భారతీయ సమాజంలో ఇంటి పని, పిల్లల పెంపకం, అణుకువ, బాధ్యతలు, ఓర్చుకోవడం, భరించడం, త్యాగం వంటివి స్త్రీకి సమానార్ధాలుగా నిర్వచించబడ్డాయి. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలను ఈ conditioning తో పెంచుతారు. అలాంటి లక్షణాలు కేవలం బలవంతంగా రుద్దడం మాత్రమే కాక, వాటిని fantasize చేయడం ద్వారా తరాల తరబడి స్త్రీలు ఈ కేటగిరీల్లోకి రావడమే లక్ష్యంగా జీవించేస్తారు.
‘అడపిల్లలు పని నేర్చుకోకపోతే అత్తారింట్లో నుంచి గెంటేస్తారు’, ‘ఈ నొప్పికే ఏడిస్తే ఎలా, ఆడాళ్ళు అన్నిట్నీ ఓర్చుకోవాలి’, ‘ఇలా గెంతుతూ, తుళ్ళుతూ పరుగెలెడితే మన పరువేం కానూ’, ‘ఆడపిల్లలు అలా కూర్చోవచ్చా? అంత గట్టిగా నవ్వచ్చా?’ ‘మొగుడన్నాకా కొడతాడు, తిడతాడు. ఓర్పుగా ఉంటే ఎప్పటికో మారతాడు కానీ, ఎదురుతిరిగి మాట్లాడచ్చా?’, ‘అత్తారు నంది అంటే నంది, పంది అంటే పంది అనాలి కానీ, వాళ్ళు తప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళని సరిదిద్దడానికి నీకు ఎంత దమ్ము’ ఇవి సాధారణ భారతీయ ఇళ్ళల్లో వినపడే మాటలు.
భర్తలు కొట్టడం, అత్తవారు ఆరళ్ళు పెట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఇంట, బయట మగవాళ్ళు molest చేయడం వంటి వాటిని ఎంతగా normalise చేశారు అంటే, ఆడవాళ్ళు వాటికి మానసికంగా సిద్ధమైపోయారు, కొత్త తరం సిద్ధం అవుతున్నారు. అలాంటి అనుభవాలు ఎదురవ్వడం సర్వసాధారణం అనే ఆలోచన ఆడవారిలో బలంగా నాటుకుపోతోంది. నిజానికి ఇలాంటి వాటిలో కనీసం ఒక్కటైనా ఎదుర్కోని ఆడవాళ్ళు నూటికి ఒక్కరు కూడా ఉండరు అనేది కటిక వాస్తవం.
పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనల్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది పూర్తిగా తల్లి బాధ్యతే. అదే, ఏదైనా ఎదుగుదల కనిపిస్తే అది పూర్తి కుటుంబపు పెంపకం అనే ఆలోచన కూడా ఆడవారి మనసుల్లో చాలా లోతుగా inject చేయబడింది. ఒకలా చెప్పాలి అంటే తరాల నుండి వస్తున్న ఈ conditioning ఆడవారి muscle memory లో నిక్షిప్తమైపోయిందేమో. అందుకే ‘అత్తా ఒకప్పటి కోడలే’ అనే విషయం మన సమాజంలో పూర్తిగా మర్చిపోతారు. కొత్త బంధాలను కోపతాపాలు, కక్షలతో మొదలుపెడతారు.
ఏడవకూడదు అని, మనసు విప్పి మాట్లాడకూడదు అని, డబ్బులు సంపాదించడమే వాళ్ళ సత్తాకు గీటురాయి అని మగవాళ్ళని కూడా conditioning లోనే పెంచుతారు. నిజానికి ఈ limitations చాలామంది మగవారిని కఠినంగా, insensitive గా తయారు చేయడానికి దోహదం చేస్తాయి. అయితే తరాలు మారే కొద్దీ కొన్ని విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగ, వ్యాపారాలు చేయడం అత్యవసరం అనే ఆలోచనాధోరణి పెరుగుతోంది. అలాగే మగవారు కూడా ఇంటి పనులు చేయాలి, పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర పోషించాలి వంటివి సమాజంలో పెరుగుతున్నాయి. కానీ ఈ రకమైన ఆలోచనాధోరణి ఎక్కువగా నగరాలకే పరిమితం అవుతోంది.
ఇతర దేశాలలోని ప్రజలు Gender Orientation ను redefine చేసుకుంటున్న ఈ రోజుల్లోనూ, మన దేశంలో చాలామంది స్త్రీల పరిస్థితి ఇంకా 1950లు, 60లలో ఉన్న స్థితికన్నా పెద్దగా ఏమీ మారలేదు. ఇప్పటికీ రెండవ తరగతి నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో ఆడవారిని ఇంటిపని చేయడానికి, పిల్లల్ని కనడానికి ఉపయోగపడే యంత్రాలుగానూ, తమ మానసిక ఒత్తిడి తీర్చుకోవడానికి వస్తువులుగానూ చూస్తున్నారు.
ఈవారం విడుదల అవుతున్న ఈ నవల దాదాపు 60ల ప్రాంతంలో రాయబడింది. అందం, అణుకువ, పనితనం ఉంటే ఆడదానికి జీవితం గడిచిపోతుంది అనుకునే stereotype ఈ నవల చదివితే పటాపంచలు అయిపోతుంది. అన్నీ ఉన్నా, భర్త చేతిలో శారీరిక, మానసిక abuse ను అనుభవిస్తుంటుంది పార్వతి. ప్రమాదంలో కాలు శాశ్వతంగా పోగొట్టుకున్న భర్త, బయటకు ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళందరూ వివాహేతర సంబంధాలు కలిగి ఉంటారు అనుకునే మూర్ఖుడు. నిత్యం భార్యను అనుమానించి, హింసించేవాడు. ఆమె అందానికి ఆకర్షితుడై, ఆమె చే తిరస్కరించబడి, తద్వారా కక్ష బూనిన సహోద్యోగి ఆ భర్త మనసులో మరింత విషాన్ని నింపుతుంటాడు. చివరికి ఆమె ఏమైంది?
‘శారద’ గా రచనలు చేసిన ఎస్. నటరాజన్ రాసిన ‘ఏది సత్యం’ నవల కథాంశం ఇది. వింటున్నంతసేపూ చాలా బాధగా, ఈనాటికీ చాలామంది ఆడవాళ్ళు, అలాంటి ఆడవాళ్ళు తెలిసిన మగవాళ్ళు relate అవ్వగల నవల ఇది. భర్త చేతిలో అన్యాయంగా abuse ని ఎదుర్కొంటూ, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగిన వాళ్ళు కూడా ఆ విష వలయం నుండి బయటకు రాలేకపోవడానికి కారణం ఈ social conditioning.
ఆడవాళ్ళు సహనంగా ఉండాలి. ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి అంటూ మనకి నిత్యం నేర్పించే పాఠాలే కారణం. ఎందుకు ఓర్పుగా ఉండాలి? ఎందుకు భరించాలి. తమకి అన్యాయం జరిగితే, అక్కడి నుండి బయటకు రావడం, తమను తాము కాపాడుకోవడం కదా ఆడవారికి నేర్పించాల్సిన పాఠం. ఈ నవల వింటే ఈనాడు గృహహింస చట్టం ఎందరి ఆడవాళ్ళ జీవితాలు నిలబెడుతోందో కదా అని కాస్త ఊరటగా అనిపిస్తుంది.
ఈ నవల విన్న తరువాత, మన సన్నిహితుల్లో ఇలాంటి ఇబ్బందిలో ఉన్నవారికి ఫోన్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి కష్టం నుండి బయటపడిన వారిని తలుచుకుని గండం గడిచినందుకు ఆనందం అనిపిస్తుంది. మనవాళ్ళెవరూ ఇలాంటి కష్టం పడకూడదు అని కోరుకోవాలనిపిస్తుంది. గృహహింస అనుభవిస్తున్నవారిలో నూటికి 60శాతం మంది ఆడవాళ్ళ జీవితం ఈ నవలలోని పార్వతి జీవితపు ముగింపులానే ఉండడం ఒక సమాజంగా మనమందరం సిగ్గుపడాల్సిన విషయం.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.