సర్వం జగన్నాథం అని ఒక నానుడి ఉంది.
ప్రహ్లాదుడు అన్నట్లు
తల్లియు తండ్రియు నారాయణుడే
గురువు చదువు నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
అఖిలమైన దేవతలు ఉన్నా వారంతా కూడా ఆ నారాయణుడే అని వైష్ణవులు ప్రధానంగా నమ్ముతారు. అందరిలోనూ, అన్నిట్లోనూ, అన్ని రూపాలుగాను, ఉన్నది ఆ జగన్నాధుడైన విష్ణువే అని వైష్ణవుల బలమైన నమ్మకం.
నారాయణ సమారంభాం
నాథ యామున మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం
అంటూ తమ గురు పరంపరను స్మరిస్తారు శ్రీవైష్ణవులు. మూల ఆధారమైన విష్ణువు తరువాత నాథముని, యామునాచార్యుల వారినే తమ గురువులుగా ఎన్నుకోవడానికి కారణం ఏమిటి?
శ్రీ వైష్ణవ మతస్థాపన ఎలా జరిగింది? పన్నెండుగురు ఆళ్వారులు విష్ణువును కీర్తిస్తూ చేసిన నాలాయర దివ్య ప్రబంధం, గోదాదేవి రచించిన తిరుప్పావై వంటి గ్రంధాల విశిష్టత ఏమిటి? వీరందరి తర్వాత వచ్చిన శ్రీ రామానుజులవారు విశిష్టాద్వైతాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లారు?
శ్రీ వైష్ణవం గురించి, రామానుజులవారు విశిష్టాద్వైతం ద్వారా వైష్ణవంలో తెచ్చిన పెనుమార్పుల గురించి, గోదాదేవి తిరుప్పావై ద్వారా వ్యక్తపరిచిన ప్రేమ, అందులో ఉన్న భక్తి శక్తి గురించి ధనుర్మాసం సందర్భంగా ఈ నెల మొదటి శనివారం జరగబోయే ప్రసంగంలో ప్రముఖ సాహితీవేత్త, కొరా రచయిత శ్రీ చంద్ర మోహన్ గారు ప్రసంగిస్తారు.
భక్తి ఉన్నవారికి విశిష్టాద్వైతాన్ని అర్ధం చేసుకునేందుకు మంచి అవకాశం, లేనివారికి ఒక మతస్థాపన నుండి, వ్యాప్తి వరకూ జరిగిన చరిత్ర, అందు నుండి పుట్టిన సాహిత్య సృష్టి గురించి తెలుసుకునే అవకాశం ఈ ప్రసంగం.
ఆచార్యదేవోభవ 5వ భాగం విడుదల
ఆచార్య దేవోభవ శీర్షికన డా. ఆర్. అనంత పద్మనాభరావుగారు రాసిన వ్యాసాలను ఇప్పటివరకు నాలుగు భాగాలుగా మీరు విన్నారు. 1967 లో ఒక పోస్ట్ గ్రాడ్యువేషన్ సెంటర్ గా కేవలం 100 మంది విద్యార్థులకు 5 విభాగాలలో మాత్రమే విద్యను ఉపదేశించగలిగే విద్యాలయంగా మొదలై తర్వాతి కాలంలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వ విద్యాలయంగా ఎదిగిన శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నేడు కళలు, వైద్యం, ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ వంటి 5 ప్రత్యేక కళాశాల ప్రాంగణాలతో ఎలా అభివృద్ది చెందిందో ఆ అభివృద్ది వెనక ఉన్న ఆచార్యుల కృషి ఏమిటో ఈ ఆచార్యదేవో భవ 5 వ భాగంలో వినండి.
అభినందనలు,
రామ్ కొత్తపల్లి.