ఓ మంచి పాట విన్నప్పుడు, ఆ పాట ఉన్న చిత్రం ఇంకా విడుదల కాకపొతే, ఆ పాటని ఎలా చిత్రకరించారో అనే కుతూహలం ఉంటుంది. చాలా సార్లు చిత్రీకరణ నిరాశ పరుస్తుంది.
శ్రోతలకే అలా ఉంటే, సందర్భం, సాహిత్యం, బాణీ కుదిరినప్పుడు, కష్టపడి మంచి పాటను చేస్తే, అది పేలవంగా చిత్రీకరించబడితే, ఆ సంగీత దర్శకుడు ఇంకా ఎంత బాధపడతాడు? కీరవాణిని అలా బాధపెట్టిన పాట, దర్శకుడు ఎవరు? అదే విధంగా, ఒక మంచి పాటని బ్రహ్మాండంగా చిత్రీకరించిన దర్శకుడు ఎవరు?
ఒక గొప్ప సంగీత దర్శకుడు ఇప్పుడు చేస్తున్న బాణీలు బావుండక పోవడానికి కారణం ఏమై ఉంటుందని కీరవాణి అభిప్రాయం? 21వ మేళకర్త రాగమే తన పేరుగా ఉన్న కీరవాణికి ఇష్టమైన రాగం ఏమిటి? పాశ్చ్యాత్త సంగీతంలో ఏ రాగం ప్రభావం ఎక్కువగా ఉంటుంది? తను చాలా అభిమానించే గాయకుడు ఎవరు? ఎందుకు?
ఏ భాషలో పాటలైనా ఒకేలా ఉంటున్న ఈ రోజుల్లో, తను చేసే బాణీల్లో సందర్భం బట్టి వేరే సంస్కృతికి చెందిన సంగీతం వాడిన, తెలుగు తనం చెడకుండా చేసే అచ్చ తెలుగు సంగీత దర్శకుడు మన మరతకమణి కీరవాణి జన్మదినం జులై 4న. ఆ సందర్భంగా రికార్డు చేసిన ముఖాముఖీని ఈ వారం వినండి.
ఈ ముఖాముఖీ విన్న తరువాత, కీరవాణి బాణీలు ఎంత మధురంగా ఉంటాయో, ఆయన వాణి అంత తీక్షణంగా ఉంటుందనిపిస్తుంది. తను చేసిన సంగీతం లో 70 శాతం చెత్త అని చెప్పుకునే కీరవాణి లో ఉన్న నిజాయితీ వల్ల, ఆయన తీక్షణత ఎవరినీ బాధించదు.
కోదండ రామిరెడ్డి తో ముఖాముఖీ
జులై మొదటి వారం లోనే (జులై 1) చిత్ర రంగానికి చెందిన ఇంకొక ప్రఖ్యాత వ్యక్తి జన్మదినం కూడా.
ఎన్నో ఘన చిత్ర విజయాలను సాధించి, చిరంజీవి mega stardom కి కారకులైన దర్శకులలో మొదటి వారు శ్రీ కోదండరామి రెడ్డి. కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రాల డ్రీం టీం చిరంజీవి, కోదండరామిరెడ్డి, K S రామారావు, యండమూరి, సత్యానంద్. మీకు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, దొంగమొగుడు, చిత్రాలు నచ్చితే, మీరు ఈ ముఖాముఖీని ఇష్టపడతారు. ఎందుకంటే దీనిని నిర్వహించినవారు ఆ చిత్రాల కథా రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్.
పెంకుటిల్లు
1935 లో జన్మించిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు సుప్రసిద్ధ తెలుగు రచయిత. బెంగాలు రచయిత శరత్ చంద్ర ప్రభావంతో తెలుగులో సుమారు 50 పైగా నవలలు వ్రాయటం వలన ఈయన "ఆంధ్రా శరత్"గా పిలువ బడ్డారు.
‘పెంకుటిల్లు' నవల ఈయన పేరును చిరస్ధాయి చేసింది.
ఇంటి పెద్ద, తన బాధ్యతను విస్మరిస్తే, ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకు కడుతుంది ఈ నవల. అన్నింటికీ మించి, కాలంతో పాటు మారుతూ వచ్చిన మధ్యతరగతి విలువల పరిణామ క్రమానికి అక్షర రూపంగా పాఠక లోకంలో 'పెంకుటిల్లు’ స్థానం ఎన్నటికీ పదిలమే. ఓ నవల చదువుతున్నట్టుగా కాక ఒక డాక్యుమెంటరీ చూస్తున్నట్టుగా అనిపించే ఈ నవలను డా. కొమ్మూరి వేణుగోపాలరావు గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రప్రధమంగా శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం.
కాశీ మజిలీ కథలు 7వ సంపుటం
100వ మజిలీతో ప్రారంభమయ్యే ఈ 7వ భాగం జితవతి కథతో మొదలై 141 మజిలీలో సూర్యవర్మ కథతో ముగుస్తుంది. ఈ మధ్యలో వచ్చే కథలలో నారదుడు, మాయా వశిష్ఠుడు, అశోకవనము, విభీషణుడు, కలభాషిణి, భుజగాసురుల యుద్ధము మొదలైన కథలు శ్రోతలను ఉత్కంఠతో ఉర్రూతలూగిస్తాయి.