జులై నెల ప్రసంగం ఈసారి జూన్ లోనే..

Meena Yogeshwar
June 25, 2024

తెలుగు చదవడం, రాయడం రాని తెలుగువారు సాహిత్యానికి దూరం కాకూడదు అనేదే దాసుభాషితం లక్ష్యాలలో మొదటిది. అందుకే శ్రవణ మాధ్యమంలో సాహిత్యాన్ని వారికి దగ్గర చేస్తున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, సమాజంలో తెలుగు స్పృహను పెంచడానికి ఒక వినూత్న కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. అదే...

“పదో తరగతి తరువాత మీరు తెలుగు వంక తిరిగి కూడా చూడరు. అంతవరకూ మార్కుల కోసం కొంచెం చదివితే చాలు. మిగిలిన సబ్జెక్ట్ ల మీద దృష్టి పెట్టండి. తెలుగుకి ఎక్కువ సమయం వృధా చేయకండి”. ఈ హితబోధ సాక్షాత్తూ ఒక తెలుగు ఉపాధ్యాయురాలు చేశారట మాకు అతి దగ్గర బంధువుల పిల్లల స్కూలులో. తరువాతి తరానికి కూడా తెలుగు అక్కర్లేని సబ్జెక్ట్ గా నూరిపోస్తున్నారు. 

మేము కూడా ఇలాంటి మాటలు వింటూ పెరిగినవాళ్ళమే. కానీ మిగిలిన ఉపాధ్యాయులు అనేవారు, తెలుగు టీచర్ మాత్రం బాధపడేవారు. మన భాషని మనం వదిలేసుకుంటే ఎలా అంటూ. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను బీటెక్ చదివే రోజుల్లోనే, మా క్లాసులో ముప్పావు మందికి ఒక పేరా గడగడా తెలుగు చదవడం వచ్చేది కాదు. మిగిలిన పావులో సగం మందికి తప్పులు లేకుండా ఒక వాక్యం రాయడం వచ్చేది కాదు. మార్కుల వేటలో మాతృభాష చాలా వెనుకబడిపోయి రెండు దశాబ్ధాలు కావస్తోంది.

తెలుగు చదవడం, రాయడం రాని తెలుగువారు సాహిత్యానికి దూరం కాకూడదు అనేదే దాసుభాషితం లక్ష్యాలలో మొదటిది. అందుకే శ్రవణ మాధ్యమంలో సాహిత్యాన్ని వారికి దగ్గర చేస్తున్నాం. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, సమాజంలో తెలుగు స్పృహను పెంచడానికి ఒక వినూత్న కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. అదే ‘తెలుగాట’. ముఖ్యంగా నేటి తరానికి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, చరిత్ర వంటి వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో విషయాలపై తెలుగులో విజ్ఞానాన్ని వినోదభరితంగా అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

తెలుగును రక్షించడానికి ఎన్నో సలహాలు, సూచనలు ఎంతోమంది పెద్దవారు ఇచ్చారు. అయితే, వాటిని ఆచరణలో పెట్టిన ఘటనలు చాలా తక్కువ. దాసుభాషితం సంస్థగా మాకైనా, సభ్యులుగా మీకైనా చెప్పడం కన్నా చేయడమే అలవాటు. దానికి అతిపెద్ద ఉదాహరణే ఈ సంస్థ, ఈ సమూహం. ఈ తెలుగాటను నిర్వహించడానికి మాకు మీ మేధోపరమైన సహాయం కావాలి. దానిపై చర్చించేందుకు, ఈ తెలుగాట గురించి పూర్తిస్థాయిలో మీకు అవగాహన కలిగించేందుకు దాసుకిరణ్ గారు ఈసారి ప్రసంగంలో మాట్లాడబోతున్నారు.

తెలుగు అభివృద్ధికి మీరు మాటలు చెప్పే రకం కాదు, చేతల్లో చేసి చూపిస్తారు అని దాసుభాషితంకు మీరు చూపించే ఆదరాభిమానాలను చూసి ఇప్పటికే మాకు తెలుసు. అయితే, ఆ మార్గంలో ఇది మరో మెట్టు. మాతో కలిసి మీరూ ఈ కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

సాధారణంగా ప్రతి నెల మొదటి శనివారం ఉండే ఈ ప్రసంగాలు కార్యక్రమం, ఈసారి కొన్ని అంతర్గత కారణాల వలన జూన్ ఆఖరి శనివారం, అంటే 29వ తేదీ ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తున్నాం. ఎప్పటి మాదిరిగా ఈ ప్రసంగాలు కార్యక్రమాన్ని యూట్యూబ్ లో ఉంచం కాబట్టీ, దాసుభాషితం కూటమిలో తెలుగు ఉజ్వల భవిష్యత్తు కోరుకునేవారందరూ తప్పకుండా ప్రసంగానికి హాజరు కావల్సిందిగా కోరుతున్నాం.

అర్చన - 2వ భాగం

వేణు అంతరంగ విన్నప్పుడు అతనివైపు, అర్చన ఆశయాలు తెలుసుకున్నప్పుడు ఆమెవైపు ఒరిగిపోతాం మనం ఈ నవల మొదటి భాగంలో. అయితే, రెండవ భాగంలో మాత్రం ఒక ఒంటరి ఆడపిల్ల ఎదుర్కొనే కష్టాలు వింటే ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఆడపిల్లల్ని మన సమాజం పెడుతోందో అర్ధం అవుతుంది. ఎన్నో కష్టాలకోర్చి, అవమానాలు భరించి, మనసుతో కూడా నిత్య ఘర్షణ చేస్తూ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది అర్చన.

కానీ ఆమె జీవితం సుఖాంతం అయిందా? ఇన్ని కష్టాలూ పడిన ఆమెకి సమాజం ఇచ్చిన బహుమతి ఏమిటి? అప్పటి వరకూ ఎన్నో సవాళ్ళకు తట్టుకుని నిలబడ్డ అర్చన చివరి వరకూ కూడా అలాగే నిలబడగలిగిందా? మగవాడి తోడు లేకపోతే ఆడదానికి ఈ సమాజం ఎలాంటి విలువ ఇస్తుంది? చిన్న పిల్లాడితో, పెద్ద వాళైపోయిన తల్లిదండ్రులతో సంసార సాగరాన్ని ఎదురీదుతున్న వేణు ఎలాంటి కష్టాలు పడ్డాడు? నిజంగా అతనిది ప్రేమా? స్వార్ధమా? దానికి అతనికి లభించినది ఏమిటి? చివరికి వీరిద్దరి దారులు కలుస్తాయా? శాశ్వతంగా దూరమైపోతాయా? వీటన్నిటికీ సమాధానం ఈ రెండవ భాగంలో ఉంది.

Tap to Listen

క్రితం న్యూస్ లెటర్ శీర్షికలో నాకు ఉన్న ప్రశ్న ‘వాళ్ళ జీవితం ఇక అంతేనా?’ అన్న దానికి ఈ భాగంలో నావరకూ సమాధానం లభించింది. ‘అవును వాళ్ళ జీవితం ఇక అంతే’. నాకు ఇలా ఎందుకు అనిపించిందో ఈ భాగం విని మీరే తెలుసుకోండి. విన్నాకా, మీకూ ఇలాగే అనిపించిందా? లేకపోతే ఆ ముగింపు సబబుగానే అనిపించిందా అనేది నాకు చెప్పడం మర్చిపోకండి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :