నా చిన్నప్పట్నుంచీ మా నాన్నగారి ఓ డైలాగ్ నాకు బాగా గుర్తు. ‘పిల్లలు పువ్వుల్లా పెరగాలి’ అని. ఆడుతూ పాడుతూ హాయిగా పెరగాలి, కుళ్ళు కుతంత్రాలు తెలియకుండా అని ఆయన ఉద్దేశ్యం. మా దగ్గరి చుట్టాల పిల్లలు పెద్దవాళ్ళ రాజకీయాల్లో తలదూర్చడం, వారి తల్లిదండ్రులకు ఏ ఏ చుట్టాలపై కోపం ఉందో తెలుసుకోవడం, వాళ్ళతో కలిసి ఆ చుట్టాలను తిట్టుకోవడం చూసి మా నాన్నగారికి నచ్చేది కాదు. మమ్మల్ని పూర్తి వ్యతిరేకంగా పెంచారు. కొందరి చుట్టాలు మా అమ్మానాన్నగార్లని విపరీతంగా ఇబ్బంది పెట్టినా, వారి గురించి మా దగ్గర ఒక్క తప్పు మాట కూడా చెప్పేవారు కాదు.
అవతలి వారి ప్రవర్తన మా పట్ల దురుసుగా ఉంటే, మా అంతట మేము వారిని తిట్టుకున్నా ఊరుకునేవారు కాదు. వాళ్ళు అలా ఎందుకు ఉన్నారో ఆలోచించమనేవారు. మాది ఇసుమంతైనా తప్పు ఉందేమో సరిచూసుకోమనేవారు. ఈ రకం పెంపకం చాలా ఆదర్శవంతమైనదే. వేరే వారిని వేలెత్తి చూపే ముందు వారి వైపు నుండి ఆలోచించడం మా నరనరాల్లో ఇంకిపోయింది. ప్రతీవాళ్ళని గౌరవించడం అలవాటైంది. బంధుప్రీతి విపరీతంగా పెరిగింది. ఎదుటివారికి ఎదురు సమాధానం చెప్పాలంటే మేము ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. ‘ఆదిలోనే హంసపాదు’ అన్నట్టు మొదలే ఎదుటివారు వెధవలు అనే ఆలోచన లేకపోవడం వలన ఎందరో దగ్గరయ్యారు కూడా.
కానీ ఇది రెండు వైపులా పదునున్న కత్తి. ఎక్కడో బ్యాలెన్స్ తప్పింది. బ్యాలెన్స్ ఎక్కడ తప్పింది అంటే, పువ్వులకు తమ చుట్టూ ముళ్ళు ఉంటాయి అని నేర్పకపోవడం వలన. మనం మంచిగా ఉంటే సరిపోదు, సమాజంలో చెడు కూడా ఉంది అని తెలియకపోవడం వలన. దీనివలన ఎవరు మనల్ని ఏమన్నా తప్పు మనవైపే ఉందేమో అనే భావన పెరిగిపోయింది. అందువల్ల ఆత్మనింద మోతాదు మించిపోయింది. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు వారిని అంచనా వేయగల శక్తి పెద్దగా లేకపోయింది. సీతమ్మ వాకిట్లో సినిమాలో రేలంగి మావయ్య లాగా ‘మనిషంటేనే మంచివాడు’ అనుకునే బ్యాచ్ లా తయారయ్యాం.
మన తప్పు లేకుండా ఎదుటివారు ఊరికే, మనపై అసూయతోనో, కక్షతోనో మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అనే విషయమే తెలియదు. అనవసరమైన వారికి కూడా గౌరవం ఇవ్వడం వలన చేతకానివాళ్ళలా కనపడ్డాం. ‘అందరూ మనల్ని మంచి అనుకోవాలి’ అనే ఆలోచన వలన ఎంతో మనశ్శాంతి కోల్పోయాం. ముఖ్యంగా మా టీనేజ్ లో ఎంతో ఇబ్బంది పెట్టిన అంశం ఇది. శరీరంలోనూ, మానసికంగానూ వచ్చే మార్పులకు, చుట్టూ ఉండేవారి ప్రవర్తనకు పొంతన కుదిరేది కాదు. మానసికంగా చాలా గందరగోళంగా ఉండే ఆ సమయంలో చుట్టూ ఉండేవారి వలన మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
అలాగని ఇలా పెంచినందుకు మా నాన్నగార్ని నేను తప్పు పట్టడం లేదు. అది ఆయన పద్ధతి. చాలావరకూ మా మంచి లక్షణాలకి ఈ రకం పెంపకమే దోహదం చేసింది. మా అదృష్టం ఏమిటంటే, మా నాన్నగారు మాకు అలవాటు చేసిన పుస్తక పఠనం మేము మానసికంగా, నైతికంగా ఎదిగేలా చేసింది. పుస్తకం చదవడం వలన ఎంతో సమయం మా ఆలోచనలను నియంత్రించడం అలవాటైంది, అవి చదివి వాటి గురించి ఆలోచించే సమయంలో ఆయా పాత్రలను మా చుట్టూ ఉండేవారిని పోల్చుకుని చూడడం అలవాటైంది.
దురదృష్టం ఏమిటంటే, మాకు ఆ వయసుకు తగ్గ పుస్తకాలు చాలా అరుదుగా దొరికేవి. అయితే చిన్నపిల్లల నీతి పుస్తకాలో, లేదంటే పెద్దవారికి సరిపోయే నవలలు, కథలో దొరికేవి. దీనివలన నాకన్నా మా అన్నయ్య ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. చదవాల్సిన అవసరం లేనివి కూడా చదివేశాడు పాపం. కానీ, నాకు చాలా సాయపడ్డాడు. నేను ఒక పుస్తకాన్ని ఎంచుకుని, తన దగ్గరకు తీసుకెళ్ళేదాన్ని. తను ఒక పెన్సిల్ తీసుకుని ఆ పుస్తకంలో నేను చదవదగ్గ కథల్ని గుర్తు పెట్టేవాడు. నేను తూ.చ. తప్పకుండా అవే చదివేదాన్ని. పెద్దయ్యాకా మిగిలినవి కూడా చదివేశాను అనుకోండి. అది వేరే కథ.
కాస్త పెద్దయ్యాకా తెలిసింది, ఆ వయసుకు తగ్గ సాహిత్యం ఆంగ్లంలో చాలా విరివిగా ఉందని, ఇంత కష్టపడనవసరం లేదని. దానిని Young Adult సాహిత్యం అంటారని. ఆ పదాన్ని చాలా అందంగా ‘తరుణ వయస్కుల సాహిత్యం’ అని అనువదించారు మా ఆంటీ, ప్రముఖ రచయిత్రి డాక్టర్ మైథిలీ అబ్బరాజు గారు. చిత్రమేమిటంటే చాలా పెద్ద అయిపోయాకా, ఆవిడ facebook లో పంచుకున్న ఈ సాహిత్యాన్ని చదవగలిగాను. నిజంగా బాధ అనిపించింది. నా టీనేజ్ లో ఈ పుస్తకాలు చదివి ఉంటే ఎంత బాగుండు అని.
అయితే, నేను నా టీనేజ్ లో young adult సాహిత్యాన్ని నండూరి రామమోహన్ రావుగారి పుణ్యమా అని చదివి, ఆనందించాను. టామ్ సాయర్, హకిల్ బెరీఫిన్, టామ్ సాయర్ ప్రపంచయాత్ర, కాంచనద్వీపం వంటి రచనలు ఆయన వలనే నేను నాకు వచ్చిన తెలుగు భాషలో, సరైన వయసులోనే అందుకోగలిగాను. నిజానికి ఇవి ప్రపంచ సాహిత్యంలో బాలల సాహిత్యంగా చెప్పబడినా, వాటిని తరుణ వయస్కులకే ఉపయోగించడం ఉపయుక్తం అనిపిస్తుంది నాకు.
నిజానికి సమాజంలో అత్యంత ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేది తరుణ వయస్కులే. ముఖ్యంగా వారి మానసిక అవసరాలకు తగ్గట్టు serve చేయగలిగిన సామర్ధ్యం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులకు చాలా తక్కువ. కొందరు తల్లిదండ్రులు వారిని చిన్నపిల్లల్లానే ట్రీట్ చేస్తారు. ‘నీకేం తెలీదు’, ‘నువ్వు చిన్నపిల్లవి/పిల్లాడివి’, ‘నీకు అర్ధం కాదు’, ‘ఈ విషయం నువ్వు మాట్లాడకూడదు’, ‘మాట్లాడకుండా ముందు పుస్తకం తియ్’ ఇలా వాళ్ళు చెప్పాలనుకునేదాన్ని చెప్పనివ్వరు. వారికి అవగాహన శక్తి ఉంది, వారు ఆలోచించగలరు అని తెలియకపోవడమే కారణం.
దానికి తోడు వారికంటూ ప్రత్యేకమైన సాహిత్యం, సినిమా, కళలు ఉండవు. వారి భావాలలోని తప్పు ఒప్పులను తెలుసుకునే అవకాశం చుట్టూ ఉన్నవారూ ఇవ్వక, సాహిత్యం వంటి మాధ్యమాలలోనూ దొరకక చాలా ఇబ్బంది పడతారు. అయితే చిన్నపిల్లలవి, లేదంటే పెద్దవారివి చూడాలి/చదవాలి అంతే. ముఖ్యంగా భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగునాట ఈ వయసువారు అంటూ ఉన్నారని సమాజం, కుటుంబం గుర్తించకపోవడం అన్యాయం. అన్యాయం లాంటి భావోద్వేగ వాదన కన్నా ముఖ్యమైన లాజిక్ వాదన ఏమిటంటే అలా గుర్తించకపోవడం ప్రమాదకరం. వారి ఎదుగదలలో, ఆలోచనా ధోరణిలో చాలా ప్రమాదకరమైన మార్పులు తెస్తుంది ఈ గుర్తించకపోవడం అనే సమస్య.
మన దేశంలో పెద్ద తప్పుగా భావించే Sex Education లేక ఎందరు టీనేజర్ లు లైంగిక వేధింపులకి, అనవసరపు గర్భానికి లోనవుతున్నారో తెలుసా? కేవలం ఆడపిల్లల సమస్యే కాదు, ఇది అబ్బాయిలకి కూడా వర్తిస్తుంది. సరైన విధంగా ఈ విషయాన్ని తెలియజేయకపోవడం వలన తప్పుదారిలో ఈ విషయాన్ని నేర్చుకుంటున్నారు. దానివలన వచ్చే అపోహల్లో కొందరైతే జీవితాంతం గడిపేస్తారు. ఎందుకంటే, ఇది ఏ వయసువారైనా మాట్లాడకూడని టాపిక్ కదా.
ఏతా, వాతా నేను తేల్చిందేమిటంటే, టీనేజ్ అనే వయసుకు మనం అందరం ఒక సమాజంగా గౌరవం ఇవ్వాలి. ఆ సమయంలో పిల్లలకు కావాల్సిన విషయాలను వారికి అందివ్వాలి. అందుకు ఒక మార్గం సాహిత్యం కూడా. తెలుగు సాహిత్యం మంచి స్తాయిలో ఉన్న ఈ సమయంలో తరుణ వయస్కుల సాహిత్యాన్ని కూడా ఎక్కువగా produce చేయాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. ఈ తరానికి మరో నండూరి రామమోహన రావుగారు కావాలి . మరో మార్క్ ట్వైన్ కావాలి.

ఇందుకు మా వంతు కృషిగా నండూరివారు అనువదించిన English Classic Young Adult సాహిత్యాన్ని ఈ వేసవి సందర్భంగా దాసుభాషితం తరుణవయస్కులకు అందిస్తున్నాం. అందులో భాగంగానే ఈ వారం మార్క్ ట్వైన్ రచించిన ‘The prince and the pauper’ తెలుగు అనువాదం ‘రాజు-పేద’ను విడుదల చేస్తున్నాం. నండూరి వారి తేటైన తెలుగులో ఇంగ్లండ్ కు చెందిన కాల్పనిక యువరాజును, బిచ్చగాణ్ణి కలుసుకుందాం. ఇలాంటి మంచి పుస్తకాలను మీరు కూడా మాకు suggest చేయండి. తిరిగి సాహిత్యాన్ని పిల్లలకి, టీనేజర్లకి దగ్గర చేద్దాం.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.