ఈ వారం రెండు విభిన్నమైన అంశాల గురించి మాట్లాడుకుందాము. ఒకటి ఆత్మ జ్ఞానానికి సంబంధించినదైతే, రెండోది, లౌకిక జీవనంలో అతి ముఖ్యమైన “డబ్బు” గురించి.
ముందు ఆత్మజ్ఞానానికి సంబంధించి థాట్ ఎక్సపెరిమెంట్స్ గురించి చెప్పుకుందాము.
రజ్జు-సర్పం. తల లేకపోవడం.
మన వ్యవహారిక వాడుకలో వేదాంతం పదానికి పెద్ద గౌరవం లేదనే చెప్పాలి. “ఆఁ ఆయనదో వేదాంత ధోరణి!”, “ఏవిటో మెట్ట వేదాంతం మాట్లాడతాడు” లాంటి వాక్యాలు మనం వింటూ ఉంటాము. దీనికి కారణం వేదాంతం సులభంగా అంతు చిక్కక పోవడమే. అందుకే మన ప్రాచీన ఋషులు, అప్పటి దైనందిన జీవితంలో తారసపడే వాటితోనే అనేక ఉపమానాలల్లి, వేదాంతం అర్థం అయ్యేలా చెప్పటానికి ప్రయత్నించారు. అందులో అతి ప్రాచుర్యం పొందింది రజ్జు-సర్పం ఉపమానం.
అజ్ఞానం అంటే, మసక వెలుతురులో తాడును చూసి పాము అని భ్రాంతి చెందడం వంటిదేనని, వెలుతురులో చూస్తే తాడు నిజస్వరూపం కనపడినట్టు, ఆత్మ జ్ఞానం అనే వెలుతురులో మన నిజమైన స్వరూపం కనపడి అజ్ఞానం పటాపంచలవుతుందని, ఆ ఉపమానం సారాంశం.
ఇలా తెలిసిన వస్తువులతోనే కాకుండా, కొందరు ఆధునిక తత్త్వవేత్తలు కొన్ని radical ప్రతిపాదనల ద్వారా కూడా అద్వైతాన్ని చూపడానికి ప్రయత్నించారు. అందులో చెప్పుకోదగ్గది, డగ్లస్ హార్డింగ్ ప్రతిపాదించిన “Having no head” అనే సిద్ధాంతం.
ఈ పరిశోధనలో భాగంగా ఒక చిన్న ప్రక్రియను సూచిస్తాడు. అదేంటంటే, మీ చూపుడు వేలును మీ మొహం వరకు ఎత్తి మీ వైపుకు తిప్పాలి.
ఇపుడు మీ చూపుడు వేలు దేనిని పాయింట్ అవుట్ చేస్తుంది? వెంటనే మొహం అంటాం. కానీ అక్కడ ఉన్నది కనపడే ప్రపంచమేనే!
మనిషి చరిత్ర చూస్తే, అద్దం వాడుక నుంచే మన మొహం మనకి తెలుస్తోంది. అప్పటివరకు, మహా అయితే ముక్కు కోస భాగం కొంచెం కనిపించేదేమో. అపుడు first person perspective లో చూస్తే, మన తల ఉన్న భాగంలో మన చైతన్యానికి కనిపిస్తోంది ప్రపంచమే కదా.
ఇది హార్డింగ్ సూత్రీకరణ.
ఇది కాస్త జటిలమైన ప్రయోగమే. చిన్నప్పటినుంచి అద్దంలో మన మొహం చూసుకోవడం వల్ల, ఆ ప్రతిబింబం మన మస్తిష్కంలో బలంగా నాటుకు పోయింది. అందుకే హార్డింగ్ చెప్పిన థాట్ ఎక్స్పరిమెంట్ చేయడం అంత సులువు కాదు. అయితే ఈ వీడియో మీకు సహాయపడగలదు.
కుందేలు చూపే ఆదిమధ్యాంతరహిత్యం.
నా ఆత్మవిచారణలో నాకు తట్టిన థాట్ ఎక్స్పరిమెంట్ ఒకటి ఇపుడు చూద్దాం.
శివ పురాణం లో అగ్నిధార రూపంలో ఉన్న శివుడి మొదలు తుది తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు హంస - వరాహ రూపాల్లో విఫల యత్నం చేయడం అనే కథ ఉంది.
దేవుడుకి పరిధులుండవని, ఆయన ఆది- మధ్య- అంత రహితుడని అంతర్లీనంగా తెలిపే కథ అది. మానవులు దైవ స్వరూపాలంటారు. అంటే దైవ గుణాలు మనలో కూడా ఉండాలి.
ఒక కుందేలుతో చేసే చిన్న విచారణతో, ఈ ఆదిమధ్యాంతరాహిత్యం అనే గుణాన్ని మనలో కూడా దర్శించే ప్రయత్నం పైవీడియోలో చూడవచ్చు.
పై వీడియో చూసి వదిలేయకుండా మీరూ ప్రయత్నించండి. మీ అనుభవాలను YouTube కామెంట్స్ మాతో పంచుకోండి.
ఆర్ధికారోగ్యం
24 ఏళ్ళ అబ్బాయి/అమ్మాయి. అప్పుడే చదువు పూర్తి చేసుకుని, వెనుక educational loan అనే బరువు మోస్తూ, మొదటి ఉద్యోగంలోకి అడుగుపెట్టారు. కొత్త ఊరు, హాస్టల్/రూమ్ కు కట్టాల్సిన అద్దె, ఆఫీస్ కు ప్రయాణపు ఖర్చులు, తిండి, సరదాలు, అమ్మా, నాన్నలకు ఏదైనా కొనిపెట్టాలనే ఆశలు. వచ్చేది ఏ 15వేలో ఉంటుంది. మొదటి వారంలోనే ఈ జీతంలోని సింహభాగం ఖర్చైపోతుంది. కానీ రాబోయే భవిష్యత్ కోసం ఎంతో కొంతైనా దాచాలనే కోరిక మాత్రం ఏ నెలకానెల అలాగే ఉండిపోతుంది.
ఒక సగటు మధ్యతరగతి మనిషి. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, పెద్దల మందులు, లోన్లు, చిన్నా చితకా అనవసరపు ఖర్చులు. వారికీ ఒకటే కల. భవిష్యత్ కోసం ఏదైనా దాచాలి. పెరిగే బాధ్యతలకు తగ్గట్టుగా అవసరాలకు ఆ దాచిన సొమ్ము ఉపయోగపడాలి. ఎవరో స్నేహితుడు/స్నేహితురాలు వేసే చిట్టీలో డబ్బులు కట్టి, హమ్మయ్యా invest చేశాం అనుకుంటారు. కానీ ఏదైనా జరగరానిది జరిగి, ఆ చిట్టీ డబ్బులు పోతే, ఇంట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా తారుమారైపోతాయి. పొదుపు సంగతి దేవుడెరుగు, జరుగుబాటు కష్టమయ్యే పరిస్థితిలోకి దిగజారిపోతారు.
అందుకే ప్రతివారికీ ఆర్ధికారోగ్యంపై అవగాహన, శ్రద్ధా చాలా అవసరం. ఎందుకు పొదుపు చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడ invest చేస్తే ఎక్కువ శాతం safe zone లో ఉంటాం వంటి విషయాలు ప్రతివారికీ తప్పకుండా తెలియాల్సినవి. దాసుభాషితం లక్ష్యం ఒక మనిషి సమగ్ర శ్రేయస్సుకు సోపానాలను నిర్మించడమే. ఆర్ధిక భద్రత మన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను శాసించే అతి పెద్ద విషయం. Financial Stability ఉన్న నాడే మనం ఏ ఇతర విషయలపైనైనా దృష్టి పెట్టగలం.
అందుకే మీ ఆర్ధికారోగ్యాన్ని రక్షించుకునే సాధనాలను మీకు అందించాలనేదే మా ఉద్ధేశ్యం. ఈ ‘ఆర్ధికారోగ్యం’ సిరీస్ ను ప్రారంభించడానికి వెనుక మాకు ఉన్న ఆలోచన ఇదే. ప్రముఖ కోరన్, స్టాక్ మార్కెట్ నిపుణులు అలోక్ నంద ప్రసాద్ గారు, తెలుగు కోరాలో ఆర్ధిక విషయాలపై రాసిన సమాధానాలను ఈ సిరీస్ లో మొదటి సీజన్ గా ఈ వారం అందిస్తున్నాం.
జూన్ 3, దాసుభాషితం ప్రసంగం వక్త ఎవరు?
ప్రతి నెల మొదటి శనివారం దాసుభాషితం నిర్వహించే ప్రసంగాలలో భాగంగా జూన్ నెల మొదటి శనివారం అంటే 3వ తేదీ ఉదయం 11 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ఆర్ధిక విశేషాలు, పెట్టుబడులు, మార్కెట్ పోకడలు వంటి విషయాలపై ఈ సిరీస్ రచయిత అయిన అలోక్ నంద ప్రసాద్ గారు ప్రసంగిస్తారు. కెరీర్ ప్రారంభం నుండి, రిటైర్మెంట్ ప్లానింగ్ వరకూ మన ఆర్ధికారోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఈ సిరీస్ ద్వారా, ప్రసంగం ద్వారా కూడా అలోక్ గారి నుండి తెలుసుకుందాం.
ఈ ప్రసంగం లో దాసుభాషితం జీవిత సభ్యత్వం తీసుకున్న వారు లైవ్ గా పాల్గొనవచ్చు. దీని రికార్డింగ్ తర్వాత దాసుభాషితం YouTube ఛానల్ లో వీడియో రూపంలో, దాసుభాషితం యాప్ లో ఆడియో రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది.
మీ దాసుకిరణ్.