బారిష్టర్ పార్వతీశం, దాసుభాషితం, ఓ కాపీరైట్ వివాదం.
అవి దాసుభాషితం తొలి రోజులు. PVRK ప్రసాద్ గారి పుస్తకాలకి శ్రవణ రూపం ఇవ్వడం పూర్తి అయింది. ఆ పరిశ్రమకు లభించిన ప్రశంస ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులో మేటి పుస్తకాలను శ్రవణ ముద్రణ చేద్దామని ప్రయత్నాలను మొదలుపెట్టాము.
మేము అనుకున్న పుస్తకాలలో టాప్ 10 లో బారిష్టర్ పార్వతీశం ఉంది. దాని హక్కులు ఎవరి దగ్గరున్నాయని తెలిసిన వారిని అడిగాము. మొక్కపాటి నరసింహ శాస్త్రి కుటుంబ సభ్యులు ఇపుడు ఎక్కడున్నారో తెలియదని, అయినా YouTube లో అప్పటికే ఆ పుస్తకం శ్రవణ రూపం ఉన్నందున, స్వేచ్ఛగా చేసేయమని మేమడిగినవారు మాకు సలహా ఇచ్చారు.
ఆ సలహా ఇబ్బందికరంగా ఉన్నా, మేము ఇలా అనుకున్నాము.
తెలుగు ఆడియోబుక్స్ యాప్ ను అప్పటివరకు ఎవరూ చేయలేదు కాబట్టి తెలుగు రచయితలకు గాని, హక్కుదారులకు గాని దాని మీద అవగాహన తక్కువ. యాప్ ఎలా పని చేస్తుంది, ఎంత మంది వింటారు, ఎంత డబ్బు వస్తుంది, రచయిత వాటా ఎంత వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం కన్నా చేసి చూపటం మేలు.
అయినా మన ఉద్దేశం మంచిది. మనం ఇతరులు ఇచ్చేదాని కన్నా ఎక్కువ వాటా రచయితకు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. కాబట్టి, మనం ప్రొడ్యూస్ చేసి విడుదల చేసి, రచయితకు రావలసిన వాటా తాలూకు చెక్ చేతిలో పెట్టి విషయం చెబితే వచ్చే నష్టం ఏమీ లేదు.
మేము ఇలా సమాధాన పడి శ్రవణ పుస్తకం తయారు చేసి యాప్ లో విడుదల చేసేశాము. విన్న వారు అద్భుతంగా ఉందన్నారు. కానీ మేము చేసిన పని ఎంత శుద్ధ తప్పో త్వరలోనే తెలిసింది.
విడుదల చేసిన కొన్ని వారాలకే, ది హిందూ దిన పత్రికలో దాసుభాషితం మీద వ్యాసం వచ్చింది. అందులో బారిష్టర్ పార్వతీశం హక్కుదారుల నుండి అనుమతి పొందే మా విఫల ప్రయత్నం గురించి చెప్తూ, హక్కుదారులు సంప్రదిస్తే వాటా ఇస్తామని ఇలా స్పష్టంగా చెప్పాము.
పూర్తి ఆర్టికల్ చూడడానికి పై ఇమేజ్ మీద టాప్ చేయండి.
పత్రికలో ఈ వ్యాసం వచ్చిన రెండురోజుల తర్వాత నాకు ఒక మనిషి ఫోన్ చేశారు. ఆ పుస్తకానికి హక్కులు తన వద్దే ఉన్నాయని, తనని సంప్రదించడానికి మేము ఏ మాత్రం ప్రయత్నం చేశామని చాలా కటువుగా అడిగారు. నేను ఆధారాలను అడిగాను. ఆయన మొక్కపాటి నరసింహశాస్త్రి తనకు హక్కులు రాసిచ్చిన పత్రాన్ని పంపారు. ఇంతకీ ఈయన శాస్త్రి గారి సమీప బంధువు.
ఇది తెలిసిన తర్వాత మేము చేసిన మొదట పని యాప్ లో నుంచి పార్వతీశం పుస్తకం తీసివేయడం. ఆ పైన నేను ఆయనతో దాసుభాషితం సదుద్దేశం గురించి చెప్పడానికి ప్రయత్నించాను. కానీ సంభాషణలు ఎప్పుడూ సుహృద్భావంతో జరగలేదు. అందువల్ల ఇక మా ప్రయత్నాలను విరమించుకున్నాము.
ఈ ఉదంతం చెప్పిన తర్వాత కొందరు, "మాకు ఆ శ్రవణ పుస్తకం ప్రైవేట్ గా షేర్ చేయండి" అని అడిగారు. అలా చేయడం అనైతికమే కాదు నేరం కూడా.
కాపీరైట్ హక్కులను గౌరవిస్తూ చట్టం నియమనిబంధనలకు లోబడి పని చేస్తేనే ఏ మీడియా సంస్థకైనా విశ్వసనీయత వస్తుంది. అసలు భారతదేశంలో ఆంగ్లేతర భాషలలో సాహిత్యం క్షీణదశలో ఉండటానికి కారణం మనం ఒక సమాజంగా కాపీరైట్ లను గౌరవించకపోవడం వల్లే.
బారిష్టర్ పార్వతీశం విషయంలో మా ప్రవర్తనలో దురుద్దేశం ఏమీ లేకపోయినా, స్థూలంగా అది తప్పే. అందుకే ఈ అనుభవం తర్వాత, కాపీరైట్ల హక్కుదారుల నుండి అనుమతి పొందకుండా మేము అసలు శ్రవణ పుస్తకాల విషయంలో ఏ పనీ మొదలు పెట్టము.
చట్టం ప్రకారం కాపీరైట్ అనేది రచన విడుదలతోనే రచయితకు సహజంగా సిద్ధించే హక్కు. దీని కోసం ఏ రెజిస్ట్రేషనూ అవసరం లేదు. ఈ హక్కు రచయిత జీవిత కాలం ఉంటుంది. రచయిత మరణించిన 60 సంవత్సరాలకి కాపీరైట్ వీగిపోయి ఆ రచన పబ్లిక్ డొమైన్ లోకి వస్తుంది.
ఈ క్షేత్రంలో మాకున్న అనుభవం దృష్ట్యా, కాపీరైట్ విషయంలో రచయితలు, హక్కుదారులు చేసే ఒక ప్రాథమిక తప్పును మేము గమనిస్తుంటాము. దీనివల్ల వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం కోల్పోతారో వారికి తెలియదు.
ఈ విషయం మీద అవగాహన పెంచడానికి మేము ఈ ఆదివారం Feb 5, 2023 న ఉ: 11 గంటలకు, గూగుల్ మీట్ ద్వారా ‘కాపీరైట్ హక్కులు. సంరక్షణ. ఆదాయం.’ అనే సదస్సును నిర్వహిస్తున్నాము.
ఇందులో చర్చించే అంశాలు ఇవి.
- కాపీరైట్ చట్టం క్లుప్త పరిచయం
- సామజిక మాధ్యమాలలో కాపీరైట్లు ఎలా ఉల్లఘించబడుతున్నాయి
- రచయిత హక్కులు
- కాంటెంట్ విస్ఫోటం వలన భవిష్యత్తులో జరిగే పరిణామాలు
- హక్కులను విస్మరిస్తే రచయిత ఎలా నష్టపోతారు
- ప్రశ్నోత్తరాలు
ఈ సదస్సులో కాపీరైట్‌ల విషయంలో రచయితగా, కోరా లో లీగల్ పాలసీ స్పెషలిస్టుగా రెండు దృక్కోణాలతో పరిచయం ఉన్న పవన్ సంతోష్ సూరంపూడి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మీనా యోగీశ్వర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో పాల్గొనదలిస్తే పై బ్యానర్ పై టాప్ చేయండి, లేదా ఈ గూగుల్ ఫారంలో మీ వివరాలివ్వండి.
https://forms.gle/ycgBuEQayhHTA1hQ9
లేదా మీకు తెలిసిన రచయితలకు ఈ సదస్సు గురించి చెప్పండి. వారిని పాల్గొనమనండి. పేర్లు నమోదు చేసుకున్నవారందరికీ శనివారం రోజున మీటింగ్ లింక్ పంపుతాము.
తేలు కడుపు చించిన ఆ మహారచయిత ఎవరు?
దాసుభాషితం జీవిత సభ్యత్వం తీసుకున్న వారి కోరిక మేరకు దాసుభాషితం కూటమి అనే ఒక ప్రత్యేకమైన వాట్సాప్ బృందం మొదలు పెట్టిన విషయం మీకు తెలిసిందే. ఇందులో ఆసక్తికర విషయాలను సరదాగా పంచుకుంటూ, యాప్ లో ఉన్న కాంటెంట్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ వారం మీనా ఈ పై ప్రశ్న అడిగారు. సమాధానం, దానిపై జరిగిన చర్చ అలరించాయి.
యాప్ లో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ రచనల శ్రవణ పుస్తకాలను, హోమ్ స్క్రీన్ పై Spotlight విభాగంలో చూడవచ్చు. ఈ బృందం కేవలం దాసుభాషితం జీవిత సభ్యత్వం తీసుకున్నవారి కోసం. మీరు జేరదలిస్తే, మమ్మల్ని App > Menu > Contact Us ద్వారా సంప్రదించండి.
అభినందనలతో,
దాసు కిరణ్