దాసరి నారాయణ రావు అనగానే వెంటనే గురొచ్చేది ఆయన నిండైన విగ్రహం.
మన ఊహకి ఇంకొంచెం అవకాశం ఇస్తే ఆయనకి మేకప్ వేసి
"సీతారావయ్యగారా!..." అనిపిస్తుంది.
కష్టాల్లోంచి పాఠాలను నేర్చుకోవడం, అపారమైన ప్రతిభ, తీవ్రంగా శ్రమించే గుణం, శ్రీ దాసరి నారాయణ రావుకు భారత దేశంలో (ప్రపంచంలో?) అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనతను తెచ్చిపెడితే, గంభీరమైన ఆలోచనలు, సామాజిక స్పృహ, ఇతరుల కష్టాలను తీర్చాలన్న తపన ఆయనను ఒక పత్రికా సంపాదకుడిగా, శ్రామికల నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగేట్టు చేశాయి.
2008లో డా. మృణాళిని తో పాల్గొన్న ముఖాముఖీలో, ఆయన 'స్టార్' లపైన, తెలుగు సినిమా నాణ్యత పైన, పత్రికల పైన, సీక్వెల్స్ పైన, తన ఆలోచనలను నిర్మొహమాటంగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్టు పంచుకున్నారు. అవి విన్న తరువాత ఆయన 'బాహుబలి' చూడగలిగుంటే బావుండనిపిస్తుంది.
ఓ దిగ్గజ మనిషి పోయిన తర్వాత సహజంగా ఆ రంగంలో ఆ మనిషి వదిలిన ప్రభావం గురించి చెప్పుకుంటాం. ఈ ముఖాముఖీ వింటే దాసరి ఇంకా చేయలేక పోయిన పనులు ఏమిటో ఆయన ద్వారానే మనకు తెలుస్తుంది.
మే 4న దాసరి పుట్టినరోజు సందర్భంగా ఆ ముఖాముఖీని ఇపుడు వినండి.
ఆకాశమంత - కథా సంపుటి
ఈ వారం విదులైన శ్రవణ పుస్తకం, డా. శమంతకమణి రచించిన కథల సమాహారం. దీని ప్రత్యేకత ఏంటంటే, శ్రవణానువాదం కూడా రచయిత్రే చేసుకున్నారు.
స్త్రీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనే శక్తినిచ్చే కథలివి. జీవన పోరాటం తప్ప అనవసర సౌకుమార్యం, లాలిత్యం, మరో భుజం పై వాలిపోయే మనస్థత్వం ఈ పాత్రల్లో ఉండవు. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన జీవితానికి తానే మార్గం ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కథలు, సందర్భోచిత హాస్యంతో నడుస్తాయి. ఎక్కడా, స్త్రీ సౌందర్య వర్ణన ఉండదు. మనో నిబ్బరం, ఆత్మస్థైర్యానికి పెద్ద పీట వేయటం ఈ కథలలో ప్రధాన లక్ష్యం.
ఈ పాత్రలు పరిపూర్ణమైన స్త్రీలు. ఓటమిని అంగీకరించని అపరాజితలు. అసలా ఆలోచన కూడా ఉండని ధీరోదాత్తలు. "ఓర్చుకోవాలి తల్లీ" అని కాకుండా "నేర్చుకోవాలి తల్లీ" అని దిశానిర్దేశం చేయడం ఆకాశమంత కథల ప్రత్యేకత.
దాసుభాషితం అన్ని రకాల సాహిత్యాలకు వేదిక కావాలని మా అభిలాష. యాప్ లో స్త్రీ/స్త్రీవాద సాహిత్యం ప్రాతినిధ్యం పెంచాలనే యోచనలో భాగంగా ఈ వారం విడుదలవుతున్న ఈ 'ఆకాశమంత కథలు' మంచి ఎంపిక అవుతుందని ఆశిస్తాము.
శ్రీ రామకృష్ణ కథామృతం 10వ సంపుటం
గత రెండు నెలల నుంచి ప్రతీ వారం విడుదలవుతున్న శ్రీ రామకృష్ణ కథామృతం 10వ ఆఖరి భాగం ఇది.
ఈ సంపుటం లో అహంకారం, వ్యాకులతల గురించి కేశవసేన్ తో శ్రీరామకృష్ణులు, మహాసమాధి, నరేంద్రుడు-భగవంతుని అస్తిత్వం, వరాహనగర్ లో శ్రీ రామకృష్ణ మొదటి మఠం స్థాపన, 'శ్రీరామకృష్ణ కథామృతం' గ్రంథ రచయిత మహేంద్రనాధ్ గుప్త సంక్షిప్త జీవిత చరిత్ర మొదలైనవి వింటారు.
వచ్చే వారం
– కాశీ మజిలీ కథలు ప్రారంభం
– యండమూరి 'వెలుగు వెన్నెల హారతి' - కథలు
– శ్రీ యండమూరి తో ముఖాముఖీ