మిస్సమ్మ రీ-రిలీజ్

Meena Yogeshwar
January 13, 2024

తెలుగువారందరి అభిమాన పండుగ సంక్రాంతికి సినిమా పరిశ్రమ డజన్ల కొద్దీ సినిమాలు విడుదల చేస్తుంది. ఈ మధ్య ప్రతి హీరో పుట్టినరోజుకీ వారి పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సంప్రదాయాలనూ పాటిస్తూ, సంక్రాంతి సందర్భంగా, తెలుగు సినిమా అంటే ఠక్కున గుర్తుకువచ్చే సినిమాల్లో మొదటివరసలో ఉండే సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నాం. అదేమిటంటే..

నెలకి ఐదువేలు జీతం అయినా, ఐదు లక్షల జీతం అయినా, తెలుగు యువత తప్పకుండా తమ బడ్జెట్ లో ఒక విషయానికి అత్యవసరమైన చోటు ఇస్తారు. అదేంటో తెలుసా? ఆ నెల విడుదలయ్యే సినిమాల్లో తాము చూడాలనుకున్నవాటి కోసం టికిట్ల బడ్జెట్. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉండే తెలుగువారికే ప్రత్యేకమైన బడ్జెట్. తెలుగు వారికి తిండి, బట్ట, ఇల్లు లాంటి నిత్యావసరాలలోకి సినిమా చేరి చాలా తరాలు అయింది.

కొత్త అల్లుడు ఇంటికి వస్తే సినిమా, పండగ వస్తే సినిమా, పుట్టినరోజుకి సినిమా, పెళ్ళిరోజుకు సినిమా, ప్రమోషన్ వస్తే సినిమా, ప్రేమ విఫలమైతే సినిమా, పరీక్షలు అయిపోతే సినిమా, పరీక్షలు మొదలైతే చాలారోజులు చూడకుండా ఉండాలి కాబట్టీ 15రోజుల ముందే ఒక సినిమా, కాలేజి పాఠాలు బోరు కొడితే సినిమా, ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించుకునేందుకు సినిమా. ఇలా తెలుగువారికి ప్రతి సందర్భంలోనూ సినిమా.. సినిమా.. సినిమా..

పిల్లలకి మొదటిసారి జుట్టు మొక్కు ఇవ్వడం ఎంత ముఖ్యమో, వారు చూసే మొదటి సినిమా కూడా అంతే ముఖ్యం. మొదటిసారి స్నేహితులతో కలసి చూసిన సినిమా, ప్రేమలో పడ్డాకా కలిసి చూసిన మొదటి సినిమా, పెళ్ళయ్యాకా మొదట చూసిన సినిమా, మొదటిసారి కాలేజీ బంక్ కొట్టి చూసిన సినిమా. తెలుగువారికే ప్రత్యేకమైన మైల్ స్టోన్స్ ఇవి.

ఇక ప్రకృతిలో ఎన్ని ఋతువులు ఉన్నాయో, అవి ఎంత ఠంచనుగా వచ్చేస్తాయో, తెలుగు సినీరంగానికి కూడా అన్ని సీజన్లూ ఉన్నాయి. సంక్రాంతి పెద్ద పండగ, ఉగాది, వేసవికాలం సెలవులు, దసరా పండగ, దీపావళి, క్రిస్మస్ ఇలా తెలుగు సినిమాలు నిండుగా విడుదలయ్యే సీజన్ల హడావిడి గురించి తెలుగు నాట పుట్టిన మూడేళ్ళ పిల్లలకి కూడా క్షుణ్ణంగా తెలుసు.

అందుకే తెలుగువారందరి అభిమాన పండుగ సంక్రాంతికి సినిమా పరిశ్రమ డజన్ల కొద్దీ సినిమాలు విడుదల చేస్తుంది. ఈ మధ్య ప్రతి హీరో పుట్టినరోజుకీ వారి పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సంప్రదాయాలనూ పాటిస్తూ, సంక్రాంతి సందర్భంగా, తెలుగు సినిమా అంటే ఠక్కున గుర్తుకువచ్చే సినిమాల్లో మొదటివరసలో ఉండే 'మిస్సమ్మ' సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నాం.

Tap to Listen

రీ-రిలీజ్ అంటే తెర కట్టి బొమ్మ వేయనక్కర్లేదనీ, వినగానే సినిమా చూసిన feeling రప్పించవచ్చు అనీ, ఈ సినిమాపై ప్రముఖ కోరా రచయిత శ్రీ అలోక్ నంద ప్రసాద్ గారు రాసిన వ్యాసం వింటే తెలుస్తుంది మనకి. ఈ వ్యాసం 'వందే సినీ మాతరం' అనే లెసన్ కు మొదటి భాగం. తెలుగు సినిమా చరిత్రలో తప్పక తెలుసుకోవాల్సిన సినిమాల గురించి అలోక్ గారు రాయబోతున్న వ్యాస పరంపరే ఈ లెసన్. సంక్రాంతి కానుకగా మీ అభిమాన థియేటర్ దాసుభాషితంలో 'మిస్సమ్మ'.

ప్రైడ్ అండ్ ప్రజుడీస్ - విశ్లేషణ

‘లేదని చెప్ప నిమిషం చాలు.. లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావాలె ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా’ టబు, అజిత్ ల ఈ పాట అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ‘ప్రియురాలు పిలిచింది’ పేరుతో తెలుగులోకి వచ్చిన ఈ తమిళ సినిమా కథ ప్రముఖ రచయిత్రి జేన్ ఆస్టిన్ రాసిన ‘సెన్స్ అండ్ సెన్సిబులిటీ’ నవల నుండి తీసుకున్నదే.

కథానాయిక పాత్ర ప్రవర్తనతో సహా జేన్ ఆస్టిన్ నాయిక ఎలనార్ ను సాక్షాత్కరింపజేశారు టబు అంటారు తన వ్యాసం ‘ప్రజ్ఞా పారమిత జేన్ ఆస్టిన్’లో ప్రముఖ రచయిత్రి మైథిలి అబ్బరాజు గారు. మన తెలుగు లెక్కల ప్రకారం ఒక నవల సినిమాగా వచ్చిందంటే, చాలా ప్రసిద్ధమైంది అనే కదా. ఆ లెక్కన జేన్ ఆస్టిన్ నవలలు ఎంత ప్రసిద్ధమంటే నేటికి ఎన్ని సినిమాలు, సిరీస్ లు వచ్చాయో లేక్కే లేదు.

మధ్య తరగతికి అర మెట్టు పైన, ఎగువ మధ్యతరగతికి అర మెట్టు కింద ఉండే కుటుంబంలో 1775లో పుట్టారు జేన్. ఆమెకు టీనేజ్ మొదలైన దగ్గర నుంచి పెళ్ళిళ్ళు, పార్టీలు, పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు పడే తపనలు, ఆ పెళ్ళిళ్ళ కోసం రెండు వైపులా ఆస్తి తూకాలు, అవి సమంగా తూగకపోతే ఎంత ఇష్టపడ్డా నడి మధ్యలో పెళ్ళిళ్ళు ఆగిపోవడాలు, సమంగా తూగితే ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు జరిగి అసంతృప్తిగా బతుకు గడిపేయడాలు వంటివి చూస్తూ పెరిగిన ఆమె సాహిత్యం నిండా అవే నిండాయి. పెళ్ళిళ్ళు తప్ప ఆమె ఏమీ రాయలేదు అని విమర్శించిన వారు ఎందరున్నారో, తను చూసిన వాస్తవం తప్ప మరేమీ రాయని ఆమె నిబద్ధతకి సలాం కొట్టినవాళ్ళు కోకొల్లలు. ఆమె నవలలు చదివితే, దేశం ఏదైనా ఆడపిల్ల పెళ్ళి అనేది కత్తి మీద సామే అనే రియాలిటీ మొహాన ఫెళ్ళున తగులుతుంది.

ఆస్తిలో తూగకపోవడం వలన, ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి జరగలేదు జేన్ కు. తరువాత మరొకతనితో పెళ్ళి స్థిరపడినా, అతను నచ్చక పెళ్ళి రద్దు చేసుకుంది. ఆఖరికి పెళ్ళి చేసుకోకుండానే నలభై రెండవ ఏట అనారోగ్యంతో మరణించిన ఆమె, తన సాహితీ సారస్వతమంతా పాఠకులకు ఇచ్చిన సందేశం ఏమిటంటే పెళ్ళికి ఆస్తి అంతస్తులను కాక, compatibility, intellectual maturityలను ప్రాతిపదకగా చేసుకోమని. ఈ వారం ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు శ్రీమతి మాలతీ చందూర్ గారు జేన్ ఆస్టిన్ నవలల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘ప్రైడ్ అండ్ ప్రజుడీస్’ పై రాసిన విమర్శ విడుదల అవుతోంది. వింటారుగా.

Tap to listen

ఇక గత వారం సర్వజ్ఞ సభ్యులకు ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూపు దాసుభాషితం కూటమిలో దాసుకిరణ్ గారు అద్వైతం-విశిష్టాద్వైతాలపై #ఆనందకిరణంలో రాసిన పోస్ట్ పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. వేల ఏళ్ళ వాదనలకు తట్టుకుని నిలబడ్డ అద్వైతం అన్ని మతాల వారూ పాటించదగ్గది అన్న మాట కొందరు సభ్యులకు ఇబ్బందికరంగా తోచడం మిగిలినవారికి మంచిదైంది. దానివలన మంచి చర్చ కొనసాగింది. ఇక నేను అడిగిన #మీ_నా_ప్రశ్నకు ఇద్దరు తప్ప ఎవరూ స్పందించలేదు అని నేను అలిగాను. రామ్ రాసిన #లోకాభిరామం చక్కటి నవ్వులు పూయించగా, ప్రభ గారి #సుప్రభాతం మనల్ని చిన్నతనంలోకి లాక్కుపోయింది. తద్వారా ఆమె పోస్ట్ ఈవారం హైలైట్ గా నిలిచింది అని నా అభిప్రాయం. అలా వేడిగా మొదలై హాయిగా సాగింది కూటమి ఈ వారం. వచ్చే వారం సంక్రాంతి సందర్భంగా మరిన్ని మంచి చర్చలు జరుగుతాయిని జోస్యం కూడా చెప్పగలను నేను.

                                                                                                                     అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :