నేను దాసుభాషితంలో ఉద్యోగం మొదలుపెట్టే సమయానికి నాకు కూడా దాసుభాషితం అనే యాప్ ఉందన్న విషయం తెలీదు. విని భలే ఆశ్చర్యపోయాను. ఆ తరువాత అప్లై చేశాను, ఉద్యోగం వచ్చింది. ఇక ఉద్యోగం చేరిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఆపకుండా చేసే పనులు రెండు. ఒకటి పుస్తకాలు తేవడం, రెండోది న్యూస్ లెటర్ రాయడం. నేను పదిమంది రచయితలకు ఫోన్ చేసి మన దాసుభాషితం పేరు చెప్తే ఒకరో, ఇద్దరో ‘ఆ.. ఆ.. ఆ యాప్ మాకు తెలుసు’ అనేవాళ్ళు. మిగిలినవాళ్ళకి పేరు అర్ధంతో సహా అన్నీ వివరించేదాన్ని.
తెలుగులో మొట్టమొదటి ఆడియో పుస్తకాల యాప్ అయినప్పటికీ మెట్రో నగరాల్లోనూ, ఇతర దేశాల్లోనూ మన యాప్ గురించి తెలిసినంత ఎక్కువగా ఇరు రాష్ట్రాల్లోని మిగిలిన నగరాలు, పట్టణాల్లో పెద్దగా తెలిసేది కాదు. ముఖ్యంగా రచయితలకు. ఎక్కువగా ప్రచురణ సంస్థలు, పత్రికలు తెలిసినంతగా ఆడియో పుస్తకాలపై అవగాహన తక్కువనే చెప్పాలి మొదట్లో వారికి. నెలలు గడిచేకొద్దీ, మన గురించి రాష్ట్రంలో అధికశాతం పుస్తక ప్రియులకు, రచయితలకు తెలుస్తోంది.
C.P.B, S.P.B వంటి కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనశాలలో స్టాల్, మనం చేసిన fundraising campaign, ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోలు చాలా Organicగా మన ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఈ సంస్థ Content Managerగా ఈ విషయం నాకు అర్ధమైన సందర్భం ఏమిటో తెలుసా? సత్యం మందపాటి అనే రచయిత ‘అమెరికా బేతాళుడి కథలు’ అనే పుస్తకాన్ని మీ యాప్ లో ఆడియో పుస్తకంగా తీసుకువస్తారా అంటూ మనకి మెయిల్ చేసినప్పుడు. అలాగే ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయి గారి కుమార్తె రేవతి గారు కూడా తన పుస్తకం ‘అవంతీ కళ్యాణం’ మన యాప్ లో తీసుకువచ్చేందుకు మనకు మెయిల్ చేశారు, నాకు కాల్ కూడా చేశారు.
సామాన్యంగా మనం రచయితని సంప్రదించడమే తెలిసిన నాకు, ఇది కొత్త అనుభవం. ఎంత ఆనందంగా, గర్వంగా అనిపించిందో నాకు. మనం చేసే పనికి Organic గా గుర్తింపు వస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. వారు ఇద్దరూ తమ పుస్తకాన్ని దాసుభాషితం ద్వారా శ్రవణరూపంలో చూసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిన విషయం. వీరికి మనం ఎలా తెలుసబ్బా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే వీరికి, నాకూ దూరదూరంగా కూడా సంబంధాలు లేవు. సరే, అమెరికాలో మనం పిచ్చ ఫేమస్ కదా, అలా తెలిసి ఉండచ్చు అనుకున్నాను.
తరువాత అనంతపురంకు చెందిన రాఘవేంద్ర రాజు గారు అనే ఆయన తమ తల్లిగారు శ్రీమతి జయలక్ష్మి రాజు గారు రాసిన ‘అమ్మ నాన్న ఓ సుశీల’ అనే కథల సంపుటిని మన యాప్ లో తీసుకురావడం కోసం మెయిల్ చేసినప్పుడు నాకు మన విస్తరణ పూర్తిగా అర్ధం అయింది. దాసుకిరణ్ గారి కల ఇది. అనంతపురంలోనో, తణుకులోనో, నల్గొండలోనో ఉన్న శ్రోతలకు కూడా దాసుభాషితం తెలియాలి అని. ఆయన కష్టం నెరవేరింది అనిపించింది ఆ మెయిల్ చూసినప్పుడు. అందుకే పైన అన్నాను ‘మన లెవెల్ పెరిగింది’ అని.
అవంతీ కళ్యాణం, అమెరికా బేతాళుడి కథలు అతి త్వరలో విడుదల అవుతాయి. ప్రస్తుతం అయితే జయలక్ష్మి రాజు గారు రాసిన ‘అమ్మ నాన్న ఓ సుశీల’ కథల సంపుటి ఈ వారం విడుదల అవుతోంది. ఆ మధ్య మన దాసుభాషితం కూటమిలో ఒకరు అడిగారు ‘ఈ మధ్య సరదా content రావడం లేదు, సోమరాజు సుశీల గారి మరో పుస్తకం విడుదల చేయండోయ్’ అని. ఇది ఖచ్చితంగా ఆ తరహా పుస్తకాలు ఇష్టపడే వారికి వీనుల విందే. తెలుగులో ఎవరండీ అన్నది హాస్య రచయితలు, అందునా స్త్రీ హాస్య రచయితలు లేరు అన్నది. ఓ సోమరాజు సుశీల గారు అనగానేమి, ఓ పొత్తూరి విజయలక్ష్మి గారు అనగానేమి, ఇప్పుడు దొరికిన ఈ హాస్య రత్నం జయలక్ష్మి గారు అనగానేమి అందరూ అందరే.
మీరు ఎన్నైనా చెప్పండి. మగవారి కన్నా ఆడవారి హాస్యం భలే సున్నితంగానూ, సూటిగానూ కూడా ఉంటాయి అంటాను నేను. హాస్యం అంటే విరగబడి నవ్వడం కాదు కానీ, సరదాగా నవ్వుకునేలా ఉంటాయి మన తెలుగు రచయిత్రుల హాస్యం. ఆ వరసలో వచ్చేవారే జయలక్ష్మి గారు. ఆమె కథలన్నిటినీ సరదా బాట పట్టించడం ఆమె ప్రత్యేక ముద్ర. ఈ కథలు విని, మీ పెదాలపై చిరు మందహాసం పూయడం మాత్రం ఖచ్చితం. నేను పందెం కడతాను ఈ విషయంలో. ఒకవేళ ఈ పందెంలో నేను ఓడిపోతే, వచ్చేవారం న్యూస్ లెటర్ రాసే సువర్ణావకాశం మీకే ఇస్తాను. ఏమంటారు? పందానికి సిద్ధమా? అయితే, ఈ కథలు వినేయండి. నవ్వేసుకుని నవ్వలేదని అబద్ధం చెప్తే మాత్రం మీ కాఫీ కప్పు వేయి వ్రక్కలైపోతుంది. మీ భాగస్వామి చేత తిట్లు తింటారు. ఇదే నా శాపం.
ఇంకో విషయం. మీలో ఎవరైనా రచయితలు ఉన్నా, లేదంటే మీకు తెలిసిన వారు రచయితలు అయినా కూడా నన్ను సంప్రదించండి చెప్తా. మీ పుస్తకాలు కూడా మన యాప్ లో వచ్చే ఏర్పాటు చేద్దాం. కాకపోతే నాకు కాస్త లంచం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఏం లేదు, పుస్తకం మన యాప్ లో విడుదలైనప్పుడు నేను రాసే న్యూస్ లెటర్ మీ గ్రూపుల్లో నా పేరు మీదే షేర్ చేయాలి. మళ్ళీ కిరణ్ గారితో ఈ విషయం చెప్పేరు, లంచం తీసుకుంటున్నానని నా మీద చర్యలు తీసుకుంటే నా పని అయిపోతుంది. ఇది మన ఇద్దరి మధ్య మాత్రమే ఉంచాల్సిన రహస్యం. ఎవరికీ చెప్పకండేం. పంపేయండి మరి త్వరగా..
అభినందనలు,
మీనా యోగీశ్వర్.