ఖతి అనగానేమి???

Meena Yogeshwar
October 3, 2024

Standardization, Unification మోజులో పడి ఎన్నో భాషలకు ఇలాంటి అన్యాయం జరుగుతోంది. ఎన్నో భాషలు, యాసలు వాటి సంప్రదాయ లిపులను కోల్పోయి అనాధలైపోతున్నాయి మన దేశంలో. సరే, ఇప్పుడు ఆ అనాధల గురించి మనకెందుకు? మన తెలుగుకి రాత, మాట రెండూ ఉన్నాయిగా అంటారా. నిజమే ఉన్నాయి. ఇలాగే ఎప్పటికీ ఉంటాయి అన్న నమ్మకం ఉందా? రాత, కాగితాన్ని దాటి డిజిటల్ అయ్యింది. లిపిలాగానే అత్యంత ముఖ్యమైనది కంప్యూటర్ లో...

హిమాచల్ ప్రదేశ్ లో జనాలు ఏ భాష మాట్లాడతారు? మీకు తెలుసా? చాలామందికి తెలుసు ఏమో. కానీ ఎక్కువ శాతం ప్రజలు అక్కడ మాట్లాడే భాష హిందీ అనుకుంటారు. కానీ అక్కడి ప్రజలు మాట్లాడే భాష పేరు ‘పహాడీ’. అయితే హిందీ అనుకోవడానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా? పహాడీకి సంప్రదాయంగా వస్తున్న లిపి ‘టాక్రీ’ చనిపోవడం వలన. వారి పహాడీ భాషని దేవనాగరి లిపిలో రాసుకుంటున్నారు వారు. ఆ రాష్ట్రం వెళ్తే, అన్ని బోర్డ్ లూ దేవనాగరి లిపిలో ఉండడం వలన ఇతర రాష్ట్రాల ప్రజలు హిమాచల్ ప్రదేశ్ ప్రజల మాతృభాష హింది అని పొరబడతారు.

పహాడీ సంప్రదాయ లిపి టాక్రీ చదవగల, రాయగల ఆఖరి వ్యక్తి ‘ఖూబ్ రామ్ ఖుష్ దిల్’. ఆయన 2020లో చనిపోయారు. ఇప్పుడు అధికారికంగా ఇక ఆ లిపి చదవగల, రాయగల వ్యక్తి లేరు. ఖూబ్ రామ్ తోనే టాక్రీ లిపి అధికారికంగా చనిపోయింది. అంతెందుకు, మరాఠీ భాషని స్వాతంత్ర్యం ముందు వరకూ ‘మోడి’ అనే లిపిలో రాసేవారు. మోడి అనే పదానికి వంచగలిగిన, విరచగలిగిన అని అర్ధం. అంటే ఆ లిపి ఇప్పటి ప్రముఖ దేవనాగరి లిపిలా గీతల్లా కాకుండా ఇంకా విలక్షణంగా ఉండేదన్నమాట. ప్రస్తుతం ఈ మోడి లిపి మరాఠీలెవ్వరికీ రాదు. వారు దేవనాగరి లిపిలోనే వాళ్ళ భాషను రాసుకుంటారు. 

Standardization, Unification మోజులో పడి ఎన్నో భాషలకు ఇలాంటి అన్యాయం జరుగుతోంది. ఎన్నో భాషలు, యాసలు వాటి సంప్రదాయ లిపులను కోల్పోయి అనాధలైపోతున్నాయి మన దేశంలో. సరే, ఇప్పుడు ఆ అనాధల గురించి మనకెందుకు? మన తెలుగుకి రాత, మాట రెండూ ఉన్నాయిగా అంటారా. నిజమే ఉన్నాయి. ఇలాగే ఎప్పటికీ ఉంటాయి అన్న నమ్మకం ఉందా? రాత, కాగితాన్ని దాటి డిజిటల్ అయ్యింది. లిపిలాగానే అత్యంత ముఖ్యమైనది కంప్యూటర్ లో ఆ భాషకు చెందిన ఖతి.

ఈ ఇంటర్నెట్ యుగంలో తెలుగు బతికి బట్టకట్టాలన్నా, భాష తరువాతి తరాలకు అందాలన్నా ఖతులు చాలా ముఖ్యం. అయితే, మిగిలిన భాషలకు ఖతులు తయారు చేయడానికి, తెలుగు లాంటి క్లిష్టమైన భాష, లిపి కలిగిన దానికి ఖతులు తయారు చేయడానికి చాలా తేడా ఉంది. మన లిపి ఎంత అందంగా ఉంటుందో, అంత కష్టమైనది కూడా. 56 అక్షరాల విశాలమైన తెలుగుకు ఒక ఖతి అందించాలంటే ఎంత శ్రమ, పట్టుదల, ఓపిక, దీక్ష కావాలో తెలుసా? నాకూ తెలియదు. శుభ్రంగా నెట్ తెరిచి, టక టకా మీటలు నొక్కుతూ తెలుగులో రాసేయడమే వచ్చు కానీ, ఈ అక్షరాలను అక్కడ భద్రపరచిన ఆ మహానుభావుల గురించి ఏమీ తెలియదు.

డిజైన్ తయారు చేయడం దగ్గర నుంచి సంపూర్ణంగా రూపొందించేంత వరకూ ఒక చేనేత చీర ఎంత శ్రమ పెడుతుందో, ఒక ఖతి కూడా అంతే పెడుతుంది అని మొన్న మన రామ్ నాకు వివరించేంతవరకూ తెలియదు. అందులోనూ తెలుగు లాంటి భాష అయితే మరీను. మరి ఈ ఖతులు ఎందుకు? ఎలా తయారు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎన్ని చేశారు? ఎన్ని చేస్తే సరిపోతుంది? అసలు ఇన్ని ఎందుకు? నిజంగా ఒక లిపికి ఉండే అంత ప్రాముఖ్యత ఒక ఖతికి ఉందా? ఇలాంటి విషయాలన్నీ మనం ఈసారి ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం.

ఎమెస్కో బుక్స్ లో డిజైనర్ గా పని చేస్తున్న పురుషోత్తమ్ కుమార్ గారు ప్రముఖ తెలుగు ఖతుల డిజైనర్. వారు ఇప్పటికి 120కిపైగా ఖతులు నిర్మించారు. అందులో 20కి పైగా ఖతులు ఉచితంగా తెలుగు వాడుకరులందరికీ అందుబాటులో ఉంచారు. మనం వాడుకుంటున్న ఎన్నో ఖతుల సృష్టికర్త వీరు. పైన మనకున్న ప్రశ్నలన్నిటికీ అక్టోబరు 5 శనివారం ఉదయం 9.30గంటలకు వారు సమాధానాలు ఇవ్వనున్నారు. ఖతులను బాగా ఉపయోగించుకునే, వాటి నిర్మాణంపై విపరీతమైన ఆసక్తి ఉన్న మన డిజైనర్ రామ్ కొత్తపల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంగా ఈ ప్రసంగం జరగనుంది. మన అమ్మ నాలుక(అదేనండీ మాతృభాష) వాడే అమ్మ చేయి(లిపి/ఖతి) గురించి తెలుసుకోవడానికి శనివారం నాడు వచ్చేయండి మరి.

సుస్వరాలలక్ష్మి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి - నవల

Tap to Listen

కర్ణాటక సంగీతం అనగానే మనందరికీ కొన్ని పేర్లు టకటకా గుర్తుకువస్తాయి. వాటిలో మొదటి స్థానాల్లో గుర్తుకువచ్చే పేరు ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి’. ఎమ్మెస్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగా మనకు పరిచయం అయిన వీరి అసలు పేరు మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. మధురై ఆమె ఊరి పేరు, షణ్ముగ వడివు ఆమె తల్లి పేరు. దేవదాసి కుటుంబంలో జన్మించిన వారికి వారి ఊరి పేరు, తల్లి పేరు వారి పేరు ముందుగా రావడం ఆచారం. అలా తన పేరుతో కన్నా ఎమ్మెస్ అంటూ తన ఊరు, తల్లి పేర్లతో ఎక్కువ పిలవబడ్డారు ఆమె.

అది సబబు కూడా. సుబ్బులక్ష్మి గారి జీవితంలో పుట్టిన ఊరుగా మధురై, ఆమె తల్లి అందించినవి అతి విలువైన సంపదలు. అవే సంగీతం, సాధన, భక్తి, అణకువ, ప్రశాంతత. ఇప్పటికీ ఎమ్మెస్ ను గుర్తు చేసుకుంటే మనకు ఇవే కదా గుర్తుకువచ్చేవి. సుబ్బులక్ష్మి సంగీతానికి అతి కీలకమైన సంవత్సరాల్లో ఆ ఊర్లో ఉండడం, ఆమె తల్లి దగ్గర పెరగడం అనేవి ఆమె మూలాలను పటిష్టపరిచాయి. అయితే, ఆమెను గుర్తించి, నలుగురికీ పరిచయం చేసినవి మాత్రం ఇంకో ద్వయం. అవి కూడా ఒక ఊరు, ఒక బంధం.

చిన్నప్పటి సుబ్బులక్ష్మికి సంగీతంలో వేళ్ళూనేలా చేసినది మధురై, ఆమె తల్లి షణ్ముగ వడివు అయితే, ఎదగడానికి వీలు - శాఖోపశాఖలుగా పెంచి మలచినది మద్రాసు, ఆమె భర్త సదాశివం. రెండు ఊళ్ళు, ఇద్దరు దగ్గరి వ్యక్తుల వలన మనకు తెలిసిన ఎమ్మెస్ ఇలా ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఇందులో ఏది ముఖ్యమైన పాత్ర? ఎవరిది ప్రముఖమైన contribution అంటే, ఏమో. నా వరకూ ఒకరు లేకుండా మరొకరు ఎమ్మెస్ కీర్తిని ఈ స్థాయికి తేలేరు అనిపిస్తుంది. అసలు ఎమ్మెస్ ఏ లేకపోతే, వీళ్ళెవర్ని ఈ స్థాయికి తెస్తారు అని కూడా అనిపిస్తుంది.

ఇవన్నీ నా అనుకోళ్ళు, నా ఆలోచనలు. మీకు కూడా ఎమ్మెస్ జీవిత చరిత్ర చాలావరకూ తెలిసే ఉంటుంది. ఆమె జీవితంలోని ఘట్టాలను నవలగా మలిచారు రచయిత్రి పల్లవి. తేదీలవారీగా ఆమె జీవితంలో జరిగిన వాటిని ఈ నవలలో పొందుపరచారు పల్లవి గారు. ఈ వారం ఈ నవల మొదటి భాగం విడుదల అవుతోంది. ఈ నవల చదివితే ఎమ్మెస్ జీవిత అంశాలపై పూర్తిస్థాయి అవగాహన రావడం ఖాయం. ఈ నవల విని, నేను కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకున్నాను. అవన్నీ వచ్చేవారం చెబుతాను. ఈలోపు మీరూ ఈ నవల విని, మీ అభిప్రాయాన్ని నాకు చేరవేయండి. వచ్చే వారం మన అభిప్రాయాలు కలిసాయో లేదో బేరీజు వేసుకుందాం. సరేనా?

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :