ఈ కాలపు తెలుగు పిల్లలకి చరిత్ర అనే పదం వింటే ‘చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది’ అనే బ్రహ్మానందమో, ‘చరిత్ర అంటే మాది’ అనే బాలకృష్ణో గుర్తుకు వస్తారేమో. శ్రీకృష్ణదేవరాయలు, రుద్రమదేవి, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరూ సినిమాల్లో పాత్రలుగా తెలుస్తారే కానీ, రక్తమాంసాలతో ఒకనాడు జీవించి, ఈ నేలను తీర్చిదిద్దిన వాళ్ళుగా ఎవరు చెప్తారు వాళ్ళకి. రాముణ్ణి, కృష్ణుణ్ణి పురాణ పాత్రలుగా, కల్పిత పాత్రలుగా మాత్రమే చూసే నేర్పు మనకి ఆంగ్లేయులు అందించి వెళ్ళారు. దాని ఆసరాతో గౌతమిపుత్ర శాతకర్ణి, రాజరాజ నరేంద్రుడు, శ్రీనాధుడు కూడా పుస్తకాల్లో పాత్రలుగా మాత్రమే చూడడం నేర్చుకున్నామనిపిస్తోంది.
మనం రోజూ సంకల్పంలో చెప్పుకుంటున్నామే కృష్ణ గోదావర్యోః మధ్య ప్రదేశే అని, దానినే ఆంధ్ర ప్రాంతంగా గుర్తించాయి పురాణాలు. ఇప్పటి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పాలించిన రాజుల చరిత్ర ఎన్నో పురాణాలలో సైతం దొరుకుతోంది. ఆంధ్రప్రాంత రాజవంశం గురించిన వర్ణన ఈ పురాణాలలో కనిపిస్తుంది. మొట్టమొదటిసారి మన ప్రాంతాన్ని బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించడం మనం చూడచ్చు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి అతిపెద్ద చక్రవర్తుల వంశం పేరు ఆంధ్ర ఇక్ష్వాకులుగా ఆ పురాణం వర్ణించింది. ఎన్నో జాతులుగా విడిపోయిన ఈ ప్రాంతాన్ని ఏకం చేసి ఆ రాజులు పాలించారంటుంది ఈ పురాణం.
దక్షిణా పధం యావత్తూ, పడమర భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతవాహనులు గోదావరీ ప్రాంత వాసులని, ముఖ్యంగా ఇప్పటి తెలంగాణాలోని కోటిలింగాల వారి జన్మస్థానమని చరిత్ర చెబుతోంది. కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి వారి రాజధాని అని కూడా చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇలా మన తెలుగు ప్రజలకు ఎంతటి గొప్ప వారసత్వం ఉందో ఇప్పటి పిల్లలకు తెలుసా? ఇప్పటి పిల్లల దాకా ఎందుకు? నా తరం, నా ముందు తరం వారికైనా తెలుసా? మన పాఠ్యపుస్తకాల్లో ఔరంగజేబు గురించి చెప్పినంత ఎక్కువగా రాణి రుద్రమదేవి గురించి చెప్తారా?
ఏ ప్రాంత చరిత్రని అక్కడి పిల్లలకు చెప్పడానికి మన విద్యా వ్యవస్థకు వచ్చే నష్టమేమిటో నాకు అర్ధం కాదు. నిజమే భారతదేశాన్ని ఏలిన రాజుల గురించి, సంస్కృతంలో కావ్యాలు రాసిన కవుల గురించి, పానిపట్ యుద్ధం గురించి పిల్లలు నేర్చుకు తీరాలి. ఒప్పుకుంటాను. కానీ, కూచిపుడిని తయారు చేసిన సిద్ధేంద్ర యోగి గురించి, భారతాన్ని అనువాదం చేసిన తిక్కన గురించి, పల్నాటి యుద్ధం గురించి, గౌతమి పుత్ర శాతకర్ణి గురించి కూడా నేర్చుకుంటే తాము పుట్టిన నేల ఎటువంటిదో ఆ పిల్లలకు తెలిసి, ఆ ప్రాంతంపై ప్రేమ, గౌరవం ఇనుమడిస్తాయి కదా. ఈ భాష, సంస్కృతుల విలువ తెలిసి కాపాడుకుంటారు కదా.
ఒక మనిషి అంటే శరీరం, అవయవాలు, మనసు మాత్రమే కాదు. ఆ వ్యక్తి పుట్టిన నేలలోని సారం, అక్కడి గాలిలోని పరిమళం, ఆ ప్రాంతపు రుచుల సమ్మేళనం, అక్కడి ప్రజల భాషలోని పలుకులు, ఆ ప్రజలు అనుభవించిన తుఫానులు, కరువులు, రోగాలు, సుఖాల నుంచి నేర్చుకున్న అనుభవం, ఆ ఆకాశమండలంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆ ప్రాంతపు ధీరులు అన్నీ ఆ వ్యక్తి కణకణంలో మండుతాయి. ఆ వ్యక్తి రక్తంలో ప్రవహిస్తాయి. ఇదేదో ఆవేశంగా నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాట కాదు. మన DNAలో ఇవన్నీ నిక్షిప్తమై ఉంటాయని ఈనాటి విజ్ఞాన శాస్త్రం నిరూపించిన మాట.
మరి ఆ జ్ఞానం, ఆ రుచి, ఆ అనుభవాలను ప్రతి తరం తెలుసుకోవాలి కదా. అలా తెలియజెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే కదా. అందుకే తెలుగు ప్రాంతానికి, భాషకి, సంస్కృతికి, ప్రజలకు చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశ్యం ప్రతి కదలికలోనూ కలిగిన దాసుభాషితం ఈ బాధ్యతను కూడా తీసుకుంది. చేసేది చిన్న ప్రయత్నమే కావచ్చు కానీ, దాని వలన భావితరాలు తమ ప్రాంతాన్ని తెలుసుకోవాలని మా ఉద్దేశ్యం. అందుకే ఈ డిసెంబరు నెల ప్రసంగం ‘తెలుగు ప్రాంత చరిత్ర’ అనే అంశంపై ఉండబోతోంది. ప్రముఖ రచయిత్రి శ్రీమతి పాలంకి సత్య గారు ఈ ప్రసంగం చేయబోతున్నారు.
చరిత్రను నవలారూపంలో, ఎక్కువమంది ప్రజలకు చేరే విధంగా అందించిన గొప్ప వారసత్వం మన తెలుగు సాహిత్యానికి ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు, తెన్నేటి సూరి గారు, అడవి బాపిరాజు గారు ఇలా ఎందరో రచయితలు తెలుగు, భారతీయ, అంతర్జాతీయ చరిత్రను నవలలుగా రాసి, సామాన్య పాఠకులకు చరిత్ర పాఠాలు చెప్పారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ చరిత్రపై ఎన్నో పుస్తకాలను రాశారు పాలంకి సత్య గారు. వారు డిసెంబరు మొదటి శనివారం అంటే 7వ తారీఖున ఉదయం 9.30గంటలకు ‘తెలుగు ప్రాంత చరిత్ర’ అనే అంశంపై మాట్లాడనున్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఓ పాటలో అన్నట్టు ‘తలయెత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుకె నిలువెత్తుగా ఎదిగినాని’ అని పాడుకుంటూ, ఈ నెల ప్రసంగానికి హాజరైపోదాం.
ఎ టౌన్ లైక్ యాలిస్ - విశ్లేషణ
మనలో చాలామందికి నాజీలు యూదులపై చేసిన ఊచకోత తెలుసు. ఇంగ్లండు వారు భారతదేశం, ఆఫ్రికా ఖండం వంటి చోట్ల చేసిన అకృత్యాలు తెలుసు. అమెరికా ఎన్నో మధ్య్రప్రాచ్య దేశాలను యుద్ధంలోకి, తీవ్రవాదంలోకి లాగిన వైనం తెలుసు. ఈ మధ్య చైనా వారు Debt Trapల ద్వారా శ్రీలంక వంటి దేశాలను దివాలాతీయిస్తున్న తీరూ తెలుసు. కానీ మన కళ్ళకు ఎప్పుడూ జిగేల్ మంటూ కనపడే మలేషియా ఒకప్పుడు జపాన్ ఉక్కుపాదాల కింద తీవ్రంగా నలిగిపోయిందని తెలుసా? మలేషియా ప్రజల్లో ఇప్పటికీ జపాన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుసా? మనకి ఆంగ్లేయులు ఎలాగో వారికి జపనీయులు అలాగని తెలుసా?
ఈ నవల చదివితే తెలుస్తుంది. నిజానికి ఈ నవల మలేషియా జపనీయుల చేతిలోకి వెళ్ళక ముందు, అక్కడి ప్రాంతాన్ని పాలించిన యూరోపియన్ల కథ. అధికార మార్పిడిలో కొన్ని సామాన్య ఆస్ట్రేలియన్ కుటుంబాలు జపనీయుల చేతిలో బందీలుగా మారబడ్డ పరిస్థితుల గురించి, ఏ నేరం చేయని వారికి విధింపబడిన శిక్ష గురించి, వారి కష్టం గురించిన కథ. అవన్నీ ఆ మలయా నేలపై అనుభవించి, రక్షించబడి తన నేలకు తిరిగి వెళ్ళిన యువతి, అక్కడి స్త్రీల నీటి కష్టాలకు చూపిన శాశ్వత పరిష్కారం గురించిన కథ. నిరంతర కష్టంలో సుఖాన్ని వెతుక్కున్న ఓ ధీరోదాత్తురాలి కథ.
ఆశక్తికరంగా ఉంది కదా. నిజమే, ఈ విశ్లేషణ విన్నప్పుడు నాకూ చాలా నచ్చింది. వెంటనే ఆ నవల ఆర్డర్ పెట్టేశాను. రేపో మాపో వస్తుంది. ఆ నవల ఒరిజినల్ చదువుతా. ఇంకా నచ్చుతుంది అనే అనిపిస్తోంది. కాబట్టీ ప్రముఖ ఆస్ట్రేలియన్ నవలా రచయిత నేవిల్ షూట్ రాసిన ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విశ్లేషకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు రాసిన ఆశక్తికర విశ్లేషణ ఈ వారం విడుదల అవుతుంది. వినేయండి. నచ్చితే నాలాగే నవల తెప్పించుకుని కూడా చదవండి. నలుగురి కష్టాలు చదివితే, మన కష్టాలు అనుభవించడానికి ధైర్యం వస్తుందని నా నమ్మకం. అందుకే ఇలాంటివి చదువుతా. మీరూ అంతేగా. అయితే, ఈ నవల మీ కోసమే. వినేయండి. ఆనక చదివేయండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.