సాధారణంగా చాలా మందికి అన్ని రసాల్లోకెల్లా హాస్య రసం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. దాసుభాషితం బృందం కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకనే ఈ వారం వంగూరి చిట్టెం రాజు గారి ‘అమెరికామెడీ కథలు’ అందించడం మాకు మాహదానందంగా ఉంది.
హాస్య చతురత అసాధారణ తెలివికి నిదర్శనం. రోజూ జరిగే మామూలు విషయాల గురించి హాస్యస్ఫోరకంగా చెప్పడం సులువు కాదు. ఈ పుస్తకంలో అన్నీ కథలు అలాంటివే. ఉదాహరణకు “జులపాల కథ”. రచయిత అమెరికాకి వెళ్లిన తొలి రోజుల్లో (30 యేళ్ళ కిందట) క్షవరం చేయించుకున్న అనుభవం వివరణ మిమ్మల్ని గట్టిగా నవ్విస్తుంది. హూస్టన్ లో ఓ తెలుగు కార్యక్రమంలో రచయితే చదివిన ఆ కథని సాంకేతికంగా సాధ్యమైనంత మెరుగు పరిచి మీకు అందిస్తున్నాం.
కాశీ మజిలీ కథలు
బృహత్తరమైన 'కాశీ మజిలీ కథలు' గ్రంధం శ్రవణానువాదం పూర్తి చేయడం ద్వారా దాసుభాషితం మరో మైలు రాయిని అధిగమించింది. ఇది మొత్తం 2360 పేజీల పుస్తకం. ఒక్కొక్క దానిలో రెండేసి భాగాల చొప్పున మొత్తం ఆరు సంపుటాలలో 419 కథలున్నాయి. మొదటి ఐదు భాగాలూ 4-4-20 నుండి 19-4-20 వరకూ 15 రోజులూ, తిరిగి 20-5-20 నుండి 7-6-20 వరకూ 18 రోజులలో మిగిలిన ఏడు భాగాలూ రెండు దశల్లో ఈ రికార్డింగ్ జరిగింది. మొత్తం రికార్డింగు నిడివి 70 గంటలు. ఈ పన్నెండు భాగాలూ వారానికి ఒకటి చొప్పున ప్రతి శుక్రవారము ఇప్పటికే యాప్ లో విడుదలవుతున్నాయి. మే 15న మొదటి భాగం విడుదల కాగా, చివరిదైన పన్నెండవ భాగం జులై 31వ తేదీన విడుదలవుతుంది.
ఈ వారం 5వ భాగంలో ప్రధానంగా జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జీవితమూ, వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతమూ, ప్రచారములకు సంబంధించిన కథలు చెప్పబడ్డాయి. 55 మజిలీ నుంచి మహాశ్వేత, మహా శక్తి, కాదంబరి పూర్వోత్తర కథలతో కొనసాగి, 99వ మజిలీలో యజ్ఞశర్మ కథ, దుర్గ వంటి ఆసక్తి కలిగించే అనేక ఉపకథలతో ఈ భాగం ముగుస్తుంది.
వినండి ఆనందించండి కాశీ మజిలీ కథలు, మీ ‘దాసుభాషితం’ యాప్ లో.
బుచ్చిబాబు
జూన్ 14న ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు, ‘బుచ్చిబాబు’ గా ప్రసిద్ధులైన శ్రీ శివరాజు వెంకట సుబ్బారావు జయంతి. ఈ సందర్భంగా ఆయన నవల ‘చివరకు మిగిలేది’ మీద డా. C. మృణాళిని తమదైన ప్రత్యేక శైలిలో చేసిన విశ్లేషణను 4 అధ్యాయాలలో మీకు అందిస్తున్నది దాసుభాషితం.
ఇది విన్న తరువాత, మీకు ఆ నవలను తప్పక చదవాలనిపిస్తుంది. పూర్తి నవల ఇప్పటికే ఇదే యాప్ లో శ్రవణ రూపంలో ఉంది. Chivaraku అని యాప్ లో వెతకండి. తక్షణమే ప్రత్యక్షమవుతుంది.