అనగనగా గుణాంకుడు అనే రాజు. వేటకి వెళ్లి అలసిపోయి ఒక వేటగాని ఇంట సేద తీరుతాడు. అపుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ వేటగాని కూతురే తన కోడలు అవుతుందని, అది విధి లిఖితం అని. ఆ కలను నమ్మి, అటువంటి సంబంధం తన అంతస్తుకు తగదని, అది జరగకూడదని అతను పన్నిన పన్నాగాలు ఏవి సఫలం కావు. ఆ అమ్మాయి పెద్దై, అపురూప సౌందర్య రాసి అవుతుంది. చివరికి అతని కొడుకు ఆమెను యాద్ధృచ్చికంగా కలిసి ఆమనే పెళ్లాడతాడు. రాజు ఆ సంబంధాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు. అతను ఎందుకు అలా చేశాడు అన్నది బేతాళడు విక్రమార్కునికి వేసే ప్రశ్న.
ఈ తెలుగు కథని ఇంకా ప్రాథమిక పాఠశాలలోనే ఉన్న నా పిల్లలు ఇవాళ దాసుభాషితం యాప్ లో విన్నారు. వినటమే కాదు, బేతాళుడు వేసే ప్రశ్నని ముందే ఊహించారు. ఇందులో విశేషం ఏమిటంటే వాళ్లకి తెలుగు రాదు. తెలుగేతర రాష్ట్రాలలో వారి బాల్యం గడుస్తుండడం, తల్లి కన్నడిగురాలు అవటంతో, ఇంట బయట వారికి తెలుగుతో పెద్ద పరిచయం లేదు. అందువల్ల వాళ్ళు తెలుగు కథలు ఆస్వాదించలేరు అని అనుకున్నాను. కానీ ఇవి నేనుపెట్టుకున్న పరిథులేనని నాకు ఇవాళ తెలిసింది. తెలుగు వాక్యాలు వాళ్లకి అర్థమయ్యేలా ఆంగ్లంలో చెబుతూవుంటే వారు కథను ఆసాంతం శ్రద్ధగా విన్నారు. ప్రశ్నలు అడిగారు. బేతాళ కథలన్నీ విందామన్నారు.
గత కొన్ని రోజులుగా కొవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచం ఎటువంటి ప్రచండ సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్నదో మనం చూస్తున్నాం. భయపెడుతున్న మహమ్మారి ప్రతిఒక్కరినీ కబళించకుండా ప్రభుత్వాలు అవసరమైన అన్ని ముందస్తు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ప్రజలను స్వచ్చందంగా సామాజిక దూరం పాటించవలసినదిగా సూచిస్తున్నాయి. దానివల్ల ఎప్పుడూ లేనంతగా కుటుంబంలో అందరూ ఇంటి పట్టునే ఉండి ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతోంది. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూనే, ఒక ఆశావాహ దృక్పధంతో ఉండటం ఈ సమయంలో అవసరం. మనసుని ఆహ్లాదపరిచే పనులు చేయటం అందులో భాగమే.
గత వారం ఒకాయన ట్విట్టర్ లో ఇంత సమయం చిక్కడంతో ఇబ్బంది పడుతున్నానని, చేయవలసినవన్ని చేసినా ఇంకా చాలా ఖాళీ సమయం ఉన్నదని సరదాగా వ్యాఖ్యానించారు. దాసుభాషితం యాప్ ను ఉపయోగించి ఓ విశ్వనాథ సత్యనారాయణనో, బుచ్చిబాబు నో తిరిగి పలకరించవచ్చు కదండీ అని నేను సమాధానంగా చమత్కరించాను. ఆ వ్యాఖ్య చేసిన తరువాత నేనేం చేయగలను అనే ప్రశ్న నన్ను తొలిచింది. తెలుగు భాష పట్ల నా పిల్లలకు అంత ఉత్సాహం ఉండదేమో అనే నా సందేహానికి పరీక్ష పెట్టాలనుకున్నాను. కథను వినిపించే ప్రయోగం చేశాను. వారు నా ప్రయోగాన్ని నా అంచనాలకు మించి సఫలీకృతం చేశారు. నా సందేహాన్ని పటాపంచలు చేశారు.
కొన్ని సంఘటనలు మానవాళికి తన ఆలోచన విధానాన్ని, అలవాట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తాయి. ఒక మంచి అలవాటుకి బీజం వేసేందుకు కూడా ఇది మహత్తర సమయం. ఆ కోవలోనే, పిల్లలు, పెద్దలు సాహిత్యాభిరుచి పెంచుకోవటానికి ఈ సమయం ఎంతో అనుకూలం. మంచి సాహిత్యం స్వల్పకాలంలో ఆనందాన్ని, దీర్ఘకాలంలో మంచి వ్యక్తిత్వాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ను జీవితంలోకి ఆహ్వానించడం వల్ల, ఇప్పటివరకు తెలియని రుచి ఎదో తెలిసివస్తుంది. పఠనంతో పాటు సాహిత్యం వినటం కూడా అలవర్చుకుంటే, ఈ కష్టకాలం దాటిన తరువాత భవబంధాలు-సమయం మధ్య యుద్ధం మళ్ళీ మొదలైనా, తెలుగు సాహిత్యంతో ఏర్పడిన బంధానికి అంతరాయం ఉండదు.
ఈ సమయంలో ఆ బంధం ధృడపడేలా దాసుభాషితం తన వంతు సహకారం అందిస్తుంది. దాసుభాషితం యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్ లో రుసుముతో ఉన్న శ్రవణ పుస్తకాలను ఉచితంగా వినవచ్చు.
___