‘దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు’ అంటుండేది మా బామ్మగారు. అయితే దేవుడు అంటే శంఖ, చక్ర, గదా, పద్మాలతోనో, త్రిశూలం, నాగాభరణాలు, చర్మాంబరాలతోనో ప్రత్యక్షమవుతాడు అనుకోవడం శుద్ధ అమాయకత్వం. దైవం మానుష రూపేణ అనే పెద్దల మాట అక్షారాలా నిజం. మనం చేసేది న్యాయమైన పని అయినప్పుడు, పూర్తి చిత్తశుద్ధితో ఉన్నప్పుడు, ఏదో ఒక రూపంలో మనకు సహాయం లభిస్తుంది. ఆ సహాయమే దైవం, చేసినవాడే దేవుడు. చాలాసార్లు మనం చాలా అసహ్యించుకునే చోటు నుండో, అనుమానించే వ్యక్తి నుండో దేవుడు ప్రకటితమవుతాడు.
ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు గారి అమెరికా తొలినాళ్ళ విశేషాలు వింటే నాకు అదే అనిపించింది. చాలామంది భారతీయులకు పాకిస్థాన్ అంతా ఒక ముద్దలాగా, అనుమానించదగిన ఒక భూమిలా కనపడుతుందే తప్ప, విడిగా ఒక్కొక్క మనిషి కనపడడు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అని గురజాడ ఊరికే అనలేదు. మనిషిని దేశ, కాల, పరిస్థితుల నుండి వేరుగా చూస్తే, ఆ మనిషి పూర్తిగా అర్ధం అవుతాడు అనిపిస్తుంది నాకు.
చేతిలో డిగ్రీలు, ప్రతిభ తప్ప ఉద్యోగం, ఇల్లు లేని భారతీయ యువకులు నడిరోడ్డుపై కనపడి, మాకు తల మీద గూడు ఇవ్వగలరా అని నోరు తెరిచి అడిగితే, సంకోచించలేదు, అనుమానించలేదు. నిస్సంకోచంగా ఆ అమెరికా భూమిపై, ఆ భారతీయుల్ని ఆహ్వానించాడు ఆ పెద్దమనిషి. ఆ మానవత్వం ఉన్నవాడు పాకిస్థానీయుడో, భారతీయుడో, అమెరికనో, ఆఫ్రికనో, మెక్సికనో అనిపించుకోడు, మనిషి అనిపించుకుంటాడు. అలా నా దృష్టిలో చిట్టెన్ రాజు గారికి అమెరికా దేశంలోని, టెక్సస్ రాష్ట్రంలో, హ్యూస్టన్ నగరంలో స్థితికారుడైన విష్ణువు వరం ఇచ్చాడు.
కాకినాడ లాంటి స్వచ్ఛమైన తెలుగు ప్రాంతం నుండి అమెరికాలోని హ్యూస్టన్ వరకూ సాగిన చిట్టెన్ రాజు గారి ప్రయాణం గురించి మాత్రమే ఈ ప్రసంగంలో మాట్లాడలేదు. ఒకప్పటి అమెరికన్ ఫారిన్ పాలసీ దగ్గర నుంచి, బాంబే ఐఐటీలో తెలుగును బతికించుకునే ప్రయత్నం చేసే ఎందరో మహానుభావుల దగ్గర నుంచి, అప్పటి వీసా పద్ధతలు దగ్గర నుంచి, అప్పట్నుంచీ ఇప్పటివరకూ అత్యధిక శాతం అమెరికన్లలో మారని కొన్ని మంచి లక్షణాల దగ్గర నుంచి, నేడు అతి సామాన్యంగా కనిపించే అప్పటి అబ్బురపు వస్తువుల వరకూ ఎన్నో మాట్లాడారు రాజు గారు.
అంతేకాదు, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం ఎలా ఖండాంతరాలు దాటి అమెరికా చేరిందో కూడా చిట్టెన్ రాజుగారి మాటలు వింటే అర్ధం అవుతాయి. ఇష్టపడో, ధనార్జన కోసమో కన్నదేశాన్ని వదిలి అంతదూరం వెళ్ళే ఆంధ్రులకు తెలుగుతనాన్ని చేరువగా ఉంచుతున్న ఎన్నో అమెరికా తెలుగు సంఘాలకు అక్కడివారే కాదు, మనం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా, వారు మనవారే కదా. మనవారికి మన సంస్కృతిని అందిస్తున్నవారి పట్ల మనకీ కృతజ్ఞత ఉండాలా లేదా? అలాంటి మహామహుల్లో చిట్టెన్ రాజు గారు ఎన్నదగినవారు.
ఆయనది, నాది కూడా సహజంగా హాస్య స్వభావం కాబట్టీ ఆయన ఏమీ అనుకోరు అనే ధైర్యంతో ఒక సరదా విషయం అంటాను ఆయన గురించి. (ఆయన ఫీల్ అవుతారు అనుకుంటే ఈ న్యూస్ లెటర్ ఆయనకి చూపించకండేం, ముందే చెప్పేస్తున్నా.) ఈ ప్రసంగం విన్నాకా, ఇటు తెలుగుదనాన్ని, అటు అమెరికా జీవనాన్నీ అమితంగా ఇష్టపడే చిట్టెన్ రాజు గారు బహుశా కాకినాడ కాజాని అమెరికన్ pancake లో చుట్టుకుని తింటుంటారేమో. మన పులిహారని అక్కడి పొలాల్లో విత్తనాలల్లే చల్లుతారేమో. Potato mash లో తిరగమోత వేసి దోశల్లో పెట్టుకుని తింటారేమో అనిపించింది.
అంటే అలాంటి విచిత్రమైన తిండి తింటారని నేరుగా అర్ధం తీసుకుంటారేమండీ, మీరు మరీనూ. రెండు సంస్కృతులను రెండు చేతులా గౌరవిస్తారని, ఉపయోగిస్తారని నా కవి హృదయం. అర్ధం చేసుకోరూ…! సరే, ఈ ప్రసంగం విని నాకు అనిపించిన విషయాలైతే ఇవి. మీరూ విని, మీకేం అనిపించిందో నాకు చెప్పడం మర్చిపోకండి.
P.S: ఒక పాకిస్థానీయుణ్ణి మహావిష్ణువుతో పోలుస్తావా అని త్రిశూలాలెత్తి రాకండేం. నేను చెప్పినదాంట్లో సారం మీకు అర్ధం అయిందనే అనుకుంటున్నా. అవ్వకపోయినా, నచ్చకపోయినా ఈ నా ఆలోచన మీద paper weight పెట్టి, పక్కన పెట్టండి. మళ్ళెప్పుడైనా తీసి చూడండి. నేను చెప్పింది సబుబుగానే అనిపిస్తుంది అని నా పూర్తి నమ్మకం. హమ్మా, నేను తప్పు చేశాను అని అంటాననుకున్నారేం. ఆశ, దోశ, పిజ్జా, డోనట్..
అభినందనలు,
మీనా యోగీశ్వర్.