ఒక రచనను అనువాదం చేయడం అంటే ఒక కథనో, విషయాన్నో ఒక భాషలో నుండి మరో భాషలోకి తర్జుమా చేయడం కాదు. ఆ రచయిత ఏ సందర్భంలో ఆ రచన చేశారో, అలా చేయడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమిటో, ఏం చెప్పదలిచారో, మనం ఎలా అర్ధం చేసుకుంటే ఆ రచయిత బాగా అర్ధం అవుతారో, ముఖ్యంగా ఆ రచనలో ఉన్న భాష, సంస్కృతి వంటి వాటిని ఎంతవరకూ అనువదించాలో, ఎంతవరకూ ఉన్నది ఉన్నట్టుగా ఉంచేయాలో అన్నీ తెలియాలి. అవన్నీ శక్త్యానుసారం execute కూడా చేయగలగాలి. అప్పుడే ఒక రచనకి, ఒక రచయితకి అనువాదకులు పూర్తి న్యాయం చేయగలరు.
సమకాలీన సాహిత్యంలో అలాంటి అనువాదకులు చాలా అరుదు. వారిలో ఒకరే ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, ఎలమి ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు పూర్ణిమ తమ్మిరెడ్డి గారు. తన అనువాద రచన ప్రచురించడానికి ఆమె ఎదుర్కొన్న కష్ట నిష్టూరాలకు సమాధానమే ఎలమి ప్రచురణ సంస్థ. తను అనువదించిన రచయితకి న్యాయం జరగడం కోసం, పాఠకులకు రచయిత ఎక్కడా తప్పుగా అర్ధం అవ్వకుండా ఉండడం కోసం, ఏ పరిస్థితులు రచయితను ఎలాంటి మాట అనడానికి దారి తీశాయో పాఠకులకు నిష్కర్షగా చెప్పడం కోసం ఆమె తీసుకోగలిగిన అతి పెద్ద నిర్ణయం, తీసేసుకున్నారు. అదే ఈ ప్రచురణ సంస్థ. తన రచయితపై అంతటి గౌరవం, ప్రేమ ఆమెకి.
ఈ నెల ప్రసంగాలు కార్యక్రమంలో అనువాదం అనే సాహితీ ప్రక్రియను 360డిగ్రీలలో మనకి పరిచయం చేశారు పూర్ణిమ గారు. ప్రతీ పదాన్నీ అనువాదం చేయాలా? వంటి సాధారణ ప్రశ్న దగ్గర నుంచి, ఎంతటి రీసెర్చి చేస్తే ఒక రచయిత పూర్తిగా మన అవగాహనలోకి వస్తారు వంటి క్లిష్టమైన విషయం దాకా ఎన్నో చెప్పారు. ముఖ్యంగా సాదత్ హసన్ మంటో వంటి వివాదాస్పద రచయితను అనువదించేటప్పుడు తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను చాలా బాగా వివరించారు.
‘మంటోతో కలిసి నవ్వాను. అతను ఏడ్చినప్పుడు నేను కూడా ఏడ్చాను. సాటి మనిషిగా అతన్ని అర్ధం చేసుకున్నాను. ఒకరకంగా చెప్పాలంటే అతనితో కలసి ప్రయాణం చేశాను’ అన్న వాక్యం చూడడానికి చాలా సాధారణంగా అనిపిస్తున్నా, పూర్ణిమ గారు వివరించేటప్పుడు ఆ వాక్యం లోతు, ఆమెకు మంటోతో ఉన్న అనుబంధం అర్ధం అవుతాయి. మంటోలో ఉన్న ఎన్నో లోటుపాట్లు, అతని ఆలోచనాధోరణిలో పూర్ణిమగారికి నచ్చని విషయాలు ఎన్నో ఉన్నా, మన స్వంతవారిని ఎలా వారి flaws అన్నిటితోనూ ఇష్టపడతామో, అలా ఇష్టపడ్డారు ఆమె. ఒక రచయితను అలా ఇష్టపడడం కష్టం.
ఎందుకంటే, కొందరు ఆ విషయాలను పూర్తిగా విస్మరించడమో, వెనకేసుకురావడమో చేస్తారు. మరికొందరు ఆ విషయాల కోసం ఆ రచయితని వదిలేస్తారు. అంతే కానీ, మంచిని ఇష్టపడడం, చెడు ఉంది అని ఒప్పుకోవడం సాధారణంగా జరగదు. ఆమె అలా మంటోని అర్ధం చేసుకుని, ఇష్టపడ్డారు కాబట్టే ఆ అనువాదం చదువుతున్నప్పుడు అంత అందంగా, హృద్యంగా, ఒక పక్క ఎంతో బలంగా ఉంటూనే, మరోపక్క ఎంతో నాజూకుగా అనిపిస్తుంది. నా ఉద్దేశ్యంలో పూర్ణిమగారు తన వ్యక్తిగత జీవితంలోని సుఖదుఃఖాలతో సహితంగా అన్ని సందర్భాలలోనూ మంటోతో సహజీవనం చేశారు. ఆయన ఎత్తుపల్లాలు ఆమె ఎలా చూశారో, ఆమె రచనా జీవితంలోని ఎత్తుపల్లాలను కూడా మంటో చూశారు అనిపిస్తుంది నాకు.
సరే, ఇలా ఎంతని చెప్పుకుంటూ పోతాను? మీరు కూడా ప్రసంగం చూడాలి కదా. ప్రసంగం విన్నదానిగా నా ఉద్దేశ్యం పైన చెప్పాను. మీరు కూడా విని, మీ ఆలోచనలను కూడగట్టుకోవాలి కదా. అందుకే మంటోతోనే ఆపేస్తున్నాను. అసలు సాహితీ ప్రక్రియగా అనువాదం అనే విషయంపై పూర్ణిమ గారు చెప్పిన మరెన్నో విషయాలను, నేరుగా వీడియో చూసే తెలుసుకోవాలి. ఎందుకంటే, ఆమెది అత్యద్భుతమైన వ్యక్తీకరణ. ఒక అనువాద రచయితకే కాక, సామాన్య పాఠకునికి కూడా అనువాద రచనను ఎలా చూడాలి అనే విషయం అవగాహన వచ్చేలా ఆమె మాట్లాడారు. కాబట్టీ, ఆమెని మీకే వదలిస్తున్నాను. నేను కల్పించుకోను ఇక. ఈ ప్రసంగం యూట్యూబ్ వీడియో అతి త్వరలో విడుదల అవుతుంది. చూసేయండి మరి.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.