2022 హైదరాబాద్ బుక్ ఫెయిర్ తర్వాత తిరిగి దాసుభాషితం పాల్గొన్న బుక్ ఫెయిర్ ఈ 2024 బుక్ ఫెయిర్ ఏ. సరిగ్గా 2 వారాల ముందర మేము బుక్ ఫెయిర్ స్టాల్స్ కి దరఖాస్తు చేసుకోవడమూ, మాకు 100 వ నెంబర్ స్టాల్ రావడమూ బుక్ ఫెయిర్ లో స్టాల్ నిర్వహణకు మేము ప్రణాళికలు వేసుకుని సన్నద్ధం అవడం జరిగింది.
మా టీమంతా కలిసి అసలు ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ లో పాల్గొంటున్నాము అంటే భలే ఉంటుంది లెండి. అదొక ఇంట్లో పండగల్లే మినీపెళ్లి సందడిలా ఉంటుంది. మా సంభాషణలు కూడా ప్రత్యేక మీటుంగులు పెట్టుకుని, డిజైన్స్ ఎలా చేయాలి? ఏం చేయాలి అని కిరణ్ గారితోనూ, బుక్ ఫెయిర్ లో స్టాల్ ని సందర్శించిన వారికి, యాప్ గురించి తెలుసుకున్న వారికి ఇద్దాం అనుకున్న తాయిలాల గురించి మీనా అక్క, ప్రభ అక్కతోనూ చర్చలు జరిగాయి.
19వ తారీఖున పుస్తకాల పండగ మొదలైనా అసలు కళ అంతా 20వ తారీఖు నుంచే మొదలైంది. పైగా ఆరోజున మన పవన్ సంతోష్ సూరంపూడి రాసిన నేడే చూడండి. తెలుగోళ్లు. సినిమాలు. ఒక చరిత్ర పుస్తకం కూడా విడుదల అయింది. ఆ విడుదలకి మన మీనమ్మే వ్యాఖ్యాత. ఆరోజు కూకట్పల్లి నుంచి మీనా అక్క, నేను ఆటోలో వస్తున్నామా అసలు ప్రిపేర్ కాలేదు కాలేదు అంటూనే ఉంది కానీ స్టేజ్ ఎక్కాక ఎంత చక్కగా వ్యాఖ్యానించిందో. పవన్ సంతోష్ గారి పుస్తకం విడుదలై ఇప్పుడు అమెజాన్ లో లభ్యం అవుతోంది.
దాసుభాషితం తరపున మేము ముందు నుండి కూడా యాప్ యూజర్స్ నీ నేరుగా కలవాలని, వారితో మాట్లాడాలని ఆలోచనలతో ఉన్నాము. అందుకు తగిన వేదిక ఈ పుస్తకాల పండగే అవడం ఇంకా బాగా కుదిరింది. 2022 లో మేము నిర్వహించిన స్టాల్ వలన అప్పటికి మేము కొంత మందికే తెలుసు, ఇంకా కొంతమందికి పరిచయం అయ్యాము. జీవితకాల సభ్యత్వం తీసుకుని అప్పుడు దాసుభాషితం యాప్ ని నిలబెట్టిన ఎందరో యూజర్స్ తో ఒక వాట్సాప్ కూటమిని ఏర్పాటు చేసిన విషయం అందిరికీ తెలిసిందే.
మొదట మేము నిర్వహించిన బుక్ స్టాల్ కి ఇప్పుడు మేము నిర్వహించిన బుక్ స్టాల్ కి ఎంత తేడా ఉంది! అప్పుడు మేము చిన్న టీమ్ ఇప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు, ప్రజలే నిర్మించడానికి ముందుకు వచ్చిన దాసుభాషితం యాప్ వాడుకరులు కూడా ముందుకు వచ్చి ఈ బుక్ ఫెయిర్ లో మాకు సహకరించారు.
బుక్ ఫెయిర్ లో ఎన్నో స్టాల్స్ కి సెలబ్రిటీలు వచ్చారు వెళ్లారు. మా సెలబ్రిటీలు మాత్రం కూటమి సభ్యులు, దాసుభాషితం యాప్ వాడుకరులే. చిన్న పాప అవంతికని వారి తల్లిదండ్రులు మా స్టాల్ కి తీసుకొచ్చి ఆ పాప చదివిన పోతన పద్యాలు మాకు వినిపించడం, ఆ పాప మీనా అక్క గొంతు గుర్తు పట్టి వారి కథల గురించి వారికే చెప్తుంటే ఆమె కళ్ళల్లో కలిగిన ఆ ఆనందం నేను చూశాను. కళ్యాణ్ పట్లోళ్ల గారు అయితే 2 రోజులు వరసగా స్టాల్ కి రావడమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా వారికి ఎన్నో పనులు ఉన్నా వారి మనసు అంతా ఇక్కడే ఉందంటూ “మీకేమైనా సహాయం కావాలా నన్ను రమ్మంటారా? వచ్చేస్తాను” అని అన్నారు.
ప్రసూన గారు మాకోసం ఫిల్టర్ కాఫీ పెట్టుకుని తీసుకొచ్చారు. మోహన్ కృష్ణ గారు మాకు తినుబండారాలు తెచ్చి పెట్టారు. ప్రభ అక్క వాళ్ళ శ్రీవారు బజ్జీలు, పఫ్ లు అంటూ మా కడుపు నింపారు. వెంకట రాజు గారు వారి పిల్లల్ని తీసుకిని మా స్టాల్ కి వచ్చి మేము అంత గొప్ప వాళ్ళం అంటూ మా గురించి గర్వంగా చెప్పారు. సుబ్బారావు గారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. వారు వచ్చి మీకు సాఫ్ట్వేర్ పరంగా, ఇంకా ఇతర టెక్నికల్ విషయాలకు నేను వాలంటీరింగ్ చేస్తాను ఏమైనా ఉంటే తప్పకుండా నాకు చెప్పండి అంటూ మమ్మల్ని సంప్రదించారు, కృష్ణ గారు, శివ గారు ఇంకా ఎంతో మంది కూటమి సభ్యులు మాకోసం వచ్చి మాతో పాటుగా దాసుభాషితం యాప్ గురించి ప్రచారం చేసారు. మీకంటే మాకు గొప్ప సెలబ్రెటీలు ఎవరుంటారు అండి. మీ అందరినీ చూస్తే మా గుండె నిండిపోయింది.
సంక్రాంతికి, న్యూ యియర్ సంబరాలకి కంటే కూడా ముందే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పుస్తకాల పండగ తెచ్చే ఈ హడావిడి, హంగామా, సందడి భలే ఉందండి. సంక్రాంతికి చుట్టాలను కలుసుకున్నట్లు మిమ్మల్నందిరిని ఇలా కలుసుకుకోవడం మాకు ఎంతో సంతోషం. మళ్లీ త్వరలోనే మనం ఇలా కలుసుకోవాలని ఆశిస్తున్నాను. మాకోసం స్టాల్ కు వచ్చి, మమ్మల్ని అభినందించి, ఆనందింపజేసిన వారందరికీ ధన్యవాదాలు. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి.
మారీచ మార్గం - నవల
చరిత్ర చెప్పాలంటే ఎంతో తెలిసి ఉండాలి. నిష్పక్షపాతంగా జరిగిన సంఘటనలను ఒప్పుకోగలగాలి. ఒకవైపు ఒరిగి మాట్లాడకుండా ఉండగలగాలి. అలాంటి చరిత్రకారులు ప్రపంచంలోనే చాలా అరుదు. అందులోనూ ఆ చరిత్రను చదివించేదిగా, నాన్ ఫిక్షన్ లో చెప్పడం ఇంకా అరుదు. అలా చెప్పగలవారిలో మన తెలుగు రచయిత శ్రీమతి పాలంకి సత్యగారు ఒకరు. దాసుభాషితం శ్రోతలకు ‘సత్య చరిత్ర’ లెసన్ ద్వారా, గత నెల నిర్వహించుకున్న ప్రసంగం ద్వారా, మన యాప్ లో ఉన్న వారి శ్రవణ పుస్తకాల ద్వారా వారు పరిచితులే.
వారి నవలనే మరోటి ఈ వారం విడుదల చేస్తున్నాం. ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో, కాటన్ దొర ఇంకా ధవళేశ్వరం బ్యారేజి కట్టనప్పుడు, అఖండ గోదావరి అందుబాటులో ఉన్నా కూడా, కోస్తా జిల్లాలు కరువుతో అల్లాల్లాడిపోతున్నప్పటి కథ. ఉప్పాడలోని ఒక చేపలు పట్టుకునేవాడు పొట్ట చేతపట్టుకుని ఎలా మద్రాసు వెళ్ళాడు, ఆ తరువాత మారిషస్ చేరాడు అనేది ఈ నవల కథాంశం. పిల్లాడు పని చేస్తే కందిపోతాడు అని భయపడే తల్లి, మారిషస్ కి పని కోసం ఎలా పంపించిందో, ఎలా బాధపడిందో వింటే కన్నీళ్ళు రానివాళ్ళుండరేమో.
తెలుగు ప్రాంతం నుండి ఒకప్పుడు ఎలా వలసలు కొనసాగాయో, ఇప్పటికీ మలయా, బర్మా, మారిషస్ వంటి దేశాల్లో ఉన్న చాలామంది తెలుగు మూలాలు ఎలా ఏర్పాడ్డాయో ఈ నవల వింటే తెలుస్తుంది. ఆ సమయానికి, ఆ ప్రాంతానికి తీసుకుపోగల సత్యగారి కథనా చాతుర్యం గురించి ప్రత్యేకించి మీకు వివరించనవసరం లేదు. కాబట్టీ, ఈ వారం విడుదల అవుతున్న ఈ మారీచ మార్గం నవల విని చూడండి. ఒకనాటి వలసల కన్నీటి గాథ మీ గుండెల్ని తాకుతుంది.
అభినందనలతో,
రామ్ కొత్తపల్లి.