అద్వైతం పాటించేవారందరికీ ఎంతో ఇష్టమైనవాడు, మార్గదర్శి అయిన ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తిని స్తోత్రం చేస్తూ ఇలా అంటారు.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రభోదసమయే స్వాత్మనమేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే
మనకు కనపడే విశ్వం అద్దంలో కనపడే నగరం వంటిది. నిజానికి ఇది మనలోనే ఉంది.
ఎలా అయితే, నిద్రలో కలలు మనలోనే కలుగుతున్నా, బయట జరుగుతున్నట్టు భ్రమ కలిగిస్తాయో, అలా ఈ కనిపించే విశ్వం మన ప్రతిబింబమే అయినా, మాయ వల్ల మనకన్నా భిన్నంగా ఉన్నట్టు తోస్తుంది అని దీని సారాంశం.
ఈ అనుభవం సాధకుని ఆధ్యాత్మిక యాత్రలో ఎంతో విశిష్టమైనది. ఈ అనుభవం ఎన్నో దశలో వస్తుంది?
ఆత్మజ్ఞానంలో దశలు ఉండవని కొందరు అంటారు. సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఎరుక కలిగినప్పుడు ఈ వాదనలో హేతువు ఉంది.
అయితే సాధకులను తొలిచే అతి ముఖ్యమైన ప్రశ్నలలో ఒకటి, నేను ఈ మార్గంలో ప్రగతి సాధిస్తున్నానా అని.
దశలుగా ఉన్నాయనుకోవడంవల్ల లాభం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రగతి మనకు తెలుస్తుంది అని అంటారు దాసుకిరణ్ ఈ వారం విడుదల చేసిన పై 7 నిముషాల వీడియో లో.
ఇంకా, ప్రతీ దశలో ఎం మార్పులు జరుగుతాయి, ఆ దశలో సాధకుని పరిస్థితి ఏమిటి? దానివలన తన సాధనలో తొలిగే అవాంతరాలు ఏమిటో ఈ వీడియోలో వినచ్చు.
ఆత్మజ్ఞానం అనేది కొందరికి అందని ద్రాక్షలాగానూ, కొందరికి వెటకారానికి ఉపయోగపడే పదంగానూ, కొందరికి అయోమయపు వలగానూ దర్శనిమిస్తుంది. కానీ, కుల, మత, వర్గ, లింగాతీతంగా ఆత్మజ్ఞానం అందరికీ అర్ధమయ్యేలాగానూ, దాని కోసం ప్రయత్నించేందుకు వీలుగానూ, తన అనుభవాల నుండి చాలా practical గా వివరిస్తున్న దాసుకిరణ్ గారి ఈ ప్రయత్నం ఎందరికో ఉపయోగపడుతుందని అనిపిస్తోంది. మీరేమంటారు?
జూన్ నెల అయిపోతోంది. అనంతకాలంలో మరో నెల కలిసిపోతోంది. అయితేనేం కొత్తది వస్తోందిగా. కొత్త నెల అంటే కొందరికి జీతాలు, కొందరికి పండుగలు, మరి దాసుభాషితం ప్రేమికులకు ఏమిటి? అదేనండి ప్రసంగం.
తెలుగు సినిమాలో జావళులు - ప్రసంగం
80వ దశకం చివరి నుండి 90లు, ఆ తరువాత పుట్టిన ఎంతోమందిని జావళులు అంటే ఏమిటి అని ఒక చిన్న సర్వేలాంటిది చేశాం. 70శాతం మందికి ఆ పదం వినడం అదే ప్రధమం. మిగిలిన 15శాతం మంది ఎక్కడో విన్నాం, కానీ దేనికి సంబంధించినదో గుర్తులేదు అని చెప్పారు. ఒక 3శాతం మంది మాత్రం సంగీతంలో ఒకరకం అనుకుంటా అన్నారు. 2శాతం మంది మాత్రం వారు విన్న కొన్ని జావళులును ఉదహరించగలిగారు.
భారతీయ సంగీత, నృత్యాలలో జావళులు, పదాలు అనేవి చాలా ప్రముఖమైన ప్రక్రియలు. వీటిలో ఎక్కువ భాగం శృంగార రసంలో ఉంటాయి. భగవంతుణ్ణి నాయకుడు/భర్తగా భావిస్తూ, తనను నాయిక/భార్యగా భావిస్తూ చేసే కీర్తనలు పదాలు. అయితే అవే శృంగార కీర్తనలు చక్రవర్తులు, రాజులు, సామాన్యులపై రాస్తే వాటిని జావళులు అంటారు. కానీ కొందరు వాగ్గేయకారులు తాము భగవంతునిపై రాసిన శృంగార కీర్తనలను పదాలుగా కాక, జావళులుగా ప్రకటించుకొన్నారు.
ఒక పల్లవి, ఒకటి అంతకన్నా ఎక్కువ చరణాలు కలిగిన పాటలను పదాలుగా/జావళులుగా వ్యవహరిస్తారు. అన్నమయ్య శృంగార సంకీర్తనలను పదాలుగా వర్గీకరించారు మన భాషాకారులు. శ్రీనివాసుడు, అలిమేలు మంగమ్మల అమలిన శృంగారాన్ని వర్ణించాడు అన్నమయ్య ఈ పదాల్లో. ‘ఏమొకో చిగురుటధరమున’ వంటి సంకీర్తనలు ఈ ప్రక్రియకు మచ్చుతునకలు. క్షేత్రయ్య మువ్వగోపాలునిపై చేసిన కీర్తనలు, జయదేవుని అష్టపదులు కూడా పదాల వర్గీకరణకే చెందుతాయి. ఇవన్నీ ‘మధుర భక్తి’ సంప్రదాయానికి చెందినవి.
‘మధురానగరిలో చల్లలమ్మ పోను దారి విడువు కృష్ణా’ అనే జావళిని కృష్ణునిపై రాశారు చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై. అలాగే మరో ప్రముఖ వాగ్గేయకారుడు స్వాతి తిరుణాళ్ కూడా ‘ఇటు సాహసములు ఏల నాపై చక్కని స్వామి’ అనే మధురభక్తి సంప్రదాయానికి చెందిన జావళి రాశారు. ఈ జావళులు, పదాలు నృత్యానికి అనుకూలంగా ఉండడం వలన కేవల సంగీత ప్రక్రియలుగా కాక, నృత్య ప్రక్రియలుగా ప్రసిద్ధి చెందాయి.
ఎన్నో రాజాస్థానాలలో, కళావంతులు/దేవదాసీల భవంతులలో నిత్యం వినపడే, కనపడే ఈ జవళులు, పదాలు తొలినాళ్ళ తెలుగు సినిమాలలోనూ స్థానం సంపాదించాయి. సందర్భానుసారంగా, కథకు అనుగుణమైన పూర్వపు కవుల జావళిని ఉపయోగించుకోవడమో, ఎన్నో రకాల ప్రక్రియలకు సాహిత్యం అందించగల ప్రతిభావంతులైన మన సినీ కవులతో రాయించుకోవడమో చేసేవారు. ఆ జావళులన్నీ ఎంతో ప్రజాదరణను అందుకున్నాయి కూడా.
అలా సినిమాల్లో వచ్చిన జావళులు, పదాల గురించి మనకు వివరించబోతున్నారు ప్రముఖ నృత్య కళాకారిణి, అమెరికాలో Learning difficulties ఉండే పిల్లలకు అధ్యాపకురాలైన సైకాలజిస్ట్ లక్ష్మీ భవాని గారు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి థియరీ లెక్చరర్ రాధిక గారు, నృత్య విమర్శకురాలు, నాట్య గురువు సుధాశ్రీధర్ గారు.
జులై 1వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ‘తెలుగు సినిమాలో జావళులు/పదాలు’ అనే శీర్షికన వారు ప్రసంగించబోతున్నారు. మనం మర్చిపోయిన మన సంగీత, నృత్య ప్రక్రియలను పరిచయం చేసుకుందాం రండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.