#40 చరిత్ర సృష్టించిన చారిత్రిక నవల - పొన్నియిన్ సెల్వన్

Meena Yogeshwar
August 26, 2021

పొన్నియిన్ సెల్వన్ తొలి తెలుగు అనువాదాన్ని శ్రవణ పుస్తకంగా విడుదల చేస్తున్న సందర్భంగా. ఈ భూమి నాది అని ప్రతివారూ అనుకుంటారు. తాను కొన్నాడు కాబట్టి తనది అనుకుంటాడు ఒకడు. తాను పాలించాడు కాబట్టి తనది అనుకుంటాడు మరొకడు. ఈ భూమిలో పుట్టి, ఈ భూమిని ఏలి, తిరిగి ఈ భూమిలోనే కలిసిపోతారు. కానీ ఈ భూమి ఎవడిదీ కాదు. తన మోహ మాయ ఉపయోగించి, ప్రతివాడినీ ఇది నాదీ అనుకోవడం కోసం కొన్నాళ్ళు ఒకరి కింద ఉన్నట్టు నటిస్తుంది ఈ భూమి. వాడి సమయం అయిపోగానే మెల్లిగా తన కడుపులోకి తిరిగి కలిపేసుకుంటుంది.

పొన్నియిన్ సెల్వన్ తొలి తెలుగు అనువాదాన్ని శ్రవణ పుస్తకంగా విడుదల చేస్తున్న సందర్భంగా.

ఈ భూమి నాది అని ప్రతివారూ అనుకుంటారు. తాను కొన్నాడు కాబట్టి తనది అనుకుంటాడు ఒకడు. తాను పాలించాడు కాబట్టి తనది అనుకుంటాడు మరొకడు. ఈ భూమిలో పుట్టి, ఈ భూమిని ఏలి, తిరిగి ఈ భూమిలోనే కలిసిపోతారు. కానీ ఈ భూమి ఎవడిదీ కాదు. తన మోహ మాయ ఉపయోగించి, ప్రతివాడినీ ఇది నాదీ అనుకోవడం కోసం కొన్నాళ్ళు ఒకరి కింద ఉన్నట్టు నటిస్తుంది ఈ భూమి. వాడి సమయం అయిపోగానే మెల్లిగా తన కడుపులోకి తిరిగి కలిపేసుకుంటుంది.

కానీ, కొందరి పేర్లను మాత్రం తరువాతి తరాలకు అందిస్తూనే ఉంటుంది. తనను భూమిగా కాక, శక్తిగా కొలిచినవాడికి ఆ గౌరవాన్ని ప్రకటిస్తుంది. తమ ధైర్య పరాక్రమాలకు, వీరత్వానికీ, భక్తికీ, ధర్మ నిరతికీ నిలబడ్డవారి కథలను ఎప్పుడూ ఈ గాలిలో తిరుగాడుతుండేలా చేయడం ఆమె ఆ వీరులకు అందించే నివాళి. అలాంటివారిలో ఒకడు మొదటి చోళ చక్రవర్తి అయిన రాజ రాజ చోళుడు.

రాజ రాజ చోళుని అసలు పేరు అరుళ్‌మొళి వర్మ. ఈ నవల అంతా అతను ఈ పేరుతోనే ప్రస్తావించబడతాడు. అతను రాజు అయ్యేటప్పటికి చోళ రాజ్యం పరిధి తంజావూరు నుండి తిరుచిరాపల్లి వరకూ మాత్రమే ఉంది. అతని తండ్రి సుందర చోళుడు రాజుగా ఉన్నప్పుడే ఈ రాజ్య విస్తరణ మొదలుపెట్టాడు రాజ రాజ చోళుడు. ఇక తాను రాజయ్యాకా చోళ రాజ్యాన్ని ఎంతగా విస్తరించాడు అంటే పైన కళింగ(ఒడిశా) నుండి మన ఆంధ్ర ప్రాంతమైన వేంగినాడు, కేరళ ప్రాంతమైన చేరనాడు, తమిళ నాడు, శ్రీలంకలోని సగం వరకూ చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతే కాదు లక్ష్యద్వీపం, మాల్దీవులను కూడా తన సామ్రాజ్యంలో చేర్చుకున్నాడు.

తన రాజధాని తంజావూరులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం కలిగిన బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన ఈ రాజు, తన పాలనా కాలంలో ఎన్నో శైవ, వైష్ణవ ఆలయాలను నిర్మించాడు. సహజంగా చోళులు వీర శైవులైనా, రాజ రాజ చోళుడు మాత్రం సర్వమత సమానత్వాన్ని పాటించాడు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. తమిళ శైవ మహా కవి నంబియానంద నంబిని ప్రోత్సహించి, తమిళ శైవ్య సాహిత్యంలో అత్యంత విలువైన రచనలను చేయించాడు. అరువది ముగ్గురు నాయనార్ల చరిత్ర అయిన పెరియ పురాణాన్ని, సంబంధార్, అప్పార్, సుందరార్ వంటి శైవ మహా కవుల పద్యాలను తిరుమురై కంద పురాణం వంటి రచనలు చేయడానికి నంబిని ప్రోత్సహించిన రాజ రాజ చోళుని, ‘తిరుమురై కంద చోళన్’ అనే బిరుదు వరించింది.

ఇంతటి మహా సామ్రాజ్య కర్త అయిన రాజ రాజ చోళుడు అధికారంలోకి రావడానికి పూర్వం చోళ రాజ్యంలోని పరిస్థితులు, చోళులను గద్దె నుండి దించాలని నందిని వంటి వారు చేస్తున్న పన్నాగాలు, వాటిని కనిపెట్టి, సింహాసనాన్ని కాపాడేందుకు రాజ రాజ చోళుని అన్నగారు ఆదిత్య కరికాలుడు, అక్కగారు కుందవాయి, ఆదిత్యుని స్నేహితుడు, ఆంతరంగిక రక్షకుడు అయిన వంతిదేవుడు కలసి చేసే ప్రయత్నాలు వంటివే ఈ పొన్నియిన్ సెల్వన్ నవల కథాంశం.

తమిళ ప్రజలకు వేల సంవత్సరాలుగా జీవధారగా నిలిచిన కావేరీ నదికి మరో పేరు పొన్ని. ఆ పొన్నికి ముద్దుబిడ్డలు అయిన చోళుల కథే ఈ నవల. ఈ నవల మొత్తం వంతిదేవుడు, కుందవాయి, రాజ రాజ చోళుల చుట్టూ తిరుగుతుంది. వీరిని మట్టుబెట్టి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని పగబట్టిన ఆడ త్రాచు నందిని చేసే పన్నాగాలను వీరెలా బట్టబయలు చేశారు, రాజ రాజ చోళుని తండ్రి సుందర చోళుని మరణం తరువాత సింహాసనం ఆతని పెద్దనాన్న అయిన ఉత్తమ చోళుడికి వెళ్ళడానికి కారణం ఏమిటి వంటి విషయాలన్ని ఈ బృహన్నవల మనకు వివరిస్తుంది.

1950లో కల్కి పత్రికలో సీరియల్‌గా మొదలైన ఈ నవల 1954లో పూర్తి ఆయ్యింది. 1955లో 2,210 పేజీలు కలిగిన ఈ బృహన్నవలను ఈ నవలా రచయిత కల్కి కృష్ణమూర్తి అయిదు భాగాలు గల నవలగా ప్రచురించారు. ఈ నవల కల్కి పత్రికలో సీరియల్‌గా ప్రచురిచతమయ్యేటప్పుడు, ఆ పత్రిక ప్రతి వారం దాదాపు 70వేల కాపీలు అమ్ముడుపోయిందిట. అప్పటి భారతదేశ పత్రికా రంగ చరిత్రలో ఇన్ని కాపీలు అమ్ముడుపోవడం అనేది ఒక అరుదైన, ఎవరూ మీరజాలలేని రికార్డు. అలాంటి గొప్ప రికార్డు సృష్టించిన ఈ నవల, ఎందరో తమిళులను పుస్తక ప్రియులుగా మార్చివేసింది. 30కి పైగా ముఖ్య పాత్రలు, ఊహించని మలుపులు, బిగువు తగ్గని కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, చదువరులను ఊహాలోకంలో ఆ చారిత్రిక ఘట్టాలలోకి తీసుకునిపోగల శైలితో కల్కి రాసిన ఈ నవల భారతీయ సాహిత్యంలోనే గొప్ప చారిత్రిక నవలగా నిలుస్తుంది.

1958లో ఈ నవలను సినిమాగా తియ్యాలని ఎం.జి.ఆర్ భావించి, ఆ సినిమా హక్కులు కూడా కొన్నారు. కానీ ఆయనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 2005లో మాక్కల్ టీవి వారు దీనిని సీరియల్‌గా తీయాలని ప్రయత్నించారు. కారణాంతరాల వలన అదీ ఆగిపోయింది. 2012లో దర్శకుడు మణిరత్నం సినిమాగా తీస్తున్నామని ప్రకటించారు. కానీ అదీ పట్టాలెక్కలేదు. 2019లో తిరిగి ఈ సినిమాను ప్రారంభించి, 2022లో విడుదల చేయాలని సంకల్పించారు మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకురాలిగా ఈ నవలను వెబ్ సిరీస్‌గా తీస్తున్నారు. అది కూడా షూటింగ్ దశలోనే ఉంది.

రష్యన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, కిర్గిజ్ వంటి ప్రపంచ భాషా సాహిత్యపు అనువాదాలతో రత్నగర్భగా సుసంపన్నం అయింది తెలుగు సాహిత్యం. ఆయా ప్రాంతాల చరిత్రను, అచార వ్యవహారాలకు పట్టుకొమ్మలుగా నిలిచిన వార్ అండ్ పీస్(యుద్ధము - శాంతి), గాన్ విత్ ద విండ్(చివరకు మిగిలింది), ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్, ద రూట్స్ (ఏడు తరాలు), స్పార్టకస్ వంటి రచనలు అనువాదం కావడం తెలుగుకు ఎంత అవసరమైనదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

మరి మనతో భాష, సాంస్కృతిక, ఆచార, సంప్రదాయ వేదికను కలిసి పంచుకునే మన సోదర భాష అయిన తమిళం నుండి ఈ పొన్నియిన్ సెల్వన్ అనే నవల తెలుగులోకి ఇన్నాళ్ళూ అనువాదం కాకపోవడం గొప్ప లోటు అనడంలో ఏ సందేహమూ లేదు. ఈ లోటును తీర్చడంలో రచయిత నాగరాజన్ కృష్ణమూర్తి గారు చేసిన కృషి ఒక చారిత్రిక మలుపుగా నిలిచిపోతుంది.

తల్లిదండ్రులు ఇద్దరూ తమిళ వారే అయినా చిత్తూరులో తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేయడం వల్ల తెలుగువారైపోయారు నాగరాజన్ గారు. తన మాతృభాషను నేర్చుకోవాలనే పట్టుదలతో, తన తల్లిగారి దగ్గర తమిళం నేర్చుకున్నారు. 1998లో కల్కి కృష్ణమూర్తిగారి శతజయంతోత్సవాల సందర్భంగా కల్కి పత్రికలో ఈ నవలను పునర్‌ప్రచురించినప్పుడు నాగరాజన్ గారు తన తల్లిగారి కోసం ఈ నవల ఉండే పేజీలను భద్రపరిచి పుస్తకంగా చేసి దాచుకున్నారట. 2011లో ఎంతో శ్రమకోర్చి, ఆ తమిళాన్ని అర్ధం చేసుకుని ఈ నవలను తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యపు కిరీటంలో కలికితురాయిని అందించారు.

ఈ నవలను తెలుగు శ్రోతలకు బహుమతిగా అందించడానికి దాసుభాషితం చేస్తున్న ఈ ప్రయత్నం తప్పకుండా ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుంది. ఈ చారిత్రపు సంధిలో ఈ వైపున మేము, ఆవలి తీరాన శ్రోతలైన మీరు నిలిచి ఉన్నారు. ఊహ అనే నౌకలో  ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటే - ఆది, అంతాలు ఎరుగని కాలమనే మహానదిలో సెకనుకి వందేళ్ల వేగంతో వెయ్యి సంవత్సరాల వెనక్కి వెళ్ళొద్దాం రండి. ఈ బృహన్నవలను ఆరు భాగాలుగా మీముందుకు సగర్వంగా, సంతోషంగా అందిస్తోంది దాసుభాషితం. 

ఓ మనిషి కథ

O Manishi Katha
Tap to listen


మనిషి తన చిన్నతనం నుంచి తాను పెరిగే వాతావరణం నుండి ప్రభావితుడయ్యి, తన జీవితాన్ని ఆ ప్రభావంలోనే గడుపుతాడు. కానీ కొన్ని అనుకోని చేదు సంఘటనలు కొందరి జీవితాన్ని పూర్తిగా కుదిపేస్తాయి. సదాచార జీవనాన్ని గడుపుతున్న త్యాగి, తల్లి మరణం తరువాత తండ్రి, భార్య ఉన్నా ఒంటరివాడై వ్యసనాలకు బానిస అవుతాడు. అన్నిటికీ ఇబ్బంది పెట్టే తండ్రి, తనను అర్ధం చేసుకోని భార్య వల్ల అతని జీవితం ఈ కూపంలోకి మరింతగా దిగిపోతుంది. కానీ తన స్నేహితుని సాయంతో తిరిగి మనిషిగా మారేందుకు ప్రయత్నించే త్యాగి ఆఖరికి ఏం అవుతాడు అనేదే 'ఓ మనిషి కథ' నవల కథాంశం. ప్రపంచ సాహిత్యాన్ని ఔపోసన పట్టిన రచయిత్రి శ్రీమతి మాలతీ చందూర్ గారి కలం నుండి పుట్టిన ఈ జీవన గంగా ప్రవాహంలో మనమూ ఓ మునక వేద్దాం.

ఇల్లాలి ముచ్చట్లు

Illali Mutchatlu Visleshana
Tap to listen


నదిని స్త్రీరూపంగా కొలవడం మన భారత సంప్రదాయం. ఒక జీవనది ఎలాగైతే తను పుట్టిన భూమిని విడిచి, ఎందరి దాహాన్నో తీరుస్తూ, ఎందరినో తరింపజేస్తూ, ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ, ఎన్నో మలుపులు తట్టుకుంటూ ముందుకు సాగి, సాగరాన్ని చేరుతుందో అలాగే స్త్రీ కూడా తన పుట్టింటిని వదిలి, తనవారి పాలిట అన్నపూర్ణగా మారి, ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ, ఎన్నో కష్ట నిష్ఠూరాలను తట్టుకుంటూ, అనంతంలోకి కలిసిపోతుంది. తరతరాలుగా స్త్రీ ఇల్లాలు అనే అతి పెద్ద పాత్రను పోషిస్తూనే వస్తోంది. ఎందరో ఇల్లాళ్ళు కానీ, అందరి కథలూ ఒకటే. అందరివీ ఒకేలాంటి తిప్పలూ, అందరివీ ఒకేలాంటి సంతృప్తులు. అందుకే పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు తన ఇల్లాలి పేరిట రాసిన ఈ ఇల్లాలి ముచ్చట్లు ప్రతి ఇల్లాలికీ చెందిన ముచ్చట్లే. ప్రతి ఇల్లాలి మనసులోని మాటలే. ఒక ఇల్లాలు చెప్పే కబుర్లను రచయిత్రి పేరుతో చెబితేనే 'రాణి'స్తుందని భావించిన శర్మ గారు తన భార్య పురాణం సీత గారి పేరుతో రాశారు ఈ వ్యాసాలను. ఈ ఇంటింటి కథలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి సి.మృణాళిని గారి విశ్లేషణ ఈ వారం విడుదల కాబోతోంది. ఈ జీవన స్రవంతలో మనమూ ఒక బిందువై సాగుదాం.


కొత్త లోగో ఆవిష్కరణ

Dasubhashitam logo teaser

ఇన్నాళ్ళూ శ్రవణ పుస్తకాలతో మిమ్మల్ని అలరించిన దాసుభాషితం ఇక నుంచి వ్యక్తిగత, వృత్తి, ఆధ్యాత్మిక విషయాలలో మీకు తోడుగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది. ఈ సందర్భంగా కొత్త లోగోతో సరికొత్త హంగులు అద్దుకుంటోంది. ఈ లోగో ఆవిష్కరణ, ఈ మార్పు వెనుక ఉన్న కారణాలు వంటి విషయాలు వచ్చే వారం దాసు కిరణ్‌గారు మనకి వివరించబోతున్నారు. బహుశా యే తెలుగు బ్రాండ్ ఇప్పటివరకూ తమ బ్రాండ్ స్టోరీ ఇలా చెప్పివుండరు. దాని కోసం వచ్చే వారం దాకా ఎదురుచూస్తూ ఉందాం.


Image Courtesy :