సాధారణ మానవ జీవితం 95శాతం మన మనసు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. మన బంధాలు, మన కెరీర్, మన జీవన ప్రమాణాలు వంటి వాటి విషయాలను మన నిర్ణయాత్మక శక్తి నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతటి ముఖ్యమైన విషయంలో మన గురించి మనకి ఏం తెలుసు? మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం? ఎందుకు ఇలాంటి తరహా నిర్ణయాలే తీసుకుంటున్నాం? మన నిర్ణయాలను ఎలాంటి అంశాలు శాసిస్తున్నాయి వంటి విషయాలు ఎలా తెలుస్తాయి. ఆత్మావలోకనం దీనికి సమాధానం. ఈ పని ద్వారా మనల్ని మనం విమర్శించుకునే అవకాశం దొరుకుతుంది.
సాధారణంగా మనం ఒక మనిషిపై ఒక రకమైన Impression ను వారి పరిచయం దగ్గర నుండి పెంచుకుంటూ వస్తాం. మొదట మనపై పని చేసేది తొలి పరిచయపు జ్ఞాపకాలే. అంటే First Impression అన్నమాట. తరువాత వారితో జరిగిన ప్రతి సంఘటన వారిపై మన అభిప్రాయాన్ని మలుస్తూ వస్తుంది. ఈ అతిచిన్న, impulsive ప్రక్రియ మన నిర్ణయాలపై, వారి పనులపై మన తీర్పుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని మనం చాలాసార్లు గమనించం. ఉదాహరణకు, ఒకే వంటకాన్ని మనకు ఇష్టమైన వారు, ఇష్టం లేని వారూ చేసి మన ఎదురుగా పెడితే, మనకు ఎవరేం చేశారో తెలియనప్పటి తీర్పుకు, తెలిసిన తరువాతి తీర్పుకూ చాలా తేడా ఉంటుంది కదా. ఇలాంటి అసంకల్పిత విషయాలు ఒకోసారి చాలా నష్టాలను తెచ్చిపెట్టవచ్చు.
కాబట్టి, ఆత్మవిమర్శ చాలా ముఖ్యమైన ప్రక్రియ. కానీ, ఇది చాలా పదునుతో కూడినది కూడా. మనకు తెలియకుండానే మనపై pressure పెంచే ఆయుధంగా మారే అవకాశం ఉంది. మనల్ని మనం ఎక్కువ విమర్శించుకుని, ప్రతి పనినీ dissect చేస్తూ పోతే, మన జీవితంలో మనం మిగిలం. ఏదో ఆదర్శానికి మనం నిర్మించుకున్న toxic example గా మన జీవితం మిగిలుతుంది ఆఖరికి. అందుకే ఆధునిక విజ్ఞానం ఈ విషయంపై ఎంతో కృషి చేసింది. ‘Behavioural Science’ అనే శాస్త్రాన్ని కూడా నిర్మించింది. శాస్త్రీయంగా మన మనసును, ఆలోచనా విధానాన్ని, వ్యవహారశైలిని, స్పందనా తీరును పరిశీలించి, విమర్శించి, దిద్దుకునేందుకు ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది.అలా మనల్ని మనం పరిశీలించి, దిద్దుకోవడం మొదలైన వెంటనే మన జీవితంలోనూ, నిర్ణయాలలోనూ స్పష్టమైన మార్పును గమనించవచ్చు. ఇంతటి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన శాస్త్రాన్ని దాసుభాషితం శ్రోతలకు పరిచయం చేయదలుచుకున్నాం. దాసుభాషితం ప్రసంగాలలో భాగంగా ఏప్రిల్ మొదటి శనివారం అయిన 1వ తేదీ ఉదయం 11గంటలకు అశోకా విశ్వవిద్యాలయం లో 'Behaviour Science' ప్రొఫెసర్ శ్రీ పవన్ మామిడి గారిని, దాసుభాషితం సభ్యులకు ఒక Overview ఇవ్వమని అభ్యర్ధించాం. శ్రీ పవన్, బిహేవియర్ సైన్స్ రంగంలో సుప్రసిద్ధులు, నిష్ణాతులు.
అయితే దాసుభాషితం సభ్యులను దృష్టిలో ఉంచుకుని ప్రసంగం రూపొందించాలని అనుకున్నాము. అందుకే దాసుభాషితం జీవితకాల సభ్యులకు ఒక Google Form ను నింపమని మెయిల్ చేశాం. వారు ఈ సెషన్ నుండి ఏం కోరుకుంటున్నారనేదానిని బట్టి, వారి ప్రసంగాన్ని రూపొందించేందుకు నిర్ణయించాం. ఇప్పటికే చాలామంది ఆ ఫాం ను నింపారు. మిగిలినవారు కూడా నింపితే మీకు ఉపయోగపడే విషయాలపై పవన్ గారు వివరణ ఇచ్చేందుకు వీలు ఉంటుంది. ఈ ప్రసంగాలు దాసుభాషితం జీవితకాల సభ్యులకు ప్రత్యేకం కాబట్టి, ఆ మీటింగ్ లో సభ్యులందరూ పాల్గొనవచ్చు. మిగిలినవారి కోసం ఇంతకుముందు వీడియోలానే, దీనిని కూడా యూట్యూబ్ లో దాసుభాషితం ఛానెల్ లో అప్లోడ్ చేస్తాం.
ఎయిర్ పోర్ట్ - విశ్లేషణ
మనిషి మనుగడకి ఒక సార్ధకత ఉంటుంది. అది గ్రహించక చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని ముగించేద్దాం అనుకోవడం చాలామందిలో కనిపించే ఒక దురదృష్టకరమైన లక్షణం. కొంతమంది తమ జీవితాన్నే కాక, పక్కవారి జీవితాన్ని కూడా చాలా సులభంగా చూస్తారు. మరికొందరు అందరి కష్టాలనూ తనవిగా భావించి, జీవితంపై గౌరవం కలిగి ఉంటారు. కానీ, ప్రతీ వారి జీవితాన్నీ సమూలంగా మార్చే సంఘటన ఒకటి జరిగినప్పుడు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా స్పందిస్తారు అనే దాన్ని బట్టి వారి మిగిలిన జీవితం, వారితో ముడిపడిన వారి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది.
అమెరికాలోని ఒక విమానాశ్రయం లో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన కథే ఈ నవల. సస్పెన్స్ రాయడంలో దిట్ట అయిన రచయిత ఆర్ధర్ హెయిలీ రాసిన ఈ నవల పరుగులు పెట్టిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఒక విమానపు పైలట్, ఎయిర్ హోస్టెస్, కొందరు ప్రయాణికులు, ఒక అనుమానితుడు, ఆ విమానశ్రయపు అధికారి, రేడార్ ఆధికారిల మధ్య జరిగే ఈ కథ ప్రతి క్షణం ఉత్కంఠతో సాగుతుంది. ఇందరి పాత్రల జీవితాలనూ, జీవితం పట్ల ధృక్పధాన్నీ శాశ్వతంగా మార్చేసిన సంఘటన ఏమిటి అనేది తెలియాలి అంటే ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమతి మాలతీ చందూర్ రాసిన విశ్లేషణ వినాల్సిందే. ఒక అనివార్య ఘటన జరిగినప్పుడు మానవులు ప్రతిస్పందించే తీరు, ఎదుర్కొనే విధానం ఎలా ఉంటుందో తెలిపే ఆసక్తికరమైన విషయాన్ని ఈ నవలా విశ్లేషణలో తెలుసుకుందాం.
అభినందనలతో,
మీనా యోగీశ్వర్.