భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ కలం వీరులకు నివాళి
తన తల్లి వినతిని దాస్యం నుండి విముక్తి చేయడానికి గరుత్మంతుడు కష్టపడినట్టు, తమ మాతృభూమిని పరాయి పాలన నుండి రక్షించడానికి ఈ భరత మాత ముద్దు బిడ్డలు ఎందరో పోరాడారు. కొందరు ఆయుధాలతో, కొందరు అహింసా మార్గంలో, మరికొందరు వీరికి స్ఫూర్తిని రగింలించేలా తమ కలాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ కవి యోధులను స్మరించుకుందాం.
దేశ ప్రజలందరిలోనూ స్వాతంత్య్ర కాంక్షను పెంచిన వందేమాతరం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయాన్ని రాసిన బంకించంద్ర ఛటర్జీ, జనగణమన అధినాయక జయహే అంటూ భారతావనిని జయహో అంటూ కీర్తించిన రవీంద్రనాథ్ ఠాగూర్, సారే జహాసే అచ్ఛా అని ఈ భరత ఖండాన్ని పొగిడిన మహ్మద్ ఇక్బాల్ వంటి వారు రగిలించిన స్వాతంత్య్ర స్ఫూర్తి అమోఘమైనది.
అలాగే మన తెలుగు నాట కూడా ప్రతీవారిలోనూ స్వాతంత్య్ర జ్వాలను రగిలించారు ఎందరో కవులు. తెలుగులో జాతీయ కవిత్వపు ఒరవడి సృష్టించిన గొప్ప కవి గరిమెళ్ళ సత్యనారాయణ. ఆయన రచించిన 'మాకొద్దీ తెల్ల దొరతనము' అనే గేయం ఆ కాలంలో సంచలనం సృష్టించింది. ఈ గేయాన్ని పాడుతూ జనాలు ర్యాలీలు తీసేవారు. దాంతో బెదిరిన ఆంగ్ల ప్రభుత్వం, సత్యనారాయణ గారిని జైలులో పెట్టారు. అయినా ఆయన రాసి, పాడిన ఆ పాట జనాలను ఉత్తేజపరుస్తూనే పోయింది. ఎందరినో ఈ సంగ్రామంలోకి దూకేలా చేసింది.
'ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము' అంటూ తెలుగు ప్రజలలో భారత భూమిపై ప్రేమ విత్తులు నాటారు రాయప్రోలు సుబ్బారావు గారు. 'శ్రీలు పొంగిన జీవ గడ్డయి పాలు గారిన భాగ్య సీమయి వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా' అంటూ మన భూమి గొప్పతనాన్ని మనకి తిరిగి పరిచయం చేశారాయన. సుబ్బారావు గారు ప్రధానంగా దేశభక్తి గేయాలు ఎన్నిటినో రచించారు.
గురజాడ అప్పారావు గారు రచించిన 'దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా', కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 'వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ తెల్పుడీ' గేయాలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. దాశరధి కృష్ణమాచార్య రచించిన 'తల్లీ భారతీ వందనం', చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసిన 'భరత ఖండమ్ము చక్కటి పాడి ఆవు', దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలు వారిన 'జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి' వంటి గేయాలు ఎందరినో స్వాతంత్య్ర సమరం వైపు అడుగులు వేయించాయి.
సాహిత్యం ఎప్పుడూ సమాజానికి ప్రతిబింబంగా ఉంటుంది. కొన్ని రచనలు సమజాంలోని విషయాలకు అద్దంలా నిలిస్తే, కొన్ని రచనలు సమాజాన్ని ప్రభావితం చేసేవిగా ఉంటాయి. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో పత్రికలు కూడా ఎంతో గొప్ప పాత్ర పోషించాయి. సమకాలీన ఉద్యమంపై పాఠకులకు అవగాహన కల్పించే విధంగా నడిచిన ఎన్నో పత్రికలు ఆంగ్ల ప్రభుత్వ ఆగ్రహానికి, తద్వారా నిషేధానికి కూడా గురయ్యాయి.
ఇక స్వాతంత్య్ర అనంతరం వచ్చిన రచనల్లో ఆనాటి ఉద్యమ విశేషాలను తరువాతి తరాలకు అందించిన గొప్ప రచనలు కూడా తెలుగులో ఎన్నో ఉన్నాయి. జాతీయోద్యమ నవలా త్రయంగా చెప్పుకోదగ్గ 'అతడు-ఆమె', 'చదువు', 'కొల్లాయిగట్టితేనేమి'లలో స్వాతంత్య్ర సంగ్రామాన్ని, అప్పటి సామాజిక స్థితి గతులనీ ఆయా రచయితలు ఎంతో చక్కగా వివరించారు. ఈ నవలలు రాసిన రచయితలు ముగ్గురూ కమ్యూనిస్టులే. కాబట్టీ కమ్యూనిస్ట్ దృష్టికోణం నుంచి ఈ మహాసంగ్రామాన్ని ఆవిష్కరించారు.
'అతడు-ఆమె' నవలలో ఉప్పల లక్ష్క్మణ రావు గారు ఆనాటి గాంధేయ మార్గాన్ని ఎంతగా వివరించారో, కేవలం రాజకీయ కారణాలతో స్వాతంత్ర్య యోధులుగా తిరిగిన వారి గురించి కూడా తెలియజేశారు. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే ప్రతీ విషయానికి భిన్న కోణాలు ఉంటాయి అని ఈ నవల చెప్తుంది మనకి. ఆనాటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చిందో కూడా వివరిస్తారు. ఆనాటి సామాజిక, రాజకీయ మార్పులకు ఈ నవల దర్పణంగా నిలుస్తుంది.
సమాజంపై స్పష్టమైన అవగాహన కలిగిన అతి కొద్ది మంది రచయితల్లో కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకరు. సుందరం అనే మధ్యతరగతి కుర్రాడి జీవితం ద్వారా స్వాతంత్య్ర కాలం నాటి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, సామాజిక అతి ముఖ్యంగా ఆర్ధిక పరిణామాలు ప్రజలపై చూపిన ప్రభావాన్ని వివరించారు 'చదువు' నవలలో. ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయిన వేళ ఒక తెలుగు కుర్రాడు చదువు ముందుకు సాగక, బ్రతుకు తెరువుకు దారి తెలియక, స్వాతంత్య్ర సంగ్రామం ఆకర్షించగా తన జీవితాన్ని ఎలా నడిపాడో కళ్ళకు కట్టినట్టు చెప్తారు కుటుంబరావు గారు. ఈ నవలను ఎందరో విమర్శకులు చారిత్రిక వాస్తవిక నవలగా అభివర్ణించారు.
ఇక ఈ త్రయంలో మూడవది అయిన 'కొల్లాయిగట్టితేనేమి' నవలను మహీధర రామమోహనరావు గారు రచించారు. సాంఘిక దురాచారాలను ఎదిరించినందుకు తన గ్రామం నుండి బహిష్కరణకు గురికావడం, స్వాతంత్య్ర ఉద్యమంలో తిరుగుతున్నందుకు స్వంత మామగారు తన భార్యను తనకు కాకుండా చేయడం ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు రామనాథం. ఆనాటి కాలంలో ఊసుపోని వారందరూ ఉద్యమంలోకి దిగారు అనే అభిప్రాయం తరువాతి తరంలో చాలా బలంగా వేళ్ళూనుకుపోయింది. నిజానికి స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడాలంటే ఎంతటి ఓర్పు, నిబద్ధత, సహనం, ధైర్యం, నిజాయితీ కావాలో కథానాయకుడు రామనాథం జీవితం ద్వారా మనకు చెప్తారు రచయిత.
ఇక తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ 'హంపి నుండి హరప్పా దాక', విశ్వనాథ సత్యనారాయణ గారి ఆత్మకథాత్మక నవల 'వేయిపడగలు' అడవి బాపిరాజు గారి 'నారాయణరావు' నవలల్లో కూడా స్వాతంత్య్ర సమరం, అప్పటి సామాజిక పరిస్థితులు, వాటిపై ఆ కాలం వారి అభిప్రాయాలు వంటి ఎన్నో విలువైన విషయాలు మనకు కనిపిస్తాయి.
ప్రపంచం యావత్తూ భూస్వామ్య విధానం నుండి పెట్టుబడిదారీ విధానంలోకి మారుతున్న సంధి కాలంలో, ప్రపంచ యుద్ధం, ఆర్ధిక మాంద్యం నడుస్తున్న కాలంలో వలస పాలనలో ఉన్న భారతదేశంలో జరిగిన స్వాతంత్ర్య మహా సంగ్రామాన్ని ఈనాటి తరం అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకాలు ఎంతో అవసరం.
ఈ స్వాతంత్య్ర రజతోత్సవ వేడుకలను ఆనాటి సమాజాన్ని నడిపించిన కవులు, ఆ సమాజాన్ని చిత్రించిన రచయితలను స్మరిస్తూ, ఆ కలం వీరులకి నివాళులు అర్పిస్తోంది దాసుభాషితం.
ఒక ఆత్మకథ
దాసుభాషితం చరిత్రలోనే రచయిత్రి తన నవలను తానే చదివి ఇవ్వడం ఇదే ప్రధమం.
మన జీవితంలో కొందరు హఠాత్తుగా వచ్చి, మనతో ఎంతో అభిమానంగా మెలిగి, అంతే హఠాత్తుగా వెళ్ళిపోతారు. ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారి జీవితంలో చూసిన చేదు అనుభవం ఈ నవల. ఆమె భర్త ఉద్యోగ బాధ్యతల వల్ల పశ్చిమ బెంగాల్‌లో వారి కుటుంబం ఉన్న రోజుల్లో పరిచయమైన చలాకీ కుర్రాడు బలవీర్ సింగ్. శ్రీమంతుల కుటుంబం నుండి అమ్మాయిని పెళ్ళి చేసుకున్న ఈ పేద కుర్రాడు అహర్నిశలూ తన కుటుంబానికి ఉన్నత జీవితాన్ని ఇవ్వాలని శ్రమించేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే బలవీర్ జీవితం తీసుకున్న మలుపు రచయిత్రి కుటుంబాన్ని సైతం కదిలించివేసింది. మన ప్రియమైన హాస్య రచయిత్రి జీవితంలోని ఈ బాధాకరమైన అనుభవాన్నివారి గళంలో విందాం.
వెన్నెల - విశ్లేషణ
అన్నం తినను అని మారాం చేస్తే అమ్మ మనకి మొదటిసారిగా పరిచయం చేసే మన నేస్తం వెన్నెల. ఇక అక్కడి నుంచి వెన్నెలతో మన ప్రయాణం కొనసాగుతుంది. యవ్వన దశలో ఈ స్నేహం మరింతగా ముదిరి, విడదీయరాని బంధంగా ఏర్పడుతుంది. మానవ జీవితం నుండే సమస్త సాహిత్యమూ వస్తుంది. అందుకే మన చిన్ననాటి చెలికత్తె అయిన వెన్నెల సాహిత్యంలోకి కూడా వచ్చేస్తుంది. ఎందరో కవులు, రచయితలు వెన్నెలతో కబుర్లాడారు, పాడారు, విరహ బాధను పెంచుతున్నావంటూ తిట్టుకున్నారు, తమ గోడు వెళ్ళబోసుకున్నారు, తన వారితో రాయబారం చేసి పెట్టమని బతిమాలుకున్నారు. ఇలా ప్రబంధ సాహిత్యం మొదలుకుని, నేటి సినీ సాహిత్యం దాకా ఎందరో కవులు ఎన్నో విధాల వెన్నెలను వర్ణించారు. వారందరి వర్ణనలపై ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు, వ్యాఖ్యాత శ్రీమతి సి.మృణాళిని గారి విశ్లేషణను ఈ వారం వెన్నెట్లో కూర్చుని మరీ విందాం. కాసేపు ఆ వెన్నెల వానలో తడుద్దాం.