మహిళా సాధికార దినోత్సవం - దసరా

Meena Yogeshwar
October 22, 2023

చైత్ర మాసం మొదట్లో chicken pox, smallpox వంటి అంటురోగాలు ముమ్మరంగా గాలిలో తిరిగే సమయంలో లలితా/చైత్ర నవరాత్రులు, వర్షాకాలానికి కాస్త ముందు ఆషాఢంలో వారాహి నవరాత్రులు, రకరకాల విష జ్వరాలు ఎక్కువగా వచ్చే ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రులు, చలికాలానికి, ఎండాకాలానికి సంధికాలంలో మాఘమాసంలో శ్యామలా నవరాత్రుల ద్వారా మన శారీరిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి రక్షా కవచాలను ఇచ్చారు ఋషులు. వీటిలో చైత్ర, శరన్నవరాత్రులు అత్యంత ప్రముఖమైనవి కాగా, మిగిలిన రెండు నవరాత్రులను గుప్త నవరాత్రులుగా పేర్కొన్నారు. మిగిలిన వాటికి తొమ్మిది రోజులు మాత్రమే ఆరాధన ఉంటుంది. సనాతన ధర్మం పాటించే అతి సామాన్యులు సైతం ఖచ్చితంగా జరుపుకునే శరన్నవరాత్రులకు మాత్రమే దసరా పేరుతో పండుగ ఉంటుంది. ఎందుకంటే...

మాతృదేవోభవ అంటూ మొదలైంది వేదం. మొదటి నమస్కారం దేవుడికన్నా ముందు తల్లికి చేయమని నేర్పింది మన సనాతన ధర్మం. తన శాయశక్తులా బిడ్డను కాపాడుకోవాలనుకునే తల్లి మనస్తత్త్వం ఆ జగదంబ నుండే వచ్చింది. అందుకే ఋతు సంధిలో, సకల జంతుకోటికీ క్లిష్టమైన సమయంలో ఆదిపరాశక్తి ఉపాసన ద్వారా ఆరోగ్యాన్ని కట్టబెట్టింది మన ఆర్షధర్మం. 

చైత్ర మాసం మొదట్లో chicken pox, smallpox వంటి అంటురోగాలు ముమ్మరంగా గాలిలో తిరిగే సమయంలో లలితా/చైత్ర నవరాత్రులు, వర్షాకాలానికి కాస్త ముందు ఆషాఢంలో వారాహి నవరాత్రులు, రకరకాల విష జ్వరాలు ఎక్కువగా వచ్చే ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రులు, చలికాలానికి, ఎండాకాలానికి సంధికాలంలో మాఘమాసంలో శ్యామలా నవరాత్రుల ద్వారా మన శారీరిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి రక్షా కవచాలను ఇచ్చారు ఋషులు. వీటిలో చైత్ర, శరన్నవరాత్రులు అత్యంత ప్రముఖమైనవి కాగా, మిగిలిన రెండు నవరాత్రులను గుప్త నవరాత్రులుగా పేర్కొన్నారు.

మిగిలిన వాటికి తొమ్మిది రోజులు మాత్రమే ఆరాధన ఉంటుంది. సనాతన ధర్మం పాటించే అతి సామాన్యులు సైతం ఖచ్చితంగా జరుపుకునే శరన్నవరాత్రులకు మాత్రమే దసరా పేరుతో పండుగ ఉంటుంది. ఎందుకంటే మిగిలినవి ఆరాధనకు మాత్రమే సంబంధించినవి కాగా, ఈ నవరాత్రులు స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని, ముఖ్యంగా స్త్రీలోని ధీరత్వాన్ని celebrate చేసుకునే పండుగ కావడమే.

శరన్నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గా స్వరూపాలలో ఆరాధిస్తారు. మొదటి రోజున శైలపుత్రీ దేవిగా అమ్మవారిని పూజిస్తారు. దీనిని సామాన్యమైన స్త్రీల విషయంలో అన్వయిస్తే, స్త్రీ ఫలానావారి అమ్మాయిగా ప్రస్థానం మొదలుపెడుతుంది. రెండవరోజు బ్రహ్మచారిణిదేవి. యవ్వనంలో ఉన్న అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందేందుకు తపస్సు చేసుకునే రూపం ఇది. తనకంటూ ఒక వ్యక్తిత్వం, ఆశయం, లక్ష్యం రూపొంది, దానికై కష్టించే పనిచేసే ఒక స్త్రీ దశ ఇది. తాము ఏమవ్వాలో, తమ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకుని, అటుగా ప్రయత్నించే స్త్రీలందరూ బ్రహ్మచారిణీదేవి స్వరూపాలే అనడంలో సందేహం ఉందా?

ఇక మూడవరోజున తన లక్ష్యమైన శివుణ్ణి పొంది కొత్త పెళ్ళికూతురిగా అమ్మవారిని చంద్రఘంటా దేవి రూపంలో కొలుస్తాం. తన లక్ష్యం నెరవేరి, అనుకున్నది సాధించుకున్న ప్రతి అమ్మాయిలోనూ ఈ అమ్మవారిలోని హుందాతనాన్ని మనం చూడవచ్చు. నాల్గవరోజున చేతిలో మధుకలశంతో కొత్త సృష్టికి సంకేతంగా, తల్లి అయ్యేందుకు సిద్ధంగా ఉన్న స్త్రీమూర్తిగా కూష్మాండా దేవి దర్శనమిస్తుంది. ఇక ఐదవరోజున బ్రహ్మాండ జనని అయిన అమ్మవారు కుమారస్వామి తల్లిగా మారి, స్కందమాతాదేవి అవుతుంది. ఎందరో స్త్రీలకు తల్లితనాన్ని ప్రసాదించగల ఆ తల్లి ఆదిజననిగా ఈ అవతారంలో కనిపిస్తుంది. ప్రపంచంలోని తల్లులందరిలోనూ కనిపిస్తుంది.

కథ అయిపోయిందా? ఇంకేముంటుంది? ఒకరింట్లో పుట్టింది, పెళ్ళి కోసం తపస్సు చేసింది, పెళ్ళి చేసుకుంది, గర్భం దాల్చింది, బిడ్డని పొందింది. ఇక ఆ బిడ్డ ఆలనాపాలనా, సంసార బాధ్యతలు ఇంతేగా ఏ స్త్రీ జీవితమైనా? అంతేనా? కాదు అంది ఆ ఆదిపరాశక్తి. “ఆడదేం చేయగలదు? అబల. ఆమె ఏం చేస్తుందిలే. అందుకే, ఏ జాతికి చెందిన మగవాడి చేతిలోనూ నేను చనిపోకూడదు” అంటూ వరం పొందాడు లోకకంటకుడైన మహిషాసురుడు. త్రిమూర్తులు చేతిలో లేని విషయం ఇది. ఇప్పుడు ఏం చేయాలి? కేవలం ఒక బిడ్డ తల్లి అనుకుని పొరపాటు పడకూడదు, కదిలేవాటిలోనూ - కదలనివాటిలోనూ నిక్షిప్తమైన శక్తి తానే అని మరోసారి ప్రపంచానికి చాటింది ఆ అమ్మవారు.

ఆరవరోజున త్రిశక్తి స్వరూపిణిగా, బ్రహ్మాది దేవతలందరూ ప్రార్ధించిన మీదట కాత్యాయినీదేవిగా అవతారం తీసుకుంది ఆ అమ్మవారు. తన రూపమే అయిన ప్రతి స్త్రీలోనూ ఎంత శక్తి ఉందో చూపించేందుకు ఉద్యుక్తురాలైంది. జగదంబ అన్న విషయం మరచి, అమ్మని చూడకూడని చూపు చూసిన మహిషాసురుణ్ణి అంతమొందించేందుకు ఏడవరోజున కాళరాత్రీదేవిగా, కోపోద్రిక్తగా, అగ్నిజ్వాలలను నిశ్వాసాలుగా వదులుతూ భయంకర రూపం దాల్చింది. ఈనాడు ప్రతి స్త్రీ ఎదుర్కొనే సమస్య - చాలామంది మగవారు అమ్మాయి అయితే చాలు తప్పుగా చూడడం, తప్పుగా ప్రవర్తించడం. అలాంటి సమస్య ఎదురైతే కాళిగా మారమని సందేశమిచ్చింది జగన్మాత.

మహిషాసురుని సేనను, మంత్రులైన రక్తబీజుడు, శుంభ నిశుంభులను, చండ ముండులను, ధూమ్రలోచనుడు వంటి ఎందరో రాక్షసులను ప్రచండ వేగంతో నాశనం చేస్తూ వచ్చింది అమ్మవారు. దేవాధిదేవులు ఏమీ చేయలేని ఇందరు రాక్షసులను, అసురలను దునుమాడుతున్న ఆ దేవి ఈ ఎనిమదవరోజున మహత్వాన్ని సంపాదించుకుని మహాగౌరిగా అవతరించింది. ప్రపంచానికి స్త్రీశక్తిని చాటి చెప్పింది.

మహిషాసురణ్ణి అత్యంత కిరాతకంగా చంపి, అతని సేననంతటినీ సర్వనాశనం చేసి, తొమ్మిదవరోజున సిద్ధిదాత్రిగా నిలిచింది అమ్మవారు. తాను తలపెట్టిన కార్యంలో సిద్ధి పొందిన ఆ తల్లి, జనులందరికీ సిద్ధిని అందించగల మహిషాసురమర్ధినిగా నిలిచింది. ప్రతివారికీ ఒక పరమ ప్రయోజనం ఉంటుంది. అదేమిటో తెలుసుకుని, అటుగా ప్రయత్నించాలని తన అవతారాల ద్వారా లోకానికి గొప్ప సందేశనమిచ్చిన ఆ అమ్మవారి విజయాన్ని విజయదశమిగా పండుగను జరుపుకుంటాం మనం. 

ఆఖరి రోజైన దసరా నాడు అపరాజితాదేవిగా(ఎవ్వరూ గెలవలేని అమ్మవారు), రాజరాజేశ్వరీదేవిగా(రాజులకే రాజ్ఞి అయిన అమ్మవారు) శివునితో పాటు సింహాసనాన్ని అలంకరిస్తుంది. అలాంటి రోజును భారతీయ సంప్రదాయంలో పుట్టినవారందరూ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మనందరి కర్తవ్యం. ప్రతి స్త్రీలోనూ అమ్మవారి అంశ ఉంటుందని గుర్తించడం కూడా అత్యావశ్యకం. 

ఇక ఈ వారం చాలా యాదృచ్ఛికంగా ప్రముఖ రచయిత్రి, కోరన్ డాక్టర్ మైథిలి అబ్బరాజు గారు కుమారసంభవం కావ్యంలోని మొదటి ఎనిమిది సర్గలనూ వివరిస్తూ రాసిన ‘మంచుకొండలలో మొలిచిన చల్లని బంగారు తీవె’ అనే వ్యాసాన్ని కావ్యభారతి రెండవ భాగంగా విడుదలవుతోంది. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి ఆవిర్భావం మొత్తం ఈ వ్యాసంలో వివరించారు ఆమె. ఆ చల్లని తల్లి గురించి మెత్తటి మాటల్లో మైథిలిగారి వర్ణన విని తీరాల్సిందే. దసరా పండుగ రోజుల్లో ఈ వ్యాసం విడుదల అవ్వడం కేవలం ఆ అమ్మవారి ప్రణాళికే. మహాకవి కాళిదాసుకూ, మైథిలిగారి అపురూపమైన విశ్లేషణకూ, ముఖ్యంగా ఆ పార్వతీదేవికీ వేనవేల నమస్కారాలర్పిస్తూ కావ్యభారతి రెండవ భాగాన్ని విడుదల చేస్తున్నాం.

Tap to Listen

పైన వ్యాసంలో ఆ జగదంబను, సామాన్య స్త్రీలకు అన్వయం చేసే సాహసం నా అంతట నేనుగా చేసింది కాదు. సంప్రదాయాన్ని, ఆధునికతను ఆధారాలు లేకుండా ముడిపెట్టడం నా పద్ధతి కాదు. జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులవారే కనకధారా స్త్రోత్రంలో “ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాధ గృహిణీం” అంటూ లోకంలోని ప్రతి ఇంటిలోని మహిళా ఆ అమ్మవారి స్వరూపమే అని చెప్పారు. జగద్గురువుల బాటలో నడవడమేగా మన కర్తవ్యం. 

భారతీయ సంప్రదాయం అందించిన ఈ మహోన్నతమైన మహిళా సాధికార దినోత్సవం అయిన దసరా శుభాకాంక్షలు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :