చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సభలూ, సమావేశాల్లో పాల్గొన్నాను. వాటిలో సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి వంటి రంగాల్లో గొప్ప కృషిచేసిన వ్యక్తుల గురించి సన్మాన సత్కారాలు జరిగినప్పుడు వక్తలు తరచుగా "ఇది విశ్వవిద్యాలయాలూ, అకాడమీలూ, ప్రభుత్వ సంస్థలు వంటివి చెయ్యాల్సిన పని. అంత గొప్ప కృషిని వీరు చేశారు." అంటూ ఉంటారు. అయితే, క్రమేపీ వయసూ, అనుభవమూ వచ్చేకొద్దీ ఒక సంగతి నాకు అర్థమైంది. భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి ఉపయోపగడే అలాంటి గొప్ప పనులు విశ్వవిద్యాలయాలూ, ప్రభుత్వ సంస్థలూ పెద్దగా చేయట్లేదు. ప్రతీసారీ వ్యక్తులే చేస్తున్నారు. ఆ చేసే వ్యక్తులు కూడా జర్నలిస్టులుగానో, మాస్టర్లుగానో, రెవెన్యూ గుమాస్తాలుగానో, ఈరోజుల్లో అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగానో తమ రోజువారీ జీవితాలను గడుపుతున్నారు. తమ ఉత్సాహాన్నీ, మేధస్సునీ, సృజననీ, సామర్థ్యాన్నీ, అన్నిటికన్నా విలువైన తమ జీవితంలో కొన్ని దశాబ్దాలనూ, ఆరోగ్యాన్నీ ఖర్చుపెట్టి భాషా సంస్కృతులకు గట్టిమేల్ తలపెడుతున్నారు. పోనీ ఇలాంటి పనిచేసేవారికైనా విశ్వవిద్యాలయాలూ, అకాడమీలూ దన్నుగా నిలబడ్డాయా అంటే జీవిత చరమాంకంలో పొరబాటున ఒక పురస్కారం ఇచ్చి, శాలువా కప్పి చేతులు దులుపుకుంటున్నాయే తప్ప ఈ పనులు చేయడానికి వనరులను, వీలును కల్పించడం లేదు.
మరి అయితే, ఆ వనరులు ఈ మనుషుల దగ్గర లేనప్పుడు అందిస్తున్నవారెవరున్నారూ?
నూటికి తొంభైపాళ్ళు ఆ పనితలకెత్తుకున్నవాళ్ళే అన్ని తంటాలూ పడాలి. కానీ, ఆ కృషిచేసేవాళ్ళు అదృష్టవంతులైతే అత్యంత అరుదుగా రసజ్ఞత, వదాన్యత కలిగిన పోషకులు అనే జాతికి చెందినవారు సాయంచేస్తున్నారు. ప్రాచీన కాలంలో ఈ పని చక్రవర్తులూ, మంత్రులూ, ఉన్నతోద్యోగులు చేసేవారు. తర్వాత వలసపాలన కాలం వచ్చాకా సంస్థానాధీశులూ, జమీందార్లూ ఆ సంప్రదాయాన్ని అందుకున్నారు. వ్యవస్థలూ, పరిస్థితులూ మారాకా వ్యవస్థలు ఈ బాధ్యతను అందుకోలేదు. నూటికో కోటికో ఒక్కరుగా మిగిలిన దాతలు, పోషకులే ఈనాటికీ ఆ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే - అలాంటి అరుదైపోయిన రసజ్ఞులైన పోషకులనే జాతికి చెందినవారే - కోడూరి ఈశ్వర వరప్రసాదరెడ్డి గారు.
వరప్రసాదరెడ్డి గారి పేరు తెలియడానికన్నా ముందే ఆయన వల్ల గొప్ప ప్రయోజనం పొందాను నేను. 2002-03 ప్రాంతంలో టీనేజీలోకి అడుగుపెడుతున్న నేను హాసం అన్న ఒక పక్షపత్రిక కొని చదవడం మొదలుపెట్టాను. అప్పటికి మొలకెత్తుతున్న నా సాహిత్యాభిలాషను, అభిరుచిని ఆ పత్రిక నీళ్ళుపోసి, పాదులుపెట్టి పెంచింది. ఆత్రేయ పాటల్లోని లోతును, సిరివెన్నెల రాతలోని తత్త్వాన్నీ, వేటూరి విరాట్ రూపాన్నీ, బాపు-రమణల విశ్వరూపాన్ని, జంధ్యాల హాస్యపు జల్లును, మహానుభావులైన వాగ్గేయకారులూ, విద్వాంసులనూ, అంతెందుకు మెహదీ హసన్ నుంచి బాలాంత్రపు రజనీకాంతరావు వరకూ, డాక్టర్ డూలిటిల్ నుంచి వూడ్‌హౌస్ జీవ్స్ దాకా ఎన్నెన్నో పరిచయం చేసిందీ, కొన్నిటిలో లోతుల్లోకి దింపింది ఈ హాసమే. అలాంటి హాస్య సంగీత పత్రికకు సంపాదకత్వమూ, నిర్వాహకత్వమూ మ్యూజికాలజిస్ట్ రాజా, ఎమ్బీయస్ ప్రసాద్ చేస్తే, పత్రిక పెట్టి లాభనష్టాలతో సంబంధం లేకుండా మూడేళ్ళు నడిపింది మన కె.ఐ.వరప్రసాదరెడ్డి గారే. 2004లో ఇక నిర్వహణ భారమై హాసాన్ని మూసేశాక కూడా వందకు పైచిలుకు పుస్తకాలను ప్రచురించి తెలుగు పాఠకులకు అందించారు. ఇక పుస్తకాలు వేసుకుంటున్న రచయితలు ఎందరికి ఆయన ఆర్థికంగా సాయం చేశారన్న లెక్కే లేదు. తెలుగు భాషకి, సంగీత, సాహిత్యాలకే కాకుండా మరెన్నో రంగాల్లో ఆయన వితరణ సాగింది. విద్యారంగంలో, వైద్యరంగంలో కోట్లాది రూపాయలు విరాళాలిచ్చి బాసటగా నిలిచారు.
ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన డైనమైట్ కనిపెట్టి, దానివల్ల వచ్చిన డబ్బుతో జీవించి చివరిదశలో మనశ్శాంతినీ, కీర్తినీ సంపాదించుకునేందుకు నోబెల్ బహుమతి ట్రస్టు స్థాపించాడని చదువుకున్నాం. కానీ, వరప్రసాదరెడ్డి గారి వితరణశీలత ఎంత గొప్పదో, ఆయన వ్యాపారమూ, వృత్తీ కూడా అంతే ఉన్నతమైనవి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న వరప్రసాదరెడ్డి అనుకోని విధంగా వ్యాక్సిన్ రంగంలోకి ప్రవేశించారు. పాశ్చాత్య పరిశోధకుడొకరు భారతదేశాన్ని అవమానిస్తూంటే, దాన్ని సవాలుగా తీసుకుని పూర్తిగా దేశీయ సాంకేతికతతో హెపటైటిస్-బి వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, అత్యంత తక్కువ ఖరీదుకు అందించి దేశవిదేశాల్లో ఎన్నో ప్రాణాలను నిలబెట్టిన మనీషి. అందుకే నెత్తిన కిరీటం లేకున్నా ఆయన మహారాజరాజశ్రీ వరప్రసాదరెడ్డి.
వరప్రసాదరెడ్డి గారు తనకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి వివరిస్తూ రాసిన శాంతిపథం అన్న పుస్తకాన్ని ఇప్పుడు దాసుభాషితం మనకు అందిస్తోంది. ఈ సందర్భంగా నేనెంతో గౌరవించే వరప్రసాదరెడ్డి గారి గురించి నాలుగు మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దాసుభాషితం బృందానికి నా కృతజ్ఞతలు.
అభినందనలు,
పవన్ సంతోష్ సూరంపూడి.