిగిన అదృష్టవంతులు ఎంతమంది ఉంటున్నారు మనలో. తెలుగు కానీ, సాహిత్యం కానీ చదువుకున్నవారికి భవిష్యత్తు లేదు అనేవారికి నా కెరీర్ కనువిప్పుగా మారడానికి ఆ చుట్టాలాయన మీద పెరిగిన పంతమే కారణం.  ఇలాంటి ఆరోగ్యకరమైన పంతం మంచిదే అని ఈ కెరీర్‌లోకి అడుగుపెట్టకముందే నాకు చెప్పిన వ్యక్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు. నన్ను శ్రీపాదవారికి దగ్గర చేసిన అంశాలలో ఇది ప్రధానమైనది.

నిజానికి పండగకో, పబ్బానికో కనపడి, సాహిత్యం వద్దు మొర్రో అని గంటలు గంటలు క్లాసులు పీకే చుట్టాలాయన మీద కసి కొద్దీ సాహిత్యానికి మేము మరింత దగ్గరయ్యాం.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి అనుభవాలూ-జ్ఞాపకాలూను చదువుతున్నప్పుడు అర్ధం అయ్యింది అలాంటి పోరును ఆయన రోజూ తండ్రి, అన్నగారి ద్వారా అనుభవించేవారని. అది చదివినప్పుడు హమ్మయ్య మనకి ఈ తలంటు ఏడాదికి ఒకసారో, రెండుసార్లో అంతే కానీ పాపం శ్రీపాద వారు రోజూ అనుభవించారు అనిపించింది. కానీ, పోను పోనూ అనిపిస్తోంది అయ్యో శ్రీపాద వారంతగా మేము కూడా రోజూ ఆ పోరును అనుభవించి ఉంటే సాహిత్యానికి ఇంకెంత చేరువ అయ్యేవాళ్ళమో కదా అని. పైగా అప్పటి కుర్ర వయసు వలనో ఏమో, శ్రీపాద వారి కీర్తిలో సగం అయినా మూటగట్టుకోలేమా అనే దురాశని కూడా రగిలించారు ఈ పుస్తకం ద్వారా.

నాకు మొదట శ్రీపాద వారు కథల ద్వారా పరిచయం అయ్యారు. మార్గదర్శి, అరికాలి కింది మంటలు, జాగ్రత్తపడవలసిన ఘట్టాలు ఇలా ప్రతీ కథా నేరుగా నాతో మాట్లాడుతున్నట్టే అనిపించేది. ముఖ్యంగా సమాజంలో స్త్రీల పట్ల జరిగే వివక్ష ఆయనకు అసలు జీర్ణం కాని అంశం. అదే తన రచనల్లో ప్రతిఫలిస్తుంది.

నాకు నచ్చిన పుస్తకాన్ని ఎన్ని పదుల సార్లైనా చదువుతాను నేను. అలాగే వంట అయినా, బట్టలైనా. వాటి మీద తృప్తి వచ్చేదాకా ఎన్ని సార్లైనా తినగలను, కట్టుకోగలను. అలా కొన్ని పదుల సార్లు చదివిన పుస్తకాలు చాలా ఉన్నాయి. హంపి నుండి హరప్పా దాకా, బుడుగు, ప్రళయ కావేరి కథలు, అమరావతి కథలు, వేయిపడగలు, పర్వ నవల, గాన్ విత్ ద విండ్ ఇలా చాలా ఉన్నాయి. అదే వరుసలో శ్రీపాద వారి కథల సుడులలో కొట్టుకుపోతున్న నాకు కొత్త నావ దొరికింది. అదే ఆయన ఆత్మకథ అయిన అనుభవాలూ-జ్ఞాపకాలూను.

ఈ పుస్తకం చదివితే శ్రీపాద వారి కథలలోని అంతర్వాహినిగా నిలిచే అభ్యుదయవాదం మనకి అర్ధం అవుతుంది. దురాచారానికో, అన్యాయమైన అభిప్రాయానికో తన పాత్రలను ఎదురు నిలబెట్టే దారి ఆయన నడిచి వచ్చినదే. సంస్కృతం తప్ప తక్కిన భాషలన్నీ హీనమైనవి అనే ఆనాటి శ్రౌత్రియ కుటుంబాల ఛాందసపు గోడల్ని బద్ధలు కొట్టుకుని, తేనెలూరే తెలుగును తన రచనకి కార్యరంగంగా ఎంచుకున్న ధీశాలి ఆయన.

మధూకర వృత్తి ప్రతి విద్యార్ధికి ఎందుకు అవసరమో శ్రీపాద వారు చాలా విపులంగా వివరిస్తారు. నిజానికి వారాలు చేసుకుని, చదువుకుని ఎంతో అభివృద్ధిలోకి వచ్చినవారు ఎందరో ఉన్నారు ఆకాలంలో. శ్రీపాద వారి ప్రకారం విద్యార్ధి అయిన వాడికి తల్లిదండ్రులు అన్నీ సమకూర్చి పెట్టడం కన్నా, ఇలా వారాలు చేసుకుని చదువుకుంటేనే బాధ్యత ఒంటపడుతుంది. అలాగే ఈ వారాలు పెట్టే ఇల్లాళ్ళ ప్రవర్తన కూడా వివరిస్తారు శ్రీపాద. కొందరు తన సొంత కొడుకులకన్నా ప్రేమగా కొసరి కొసరి వడ్డిస్తే, మరికొందరు ఏదో పెట్టాంలే అన్నట్టు పెట్టేవారట. 

మా నాన్నగారు కూడా వారాలు చేసుకునే చదువుకున్నారట. ఈ నాటికీ మొదటి ముద్ద తినేటప్పుడు ఆ తల్లులందర్నీ తలుచుకుంటారు.  నిజంగా ఎందరో తల్లులు తమ చేతి చలువతో ఆశీర్వదించడం వల్లనే ఈ భూమిలో ఎందరో విద్యార్ధుల ఆకలి తీరింది అనే శ్రీపాద వారి మాట వ్యక్తిగతంగా నాకు అందుకే చాలా ఇష్టం. 

వ్యవహారిక భాషలో రచనలు చేసిన అతి కొద్దిమంది తొలితరం రచయితల్లో శ్రీపాద ఒకరు. తన రచనలకు ప్రాణంగా నిలిచిన ఈ వ్యవహారిక భాషను తన తల్లిగారు శ్రీపాద మహాలక్ష్మి సోమిదేవమ్మ గారు, ఆమె స్నేహితురాళ్ళతో చెప్పిన కబుర్లలో నుంచి దోసిళ్ళతో తెచ్చుకున్నారు. వారి మాటల్లో ఒలికే సామెతలూ, పలుకుబడులూ, పద ప్రయోగాలూ, బ్రాహ్మణ ఇళ్ళాళ్ళ యాస అన్నిటినీ భరతుడు రామ పాదుకలను నెత్తినపెట్టుకున్నంత భక్తిగా నెత్తికెత్తుకున్నారు. వాటితోనే తెలుగు సాహిత్యంలో వ్యవహారిక భాషకు పూల బాటను కూడా నిర్మించారు శ్రీపాద.

నిజంగా ఆ స్త్రీమూర్తుల సంభాషణలు వింటూ అచ్చ తెలుగు నుడికారాన్ని ఒంటబట్టించుకున్న ఆయన తన కథలలో కూడా అలంటి సరసమైన సంభాషణలను చొప్పించగలిగారు. కొన్ని కథలైతే కేవలం సంభాషణలతో మాత్రమే ఉంటాయి. కానీ ఏ పాత్ర ఏం మాట్లాడుతున్నారు అన్న విషయం చదువరికి అరటిపండు ఒలిచిపెట్టినంత బాగా అర్ధం అవుతుంది. అంతగా పాత్ర స్వరూప, స్వభావాలని మన నరాల్లోకి ఎక్కించేస్తారు శ్రీపాద.

నిజానికి ఆంగ్ల సాహిత్యంతో ఇసుమంత కూడా సంపర్కం లేని శ్రీపాద, తన రచనల్లో చేసిన కొన్ని ప్రయోగాలు, ప్రతిపాదనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తకమానదు. ఎందుకంటే ధారళంగా ఆంగ్ల సాహిత్యం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా అక్కడ జరిగిన కొన్ని ప్రయోగాలు మన దగ్గర జరగవు. కానీ ఏ మాత్రం ఆంగ్ల సాహిత్యం చదువుకోని శ్రీపాద కేవలం తన ఊహాశక్తితో చేసిన కొన్ని రచనా ప్రయోగాలు ఆయన దీర్ఘ దృష్టిని మనకి పరిచయం చేస్తాయి.

"ఆధునికాంధ్రమున వాడుక భాషను నిర్మించిన కొలది మందిలో మీరొకరు... మీ చిన్ననాటి తెనుగు పల్లెటూళ్ళ జీవితము, ఆచారములు, శ్రౌతుల గృహాల శోభ, ఆ సంస్కృతి, సర్వము రమణీయముగా ఉన్నది. ఆనాటి కొన్ని సంగతులు మీరు చెపితే కానీ ఈనాడు తెలియవు. సర్వధా తమరీనాటి ఆంధ్ర వ్యావహారిక భాషా నిర్మాతృగణ ప్రధమ గణనీయులు" అని కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీపాదవారి అనుభవాలూ-జ్ఞాపకాలూను చదివి అన్న మాటలు ఇవి. 

నిజానికి విశ్వనాథ వారు శ్రీపాద వారి గురువులైన రామకృష్ణ కవుల ప్రత్యర్ధులు తిరుపతి వెంకట కవుల వారి శిష్యులు. ఈ ఇద్దరు గురు కవుల మధ్య జరిగిన ఎన్నో సంవాద, వివాదాలలో పాల్గొన్నవారే ఈ శిష్యులిద్దరూ. కానీ ఈ సైద్ధాంతిక వైరాలేవీ గొప్ప రచనని గుండెలకు హత్తుకోవడాన్ని ఆపలేవు అని నిరూపించారు విశ్వనాథ.

ప్రతివారూ తమ కాలానికి చెందిన సమాజం రచించే నియమ, నిబంధనలను ఎంతో కొంత పాటిస్తూ తమ జీవితాన్ని కొంత తమకి నచ్చిన పద్ధతిలో జీవిస్తారు. కానీ శ్రీపాద వంటి కొందరు మాత్రం ఎదురు తిరిగి నిలుస్తారు. శ్రీపాద వారి కాలానికి తాను పుట్టిన శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో వారు తెలుగులో రచనలు చదవడమే మహాపాపంగా భావించేవారు. శ్రీపాద ఏకంగా తెలుగులో రచనలే చేశారు. అప్పటివారు చొక్కాలు తొడుక్కోవడం నిషిద్ధం. ఆయన కోటు కూడా తొడుక్కునేవారు. ఆనాటి వారి కుటుంబాలలో నాటకాలు చూడటం తప్పు. శ్రీపాద నాటకాలు రాసి, దర్శకత్వం వహించి, నటించేవారు. ఇలా ప్రతీ అడుగులోనూ వారి ఎదురీత ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది.

శ్రీపాద వారిది ముక్కుసూటి స్వభావం. ఆయనకు పౌరుషం మెండు. ఎవరైనా ఈ పని నువ్వు చేయలేవు అంటే మొండిగా దాన్ని చేసి చూపించడం ఆయన నైజం. అదే మనస్తత్త్వం వరద గోదావరిలో ఈతపోటీలో నెగ్గేలా చేసింది, తెలుగులో రచనలు చేసి ప్రచురించేలా చేసింది. ఇదే లక్షణం ఆయనలో కొరవడి ఉంటే మన జీవితానికి ప్రతీ సందర్భంలోనూ కాగడా లాగా దారి చూపించే రచనలు తెలుగు సాహిత్యం చూసి ఉండేది కాదు.

అనుభవాలు జ్ఞాపకాలూనూ 1

Anubhavaalu Jnapakaloonoo 1
Tap to listen

 

నాకు ఆత్మకథలంటే చాలా ఇష్టం. ఆయా స్థల, కాలాలను, సంప్రదాయాలను, అప్పటి ప్రజలను, వారి స్థితి గతులను, వారి జీవన విధానాలను, అప్పటి సంబంధ బాంధవ్యాలనూ అర్ధం చేసుకోవడానికి ఆత్మకథలు మంచి పనిముట్లు.  

తెలుగు సాహిత్యంలో వచ్చిన ఆత్మకథలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూను ఒక అనర్ఘ రత్నంగా చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పుస్తకాన్ని శ్రవణ రూపంలో దాసుభాషితం యాప్‌లో మీరు వినవచ్చు.

విశ్వనాథ చిన్నకథలు

Vishwanatha Chinna Kathalu
Tap to listen


తెలుగు సాహిత్యంలో పరిచయం అవసరం లేని రచయిత, కవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రాసిన విశ్వనాథ చిన్నకథలను కూడా శ్రవణ పుస్తకంగా మీ ముందుకు తెస్తున్నాం. తెలుగు సాహిత్యంలో దాదాపు అన్ని ప్రక్రియలలోనూ అరుదైన రచనలు చేసిన విశ్వనాథ తన కల్పనా విరాట్ స్వరూపాన్ని ఈ కథల ద్వారా దర్పణంలో మనకి దర్శింపజేస్తారు. ఆ రచనా స్రవంతిలో మీరూ ఓ మునక వేయండి మరి.


సాహిత్య, సినీ రంగాలలో సుప్రసిద్ధ స్థానాన్ని అధిరోహించడమే కాక, మిథునం వంటి సినిమా తీసి ఆ రెండు రంగాలకీ మధ్య వారధి నిర్మించిన సినీ నటుడు, రచయిత, కవి తనికెళ్ళ భరణి తన జీవితంలోని ఘట్టాలనూ, అనుభవాలలోనూ తెలుగు సినీ పాటలు వేసిన ముద్రల గురించి, ఆ సాహిత్య సంగీతాల అడుగుజాడలు తన జీవితంలో ఎలాంటి స్థానాన్ని తీసుకున్నాయో వివరించిన పాడ్‌కాస్ట్ ఈ వారం మిమ్మల్ని అలరించబోతోంది.

సాంత్వన రాగాలు

Saantvana Raagalu
Tap to listen

మన ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి (stress) ఒక జీవన విధానమై కూర్చుంది. మహా మహా రోగాలనే రాగాలతో నయం చేయవచ్చు అని అంటారు పెద్దలు. అంతటి శక్తి కలిగిన సంగీతాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా ఎంతో సాంత్వనను పొందవచ్చు. 

దాసుభాషితం జింగల్ స్వర పరచిన యువ సంగీత కళాకారుడు శ్రీ వశిష్ఠ రామ్ కూర్చిన సాంత్వన రాగాలు విని సేద తీరండి.



Image Courtesy :
Born in Rajamundry.