మీరు ఏ కాలానికి వెళ్తారు?

Meena Yogeshwar
February 24, 2025

మన భూమి ఉపరితలం కన్నా, core వయసు రెండున్నర సంవత్సరాలు తక్కువని తెలిసి భలే ఆశ్చర్యం వేసింది. కొన్ని గ్రహాల్లో ఒక సంవత్సరం సమయం గడిపితే మన భూమిపై 7, 8 సంవత్సరాలు గడిచిపోతాయి అని తెలిసినప్పుడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే, ఇలాంటి విషయాలు మన భారతీయ ఇతిహాసాలలో విన్నాను కాబట్టీ. బ్రహ్మకు ఒక రోజు అంటే మానవ సంవత్సరాలలో 100ఏళ్ళు అని, భూమిపై జీవులు, ఇతర లోకాల కన్నా అల్పాయుష్కులు అని విన్న విషయాలన్నీ గుర్తుకువచ్చాయి. మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ‘కాలం పరబ్రహ్మ స్వరూపం’ అని. అందులోనే ఎన్నో రహస్యాలు...

మనలో చాలామంది కాలం ఒక linear lineలాగా ముందుకు వెళ్తుంది అనే ఆలోచన ఉంది. నాకూ అలాగే ఉండేది. సైన్స్ లో ఐన్ స్టీన్ సిద్ధాంతాలు చదివినప్పటి కంటే, Interstellar సినిమా చూసినప్పుడు నా ఊహలో బీటలు మొదలయ్యాయి. ఆ సినిమా పూర్తిగా అర్ధమైపోయింది అని చెప్పను కానీ, కాలం విషయంలో నా ఆలోచనలో గొప్ప మార్పు వచ్చింది. ఐన్ స్టీన్ చెప్పిన Theory of Relativity చదువుకున్నప్పుడు నా మట్టిబుర్రకి అంత గొప్పగా ఎక్క లేదు. కానీ ఆ సినిమా చూసినప్పుడు gravity కాలాన్ని ఎలా మారుస్తుంది అనేది కాస్త అర్ధమైంది. తరువాత ఆసక్తి పుట్టి చదువుకుంటే, మన భూమి ఉపరితలం కన్నా, core వయసు రెండున్నర సంవత్సరాలు తక్కువని తెలిసి భలే ఆశ్చర్యం వేసింది.

కొన్ని గ్రహాల్లో ఒక సంవత్సరం సమయం గడిపితే మన భూమిపై 7, 8 సంవత్సరాలు గడిచిపోతాయి అని తెలిసినప్పుడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే, ఇలాంటి విషయాలు మన భారతీయ ఇతిహాసాలలో విన్నాను కాబట్టీ. బ్రహ్మకు ఒక రోజు అంటే మానవ సంవత్సరాలలో 100ఏళ్ళు అని, భూమిపై జీవులు, ఇతర లోకాల కన్నా అల్పాయుష్కులు అని విన్న విషయాలన్నీ గుర్తుకువచ్చాయి. మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ‘కాలం పరబ్రహ్మ స్వరూపం’ అని. అందులోనే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావ్? అసలు నీ శీర్షికకి, నీ ఉపోద్ఘాతానికి ఏమైనా సంబంధం ఉందా? ఊరికే పెట్టావా అంటారా? ఎప్పుడు కంగారేనండీ మీకు. నేను చెప్పేది పూర్తిగా వినకుండానే, నన్ను అనుమానిస్తారు. ఏదో సోది చెప్పేస్తానేమో అని అంత భయం ఎందుకు మీకు. సరే, అసలు విషయం ఏమిటంటే, మొన్న మా మేనకోడలు ఒక మాట అంది. ‘అత్తా, మనం చూసే సాధారణ విషయాలు, సినిమాలు, పాటలు చెత్తా చెదారం అంతా ఎప్పటికీ గుర్తు ఉండిపోయే విషయాలన్నీ Right Brainలోనూ, చదువు, ముఖ్యమైన విషయాలను త్వరగా మర్చిపోయే Left Brain లోనూ దాచుకునులే దేవుడు ఎందుకు చేశాడు? మన మీద కక్ష కాకపోతే’ అని.

నిజమే అనిపించింది. పోనీ మన విద్యా విధానం అయినా ఇలా ఎందుకు ఉండాలి? క్లిష్టమైన విషయాలన్నీ సినిమా చూపించినట్టు చూపిస్తే, మనకి ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి కదా. సైన్స్ లో చదువుకున్నప్పటి కన్నా, ఆ సినిమాలో చూసినప్పుడు కాలం గురించిన విషయాలు బాగా అర్ధం అయ్యాయి, గుర్తు ఉన్నాయి కూడా. అయితే, తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్లు తక్కువ. ఎక్కడో ఆదిత్య 369 సినిమాలో టైం ట్రావెల్ గురించి, భవిష్యత్తులో భూమి పరిస్థితి గురించి చూపారు. కానీ పాపులర్ తెలుగు సాహిత్యంలో మాత్రం ఇలాంటి ప్రయత్నాలు నాకు తెలిసినంతవరకూ తక్కువ(ఒకవేళ జరిగి ఉంటే క్షమించండి. నా ఎరుకలో ఉన్నంతవరకూ మాత్రమే నేను చెప్తున్నాను).

అలాంటి ఓ మంచి ప్రయత్నమే ప్రముఖ రచయిత్రి శ్రీమతి పాలంకి సత్య గారు రాసిన ‘కలయిక కాలాతీతం’ నవల. ఒక ఆధునిక బృందం టైం ట్రావెల్ చేసి, శాతవాహన కాలంలోని కృష్ణాజిల్లా శ్రీకాకుళంకు వెళ్ళడమే ఈ నవల ఇతివృత్తం. నిజానికి శాస్త్రపరంగా ఏ విషయాలనూ ఈ నవలలో చర్చించకపోయినా, అప్పటి కాలాన్ని మాత్రం మన కళ్ళకి కట్టారు సత్య గారు. గుణాఢ్యుడి బృహత్కథ ఆధారంగా ఆనాటి సమాజాన్ని ఈ నవలలో నిర్మించారు అనిపించింది నాకు.

అప్పటి సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, న్యాయపరమైన సామాన్య జీవనం ఎలా ఉంటుంది అనేది ఈ నవల వింటే, సుస్పష్టంగా అర్ధం అవుతుంది. అంతే కాదు, ఎన్నో చారిత్రిక విషయాలను కూడా సంభాషణల ద్వారా వివరించారు ఆమె. ఆంధ్ర జాతి విశ్వామిత్రునిచే శాపం పొంది, దొంగలు, దోపిడీదారులుగా మారిన ఆయన కొడుకుల నుండి పుట్టిన జాతా? లేక ఇక్ష్వాకుల నుండి పుట్టిన జాతా వంటి గంభీరమైన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఈ నవలలో. అప్పటి స్త్రీ, పురుషుల వస్త్రాలు, అలంకరణ, భోజనం, జీవనం, ప్రయాణం, విద్య, వైద్యం ఇలా ఆమె స్పృశించని అంశం లేదంటే అతిశయోక్తి కాదు.

Tap to Listen

ఈ నవల విన్న తరువాత నాకు కూడా అలా వివిధ కాలాలోకి వెళ్ళాలని అనిపించింది. భారతీయ, ప్రపంచ చరిత్ర గతిని ఎప్పటికీ మార్చేసే కొన్ని ఘట్టాలను జరగకుండా ఆపే ప్రయత్నం చేయాలనిపించింది. అంటే, మెగస్తనీస్ దగ్గరకి వెళ్ళి లాగి ఒక్కటి కొట్టి మా చరిత్రని తిన్నగా రాయి, అన్నేసి శతాబ్ధాలు దాచేసి తప్పుడు చరిత్ర రాయకు అనాలనిపించింది. అలాగే మొట్టమొదటి ఆంగ్లేయుడు మన భూమిపై అడుగుపెట్టిన వెంటనే వాళ్ళని చంపేసి, భారత ఉపఖండంలోని రాజులందరికీ ఈ ఆంగ్లేయుల్ని రానివ్వద్దని చెప్పాలనిపించింది.

ఏదోటి చేసి హిట్లర్ ని లేపేస్తే బాగుండును అనిపించింది. క్విట్ ఇండియా ఉద్యమానికి వెనుక నుండి గోతులు తవ్విన వారిని, దేశ విభజనకు కారణమైన వారిని ఆపేయాలనిపించింది. సుభాష్ చంద్ర బోస్ ఆరోజు ఆ విమానం ఎక్కకుండా అడ్డుకోవాలనిపించింది. ఇలా నాకన్నా ముందు చాలామంది ఆలోచించారని, దానినే ‘Alternative History’ అంటారని మా అన్నయ్య చెప్పాడు. క్వింటెన్ టొరంటినో అనే పెద్దమనిషి గొప్ప సినిమాలు తీశాడని తెలుసుగానీ, ఆ సినిమాల్లో కొన్నిటికి ఇదే ఇతివృత్తమని తెలిసి, కాసేపు నేనూ క్వింటెన్ ఒకేలా ఆలోచిస్తాం అనిపించి గర్వంగా కూడా అనిపించేసింది. అది మన వీక్ నెస్ లే కానీ.

ఇంతకీ మీరు ఏ కాలానికి వెళ్తారు? వెళ్తే ఏం చేస్తారు? ఈ నవల వినేసి, మీరూ ఓ సినిమా ఏస్కోండి మీ మనసులో మిమ్మల్ని మీరు టైం ట్రావెల్ చేస్తూ ఊహించుకుని. సరేనా?

‘ఈతరం తెలుగు’ అంశంపై వచ్చే నెల ప్రసంగం..

పదుల సంఖ్యలో Instagram Pages ఉన్నాయి తెలుగు సాహిత్యం, తెలుగు సినిమా, తెలుగు సినిమా సాహిత్యాల గురించి చెప్పేవి. వాటికి వేలల నుంచి లక్షల వరకూ Followers. పుస్తకాల అమ్మకాలు వేలు దాటి లక్షలోకి అడుగుపెడుతున్నాయి. ఎన్నో బుక్ క్లబ్స్ వెలిశాయి. వెరసి, తెలుగు భాషకే మొత్తంగా మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తోంది నాకు. తెలుగు సాహిత్యంలో మాత్రం ఖచ్చితంగా New Age మొదలైంది అని చెప్పవచ్చు.

అది ఎంతవరకూ జరిగింది? ఇంకా ఎంత ప్రయాణం ఉంది? నిజంగా నా ఆలోచనలన్నీ ఊహలు, కలలా? నిజాలా? ఇవన్నీ తెలుసుకోవాలంటే, ఇదే పనిలో ఉన్న మనిషితో మాట్లాడాలి. నేను ఒకదాన్నే మాట్లాడేసి, తెలుసుకుని, విషయాన్ని ఇక్కడితో ఉంచేసే స్వార్ధపరురాల్ని కాదు అని మీకు తెలుసు. అందుకే ఇలాంటి ముఖ్య విషయాలనే మన ప్రసంగాలకు అంశాలుగా ఎంచుకుంటాను కదా. ఇప్పుడూ అదే చేశా. 

Instagramలో దాదాపు 25వేలకు పైగా Followers ఉన్న తెలుగు సాహిత్యపు పేజి ‘Telugu Collective’. ఆ పేజీ నిర్వాహకులు ఆదిత్య అన్నావఝుల గారిని మన ప్రసంగానికి ఆహ్వానించాను. మార్చి నెల 1వ తేదీ, శనివారం ఉదయం 9.30గంటలకు, ఈ అంశంపై ఆదిత్య ప్రసంగించనున్నారు. తరువాతి తరాల్లో తెలుగు భవిష్యత్ ఏమిటో తెలుసుకోవాలనుందా? వచ్చేయండి మరి ప్రసంగానికి.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :