“మనతో మనం మాట్లాడుకోవడం ఎలా? ఊరుకోండి, ఇది కూడా ఒక ప్రశ్నే? అదేమైనా బాస్ తోనో, అత్తవారితోనో, చుట్టాలతోనో మాట్లాడడం లాగా బహు క్లిష్టమైన విషయమా ఏమిటి? అది కూడా నేర్చుకోవాలా? మరీ చోద్యం కాకపోతే? ఏం రాయాలో తెలీక ఏది పడితే అదే రాసేస్తున్నారు.” అని తిట్టుకున్నవాళ్ళందరికీ ఒక పరీక్ష.
ఒక పావుగంట పాటు ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, పుస్తకాలు పక్కన పెట్టండి. ఒంటరిగా కూర్చోండి. పాత సినిమాలు, కొత్త సీరియళ్ళలో లాగా మీ అంతరాత్మని పిలిచి, ఎదురుగా కూర్చోబెట్టండి. ఇప్పుడు ఏ distraction లేకుండా ఆ అంతరాత్మతో మాట్లాడి చూడండి. మనతో మనం మాట్లాడుకోవడం ఏమీ మజాకా కాదు అని అప్పుడు అర్ధం అవుతుంది.
మన అసలు రంగు మనకి కనిపిస్తుంది. నిజానికి నలుపు, తెలుపుల్లో ఏ మనిషీ ఇమడరు. మన ఆలోచనలు, పనులు, వ్యక్తిత్వం అంతా grey నే. అందుకే మనలో చాలామందిమి మన మనసు మాటల్ని పూర్తిగా వినడానికి ఇష్టపడం. ఎందుకంటే అవి చెప్పే కొన్ని చెడ్డ మాటలు చేయడానికి ఇబ్బందిగా ఉండకపోయినా, ఆ ఆలోచన మనది అని ఒప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
చాలామందిమి చేసే పనిని, మన మనసులో అయినా తిరిగి మననం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ప్రపంచానికే కాదు, మన మనసుకి కూడా మనం పూర్తిగా మంచి వాళ్ళం అనే అబద్ధం చెప్పడానికి ఇష్టపడతాం. మనం చేసే చెడ్డ పనిని వేరొకరి మీదో, పరిస్థితుల మీదో నెట్టేస్తాం. కనీసం మన అంతరాత్మని కూడా మనల్ని blame చేసే అవకాశం ఇవ్వం. అదంతా మనతో మనం మాట్లాడుకోవడం రాకపోవడం వలన జరిగే నష్టాలు. మనం ఎలాంటి వాళ్ళమో మన మనసుకి కూడా పూర్తిగా తెలియనప్పుడు, కనీసం అదైనా మనల్ని స్వేచ్ఛగా criticize చేయలేనప్పుడు ఇక మార్పుకు అవకాశం లేనట్టేగా.
ఎవ్వరూ మనల్ని చూడట్లేదు అని తెలిసినప్పుడు, మనం ఒక్కరమే ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలా ఆలోచిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం అంటారు పెద్దలు. ప్రతి క్షణం ఏదో ఒక entertainment లభిస్తున్న ఈ కాలంలో మనతో మనం మాట్లాడుకోవడం అనేదే తగ్గిపోయింది. మనల్ని మనం పరిశీలించుకోవడం, అంచనా వేసుకోవడం, healthy గా criticize చేసుకోవడం మన ఎదుగుదలకు మొదటి మెట్టు.
మరి ఎలా నేర్చుకోవాలి? బుచ్చిబాబు గారిది కానీ, కొడవటిగంటి కుటుంబరావు గారిది కానీ, గోపిచంద్ గారిది కానీ, చలం గారిది కానీ ఏదైనా పుస్తకం చదవండి. మన ఆలోచనలని observe చేయడం ఎంత ముఖ్యమో, దానివల్ల మన మానసిక, సామాజిక ఉన్నతి ఎంతగా ప్రభావితం అవుతుందో అర్ధం అవుతుంది. అలా చదవగా, చదవగా మనతో మనం మాట్లాడుకోవడం నచ్చుతుంది. మౌనంగా ప్రతీదానినీ observe చేయడం వస్తుంది. మన అలోచనా స్రవంతి వెంబడి మెల్లిగా నడుస్తూ, దానిని గమనించడం అబ్బుతుంది.
మ్యూజింగ్స్ లో చలం, చివరకు మిగిలేదిలో దయానిధి వారి ఆలోచనాధోరణిని, మనస్సుని పరిశీలించిన తీరు మనం నేర్చుకుని అమలు చేయదగ్గవి. తెలుగు సాహిత్యంలో తప్పకుండా చెప్పుకోవాల్సిన కథకులు, నవలాకారుల జాబితాలో ముందువరసలో ఉండేవారు బుచ్చిబాబు గారు. మనోవైజ్ఞానిక రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన బుచ్చిబాబు గారి రచనలకు మించిన మందులు ఉండవు.
ఈ వారం విడుదల కాబోతున్న ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ కథాసంపుటి చాలా విలక్షణమైనది. గొలుసుకట్టు కథల సంపుటి అది. ఒకే వ్యక్తి ఎందరో వ్యక్తుల జీవితాలను కథలుగా మనకు పరిచయం చేస్తుంటాడు ఈ సంపుటిలో. ఇందులోని ప్రతి కథ, ఒక ప్రత్యేకమైన జీవితమే. కానీ వాటిన్నటినీ కలిపే గొలుసు అంతర్వాహినిగా నడుస్తుంటుంది.
సామాజిక, వ్యక్తిగత, మానసిక, లైంగిక అంశాలు ఎన్నిటినో ఈ కథలలో చర్చిస్తారు బుచ్చిబాబు గారు. ఎన్నో చీకటి కోణాలు ఉండే ఈ అంశాలు మనతో మనం మాట్లాడుకోవడమే కష్టమని మనకు తెలుసు. అలాంటిది వాటిని పాఠకునితో చర్చించాలంటే బుచ్చిబాబు గారికి ఎంత ధైర్యం, సరళత్వం ఉండాలి? అందుకే వారి సాహిత్యం చదివితే మనతో మనకి సాన్నిహిత్యం పెంచుకోవడం నేర్చుకోవచ్చు అనేది.
“కథా సాహిత్యంలో బుచ్చిబాబు గారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ ఒక కళా ఖండం” అన్నారు ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుగారు. వంద కథలను, ఆ కథల కథకులను ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ద్వారా తెలుగువారికి పరిచయం చేసిన మారుతీరావు గారి నుండి వచ్చింది అంటే ఈ ప్రశంసకు ఎంత విలువ ఉందో వేరే చెప్పనవసరం లేదు. నా అనుభవం ప్రకారం ఈ కథల్ని ఒంటరిగా కూర్చుని, శ్రద్ధగా వినండి. మీకు ఉన్న ఎన్నో ప్రశ్నలు తీరిపోతాయి. మీ ఆలోచనల్ని embarrassment లేకుండా accept చేయగలిగే super power వస్తుంది.
మీ అందరి మనసులూ మీకు తెలిసే super power సిద్ధిరస్తు…
అభినందనలు,
మీనా యోగీశ్వర్.