కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

Meena Yogeshwar
August 1, 2024

విశ్వనాథ సత్యనారాయణ. అత్యధిక తెలుగు పాఠకుల చేత తప్పుగా అర్ధం చేసుకోబడిన గొప్ప రచయిత. ఆయన రాసే సిద్ధాంతాలపైనే ఎక్కువ మంది దృష్టి పెడతారు. దానిని ఆధారం చేసుకునే ఆయనను అమితంగా ఇష్టపడడమో, పూర్తిగా వ్యతిరేకించడమో చేస్తారు. నిజానికి విశ్వనాథలో మృదువైన సున్నితత్వం, గొప్ప కల్పనా శక్తి ఉన్నాయి. రచయితగా తన పాత్రను కూలంకషంగా అర్ధం చేసుకుని, దాని వైపు నుండి ఆలోచించి, ఇష్టపడి కూడా, ఆ పాత్ర చేసే పనుల బట్టీ దానికి...

విశ్వనాథ సత్యనారాయణ. అత్యధిక తెలుగు పాఠకుల చేత తప్పుగా అర్ధం చేసుకోబడిన గొప్ప రచయిత. ఆయన రాసే సిద్ధాంతాలపైనే ఎక్కువ మంది దృష్టి పెడతారు. దానిని ఆధారం చేసుకునే ఆయనను అమితంగా ఇష్టపడడమో, పూర్తిగా వ్యతిరేకించడమో చేస్తారు. నిజానికి విశ్వనాథలో మృదువైన సున్నితత్వం, గొప్ప కల్పనా శక్తి ఉన్నాయి. రచయితగా తన పాత్రను కూలంకషంగా అర్ధం చేసుకుని, దాని వైపు నుండి ఆలోచించి, ఇష్టపడి కూడా, ఆ పాత్ర చేసే పనుల బట్టీ దానికి వచ్చే కర్మను అంగీకరించగల గుండె దిటువు ఉంది ఆయనకు. ఒక సన్నివేశాన్ని కల్పించడంలోనూ అంతే ఊహాశక్తి ఉంది.

నేను ఆయన రచన చదివేటప్పుడు కలిగిన ఒక అనుభవం చెప్తాను. నా చదువు పూర్తి అయిపోయిన కొత్తల్లో, ఇంక పాఠ్యపుస్తకాలు ముట్టుకోనవసరం లేదు అని ధీమా వచ్చిన రోజులవి. అప్పటిదాకా సైడ్ బిజినెస్ లాగా కొనసాగుతూ వచ్చిన నా సాహిత్య పఠనం దివారాత్రాలకు ఎగబాకింది. ఒకరోజు మధ్యాహ్నం ఎండ ఫెళఫెళలాడుతుండగా విశ్వనాథ వారి ‘భగవంతుని మీది పగ’ నవల చదువుతున్నాను. అందులో రాజకుమారుడు చంద్రభాగ అనే నది వెంట ప్రయాణం చేసి, దుష్టుడైన స్నేహితుని ప్రోద్భలంతో అది లోయలో జలపాతంగా పడే చోట నుండి కిందకి ఆ ధారతో పాటు దూకేస్తాడు. నది ఒడ్డున నిలుచున్న యువరాజు అంగరక్షకుడు అతని వెంట దూకేస్తాడు.

విశ్వనాథ ఆ చంద్రభాగా నదిని ఆ అంగరక్షకుడు నిలుచున్న ప్రదేశం నుండి వర్ణిస్తారు. ఆ వర్ణన చదివిన నాకు ఒక పది క్షణాలు ఆ నది నుండి వీచిన చల్లటి గాలులు నా కుడివైపు శరీరం అంతా తాకిన అనుభూతి కలిగింది. నిజంగా ఒక చల్లటి వస్తువు పక్కన నా కుడివైపు అంతా ఉంటే ఎంత చలి పెడుతుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఆ అనుభూతి పొందగలిగాను నేను. అది ఆయన వర్ణనా మహత్యం, కల్పనా చాతుర్యం.

మరో నవల ‘భ్రమరవాసిని’లో కథానాయకుడు తనకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటాడు. అందుకని ఆమెను తగు దూరంలో పెడుతూ వస్తాడు. కొన్నాళ్ళకు ఆమె మరణిస్తుంది. దానితో పశ్చాత్తాపంలో కూరుకుపోతాడు అతను. అక్కడ విశ్వనాథ ఆమె జ్ఞాపకాలు అతణ్ణి ఎలా వెంబడిస్తున్నాయన్నది వర్ణిస్తారు. ఎలా అంటేట, ఆమె ప్రతి శుక్రవారం దేవీ పూజ విశేషంగా చేసి, కాళ్ళకి ఒత్తుగా పసుపు రాసుకునేదిట. మధ్యాహ్నం అలసటతో కాళ్ళు గోడకు ఆనించి, మంచంపై పడుకునేదిట. ఆ పసుపు పాద ముద్రలు  ఆ గోడపై ఉన్నాయట. అవి చూసి, ఆమె గుర్తుకు వచ్చిందట అతనికి. ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో నాకు. ఇంత చిన్న details కూడా తెలుసా అంతటి పెద్దాయనకి అని.

ఇక ‘వేయిపడగలు’లో అరుంధతి కోసం ధర్మారావు పడే వేదన జగత్ప్రసిద్ధం. ఆ అధ్యాయాలు చదివి వారం పాటు మనసు పాడైపోయింది నాకు. ఒక రాత్రి వేళ కళ్ళు ఎర్రబడిపోయేదాకా ఏడ్చేశాను నేను. అంతగా వారి పాత్రచిత్రణతో, సన్నివేశ కల్పనతో మన హృదయాన్ని ధ్రవింపజేస్తారు ఆయన. ఆయనకు తాను సృష్టించే పాత్రలన్నిటి పూర్వా పరాలూ తెలుసు. అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రవర్తిస్తాయో ఆయనకి క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది. ఇంకా వాటిపై బోలెడంత అభిమానం కూడా ఉంటుంది. అందుకే అవి ఎలా ప్రవర్తిస్తాయో అలా ప్రవర్తించనిస్తారు. వాటి పరిణామాలను అంగీకరించడంతో పాటు, ఆ పాత్రలను ఎప్పటివలెనే ప్రేమిస్తారు కూడా. అవి దుష్టపాత్రలైనా సరే.

అలా ఆయన ఇష్టపడి, జాలిపడి, కర్మానుభవం చూస్తూ ఉండిపోయిన పాత్ర కీచకుడు. ఈ వారం కావ్యభారతి సిరీస్ లో భాగంగా విశ్వనాథ వారి ‘నర్తనశాల’ నాటకంపై ప్రముఖ రచయిత్రి, వైద్యురాలు డాక్టర్ మైథిలీ అబ్బరాజు గారి విశ్లేషణ విడుదల అవుతోంది. ఈ విశ్లేషణలో మైథిలీ గారు అంటారు, ఒక కథను అప్పటికే వేరొక రచయిత చెప్పేసినా, తిరిగి ఇంకో రచయితకి చెప్పాలని అనిపిస్తోంది అంటే, ఆ కథని ఎంతగా ప్రేమిస్తే అలా చేస్తారు అని. నిజంగా విశ్వనాథ కీచకుణ్ణి, లోతుగుండె కలిగిన ద్రౌపదిని ఎంతగా ప్రేమిస్తే వ్యాసుడు, తెలుగులో తిక్కన గారు చెప్పేశాకా కూడా తిరిగి చెప్తారు?

ముందు మనం అనుకున్నట్టు వారు పాత్రను పాత్రగా ప్రేమిస్తారు. అందుకే విశ్వనాథ కీచకుడు ఎంతటి నిజమైన ప్రేమ కలవాడైనా, ఎంత మర్యాదగా ఉండేవాడైనా, పర స్త్రీని కోరుకున్నప్పుడు అతని చావు ఖాయం అయిపోయిందని ఆయన ఒప్పేసుకున్నారు. అయినా, అతను వివాహితను, తనపై ఆసక్తి లేని స్త్రీని ప్రేమించడం తప్పు కానీ, అతని ప్రేమ నిజాయితీ అయినదని మనకు చూపిస్తారు ఈ నాటకంలో. వ్యాసుని కీచక, ద్రౌపది పాత్రలకి, తిక్కన తీర్చిన పాత్రలకి, విశ్వనాథ చూపించిన ద్రౌపది, కీచక పాత్రలకి మధ్య తేడాను, అవి అలా ఉండడం వెనుక రహస్యాన్ని చక్కగా వివరించారు ఈ వ్యాసంలో మైథిలీ గారు. లోకో భిన్న రుచిః అని పెద్దలు ఊరికే అనలేదు.

Tap to Listen

ఇంత చెప్పావు ఇందులో కుంజర యూధము, దోమ కుత్తుక రాలేదేమి అమ్మాయి అని మీరు అడగవచ్చు. ఈ పేరు ఈ వ్యాసానికి రెండు కారణాల చేత పెట్టాను. ఒకటి, నర్తనశాల విరాట పర్వం ఆధారంగా పుట్టిన నాటకం, ఈ పాదం విరాట పర్వంపై పూరించిన పద్యం కాబట్టి. ఇక రెండవది, ఈ పాదం తెలుగు పద్య వైభవానికి ఒకానొక తార్కాణం కాబట్టీ.

తెలుగు పద్య వైభవం - ప్రసంగం

పైన ఉదహరించిన పద్యం అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే అది పూరించిన తెనాలి రామకృష్ణ కవి గురించి, ఇలా తిరకాసు పాదాలు ఇచ్చి పద్యం పూరించడం అనే సాహితీ ప్రక్రియ గురించి కూడా తెలిసే ఉంటుంది. తెలుగు భాషకు వన్నె తెచ్చిన పద్య సౌందర్యం గురించి తెలియని సాహితీ ప్రియులు తక్కువ కదా. అయితే, పద్యంపై ప్రీతి, పట్టు కూడా సడలిపోతున్నాయి ఈ కాలంలో. పద్యంలో ఉండే అందం అర్ధం చేసుకోవడం పక్కన పెడితే, పద్యమే అర్ధం కాని కాలంలో ఉన్నాం మనం.

అందుకే ఆ పద్య సౌందర్యం, గాంభీర్యం, వైభవం గురించి మనకు గుర్తుచేసేందుకు శతావధాని, సంస్కృత ఉపాధ్యాయిని డాక్టర్ బులుసు అపర్ణ గారు మన ప్రసంగానికి వస్తున్నారు. ప్రతి నెల మొదటి శనివారం మనం నిర్వహించుకునే ప్రసంగాలు లో అద్భుతమైన పద్య గంగ ప్రవహించనుంది. ఆగస్ట్ 3, శనివారం ఉదయం ఠంచనుగా 9.30కల్లా వచ్చేస్తారు. ఒక్క నిమిషం అటు కాదు, ఒక నిమిషం ఇటూ కాదు అచ్చంగా 9.30కి మొదలుపెట్టేస్తారు. 

ఉపాధ్యాయిని కదా, సమయపాలన మరి. కాబట్టి సరిగ్గా సమయానికి అందరూ ప్రసంగానికి హాజరైపోవాలని ముందే హెచ్చరిస్తున్నాను. అయ్యో, ఇంత మంచి కార్యక్రమానికి లైవ్ లో వినే అవకాశం అయిదు నిమిషాలు తగ్గిపోయాయి, ఆలస్యంగా రావడం వలన అని, నువ్వు ముందే చెప్పకపోవడం వలనే మేము రాలేదు అని నన్ను అంటే ఊరుకునేది లేదు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా. చాదస్తం అనుకున్నా సరే మరలా చెప్తున్నా, 9.30కి సరిగ్గా ప్రసంగం మొదలైపోతుంది. సమయానికి వచ్చేయండేం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :