మాది అత్తిలి మండలంలో కంచుమర్రు అనే చిన్న గ్రామం. మా పెదనాన్న గారు కరణం అవడం వలన, మా నాన్నగారు హెడ్ మాస్టర్ కావడం వలన ఊరిలో మాకు చాలా గౌరవం ఉండేది. పైగా మా ఊరి రాజులకు ఎంత చిన్నవారినైనా మన్నించడం అలవాటు. అరవై ఏళ్ళ పెద్దావిడ అయినా సరే, ఆరేళ్ళ నన్ను ఉద్దేశిస్తూ ‘ఇండే(ఏవండీ) గాయిత్రి గారూ, మీ అమ్మేంచేస్త్నారిండే’ అనే పలకరించేవాళ్ళు. ఆఖరికి నాకన్నా ఒక్క రోజు చిన్నదైన నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ‘ఇండే గాయత్రి, ఇసికలో ఆడదాం ఒస్తారా’ అనేది. ఇక మా ఇంట్లో పని చేసే అమ్మాయి కూడా ‘ఇండే గావిత్రి(గాయత్రి అనడం వచ్చేది కాదు) గారో, తలంటోయించుకుంటారండే ఈయాల’ అనేది.
అంతటి మర్యాదస్తుల ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. సిరి, నాని. వాళ్ళకు తోడు హైదరాబాద్ నుండి సెలవలకి వచ్చే మా పెదనాన్నగారి మనవడు అయ్యప్ప. నాకు అయిదేళ్ళ వయసున్నప్పుడు వాళ్ళు 8, 9ఏళ్ళ వయసు వాళ్ళు. ఎక్కడ ఏ రచ్చ జరిగినా ఈ మూగ్గురిలో ఎవరో ఒకరు చేసిందే అయి ఉండేది. వేసవి సెలవలకి మా అత్త పిల్లలు దాశరధి, జయ, అయ్యప్ప, వాళ్ళ చెల్లి సౌమ్య, భీమవరంలో మా తాతయ్యగారి దగ్గర చదువుకునే మా అన్నయ్య, అక్క మా ఊరు వచ్చేవారు. మనం మాత్రం ఎప్పుడూ కేరాఫ్ ఊరే.
వీళ్ళు కాక దివ్య, శ్రీను, లల్లి, సురేష్, కిశోర్, బాల ఇలా అంతా కలిపి ఓ 14, 15మంది అయ్యేవాళ్ళం. అన్ని సెలవల కన్నా వేసవి సెలవలు చాలా ప్రత్యేకం. మా ఇంటి ముందు ఉండే కాలువ ఎండిపోయేది. మామూలుగా అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకపోతే చాలా సులభంగా ఒక పావు కిలోమీటర్ కొట్టుకుపోగల ఉధృతి ఉన్న కాలువ అది. మామూలప్పుడు దగ్గరకు వెళ్ళాలంటే భయపడే ఆ కాలువ వేసవి సమయంలో మా ఇల్లు కన్నా ఎక్కువ ఇష్టంగా గడిపే స్థలం.
అక్కడ ఓ ఏడెనిమిది రోజులు కష్టపడి మంచి ఇల్లు లాంటిది కట్టుకునేవాళ్ళం. మిగిలిన రోజులు మా ఆటలన్నీ అందులోనే. కాలువ గట్టున ఉన్న చింత చెట్టుకు ఉయ్యాల కట్టేవారు మా నాన్నగారు. మేమందరం మనిషికి పది ఊగిసలాటల చొప్పున వంతుల వారీగా ఊగేవాళ్ళం. అప్పటిదాకా ‘ఇండే ఇండే’ అంటూ సాగే మాటలు ఒక్కసారిగా అచ్చ తెలుగులోకి వచ్చేసేవి. అలా తీసుకురావడంలో మా అయ్యప్ప, సిరిల కృషి వర్ణనాతీతం. ఉయ్యాల ఎక్కినవాళ్ళు దిగాల్సినప్పుడు దిగకపోతే వీరి విశ్వరూపం బయటకు వచ్చేది.
మేము అసలు వినే అవకాశం లేని తిట్లని వింటూ, వాళ్ళని హీరోలని చూసినట్టు చూసేవాళ్ళం. పైగా కాలువ పక్క పెరిగే పిచ్చి చెరకు ఆకుల్ని చుట్టల్లా చుట్టి, నోట్లో పెట్టుకుని పొగ పీలుస్తున్నట్టు వాళ్ళు చేసే నటన మాకు సినిమా చూసినంత వినోదం. వాళ్ళు పెద్దవాళ్ళలాగా దూరానికి పడేలా ఉమ్మి వేయడం కూడా మాకు వింతే. ఇక చకచకా చెట్లెక్కి కాయలు కోయడంలో వాళ్ళ ప్రతిభ మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచేసేది.
మేం ఆడే ఇసుక ఆటలు, అన్నం వండడాలు, పూజ చేయడాలు, పండుగలు జరుపుకుంటున్నట్టు, మేం చూసిన ఫంక్షన్లు జరుపుకుంటున్నట్టు ఆడే ఆటలు వాళ్ళకి రోత. వాటిని వాళ్ళు వెక్కిరిస్తుంటే కోపం వచ్చేది కాదు(ఆ గుంపులో అందరికన్నా బాగా చిన్న, కేవలం 5 - 6 ఏళ్ళ వయసుండే నాకైతే వచ్చేది కాదు, మిగిలినవాళ్ళ సంగతి నాకు తెలీదు). ‘ఇసుకతోనూ, దేవుడి పటాలతోనూ ఆడుకోవడం అమ్మలు చూస్తే తంతారు. అవి ఆడడమే పెద్ద గొప్ప అనుకుంటే, వీటినే పిచ్చి ఆటలు అంటున్నారంటే, ఆహా వీళ్ళెంత ధైర్యస్తులు’ అనుకునేదాన్ని.
వాళ్ళ దృష్టిలో ఆటలు అంటే పెద్దవాళ్ళు చూడకుండా మంచి నీటి చెరువులో స్నానం చేయడం(తాగే నీళ్ళల్లో స్నానం చేస్తే తంతారు కాబట్టీ అదొక ఫీట్), గేదెల చెరువులో ముక్కు మూసుకుని ఎక్కువ సేపు మునిగి ఉండడం, గుడి కోనేట్లో దిగి ఎక్కువ తామరపూవులు కోయగలగడం, మామిడి చెట్లపై రాళ్ళ దాడి చేసి-పాలేర్ల చేతులకి చిక్కకుండా పళ్ళు దొంగలించగలగడం, వేప చెట్లకు ఉండే తేనెపట్లు కొట్టి తేనె తాగడం, మధ్యాహ్నాలు, రాత్రిళ్ళు చింతతోపుల్లోకి వెళ్ళడం, స్మశానం దగ్గరకు వెళ్ళడం వంటివి.
అవి వింటేనే ఒళ్ళంతా వణుకుపుట్టే నాకు, అందులో చాలావరకూ చేసే వాళ్ళని చూస్తే, నిజ జీవితంలో హీరోలంటే ఇలానే ఉంటారనుకునేదాన్ని. ఏ వెధవ పనిలో అయినా వాళ్ళు దొరికిపోయి, పెద్దవాళ్ళతో తన్నులు తింటోంటే, అన్యాయంగా సినిమా పోలీసుల చేత సంకెళ్ళు వేయించుకుని, జైల్లో దెబ్బలు తినే హీరోలలా కనపడేవారు. వాళ్లతో ఆడినందుకు మాకు కూడా దెబ్బలు పడితే మాత్రం, హీరోయిజం-జీరోయిజం జాన్తా నై. ‘ఛీ వీళ్ళ వల్లే తన్నులు తిన్నాం అనవసరంగా, ఆడినంత సేపు ఎక్కడ దొరికిపోతామో అనే టెన్షన్ తప్ప ఆనందించిందే లేదు’ అనిపించేది.
ఒకసారి అయ్యప్ప, సిరి కలిసి అగ్గిపెట్టెతో ఆటలు ఆడుతున్నారు. అగ్గిపుల్ల వెలిగించి, నాలుక మీద రాస్తూ చేసే ట్రిక్కులు ఏవో ప్రయత్నిస్తున్నారు. నేను, వాళ్ళ చెల్లెలు సౌమ్య, మా అక్క అందరం కూర్చుని చూస్తున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా నాలుక దగ్గరకి వచ్చేలోపే అగ్గిపుల్ల ఆరిపోయేది. వాళ్ళకీ నిలబడి, నిలబడీ కాళ్ళు పీకుతున్నాయి. ఓ పక్క ఎండ మండిపోతోంది. మేమంటే అరుగు మీద కూర్చున్నాం కాబట్టీ, మాకు బాగానే ఉంది. వాళ్ళకి చిరాకు వచ్చి, పక్కనే ఉన్న గడ్డి మేటు మొదట్లో కూర్చుని ఒకేసారి రెండేసి అగ్గిపుల్లలు వెలిగించారు ఇద్దరూ.
ఆ వెలిగించడంలో పెద్ద మంట వచ్చింది. చేతులు కాలడంతో ఒక్కసారి విసిరేశారు. అంతే అంత పెద్ద గడ్డిమేటు భగ్గున మంట అందుకుంది. అసలే ఆ ఎండల్లో బాగా ఎండిపోయిన గడ్డి ఒక్కసారి అంతెత్తున మంట లేచింది. ఇంట్లోంచి పెద్దవాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. పావుగంట కష్టపడి, దాదాపు పది, పదిహేను బకెట్ల నీళ్ళు పోస్తే కానీ, మంట చల్లారలేదు. అది చల్లారాకా, వాళ్ళని పట్టుకు కొట్టారు చూడండి. చితక్కొట్టుడే. కుయ్యో, మొర్రో అంటూ చాలాసేపు తన్నులు తిన్నవాళ్ళు, ఆ వినోదం చూస్తున్న మేమే రెచ్చగొట్టామని అబద్ధం చెప్పారు. దాంతో ఈసారి మాకు దరువు మొదలైంది. చేతికి దొరికిన రకరకాల ఆయుధాలతో ఊకుమ్మడిగా చాకిరేవు సాగింది ఒక పావుగంట.
మాగాయి కోసం ఎండబెట్టుకున్న మామిడి ముక్కల ఊటను పావనం చేయడం, ఎదురింటి వారి కోడిని దొంగిలించి - పక్కింటివారి బుట్టలో దాచి వాళ్ళూ వీళ్ళు దెబ్బలాడుకునేలా చేయడం, మా పెద్దనాన్న ఆఫీస్ కాగితాలు దాచేసి మా మీద నెట్టేయడం, చాకుతో చింత చెట్లను నరికేస్తాం అని గంటలు గంటలు కష్టపడడం, రైలు కింద రూపాయి బిళ్ళ పెడితే పెద్దది అవుతుందని, మా అందరి దగ్గర డబ్బులు గుంజేసి, సోడాలు తాగేయడం, మొక్కలకున్న ఆకులన్నీ పీకేస్తే త్వరగా పూవులు, కాయలు వస్తాయని మాకు అబద్ధం చెప్పి, మా చేత ఆకులన్నీ పీకించడం, తరువాత మా పెద్దవాళ్ళ చేత మమ్మల్ని పీకించడం. ఇలా చెప్పాలంటే ఎన్నో అల్లర్లు, కొత్తగా సృష్టించి మరీ చేసేవారు. ఎన్ని చేసినా వాళ్ళు నా దృష్టిలో ఎంతో ధైర్యస్థులైన హీరోలు.
మొట్టమొదటిసారి మార్క్ ట్వైన్ రాసిన టామ్ సాయర్ పుస్తకం చదివిన నేను నా బాల్యంలోకే వెళ్ళిపోయాను. టామ్ సాయర్, హకిల్ బెరీ ఫిన్ పాత్రల్లో మా అయ్యప్ప, సిరిలను ఊహించుకున్నాను. చిన్నప్పడు వీళ్ల వెనుక తుంటరి పనులకు ఎలా వెళ్ళేదాన్నో, నవల చదివినంతసేపూ టామ్, హక్ ల వెనుక కూడా అలానే వెళ్ళాను. ఆంధ్రలోని ఒక పల్లెటూళ్ళో వీళ్ళు చేసే అల్లరికీ, అమెరికాలోని ఒక ఊళ్ళో, 1800ల్లో టామ్, హక్ లు చేసే అల్లరికీ చాలా తేడాలే ఉన్నాయి. కానీ అదే చిన్నతనం, అదే దుందుడుకుతనం, అదే అల్లరి. కాబట్టే, అంతగా relate అయ్యాను.
ఈ నెలను బాలల మాసంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న సంగతి, అందుకు తగ్గ ప్లాను కూటమిలోనో, X వంటి సామాజిక మాధ్యమాల ద్వారానో మీరు తెలుసుకుని ఉంటారు. అందులో భాగంగానే ఈ వారం అమెరికన్ సాహిత్యానికి పితామహునిగా పెరొందిన మార్క్ ట్వైన్ రచించిన, ప్రముఖ రచయిత, అనువాదకులు శ్రీ నండూరి రామమోహన్ రావు గారు అనువదించిన ‘టామ్ సాయర్’ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం. ఇంకా ఇక్కడే ఉన్నారంటే, నా కబుర్లు చెప్పుకుంటూనే మిమ్మల్ని కూర్చోపెట్టేస్తాను. కాబట్టీ, త్వరగా మీ చిన్నతనంలోకి వెళ్ళే టైం మిషన్ ఎక్కాలంటే, అర్జెంట్ గా వెళ్ళి ఈ పుస్తకం వినేయండి. టాటా. Happy journey into your childhood.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.