దాసుభాషితం కూటమిలో Engagement Quality పెంచడం కోసం మేము Feed back అడిగినప్పుడు చాలామంది సాహిత్యంపై మరింత దృష్టి పెట్టమని అడిగారు. అందులో భాగంగా ఒక మంచి కార్యక్రమం రూపొందించాం. అదే 'దాసుభాషితం క్విజ్'.
ఒక గొప్ప పుస్తకం చదివిన తర్వాత కలిగే అనుభవం మాటల్లో వివరించలేనిది. కానీ ఒక్కోసారి దురరదృష్టవశాత్తు ఆ అనుభవం మన ఒక్కరికే ఉండిపోతుంది. మన చుట్టుపక్కల వారో, మన స్నేహితులో, బంధువులో మనం చదివిన పుస్తకమే చదవని వారు ఉంటారు. మనం చదివిన పుస్తకం వారు కూడా చదవాలని, ఆ పుస్తకంలోని పాత్రలను వారు కూడా అవలోకనం చేసుకోవాలని, ఆ ప్రపంచంలో వారు కూడా ప్రయాణించాలని మనకి కూడా ఎంతో కుతూహలంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే కదా వారితో మనం డిబేట్ పెట్టుకోవచ్చు, ఆధ్యాత్మిక అనుభవాలపై, నిజ జీవిత ఘటనలపై రాసిన పుస్తకాలపై ఐతే ఇలాంటి సంభాషణలు ఇంకా రసవత్తరంగా ఉంటాయి.
అందుకే ఈ పుస్తక సంభాషణలతో పాటు క్విజ్ పోటీలను కూడా నిర్వహించి సాహిత్యంపై మరింత దృష్టి పెట్టడానికి దాసుభాషితం పూనుకుంది. అయితే పూర్తిస్థాయిలో మొదలుపెట్టే ముందు, ఒక Pilot కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాం. ఈ క్విజ్ లైవ్ లో నిర్వహిస్తే, సరదాగా ఉంటుందని మా అభిప్రాయం. కాబట్టీ, ఈ నెల ఆఖరి శనివారం అంటే 29వ తేదీ ఉదయం 11 గంటలకు క్విజ్ లైవ్ కార్యక్రమం జరుగుతుంది.
మరి ఈ క్విజ్ పోటీలో భాగంగా మొట్టమొదట శ్రోతలకి వినమని మేం ప్రతిపాదిస్తున్న పుస్తకం తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, కీర్తి శేషులు శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారు రచించిన నాహం కర్తా. హరిః కర్త ఈ పుస్తకం విడుదల అయ్యి ఈ ఆగస్టుకి 20 ఏళ్లు. ఆ గొప్ప పుస్తకానికి, ప్రసాద్ గారికి నివాళులు అర్పించడానికి మనకి ఇది సరైన సమయం.
పుస్తకం వినడం మొదలు పెట్టిన మొదటి 30 నిమిషాలలోనే 1980ల నాటి పరిస్థితులకి తీసుకుని వెళ్లిపోతుంది. ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉండేది, అప్పటి రాజకీయాలు, తిరుమలలో ఆలయం చుట్టూ జరిగిన వ్యాపారాలు ఇలా అసలు ఒకప్పటి తిరుమల ఎలా ఉండేదో కళ్ళకి కట్టినట్లు ఈ పుస్తకంలో చెప్తారు pvrk ప్రసాద్ గారు.
ఇది ఆధ్యాత్మిక పుస్తకమా అంటే పూర్తిగా కాదు, అలా అని ఆత్మకథ కూడా కాదు. నాహం కర్తా హరిః కర్తా అనే భావనలో చెప్పాలి అంటే ఇది హైదరాబాద్ నగరం నుంచి తిరుపతి కి కార్యనిర్వహణాధికారిగా వెళ్ళి, నాలుగేళ్ల సమయంలో తిరుమలను అప్పటి కంటే గొప్ప organized క్షేత్రంగా మార్చిన ఒక అధికారి అనుభవాల సారాంశం. తిరుపతిలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఎన్నో సందర్భాల్లో తన పరిధికి మించి నిర్ణయాలు తీసుకొని, అమలు చేస్తుంటే, అది పాలనాదక్షతా? నాయకత్వ లక్షణమా? అని అనిపిస్తుంది. ఒక అధికారి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం ఎంత దుస్సాధ్యం అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో తిరుమల కొండపై జరిగిన వరుణ హోమం గురించిన సందర్భం నిజంగా మనలని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అప్పటికి కొద్ది నెలలుగా తిరుమలలో నీళ్ళు తగ్గుతూ వస్తున్నాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకి, తిరుమలలో అవసరాలకి, అన్నిటికీ నీరు సరిపోదు. నీటి సమస్య పోవాలి అంటే వర్షం పడాలి. వర్షం పడాలి అంటే శాస్త్రాలను పరిశీలించి, వేద, వేదాంగాలను చదివిన పండితులతో చర్చించి తిరుమలలో వరుణ హోమం తలపెట్టారు. ఆ ఈ కలియుగంలో కూడా యాగాలు చేస్తే వర్షాలు పడతాయా ? జపాలకి జడివానలు కూరుస్తాయా ? అన్నారు.
మూడు రోజుల పాటు హోమం జరిగింది. విలేకర్లు “ కళ్ల నుండి కన్నీళ్ళు కురుస్తున్నాయి కానీ, ఆకాశం నుండి వర్షం కురవడం లేదు అన్నారు. ఆ మరుక్షణం ఆకాశం మేఘావృతం అయ్యి వర్షం ప్రారంభం అయ్యింది. అలా మొదలైన వాన మరుసటి రోజు ఉదయం వరకూ తిరుమల గిరిపై కుండపోతగా కురిసింది. ఆరోజు ఉదయం చీఫ్ ఇంజినీర్ ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి గో గర్భం డ్యామ్ పొంగి ప్రవహిస్తుంది అన్న వార్తను ప్రసాద్ గారి చెవిలో వేశారు. విచిత్రం ఏంటి అంటే అలాంటి వాన తిరుపతి చుట్టుపక్కల ఎక్కడా పడలేదు. కేవలం తిరుమల గిరిపై మాత్రమే పడింది.
ఇలా ఒక వ్యక్తి త్రికరణ శుద్ధిగా, నిస్వార్థంగా ఏ కార్యం సంకల్పించినా
పంచ భూతాలన్నీ తమ శక్తి యుక్తుల్ని ఆ వ్యక్తిలో ప్రవేశింపజేసి, ఆ కార్యం నెరవేర్చడమే కాకుండా భవిష్యత్తు తరాల వారికి ఆదర్శప్రాయంగా వుండే విధంగా పూర్తి చేయించే ప్రేరణ కలిగించగలిగిన ఎన్నో ఉదంతాలు మనం ఈ శ్రవణ పుస్తకంలో వింటాం. ఇవన్నీ కర్తలుగా ఉండి మానవుడు చేసిన క్రియలా, లేక ఆ నారాయణుడు మన వెనక ఉండి చేసిన పనులా అనే ప్రశ్న ప్రతి అధ్యాయం చివర పుడతుంది. దానికి రెండే రెండు ముక్కల్లో సమాధానం నాహం కర్తా. హరిః కర్త.
ఈ పుస్తకం వినడానికి ఈ రెండు వారాల వ్యవధి లభిస్తుంది. ఈ క్విజ్ దాసుభాషితం కూటమి సభ్యులకు ప్రత్యేకం కాబట్టీ, ఈ క్విజ్ లో పాల్గొనదలచిన వారు వచ్చే ఆదివారం అంటే 23వ తేదీ లోపు కూటమిలో తమ పేర్లను ఇవ్వవచ్చు.
ఆచార్యదేవోభవ - 4
ఆచార్య దేవోభవ శీర్షికన డా. ఆర్. అనంత పద్మనాభరావుగారు రాసిన వ్యాసాలను ఇప్పటివరకు మూడు భాగాలుగా మీరు విన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా, ఉపకులపతులుగా ఉండి తమకున్న ఆసక్తితో చేసిన పరిశోధనలను, సాహిత్యంపై చేసిన కృషిని 'ఆచార్యదేవోభవ' అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకుని వచ్చారు డా. ఆర్. అనంత పద్మనాభరావుగారు. మొదటి మూడు భాగాలు మద్రాస్ విశ్వ విద్యాలయం, ఉస్మానియా విశ్వ విద్యాలయం, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అయితే నాలుగవ భాగం ఆ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.
1954లో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారిచే తిరుపతిలో ప్రారంభించబడ్డ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒక మహా వృక్షంగా ఎదిగి, తర్వాతి కాలంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర వైద్య, విజ్ఞాన సంస్థ, జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయాలు పట్టుకొమ్మలుగా చేరడానికి దోహదపడింది. కోట్ల విజయ భాస్కార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై యస్ రాజ శేఖర రెడ్డి, లాంటి ఎందరో గొప్ప నాయకులు ఈ విశ్వ విద్యాలయంలో విద్య నేర్చిన వారే.
1954 నుండి 2022 వరకు ఈ విశ్వవిద్యాలయానికి ఉపకులపతులుగా వ్యవహరించిన ఆచార్యులు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి వారు చేసిన కృషి ఈ నాలుగవ భాగంలో వినండి.
యాదృచ్చికమో మరి కాక తాళీయమో శ్రీ pvrk ప్రసాద్ గారి నాహం కర్తా హరిః కర్త పుస్తకం గురించి మనం ఈ నెలలో చర్చించుకోబోతుంటే అదే సమయంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆవిర్భావం, అభివృద్ధి, ఆచార్యుల కృషి గురించి కూడా ఈ వారం ఆచార్యదేవోభవ శ్రవణ పుస్తకంలో వినబోతున్నాము.
భావము లోనా, బాహ్యము నందునూ గోవింద గోవిందయని కొలువవో మనసా...