సినీ వట వృక్షానికి విత్తనం సాహిత్యం
'అతడు నవ్వడు'. ఇది రాక్షసుడు నవలలో కథానాయకుడిని వర్ణిస్తూ యండమూరి వీరేంద్రనాధ్ గారు చెప్పిన వాక్యం. అది చదివిన వెంటనే పాఠకుడు ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటాడు. తనకు తెలిసిన కళ్ళు, ముక్కు, పెదాలను ఒక చోట పెట్టి, వాటిని ఒక మొహానికి అతికించి, అతడు నవ్వనట్టుగా ఉండే ఆ చిత్రాన్ని తన మస్తిష్కంలో చిత్రించుకుంటాడు. ఆ నవలను అదే పేరుతో చిరంజీవి హీరోగా సినిమా తీశారు దర్శకుడు కోదండరామిరెడ్డి. తెర మీద ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు. చిరంజీవి ముఖం ఈ సన్నివేశాన్ని మనకు చెప్పేస్తుంది.
మన ఊహా శక్తిని వామనుడిలా పెంచుకోగలిగిన సామర్ధ్యం సాహిత్యాన్ని చదివేటప్పుడు అది మనకి ఇచ్చే బహుమతి. ఒక సన్నివేశాన్ని మనకు చిత్తం వచ్చినట్టు ఊహించుకుంటాం. ఎరుపు రంగు గులాబీలను ఊహించుకోవాలంటే ఎరుపులో ఎన్ని వర్ణాలున్నాయో అన్ని రంగుల్లోనూ ఊహించుకోగలం. అదే సన్నివేశాన్ని సినిమాగా చూసేటప్పుడు ఒక పరిధి ఏర్పడిపోతుంది. కానీ ఊహ కంటే, చూసిన దృశ్యం మన మెదడులో ముద్ర పడిపోతుంది కాబట్టే సినిమా చాలా బలమైన మీడియా కాగలిగింది.
కాలాన్ని బట్టి ప్రజల వినోద సాధనాలు మారుతుంటాయి. తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, నాట్యం, సంగీతం, పుస్తకాలు, నాటకాలు, నాటికలు, రేడియో, సినిమా, టీవీ, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు. ఇలా కాలానుగుణంగా వినోదం ఏదో ఒక కొత్త అవతారం ఎత్తుతూనే ఉంది. అయితే ఈ అవతారాలన్నీ ఒక దానిలో నుంచి మరొకటి ఉద్భవిస్తాయే తప్ప, పాత వాటిని పూర్తిగా పక్కకి తోసేసి కాదు.
ఈనాటి కాలానికి అతి పెద్ద వినోద సాధనం అయిన సినిమా అనే వట వృక్షానికి సాహిత్యమే విత్తనం. ప్రపంచంలో మొట్టమొదటి సినిమాల్లో ఒకటిగా చెప్పబడే 'ది కిస్' అనే 18 సెకెన్ల సినిమాకు మూలం "ది విడో జోన్స్" అనే సంగీత నాటకంలోని ఆఖరి సన్నివేశం. తొలి తెలుగు టాకీ సినిమా 'భక్త ప్రహ్లాద' కూడా అప్పటికి అత్యంత విజయవంతమైన నాటకమే. అలా సాహిత్యపు ఒడిలో పురుడుపోసుకున్న సినిమా చాలా కాలం పాటు ఎక్కువ శాతం నాటకాలు, ప్రబంధ, పురాణ కథల మీదే ఆధారపడింది. తెలుగు సినిమా కిరీటంలో కలికి తురాయి అని చెప్పదగ్గ 'మాయాబజార్' సినిమాకు కథ 'శశిరేఖా పరిణయం' అనే నాటకం నుండే వచ్చింది. అప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందిన నాటకాలు అయిన కన్యాశుల్కం, సత్య హరిశ్చంద్ర, చింతామణి, సీతా కల్యాణం, సతీ అనసూయ వంటివి సినిమాలుగా వచ్చాయి. సాంఘిక చిత్రాలు కూడా అప్పటి విజయవంతమైన నాటకాల నుండే చాలా వరకు తీయబడ్డాయి.
ఆ తరువాత నాటకాల స్థానాన్ని నవలలు భర్తీ చేశాయి. భారతీయ సారస్వతానికి నవలలు చాలా ఆలస్యంగా పరిచయం అయ్యాయి. కానీ వచ్చిన కొద్ది కాలానికే సాహితీ ఒరవడిలోనే పెను సంచలనాలు సృష్టించాయి. నవలల మీద పాఠక లోకానికి ఎంత మోజు ఏర్పడిందో, రచయితలకు అంత కంటే ఎక్కువ మక్కువ పెరిగింది. తాము చెప్పదలుచుకున్నదాన్ని విస్తృతంగా వివరించడానికి ఈ ప్రక్రియ దోహదపడటంతో ఎందరో రచయితలు ఈ స్రవంతిలో మునకలేసి, పాఠకులను ఒక ఊపు ఊపారు.
1940లో మొక్కపాటి నరసింహశాస్త్రి గారు వ్రాసిన 'బారిష్టర్ పార్వతీశం' నవల సినిమాగా వచ్చింది. ఆ తరువాత మార్క్ ట్వెయిన్ రాసిన 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్' నవల ఆధారంగా 1954లో ఎన్టీరామారావు హీరోగా 'రాజు-పేద' సినిమాని తీశారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించింది. అలా నవలా సాహిత్యం సినిమాపై ప్రభావం చూపించడం ప్రారంభమైంది.
బెంగాలీ నవలలు, అందునా శరత్ చంద్ర ఛటర్జీ రాసిన నవలలు తెలుగు దేశాన్ని ఎంతగా ఊపేశాయో ఆ నవలల ఆధారంగా వచ్చిన సినిమాలు కూడా అదే స్థాయిలో విజయం సాధించాయి. 1953లో వచ్చిన 'దేవదాసు', 1957లో విడుదలైన 'తోడికోడళ్ళు', 1961లో వచ్చిన 'బాటసారి' వంటి సినిమాలకు శరత్ నవలలే మూలం.
1960వ దశకం ప్రారంభం నుండి ఈ నవలా సినిమాల హవా ఉధృతమైంది. కోడూరి కౌసల్యాదేవి రాసిన నవలల ఆధారంగా వచ్చిన డాక్టర్ చక్రవర్తి, చక్రవాకం, ప్రేమనగర్ వంటి సినిమాలు అఖండ విజయం సాధించాయి. రంగనాయకమ్మ రాసిన నవల ఆధారంగా వచ్చిన 'బలిపీఠం' వంటి సినిమాలు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించాయి.
ఇక నవలా రంగంలో యద్ధనపూడి సులోచనారాణి ఎంత మంచి స్థానాన్ని సంపాదించుకున్నారో, ఆమె నవలలు కూడా సినీలోకంలో అంతటి ఘన విజయాలుగా మారాయి. ఆమె నవలల ఆధారంగా తీసిన 'మీనా', 'గిరిజా కల్యాణం', 'జీవన తరంగాలు', 'సెక్రెటరీ', 'ఆత్మ గౌరవం' వంటి సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. 2016లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రం తీసిన ‘అ ఆ’ సినిమాకు కూడా మీనా నవలే ఆధారం.
చిరంజీవి-కోదండరామిరెడ్డి కలయికలో యండమూరి వీరేంద్రనాధ్ నవలల ఆధారంగా వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో. 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' వంటి సినిమాలు చిరంజీవి కెరీర్‌లోనే మంచి హిట్లుగా నిలిచాయి.
అయితే స్క్రీన్ అడాప్షన్, అంటే ఇలా నవలలను సినిమాలుగా మలచడం, అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అదో ఒక గొప్ప కళ. ఎంతో సాధన, కథకు ఉండే ఆత్మను సరిగ్గ అర్ధం చేసుకుని, దానిని తిరిగి చెప్పగలిగిన సత్తా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది.
ప్రపంచ సినీ చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిన 'గాడ్‌ఫాదర్' సినిమాను స్క్రీన్ అడాప్షన్ విషయంలో ఒక పాఠ్యపుస్తకంగా ఎన్నుకోవచ్చు. అంత గొప్పగా ఆ సినిమాను తీసిన దర్శకుడు ఫ్రాన్సిస్ నైపుణ్యత అంతటిది మరి. అయితే ఈ స్క్రీన్ అడాప్షన్ విషయంలో మన దేశంలో కొన్ని సినిమాలు చాలా వివాదాలకు గురయ్యయి.
1965లో ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా తీసిన 'గైడ్' సినిమా భారతీయ చలన చిత్ర రంగలో క్లాసిక్‌గా నిలిచింది, అలాగే అతి పెద్ద హిట్ కూడా అయ్యింది. కానీ ఈ సినిమా చూసిన తరువాత తాను చాలా బాధ పడ్డానని, నవలలోని ఆత్మని సినిమాలో సరిగ్గా చూపించలేకపోయారని రచయిత నారాయణ్ చెప్పారట. స్క్రీన్ అడాప్షన్‌కి జయాపజయాలు కొలబద్దలు కావు అనడానికి ఇదే తార్కాణం.
ఇక మన తెలుగు నాట కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన అద్భుతమైన నవల 'ఏకవీర'ను సినిమాగా తీయడంలో విఫలమయ్యారనేది ఆనాటి ప్రేక్షకుల, విమర్శకుల మాట. ఈ సినిమా దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుంది. విమర్శకురాలు డాక్టర్ వై.కామేశ్వరి ఏకవీర విశ్వనాథ కథా కథన కౌశలం అనే పుస్తకంలో నవలను, సినిమాను పోల్చి ఎంతో తులనాత్మకమైన విమర్శ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నలుగురు నాయికా, నాయికలూ చనిపోయినట్టు చూపించడం ఈ సినిమా స్క్రీన్‌ప్లే రచయిత సి.నారాయణ రెడ్డి చేసిన తప్పిదంగా ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ సినిమా విశ్వనాథ అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.
ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో స్క్రిన్‌ప్లేతో పాటు స్క్రీన్ అడాప్షన్‌కు కూడా అవార్డులు ఇస్తారు. అంటే ఏదైనా సాహితీ ప్రక్రియ నుండి తీసుకున్న కథను సినిమాకు అనుగుణంగా స్క్రిప్ట్ తయారు చేసుకోవడం అన్నమాట. దీనిని బట్టే చెప్పవచ్చు ఒక కథనో, నవలనో సినిమాగా తీయడం అంటే దర్శకుడికి ఎంతటి కత్తి మీద సాము లాంటి విషయమో.
ప్రేమలేఖ
జంధ్యాల దర్శకత్వం వహించిన పూర్తి స్థాయి హాస్య భరిత చిత్రం 'శ్రీవారికి ప్రేమలేఖ', ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారి 'ప్రేమలేఖ' ఆధారంగా తీసినదే. తెలుగు సాహిత్యంలో హాస్యానికి కేరాఫ్ ఎడ్రస్‌గా నిలిచిన విజయలక్ష్మి గారి నవలను, తెలుగు సినీ చరిత్రలో హాస్య బ్రహ్మగా పేరొందిన జంధ్యాల గారు సినిమాగా తీయడమనేది తెలుగు వారి భాగ్యంగా చెప్పడం అతిశయోక్తి కాదేమో.
చతుర పత్రికలో ధారావాహికగా వచ్చిన ఈ నవలను రామోజీరావుగారి ప్రోత్సాహంతో, జంధ్యాల గారు వెండితెరకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి సినిమాగా తీశారు. ఈ నవల, సినిమా రెండూ మంచి విజయం సాధించడం యాదృచ్ఛికం కాదు. పాత్రలు, కథ, కథనాల బలమే ఈ ఘన విజయాలకు కారణం.
ఎవర్ని పడితే వాళ్ళని చెడామడా తిట్టిపోసే పరంధామయ్య, ఆపకుండా పేకాడే పరంధామయ్య పెద్ద కొడుకు, చూసిన ప్రతి సినిమానీ అక్షరం పొల్లు పోకుండా దొరికిన వాళ్ళందరికీ బుర్ర పాడయిపోయేదాకా చెప్పుకుపోయే కోడలు, ముక్కూ మొహం తెలియని పిల్ల రాసిన ప్రేమలేఖకి మురిసిపోయి, పెళ్ళి చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్న కథానాయకుడు ఆనందరావు, ఇలా ప్రతీ పాత్ర తమ స్వరూప స్వభావాలతో కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటాయి.
ఈ వారం ఈ హాస్య నవల శ్రవణ పుస్తకంగా మన ముందుకు రాబోతోంది. ఇంకేముంది ఈ నవ్వుల వానలో తడిసి ముద్ద అయిపోదామా.
వాణిశ్రీ
వాణిశ్రీ గారి సినీ కెరీర్‌లో నవలల ఆధారంగా వచ్చిన సినిమాలు మేలి మలుపులుగా నిలిచాయి అనడంలో అతిశయోక్తి కించిత్తు కూడా లేదు. ఎంతగా అంటే వాణిశ్రీ గారికి 'నవలా నాయిక' అని బిరుదు వచ్చేంతగా. ఎందరో నవలా రచయితలు చెక్కిన పాత్రలకు ఆమె వెండితెర మీద ప్రాణం పోశారు. తన అభినయంలో గానీ, మేకప్‌లో గానీ, వస్త్రధారణలో గానీ పాత్ర నుండి కొంచెం కూడా పక్కకి జరగకుండా జాగ్రత్త తీసుకోవడం ఆమె నవలా నాయిక కావడానికి ప్రధాన కారణం. పాఠకులు నవల చదివినప్పుడు హీరోయిన్‌ని ఎలా ఊహించుకున్నారో, అలాగే ఉండటానికి ఆమె ఎంతో కృషి చేసేవారట. ఈ విషయాలన్నిటినీ ఈ వారం విడుదల కాబోతున్న ఆమె ముఖాముఖీలో వినవచ్చు.
అనుభవాలు - జ్ఞాపకాలూను 4
అనుభవాలు - జ్ఞాపకాలూను పుస్తకానికి నాలుగవది, ఆఖరిది అయిన ఈ భాగంలో తన 'వీరపూజ' పుస్తకం అచ్చువేయించుకోవడానికి శ్రీపాద వారు పడిన కష్టాలను వివరించారు. నిజానికి రచయిత అనేవాడికి తన రచనను తానే ప్రకటించుకోవాల్సి రావడం ఎంత ఇబ్బందికరమైన ప్రయత్నమో శ్రీపాద వారి అనుభవాల ద్వారా అర్ధం అవుతుంది మనకు. అలాగే పుస్తకాలను ప్రచురించే సంస్థలు తమ ఆలోచనలు, ఆదర్శాలకు అనుగుణంగా రచనల్లో మార్పులు చేయమన్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో కూడా చెప్తారు శ్రీపాద. ఇంకా ఉంటే ఎంత బాగుండును అనిపించే రచనల్లో శ్రీపాద వారి ఈ ఆత్మకథ ఒకటి. గంగి గోవు పాలు గరిటడైనను చాలును అన్నారు శతకకర్తలు. కాబట్టీ దొరికిన ఈ సంపదను కళ్ళకు అద్దుకుని భద్రంగా గుండెల్లో దాచుకోగలిగితే ధన్యులమే అవుతాము. శిష్ట వ్యవహార భాషలో రచనలు చేసిన తొలి తరం రచయితల్లో ఒకరైన శ్రీపాద వారి అనుభవాల ఆఖరి సంపుటాన్ని సగర్వంగా ఈ వారం మీకు అందిస్తోంది దాసుభాషితం.