‘కళాకారుల కోసం పదేళ్ళు తిరిగాను’

Meena Yogeshwar
October 17, 2024

ఒక ఖతిని ప్యాకేజీలుగా నిర్మించడానికి 2 నుంచి 3లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందిట. ఎన్ని ఎక్కువ సంస్థలు 10 వేల రూపాయలు ఖర్చు పెట్టి font ప్యాకేజీని కొంటే, ఆ కష్టానికి అంత ప్రతిఫలం దక్కుతుంది. కానీ ఎంతమంది కొంటారు ఈ ప్యాకేజీలు? ఈ ఫాంట్ ను pirate చేసి, ఆ మిగిలే డబ్బులు కూడా లేకుండా చేస్తున్నారు. కమర్షియల్ గా ఫాంట్లను వాడుకుని, ఆదాయం సంపాదించేవారు...

‘నేతన్న తెలిస్తే కట్టు వస్తుంది.. రైతన్న తెలిస్తే కూడు తెలుస్తుంది’ అనేవారు మా బామ్మగారు. చిన్నప్పుడు సొంతంగా తినడం రానప్పుడు కంచం చుట్టూరా మెతుకులు ఒంపేస్తే ఎంతో బాధపడేది ఆవిడ. దుక్కి దున్నడం దగ్గర్నుంచి, పంట కళ్ళెంలోకి వచ్చేంతవరకూ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో తెలిస్తే అన్నం మెతుకు విలువ తెలుస్తుంది. ఒకే ఒక్క గింజ కోసం రైతు ఎంత అల్లాల్లాడతాడో అర్ధం అవుతుంది అనేది. 

మొన్నీ మధ్య ఒక యూట్యూబ్ ఛానెల్ చూశాను. నేత కార్మికునిది ఆ ఛానెల్. పట్టుదారం వారి దగ్గరకి రావడం దగ్గర నుంచి, రంగు వేయడం, ఎండబెట్టడం, ఒక డిజైన్ తయారు చేయడం, దాని ప్రకారం మగ్గం పైకి ఈ దారాన్ని ఎక్కించడం, ఒక్కో పావు మీటరు చీర నేయడం, ఆఖరికి పట్టుచీర మడతపెట్టడం వరకూ అన్నీ చూపించారు అతను. ఒక్కసారి కళ్ళుతిరిగాయి నాకు. డబ్బులు ఇచ్చి, నచ్చిన చీర కొనుక్కుని, ఇష్టం వచ్చినట్టు వాడే నాకు ఈ కష్టం తెలీదు కదా అనిపించింది. అప్పుడు పూర్తిగా అర్ధం అయింది మా బామ్మ చెప్పిన పై సామెత.

అక్టోబరు నెల ప్రసంగం విన్న తరువాత ఈ జాబితాలోకి ఖతులను (Font) తయారు చేసేవాళ్ళని కూడా కలపవచ్చు ఏమో అనిపించింది. ఒక ఖతి డిజైన్ తయారు చేసిన దగ్గర నుంచి, దానిని ప్రజల వాడుకకు అందించేంత వరకూ ఎంతటి శ్రమ, దీక్ష, కష్టం, ప్రేమ దాగి ఉన్నాయి అనిపించింది. తెల్లవారి లేస్తే, మనలో 95శాతం మంది కంప్యూటర్ లో తెలుగు రాస్తున్నవాళ్ళమే, కానీ ఆ అక్షరాలను అక్కడ పేర్చిన మహానుభావుల గురించి మనలో ఎంత మందికి తెలుసు? పైగా ఆ కళని అన్యాయంగా, దొంగతనంగా వాడుకునేవారు ఎంతటి శ్రమదోపిడి చేస్తున్నారు?

ప్రసంగకర్త శ్రీ కె.పురుషోత్ కుమార్ గారు అక్షరాలను డిజైన్ చేసే ఆర్టిస్టుల కోసం ఓ పదేళ్ళ పాటు రెండు తెలుగు రాష్ట్రాలు తెగ తిరిగారట. వారిని బతిమాలి, బామాలి అక్షరాలు డిజైన్ చేయించుకున్నారట. 56 అక్షరాలు తెలుగు భాషకు ఒక ఖతిని తయారు చేయడానికి 800 నుంచి 1400 లేయర్ల లిప్తాక్షరాలు అవసరం అవుతాయిట. కుమార్ గారికి ఒక్కో ఫాంట్ తయారు చేయడానికి దాదాపు 2 నుంచి 3 నెలలవరకూ సమయం పడుతుందిట. కొన్నిటికి అయితే ఆయన సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చించారట.

ఒక ఖతిని ప్యాకేజీలుగా నిర్మించడానికి 2 నుంచి 3లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందిట. ఎన్ని ఎక్కువ సంస్థలు 10 వేల రూపాయలు ఖర్చు పెట్టి font ప్యాకేజీని కొంటే, ఆ కష్టానికి అంత ప్రతిఫలం దక్కుతుంది. కానీ ఎంతమంది కొంటారు ఈ ప్యాకేజీలు? ఈ ఫాంట్ ను pirate చేసి, ఆ మిగిలే డబ్బులు కూడా లేకుండా చేస్తున్నారు. కమర్షియల్ గా ఫాంట్లను వాడుకుని, ఆదాయం సంపాదించేవారు తప్పకుండా ఒరిజినల్ ప్యాకేజీలను కొనుక్కోవాలని ఈ ప్రసంగం ద్వారా ఆయన అభ్యర్ధించారు.

అయితే, చిన్న చిన్న D.T.P center లలో వర్కర్లను ఇలా కొనుక్కోవాలని ఆయన ఆశించకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘వారు రోజంతా టైప్ చేసుకుంటే, వారికి మిగిలేది 500 రూపాయలు కూడా ఉండదు. అందులో వారు ఇల్లే గడుపుతారా? ఫాంట్లే కొనుక్కుంటారా? అందుకే వాళ్ళు pirated versions ని వాడడాన్ని నేను తప్పు పట్టను’ అన్నారు ఆయన. అదే వృత్తి నుంచి వచ్చిన పురుషోత్ కుమార్ గారు వారి కష్టాన్ని, కొనుక్కోలేని నిస్సహాయతని ఇప్పుడు ఉన్న ఈ స్థాయిలో గుర్తు ఉంచుకోవడం చాలా ఆదర్శనీయం అనిపించింది. మూలాలను మర్చిపోలేదు కాబట్టే వారు తెలుగునీ మర్చిపోలేదు అనిపించింది.

ఏనాడూ ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వని పురుషోత్ కుమార్ గారు ప్రప్రధమంగా దాసుభాషితం శ్రోతల కోసం ఖతులు తయారు చేసే process దగ్గర్నుంచి, తను మొదట టైపింగ్ నేర్చుకోవడం, భారత మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారికి తెలుగు DTP విధానం నేర్పించడం వంటి ఎన్నో విషయాలు పంచుకున్నారు. పి.విగారి తో పురుషోత్ కుమార్ గారికి చాలా అపురూపమైన అనుబంధం ఉంది. అదంతా వారు ప్రసంగంలో పంచుకున్నారు. కావాలనే నేను ఇక్కడ ప్రస్తావన మాత్రం చేసి, దానిని వివరించడం లేదు. నా రాతలో కన్నా వారి మాటలో వినడమే బాగుంటుంది.

దాసుభాషితం ప్రసంగాలు అనే సిరీస్ కు ఈ ప్రసంగం ఒక గొప్ప విజయం అని నేను అనుకుంటాను. ఎక్కడా మాట్లాడని ఒక తెలుగు ఖతుల నిర్మాత మన దాసుభాషితంలో మాట్లాడడం అంతా మన డిజైనర్ రామ్ చలవే. ఆలోచన దగ్గర్నుంచి, ప్రసంగ నిర్వాహణ వరకూ అతనిదే ఈ ప్రసంగం.

కాబట్టీ, అచ్చమైన తెలుగు భాషా ప్రేమికుణ్ణి, దాని కోసం విలువైన సమయాన్ని, ఓపికని, ఆరోగ్యాన్ని, డబ్బుని ఖర్చు చేస్తున్న ఈ ఖతుల నిర్మాతని పరిచయం చేసుకోవాలంటే ఈ కింది లింకును నొక్కండి. ఒక్కో చోట మనసు దుఃఖపడుతుంది వారి శ్రమకి. ఒకోసారి తెలుగు పది కాలాలపాటు చల్లగా ఉంటుంది అనే భరోసా కలుగుతుంది. ఒకోసారి ప్రపంచ భాషల స్థాయికి తెలుగు ఎదుగుతుంది అని ఆశ కలుగుతుంది. నా తెలుగుని నా స్థాయిలో నేను రక్షించుకోవాలి అనే సంకల్పం వస్తుంది ఒకోసారి. వెరసి తెలుగు పండుగ ఉగాది లాగా, ఈ ప్రసంగం కూడా ఎన్నో అనుభవాల సమ్మేళనం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :