సృష్టిలోనే అందమైనది, అపురూపమైనది - తల్లి ప్రేమ. వెయ్యి తలలున్న ఆదిశేషుడికి కూడా అమ్మ ప్రేమని వర్ణించడం కష్టమట. అలాంటి తల్లి ప్రేమ గురించి ఎవ్వరూ ఎంత చెప్పినా తక్కువే.
ఎన్నెన్నో కొత్త కొత్త ఊహాలతో ఇద్దరు ఒక జోడీ కడతారు. అంటే నా ఉద్దేశ్యంలో పెళ్లి చేసుకుంటారు. ఇక అక్కడ నుండి మొదలవుతుంది వాళ్ళకి (ముఖ్యంగా ఆడపిల్లకి) టార్చర్ - ఏమ్మా.. ఇక పిల్లలని కనాలనుకోడంలేదా? ఇంకెప్పటికి కంటారు? నీతోటి వాళ్ళంతా అప్పుడే రెండోసారి కనేస్తున్నారు. ఎంత చదువుకున్న వారైనా అందరి అత్తల నుంచి వచ్చే సామాన్య మాటలు ఇవి. భర్తకి అత్తగారి మాటలు చెప్పలేక, తనలో తాను కుమిలిపోయే ఆడపిల్లలు ఈ మోడరన్ కాలంలో కూడా ఉన్నారు.
ఆడపిల్లల్లో సహజంగా ఉండే కోరిక తల్లి అవ్వాలని. ఈ కాలంలో మన జీవనవిధానం వల్ల అనేక మార్పులు వచ్చాయి. సమాజము నుంచీ వచ్చే మాటలు పడలేక, తమకు సహజంగానే ఉన్న ఆశని తీర్చుకోడం కోసం hospitals చుట్టూ తిరుగుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లి అవ్వబోయే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనికూడా ఆలోచించలేని ఈ వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ఒకానొక నవల ఈ “స్వయం దత్తుడు”. ఇది పాలంకి సత్య గారికి ఎన్నో ప్రశంసలు, అవార్డ్లు తెచ్చిపెట్టింది.
ఈ నవలలో అనురాధ తాను కనకపోయినా దత్తత తీసుకున్న వంశీకృష్ణ ని అన్ని రకాలుగా అంటే చదువులో, సామాజిక కార్యక్రమాలలో, ఆటలలో ఆల్ రౌండర్ గా పెంచుతుంది. కానీ వంశీకి తాను ఎవరో తెలియాలని అన్ని విషయాలు చెబుతూ ఉంటుంది. తాను అనురాధ వాళ్ళకి పుట్టిన వాడు కాదని తన కన్నతల్లిని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు వంశీ. వంశీపై బెంగ పెట్టుకుని అనురాధ మంచాన పడుతుంది. తన కన్నతల్లిని కలుసుకున్న వంశీని ఆమె ఎలా ఆదరించింది? తరవాత అనురాధ పరిస్థితి ఏమిటో తెలుసుకుంటూనే ఇందులో 2 విషయాలు గమనించవచ్చు.
కన్నతల్లి అయినా, పెంచిన తల్లి అయినా తల్లిప్రేమ ఏ స్థాయిలో ఉంటుంది. యుక్త వయసులోకి వచ్చిన పిల్లల ప్రవర్తన, కుటుంబ వ్యవస్థ, ప్రతీ తల్లీతండ్రి పిల్లల పెంపకం విషయంలో ఎలా ఉండాలి, ఆలూమగల మధ్య అవగాహన ఎలా ఉండాలి, తనను తాను కోల్పోతున్నా ఇంటి ఇల్లాలు పిల్లల కోసం పడే తపన ఇలాంటి ఎన్నో విషయాలు తన రచనలో చూపిస్తూ సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలను కళ్ళకుకట్టినట్టు వ్రాసారు సత్యగారు.
సాహిత్యం చదవడం అంటే (ముఖ్యంగా నవలలు) టైమ్ పాస్ అని అనుకుంటారు చాలామంది. కానీ తన చుట్టూ ఉన్న సమాజాన్ని అనేక పాత్రలతో ముడిపెట్టి ఒక రచయిత తన హృదిలో మెదిలే అనేకభావాలను మనకందించి మనకు ఒక దిశా నిర్దేశం కూడా చేయగలడు.
పాలంకి సత్యగారి రచనలలో నేను ముఖ్యంగా గమనించినంది ఒక స్త్రీ లో ఉండే సహన గుణం, తల్లి ప్రేమని ఆవిడ అద్భుతంగా చూపించారు. పునర్జన్మ, స్వయందత్తుడుతో పాటు ఇక ముందు రాబోయే మారీచమార్గం నవలల్లో కూడా ఇది గమనించవచ్చు.
ఈ వారం స్వయం దత్తుడు నవల విడుదల అవుతోంది. మీరు ఈ నవల వినప్పుడు ఇలాంటి భావాలు కలుగుతాయనే ఆశిస్తూ...
అభినందనలు,
ప్రభ పొనుగుపాటి.