‘Theory of Relativity’, ‘Atomic Theory’, ‘Special Relativity’, ‘Gravitational Waves’, ‘E = mc2’ ఇలాంటి ఎన్నో భౌతికశాస్త్ర ఆవిష్కరణలు ఎప్పటికీ బయటకి రాకపోతే ఏమయ్యేది? అసలు వాటిని ప్రతిపాదించిన వ్యక్తినే చంపేసి ఉంటే ఏమయ్యేది? ఎవరు చంపుతారు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ని? ఎందుకు చంపుతారు? Hypothetical Questions ఎందుకు వేస్తున్నావ్ అని చరిత్ర తెలియని చాలామంది నన్ను అడగచ్చు. కానీ తెలిసినవారికి నేను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నానో, ఐన్ స్టీన్ మరణపు అంచుల దాకా వెళ్లారో లేదో తెలుసు.
ప్రపంచ చరిత్రలో ఎందరో రక్తపిపాసులైన వ్యక్తులలో గత శతాబ్దం చూసిన అత్యంత దారుణమైన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ అదే చేయబోయాడు. ఐన్ స్టీన్ ను పట్టిచ్చిన వారికి 5000 జర్మనీ మార్క్ ల పారితోషకం ఉండేది. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలను తగులబెట్టారు. అవన్నీ Anti-german పుస్తకాలుగా సామాన్య జనంలో ప్రచారం చేశారు. ఇదంతా ఎందుకో తెలుసా? ఆయన ఒక యూదు వ్యక్తి కావడం వలన.
అసలు ఇలాంటి వ్యక్తిని జర్మనీ ప్రజలు ఎలా తమ నాయకుణ్ణి చేశారు? వారికి ఆ మాత్రం తెలివి లేదా? ఒక నరహంతకునికి అంతటి శక్తివంతమైన కుర్చీ ఎలా ఇచ్చారు? దీనంతటికీ కారణం “Propaganda”. ఏ దేశంలోనైనా, ఒక Dictator పుట్టే విధానం చాలావరకూ ఒకేలా ఉంటుంది. ముందుగా ఆ దేశంలోని మెజరిటీ, మతస్థులనో, జాతివారినో ఎంచుకుంటారు. వారిపై తమ ప్రచారాస్త్రాలు సంధిస్తారు. మొదట తమ జాతి/మతం గొప్పదని, తమ రక్తం చాలా స్వచ్ఛమని, తాము అందరికన్నా అధికులమని, నాగరికులమని వారిలో False Prestigeను ప్రేరేపిస్తారు.
తరువాతి పని, తాము తరతరాలుగా అణిగిపోతున్నాము అని వారిని నమ్మించడం. కొన్నిసార్లు నిజంగానే ఆ పని జరుగుతుంటుంది. కొన్నిసార్లు చెదురుమదురు సంఘటనలను భూతద్దంలో పెద్దగా చూపిస్తారు. ఆ తరువాత తమందరికీ ఒక అతిపెద్ద శత్రువును సృష్టించడం. హిట్లర్ చేసిందదే, జర్మన్ ఆర్యన్ రక్తం అత్యంత స్వచ్ఛమైనదని, తాము అధికులమని అత్యధిక సంఖ్యాకులను రెచ్చగొట్టిన తరువాత, మొదటి ప్రపంచ యుద్ధం వలన జరిగిన ఆర్ధిక, సామాజిక నష్టాన్ని యూదుల తప్పిదంగా చూపించాడు. వారి వలనే ఇన్ని ఇబ్బందులు అన్నట్టు జర్మనీయులను నమ్మించాడు. వారందరూ తమ ధనాన్ని లాగేసుకుంటున్నారని నమ్మబలికాడు. జర్మనీ అంతటా ఒకే జాతి ఉండాలి అని, ఇతర జాతులు దేశానికి ప్రమాదకరమనీ జనాన్ని నమ్మించాడు.
ఆఖరి అస్త్రం, తానే ఆ లోకరక్షకుడు అని వారిని నమ్మించడం. తనను తాను దేవునిగా, కొన్నిసార్లు దేవునికన్నా అధికునిగా చిత్రించడం. అతని గుణగానాన్ని అన్ని దిక్కులా వ్యాపింపచేయడం. తాను కష్టపడి పైకి వచ్చినట్టు, కేవలం దేశసేవ తప్ప, తనకి ఆర్జన మీద కానీ, అధికారం మీద కానీ ఏ ఆశ లేనట్టు చెప్పుకోవడం. అన్ని రకాల మాధ్యమాల ద్వారా ఈ propaganda ని ప్రచారం చేయడం. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పనా? 1923లో హిట్లర్ పై ఒక జీవితచరిత్ర వెలువడింది. దానిలో హిట్లర్ ని జీసస్ తో పోల్చారు రచయిత. అతను అత్యంత కటిక పేదరికంలో నుంచి వచ్చాడు అన్నట్టు కూడా రాశారు. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, ఆ రచయిత వేరెవరో కాదు హిట్లరే. తనను పొగుడుకుంటూ తానే పుస్తకం రాసుకుని, వేరే వారి పేరు పెట్టాడట రచయితగా.
ఒకసారి రాజకీయంలో భావోద్వేగం, మతం, దేశభక్తి లాంటి సున్నితమైన అంశాలు చొరబడ్డాకా దానిని ప్రశ్నించే ధైర్యం సామాన్యుడు చేయడం చాలా కష్టం. అలాంటి రాజకీయాన్ని ప్రశ్నించడం అంటే తన దైవ భక్తిని, దేశభక్తిని కూడా ప్రశ్నించుకోవడంలా చిత్రిస్తారు ఈ propagandistలు. అక్కడే logic అంతమైపోతుంది. అదే జరిగింది. హిట్లర్ కు ఎందరో సామాన్య జర్మన్ ప్రజలు బ్రహ్మరధం పట్టారు.
జర్మనీ విశ్వవిజేత అవుతుందని కలలు కన్నారు. జర్మనీ ఒక తిరుగులేని రాజ్యంగా ఎదుగుతుందనుకున్నారు. అతను చెప్పిందల్లా చేశారు. నిన్నటి వరకూ తమతో కలిసి తిరిగిన యూదులను, తమకు సాయం చేసిన స్లావిక్ జాతివారిని తామే ప్రభుత్వానికి అప్పగించారు. ‘One nation, One race’ సిద్ధాంతాన్ని నరనరానా జీర్ణించుకున్నారు. తమ సాటివారిని, సాటి దేశాలనూ కాలరాస్తోంటే ఆనందంగా చూస్తుండిపోయారు. ఫలితం?
హిట్లర్ యుద్ధం ఓడిపోతున్నాడని తెలిసిన వెంటనే చక్కగా ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోయాడు. మరి జర్మనీ పరిస్థితి? దానిని తూర్పు, పడమర జర్మనీలుగా విడదీసి చాలాకాలం అమెరికా, సోవియట్ యూనియన్ లు పరిపాలించాయి. సోవియట్ యూనియన్ పరిపాలనలో ఉన్న తూర్పు జర్మనీ industrialisationకు దూరంగా కమ్యూనిజం ప్రభావం వల్ల ఎంతో పేదరికంలో మగ్గింది. ప్రపంచ దృష్టిలో యూదుల హంతకులుగా మిగిలారు జర్మనీయులు. ఎన్నో దేశాల్లో ఇప్పటికీ ఎంతో జాత్యాహంకారాన్ని అనుభవిస్తున్నారు. వారి సామాజిక, ఆర్ధిక, అంతర్జాతీయ జీవనంలో ఎన్నో కష్టనిష్ఠూరాలను అనుభవించారు. జర్మన్లందర్నీ నాజీలుగా ముద్రవేసి అంతర్జాతీయ సమాజం ఎంతో కించపరిచింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వేసిన జరిమానా 2010లో పూర్తి అయింది. ఇలా అన్నిరకాలుగా చితికిపోయారు వారు.
వారనే కాదు, Dictatorలు ఉండే ఏ దేశం పరిస్థితైనా ఇంచుమించు ఇంతే. పైకి వారు ఆర్ధికంగా, అంతర్జాతీయంగా ఎదుగుతున్నట్టు ఉన్నా ఒక సమాజంగా, వ్యక్తిగతంగా ఎన్నో నిర్బంధనలు, అస్వతంత్రతలో కూరుకుపోతారు. చైనా, ఉత్తర కొరియా ఇందుకు ఈ శతాబ్ధపు ప్రత్యక్ష నిదర్శనలు. ఈ దేశాల్లో మతం ఉండదు, ఆ డిక్టేటర్ లే దేవుళ్ళు. వాళ్ళకే మొక్కాలి, వాళ్ళనే పూజించాలి. వారి గురించి చిన్న తప్పు మాట అన్నా, జీవితాంతం జైల్లోనే. ఉత్తర కొరియా అయితే ఈ విషయంలో మరింత దారుణం. ఒక వ్యక్తి డిక్టేటర్ ను విమర్శించినా, వ్యతిరేకంగా అతి చిన్న పని చేసినా, అతని కుటుంబాన్ని మొత్తం తరతరాల వరకూ జైల్లోనే ఉంచుతారు. సగటు మనిషి కటిక పేదరికంలో మగ్గిపోతున్నాడు. అతనికి అంతర్జాతీయ దృష్టి శూన్యం.
వారి ఆర్ధిక, సామాజిక, వ్యక్తిగత, రాజకీయ, మేధోపరమైన విషయాలన్నిటిపైనా censorship రాజ్యం చేస్తుంది. ఆఖరికి వారు ఇంటర్నెట్ లో ఏం చూస్తున్నారు అనేది కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు screenshots ద్వారా చేర్చబడుతుందిట. వారు ఏ మాత్రం పశ్చిమదేశాల వైపు ఆకర్షితులవుతున్నారని ప్రభుత్వానికి అనుమానం వచ్చినా, వారు మాయం అయిపోతారు. అడిగే దిక్కు ఉండదు. వారు బతికే ఉన్నారా? జైల్లో ఉన్నారా? Re-education campsలో ఉన్నారా? లేదంటే వారికి భూమిపై నూకలు చెల్లిపోయాయా అన్నది వారి నియంతకే తెలుసు. ఇంకెవరికీ తెలీదు.
భారతదేశంలో ఈ మధ్య కొత్త trend నడుస్తోంది. Podcastలలోనూ, టీవీ డిబేట్ లలోనూ, ఇతర సామాజిక మాధ్యమాలలోనూ Dictatorship ను promote చేసేవారు పెరిగిపోయారు. ఇది యాదృచ్ఛికంగా అయితే కనిపించడం లేదు. చాలా పకడ్బందీగా తయారు చేస్తున్న వల. నియంతృత్వం వల్ల దేశం బాగుపడిపోతుందని, Super powerగా ఎదుగుతుందని, కోల్పోయిన ఘనత తిరిగి వస్తుందని, ఆర్ధికంగా బలంగా మారుతుందని, మన శత్రువలను చీల్చి చెండాడే అవకాశం లభిస్తుందని ప్రచారం ముదిరిపోయింది. ఇవన్నీ చూస్తోంటే గత చరిత్ర తెలియని, కొందరు స్వార్ధం కోసం, విలన్లను హీరోలుగా చిత్రించి తిరిగరాస్తున్న కొత్త చరిత్రని చదువుకుంటున్న ఈ తరం ఈ నియంతృత్వపు మత్తులో పడితే దేశం అధోగతి ప్రారంభం అవుతుందని చాలా భయంగా ఉంది.
అయితే నియంతృత్వం వలన నష్టపోయిన దేశాలే ఎక్కువ తప్ప, బాగుపడినవి అతి కొద్ది అని ఎవరూ చెప్పరు. నేడు దాదాపు 76దేశాలు ప్రత్యక్ష, పరోక్ష నియంతల ఏలుబడిలో ఉన్నాయి. అందులో బాగుపడిన దేశాలు ఎన్నంటే లెక్కపెట్టడానికి మన చేతి వేళ్ళు కూడా అవసరం లేనంత తక్కువ. రష్యాలో యుద్ధం వద్దు అనే ప్రజలే ఎక్కువ, కానీ వారి అభిప్రాయానికి విలువ లేదు. కారణం? పుతిన్ నియంతృత్వం. ఉత్తర కొరియాలో నుండి పారిపోవాలని లక్షలాది కొరియన్లు కోరుకుంటున్నారు. కానీ వారిలో సఫలీకృతులయ్యేది ఏ గుప్పెడో. వారెందుకు పారిపోవాలనుకుంటున్నారు? కారణం? కిమ్ నియంతృత్వం. ఇలా ఎన్ని దేశాలను చూసినా ఏమీ నేర్చుకోకపోతే ఎలా? కొందరి అధికార దాహానికి మన జీవితాలనూ, దేశాన్ని పణంగా పెడితే ఎలా?
నావరకూ నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను.
- రాజకీయాన్నీ, మతాన్ని దూరంగా ఉంచడం.
- రాజకీయంలో లాజిక్ కి తప్ప, భావోద్వేగానికి చోటివ్వకపోవడం.
- ప్రగతిని చూసి ఓటును వేయాలి కానీ, మరే ఇతర కారణానికి కాదు.
- ఏ వ్యక్తీ దేవుని కంటే గొప్ప కాదు. సామాన్య సగటు భారతీయుడి కంటే అసలు గొప్ప కాదు అని గుర్తుంచుకోవడం.
- నా దేశభక్తిని, దైవభక్తిని నా రాజకీయ ధృక్పధాలకు పునాదులుగా ఉంచకపోవడం.
- అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజాస్వామ్యం అత్యావశ్యకం అన్నది మర్చిపోకపోవడం.
మరొక హిట్లర్ బారిన పడకుండా ఉండేందుకు నా వంతుగా, నేను నిర్మించుకున్న నియమాలు ఇవి.
ప్రపంచ సాహిత్యంలో రెండవ ప్రపంచ యుద్ధం కీలకమైన కాలం. అప్పడు పుట్టిన సాహిత్యం, ఆ సమయం గురించి పుట్టిన సాహిత్యం కణకణమనే సత్యాల అగ్నిజ్వాల. చదివితే గుండె మండుతుంది. జ్ఞానాగ్ని రగులుతుంది. అలాంటి పుస్తకమే ‘ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్’. రెండేళ్ళు అజ్ఞాతంలో గడిపిన రెండు యూదు కుటుంబాల జీవనమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో అత్యంత క్రూరమైన సమయంలో ఒక బాలిక, యవ్వనవతిగా ఎదిగే క్రమాన్ని చూడవచ్చు. ప్రపంచ విఖ్యాతమైన ఈ పుస్తకం రాసింది నిజంగా ఓ పధ్నాలుగేళ్ళ బాలిక ఆన్ ఫ్రాంక్ అని తెలిస్తే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి. అంత చిన్న వయసులో ఆమె అనుభవించిన ఆ జీవితం మానవత్వానికి అంటిన రక్తపు మరక. ఈ పుస్తకం ఎంత జగద్విఖ్యాతమైందో సాహిత్య ప్రేమికులకు చెప్పనవసరం లేదేమో.

ఈ పుస్తకంపై విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు చేసిన ఈ విశ్లేషణ వింటేనే గుండె పట్టేసింది. ఇక అసలు పుస్తకం చదివితే ఏమైపోతానో. ఇలాంటి పుస్తకాలు చదివితే ఒక మనిషి అధికార దాహం ఎన్ని లక్షల జీవితాలను కాలరాయగలదో అర్ధం అవుతుంది. ఆ అధికారం వారి చేతికి ఇచ్చేది మనలాంటి సగటు వ్యక్తే. ఆ తరువాత నరకప్రాయమయ్యేది మనలాంటి సగటు వ్యక్తి జీవితమే.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.