చదువుకోండి ఫస్టు..!

Ram Kottapalli
February 13, 2025

భారత దేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న గురుకుల విద్యా విధానాలు ఇప్పటికీ కొన్ని అలాగే కొనసాగుతుంటే ఈ అధునాతన కాలంలో సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులతో రూపు దిద్దుకున్న ఐటి ప్రపంచం చదువు, internship, Mentoring, Network పెంచుకునే విధానాలు, upskill అవడం, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం ఇలా ఎన్నో విషయాలు గురించి...

మొన్న ఒక పెళ్లిలో మీనక్క నేనూ మాట్లాడుకుంటున్నాం. స్నాతక పూజ జరుగుతోంది. ఆ పూజలో పెళ్లికొడుకు చేత అతని జీవితంలో చేసిన దోషాలు అన్నిటికీ ప్రాయశ్చిత్తంగా మంత్రాలు పఠిస్తూ పూజ చేయిస్తూ, హోమం చేయిస్తున్నారు శాస్త్రి గారు.  ఆ దోషాలు ఇలా ఉన్నాయి. ఎప్పుడూ తల దువ్వుకోకూడదు, అద్దం చూడగూడదు. వాహనాలు ఎక్కి తిరగకూడదు, దేశ సంచారం చేయగూడదు, వక్కపొడి తినకూడదు, సముద్రాలు దాటకూడదు. ఇలా ఎన్నో ఉన్నాయి. నేను అవన్నీ విని ఏంటి ఇవి దోషాలా? అదేంటి నాకు వీటిల్లో ఏమీ తప్పులు కనబడలేదే ఇవి ఎందుకు దోషాలు అయినాయి ? వీటికి ఎందుకు ప్రాయశ్చిత్తాలు? అని అడిగాను. 

అప్పుడు మీనక్క ఇలా అన్నారు. చదువుకోండి ఫస్టు. మనిషిగా పుట్టాక ఒక వయసు వచ్చాక అసలు ఖచ్చితంగా చచ్చినట్లు పాటించాల్సింది మూడు విషయాలు. ఒకటి చదువుకోవడం. రెండు చదువుకోవడం. మూడు చదువుకోవడం. చదువుకోవడం అంటే పుస్తకం తీసి నవల చదివినట్లు రోబోట్ లా అటూ ఇటూ స్కాన్ చేసి పడేయడం కాదు. విద్యను అభ్యసిస్తూ అందులో ఉన్నది గ్రహించాలి, వంట పట్టించుకోవాలి. పాటించాలి, సాధన చేయాలి. నేర్చుకున్నది గురువు గారి అనుగ్రహంతో ఆచరణలో పెట్టాలి. 

ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సందర్భాన్ని బట్టి ఇంకో విషయం చెబుతున్నాను. 

పూర్వం మగ పిల్లవాడు పుట్టాక వాడికి ఏడేళ్లు రావడం ఆలస్యం తీసుకెళ్లి వారి వారి విధానాల ప్రకారం గురుకులంలో పెట్టేస్తారు. ఆ గురుకులంలో వాడికి ఉండటానికి వసతి, కట్టడానికి 2 గుడ్డలు, తినడానికి తిండి పెడతారు. అలా వాడు గురుకులంలో పనులు చేసుకుంటూ, చదువుకుంటూ, అభ్యాసం చేస్తూ, ఆచరణలో పెడుతూ ఉంటాడు. ఒక వయసు వచ్చి పాఠశాల నుంచి బయట పడేవరుకు ఇంతే. రోజువారీ క్రమం ఇలాగే ఉంటుంది. అంతే గానీ అద్దం చూసుకోవడం, సోకులు చేసుకోవడం, గడ్డం చేసుకోవడం, తల దువ్వుకోవడం, బండ్లెక్కి తిరగడం, సముద్రాలు దాటడం, ఇలాంటి పనులేం ఉండవు. చదువుకోవడమే ఫస్టు. అలా కాకుండా ఇంకేం చేసినా ధ్యాస ఇతర విషయాలపైకి వెళ్లి ఇంక దేని మీద సరైన శ్రద్ధ లేకుండా పోతుంది. 

మీనక్క ఈ విషయం చెప్పిన తర్వాత నాకు మరొక పండితులు చెప్పిన విషయం కూడా గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో 7 సంవత్సరాల వయసుకి రాగానే అబ్బాయికి ఒడుగు చేసి, విద్యార్థిగా పాఠశాలకి పంపేస్తారు. సంవత్సరానికి పదకొండు నెలల పాటు అసలు తిరిగి కూడా చూడని తల్లి దండ్రులు ఉంటారు. అలా చూస్తే వ్యామోహంతో చదువు పై ధ్యాస పోయి భవిష్యత్ పాడైపోతుంది అని. ఇలా 14 సంవత్సరాల పాటు విద్య  నేర్చుకున్న విద్యార్థిని ఆ పాఠశాల గురువుగారు పట్టా ఇచ్చి “నాయనా వెళ్లిరా. ఇక నువ్వు నేర్చుకున్నది సాధన చేస్తూ ఆచరణలో పెట్టు” అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలో చెప్తారట, ఏం చేయాలో చెప్తారట, బయట నిజ జీవితంలో పూజా కార్యక్రమాలు, విధులు అన్నీ చేసే ఒక వేద పండితునికి కూడా అతన్ని అప్పజెప్పుతారు. కొత్త నెట్వర్కు ఎలా ఏర్పాటు చేసుకోవాలో నేర్పిస్తారు, చేసి చూపిస్తారు. కొన్ని పాఠశాలల్లో బయటకి వస్తున్న విద్యార్థికి చేతిలో లక్ష రూపాయల డబ్బు ఫిక్సిడ్ చేసి అతనికి భృతి కలిగే వరకు అది అతనికి ఉపయోగపడేలా చేస్తారు. ఇదొక విధానం. ఇప్పటికి చాలా పురాతన పట్టణాల్లో అగ్రహారాల్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. 

ఇప్పుడు ఇది చెప్పింది ఎందుకు అంటే భారత దేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న గురుకుల విద్యా విధానాలు ఇప్పటికీ కొన్ని అలాగే కొనసాగుతుంటే ఈ అధునాతన కాలంలో సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులతో రూపు దిద్దుకున్న ఐటి ప్రపంచం చదువు, internship, Mentoring, Network పెంచుకునే విధానాలు, upskill అవడం, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం ఇలా ఎన్నో విషయాలు గురించి IT రంగంలో ఎంతో అనుభవం ఉన్న ప్రముఖ Consultant దేవి ప్రసాద్ గారితో ఈ ఫిబ్రవరిలో “కెరీర్ పై స్పష్టత” అనే ప్రసంగం నిర్వహించాము.

చదువు పూర్తి అయ్యి ఉద్యోగం వెతుక్కునే Freshers దృష్టి కోణం ఎలా ఉండాలి, నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి, Mentors ని ఎలా పట్టుకోవాలి, కెరీర్ రోడ్ మ్యాప్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? SAP వంటి రంగంలో మంచి అవకాశాలు ఎలా అందుకోవచ్చు? వంటి విషయాలు పంచుకున్నారు. ఇది కేవలం ఫ్రెషర్స్ గురించే కాదు కెరీర్ గ్యాప్ ఉన్నవారికి, కెరీర్ షిఫ్ట్ అవుతున్నవారికి, తల్లి కావడం వలన చాలా కాలం ఉద్యోగం చేయని మహిళలకి, ఇంకా ఎన్నో కారణాల వలన కెరీర్ లో ఆగిపోయిన వారికి ఒక దృక్కోణం చూపించడంలో ఈ ప్రసంగం ఉపయోగ పడుతుంది. ఈ పూర్తి ప్రసంగం మీరు పైన  వీడియోలో చూడచ్చు. 

అభినందనలు,

రామ్ కొత్తపల్లి.

Image Courtesy :