నేను కన్యాశుల్కం నాటకం చదివినప్పట్నుంచి నాకు గుర్తుండిపోయిన డైలాగుల్లో ఈ ఫేమస్ డైలాగ్ కూడా ఒకటి. మాయాబజార్ లో కృష్ణుడు ‘ఈ తరం బాగా చెడిపోయారన్నయ్యా, మనం ఇలా ఉండేవాళ్ళమా’ అంటే అన్ని తరాల ముందు నుంచే తరువాతి తరం ముందు వారి కళ్ళకి తింగరాళ్ళల్లానే కనిపిస్తారన్నమాట అనిపించింది. పై డైలాగ్ కూడా అలాంటి ఫీలింగే ఇస్తుంది నాకు. అంటే 1920లు, 30ల నుంచే మన తెలుగాళ్ళకి తెలుగుతనంపై ప్రేమ లేదు అనేది Established Fact అన్నమాట.
అదే మాటని పునరుద్ఘాటించారు డిసెంబరు నెల ప్రసంగకర్త శ్రీమతి సత్య పాలంకి గారు. ఎలా తరాల తరబడి మన సంప్రదాయం, ఆహార విహారాలు, భాష వంటి వాటి పట్ల నిర్లక్ష్య వైఖరితో తెలుగు వాళ్ళు ఉన్నారు అన్నది ఆమె వివరిస్తూ ఉంటే భలే బాధ అనిపించింది. తమిళవాళ్ళు తమ భాషపై చూపించే ప్రేమను చూసి, తన మాతృభాష అయిన తెలుగుపై ప్రేమను పెంచుకున్నాను అని ఆమె చెప్తే ఇంకా బాధేసింది, ఆ పని ఒక తెలుగు వ్యక్తి చేయలేకపోయారే అని.
ఈ మధ్యే ఏదో రీల్ చూస్తోంటే తెలిసింది. టైటానిక్ ప్లేట్స్ షిఫ్ట్ జరిగి ఖండాలు, దేశాలు ఏర్పడినప్పట్నుంచే మన దక్షిణభారతదేశం ఒక ముక్కగా పటిష్టంగా ఉంది అని. సైన్స్ ప్రకారం చూస్తే అప్పట్నుంచే మన తెలుగునేల ఉందన్నమాట. ఇక పురాణాల సంగతి ఆమె ప్రసంగంలో చెప్పనే చెప్పారు. తైత్తరీయ బ్రాహ్మణంలో మన తెలుగు నేల, రాజులు, ప్రజల ప్రస్తావన గురించి. ప్రాకృతంలో వచ్చిన గాధాసప్తశతిలో క్రీ.శ. మొదటి శతాబ్ధానికి పూర్వమే నాగరీకమైన మన జాతిలోని సామాన్య జీవితాల చిత్రణ చూడవచ్చు. అంతటి పురాతన చరిత్ర కలిగిన మనం, మన సంస్కృతి-భాషలకు ఇచ్చే గౌరవం ఏమిటి?
నేను తెలుగు వ్యక్తిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడే అంతటి పెద్ద తప్పు తెలుగు ఏం చేసింది? మన పూర్వులు ఏం చేశారు? ఎన్ని రకాలుగా విడిపోవచ్చో మన తెలుగు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఆఖరికి ఊరు, సందు, సందుకి ఎడమ/కుడి అని కూడా విడదీసుకోగల సమర్ధులం మనం. కానీ మనమందరం ఒకే తాటిపై నిలవగలిగే విషయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మన తెలుగుదనాన్ని ఒప్పుకోకపోవడం. మన Cultural Identityని deny చేయడం. అందులో మాత్రం ఎక్కడా లేని ఐకమత్యం మనకి.
సర్లే, ప్రసంగం ఎలా జరిగిందో చెప్పవమ్మా అంటే ఊరికే తిట్ల దండకం అందుకుంటావేం అంటారా? ఏం లేదండీ, ఆమె ప్రసంగం విన్నాకా ఇంత గొప్ప చరిత్ర, rich heritageని మనం మోయడానికి, తరువాతి తరానికి ఇవ్వడానికి సిగ్గుపడుతున్నాం అనే విషయం వారం అయినా నా బుర్రలో నుండి పోవడం లేదు. అందుకే ఈ న్యూస్ లెటర్ అంతా మన అమాయకత్వాన్ని తిట్ట బుద్ధి అయ్యి ఇలా.. సరే, అందర్నీ ఒక గాటన కట్టడం నాదే తప్పు. తెలుగు కోసం మీరు ఎంత చేస్తున్నారో రెండేళ్ళ క్రితమే రుజువైంది.
తెలుగు కోసం అంకితమైన దాసుభాషితాన్ని మీ భుజాన వేసుకున్నప్పుడే గురజాడ తిట్టిన “మనవాళ్ళల్లో” మీరు లేరని నాకు తెలుసు. మిగిలినవాళ్ళతో మిమ్మల్ని కలిపి మాట్లాడినందుకు క్షమించండి. నా బాధంతా ప్రతి తరం తెలుగుదనంతో ఉట్టిపడాలి. ప్రతి తెలుగు ఇల్లు తెలుగు భాషతో కళకళలాడాలి. మన ప్రభుత్వం తన కర్తవ్యం తెలుసుకుని, తెలుగును నిలబెట్టేందుకు కృషి చేయాలి. అంతే. ఇక అసలు చరిత్ర విషయానికి వస్తే.. నేను చెప్తే బాగోదు. ఎందుకంటే అక్కడ ఒక చరిత్ర పండితురాలితో వీడియో ఉండగా నేను ఊకదంపుడు ఎందుకు లెద్దూ. ఈ కింది లింకులో ఉన్న ప్రసంగం చూసేయండి. మీరే First Hand Information తెలుసుకోండి.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం - బుక్ ఫెయిర్ లో నేరుగా కలుసుకుందాం..
నిజంగా నిజమండీ బాబూ.. బుక్ ఫెయిర్ లో స్టాల్ పెడుతున్నాం. డిసెంబర్ 19 నుంచి 29వరకూ ప్రతిరోజూ మనం కలిసి, మాట్లాడుకోవచ్చు. నేను, దాసుకిరణ్ గారు, లక్ష్మీ ప్రభగారు, రామ్ కొత్తపల్లి స్టాల్ నెంబర్ - 100 లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకూ ఉంటాం. చక్కగా మిర్చి బజ్జీలో, మిర్చరో లాగించేస్తూ హాయిగా కబుర్లు చెప్పుకుందాం వచ్చేయండి.
ఇంకో ప్రత్యేక ఆహ్వానం కూడానండోయ్. మన పవన్ సంతోష్ సూరంపూడి లేడూ, తన పుస్తకం ‘నేడే చూడండి - తెలుగోళ్ళు, సినిమాలు, ఒక చరిత్ర’ పుస్తకం విడుదల చేస్తున్నాడు. అదేనండి మనం మన యాప్ లో ఆడియో రూపంలో విన్నామే, ఆ పుస్తకమే. ఇప్పుడు పుస్తక రూపంలో వస్తోందన్నమాట. డిసెంబర్ 20వతేదీ శుక్రవారం, సాయంత్రం 7గంటలకు ముహూర్తం బేషుగ్గా ఉందబ్బాయ్, అప్పుడు పెట్టుకో విడుదల అన్నాను. చిత్తం గురువుగారూ, అంతా మీ దయ అన్నాడు. పాపం మంచి కుర్రాడులే.
పైగా మన దాసుభాషితం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ‘మీరే వ్యాఖ్యాతగా ఉండి, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలి’ అని ఓహో గట్టి పట్టు పట్టేశాడు. సరే ఎంత కాదన్నా నాకన్నా పెద్దవాడు, అన్నయ్య కూడాను ‘సర్లే, అలాగే చేద్దాం’ అన్నాను. పాపం పారితోషకం ఏదో అనబోయాడు. అబ్బే వద్దు బాబూ నేను తెలుగు కోసం ఇలాంటివి ఫ్రీగా చేస్తాను(కాస్త పేరు వచ్చేదాకా, సుమ అంత అయిపోయాకా ఎలాగో తీసుకుంటాం అనుకోండి) అన్నాను. అంతా నా దయా హృదయం అని పొంగిపోయాడు.
అదండీ విషయం. మరి ఆరోజు కూడా వచ్చి, మన దాసుభాషితం రచయిత నుండి వస్తున్న ఈ పుస్తకాన్ని ఒకటికి, రెండు కాపీలు కొనుక్కోవాలని ఆజ్ఞాపిస్తూ.. అదే అదే ఆశిస్తూ ఇక శలవు తీసుకుంటా. అసలే ఆ రోజు బాగా కనపడాలంటే.. అదే అదే మాట్లాడాలంటే ఒక కొత్త చీర కావాలిగా. నేను షాపింగ్ కి వెళ్ళాలి. ఉంటాను మరి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.