నాకు అస్సలు నచ్చని సామెతల్లో మొదటిది ‘చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లి ఉండదు’. ఇలా generalize చేసి మాట్లాడితే నాకు భలే కోపమొస్తుంది. ఒక వ్యక్తికి ఉండే అనేకానేక పాత్రల్లో తల్లి/తండ్రిగా ఉండడం కూడా ఒక పాత్ర. అది ఎక్కువ శాతం మంది సమర్ధవంతంగా, ప్రేమపూరితంగా నిర్వహించినంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవడం అమాయకత్వం. ఒక మనిషి సహజంగానే చెడ్డవారైనప్పుడు వారు నిర్వర్తించే ఇతర పాత్రల్లో కూడా ఈ చెడ్డతనం అనేది ప్రవేశించడం సహజం. కాబట్టీ చెడ్డ తల్లి/తండ్రి ఉండరనుకోవడం నిజం కాదు.
నేను చాలామంది తల్లిదండ్రుల్ని పరిశీలించాను. వాళ్ళ పిల్లల జీవితాన్ని వాళ్ళ చేతులారా నాశనం చేసినవాళ్ళు ఉన్నారు. కొందరు తామే సరైన వ్యక్తులం, తమదే సరైన శైలి అనుకుంటూ మూర్ఖత్వంతో పిల్లల ఆలోచనా విధానాన్ని శాశ్వతంగా నాశనం చేసినవారున్నారు. ఇంకొందరు, పిల్లలపై అతి ప్రేమతో వాళ్ళ జీవితంలో సహజంగా వచ్చే ఇతర వ్యక్తులపై అసూయతో వారి బంధాలను నాశనం చేసినవాళ్ళున్నారు. మొత్తానికి బాధ్యతే తీసుకోకుండా అతి చిన్న వయసు నుండే పిల్లలను పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళ భవిష్యత్ ను నాశనం చేసినవాళ్ళున్నారు.
వీళ్ళందరికన్నా అతి ప్రమాదకరమైన వాళ్ళు వేరే రకం. Self centered, narcissistic వ్యక్తులు తల్లిదండ్రులైతే అంతకన్నా పిల్లలకు నరకం వేరే ఉండదు. సహజంగా ఈ వ్యక్తులు ఏ బంధానికైనా ప్రమాదకారులే, అన్నిటికన్నా ఎక్కువ పిల్లలకు అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో పిల్లలు వాళ్ళు తయారు చేసిన మట్టిబొమ్మలు. వాళ్ళతో ఎలా అయినా ప్రవర్తించే హక్కు తమకు ఉంది అని వీళ్ల అభిప్రాయం. వీళ్ల ఉద్దేశ్యంలో తామే ముఖ్యం, తమ శరీరమే ముఖ్యం, తమ సౌఖ్యమే ముఖ్యం. మిగిలినవాళ్ళు, సొంత పిల్లలతో సహా ఎవరు ఏమైపోయినా వీళ్లకి అనవసరం.
ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఉంటారు అండి, తప్పకుండా ఉంటారు. నాకు ఉన్నవి 32ఏళ్ళే కానీ, నేను నా జీవితంలో చాలా రకాల వ్యక్తులను చూశాను. అదృష్టమో, దురదృష్టమో తారసపడిన వ్యక్తులను లోతుగా observe చేసి, అంచనా వేసే అలవాటు పెట్టాడు నాకు భగవంతుడు. తమ సొంత స్వార్ధం కోసం, తమ గొప్ప కోసం పిల్లల కాపురాలు, కెరీర్ లు సర్వనాశనం చేసిన తల్లిదండ్రుల్ని చూశాను నేను. తాము సాధించలేనిదాన్ని పిల్లలపై రుద్ది, వారి మానసిక అనారోగ్యానికి కారణమైన తల్లిదండ్రుల్ని చూశాను నేను.
అంతా నేనే, అన్నిటా నేనే, అందరి జీవితాల్లోనూ నేనే ముఖ్య పాత్రని అనుకునే తల్లిదండ్రుల పెంపకంలో ఎదిగిన పిల్లల్ని చూశాను నేను. వాళ్ళ కష్టం అర్ధం చేసుకున్నాను. అలాంటి వారు చాలా శాతం bitterగా అయిపోవడం, సరైన వ్యక్తిత్వం లేకపోవడం, మానవత్వం లోపించడం కూడా నేను వారిలో గమనించాను. ఇక అలాంటి పిల్లల జీవిత భాగస్వాములు, వారి పిల్లలు కూడా effect అవ్వడం అదంతా ఒక loop. అందుకే నేను బల్ల గుద్ది చెప్పగలను ‘చెడ్డ పిల్లలు ఉన్నట్టే, చెడ్డ తల్లిదండ్రులు కూడా లోకంలో ఉంటారు’ అని సామెతను మార్చాలి.
కొంతమంది నేను ఇంత bluntగా రాసినందుకు బాధపడతారేమో. కానీ నేను చెప్పేది మాత్రం నా జీవితంలో నా కళ్ళెదురుగా చూసిన కటిక సత్యం. నేను ఎప్పుడూ దేవుడికి ఒకటే దణ్ణం పెట్టుకుంటాను. ‘నన్ను అన్ని రకాలుగా ఎదగనిచ్చిన తల్లిదండ్రుల చేతిలో పడేసినందుకు ధన్యవాదాలు స్వామీ. నా చేతిలోకి నా పిల్లలు వచ్చినప్పుడు నేను కూడా అలానే ఉండగలిగేలా చూడు’. ఇదే నా ప్రార్ధన ఎప్పటికీ. ఎందుకంటే పిల్లల్ని కలిగి ఉండడం, ఒక ప్రాణి పుట్టుక, ఎదుగుదల దగ్గరగా చూస్తు, వారిని ప్రభావితం చేయగలగడం ఒక గొప్ప వరం. అది అర్ధం చేసుకోలేనివారికి పిల్లల్ని పెంచే బాధ్యత ఇవ్వడం దేవుడి లీల. వారి కర్మ ఫలం అనిపిస్తుంది నాకు.
అమెరికన్-లెబనీస్ ఫిలాసఫర్ కహ్ లిల్ గిబ్రన్ ఒక మాట అన్నాడు. ‘Your children are not your children. They come through you but not from you’. ఒక ప్రాణికి ఈ ప్రపంచంలోకి రావడానికి ఒక వాహకం అవసరం కాబట్టీ, వారు కొన్నేళ్ళు మనగలగడానికి ఒక గూడు అవసరం కాబట్టీ, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అనుభవం ఉన్నవారు అవసరం కాబట్టీ మనకి పుడతారు పిల్లలు. వారి కర్మలు, మన కర్మల్ని అనుసరించి, ఎవరికి ఎవరు సరైన జోడీనో ఎంచుకుని, ఆ ప్రాణిని ఈ భూమి మీదకి తీసుకురావడానికి మనల్ని ఒక vehicleగా ఎంచుకుంటాడు దేవుడు అని గట్టి నమ్మకం. అంతేకానీ, మనం వారి creators కాదు. వారిని ఏమైనా చేసేయగల హక్కు మనకి లేదు.
ఇలా ఆలోచించని తల్లిదండ్రులు పిల్లల్ని ఆస్తులగానో, తమ నమ్మకాలకు వాహకులుగానో, తమ కోరికలని తీర్చే యంత్రాలగానో, తమ గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తులగానో చూస్తారు. అలా చూసిన ఒక తల్లి, తద్వారా జీవితం నాశనమైన ఒక కూతురు కథే ‘where love has gone?’ నవల. ప్రముఖ ఆంగ్ల నవలాకారుడు హెరాల్డ్ రాబిన్స్ 1962లో రాసిన ఈ నవల ఎన్నో మలుపులతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పక్కా కమర్షియల్ నవల అయిన ఇందులో మనుషుల వ్యక్తిత్వం, అది ఇతరులపై చూపే ప్రభావం వంటి లోతైన విషయాలు ప్రస్తావించారు రచయిత.

ఒక self centered తల్లి చేతిలో చిక్కుకుపోయిన కూతురు జీవితం ఎలా పతనమైందో ఈ నవల చదివితే అర్ధం అవుతుంది మనకి. ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు రాసిన విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. ఈ న్యూస్ లెటర్ చదివాకా, ఆ విశ్లేషణ విని చూడండి. నేను చెప్పింది సబబేనో కాదో నాకు మెసేజ్ చేయండి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.