నాహం కర్తా, హరిః కర్తా..

Meena Yogeshwar
August 8, 2023

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శనం సామాన్య భక్తునికి ఎంత నాణ్యతతో అందించగలనా అని నిరంతరం తపించిన ప్రసాద్ గారి గురించి ఈ పుస్తకంలో మనం చాలా తెలుసుకున్నా, దాసుభాషితం ప్రసంగాలు కార్యక్రమంలో పాల్గొన్నవారి వలన ప్రసాద్ గారి గురించి మనకు తెలిసినదేమిటంటే...

దాదాపు 3వారాల క్రితం దాసుకిరణ్ గారు మా వీక్లీ మీటింగ్ లో నాహం కర్తా పుస్తకం వచ్చి 20ఏళ్ళు అవుతోందని ఆ పుస్తక అభిమానులు ఏర్పరిచిన ఒక వాట్సాప్ గ్రూపులో చూశానని, దానిపై మనం ప్రసంగం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు. తాను ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి గోపిక ప్రసాద్ గారిని ఆహ్వానిస్తానని చెప్పారు. నేను ఆ పుస్తకానికి ఎడిటింగ్ చేసిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ జి.వల్లీశ్వర్ గారు మాకు కుటుంబ మిత్రులని, వారిని నేను ఆహ్వానిస్తాను అని చెప్పాను. వల్లీశ్వర్ గారు, గోపిక అమ్మగారు సవినయంగా మా ఆహ్వానాన్ని మన్నించారు. అయితే వల్లీశ్వర్ గారిని సంప్రదించడం ఈ కార్యక్రమాన్ని మరో మలుపు తిప్పింది.

ఎందరో IAS, IPS అధికారులతో దగ్గరి సాన్నిహిత్యం కలిగిన వల్లీశ్వర్ గారు, ప్రసాద్ గారి మిత్రులను, ఈ పుస్తకంలోని కొన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు అనదగ్గ వారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించమని సూచించారు. సూచించడమే కాక, స్వయంగా వారి ఫోన్ నెంబర్లు కూడా అందజేశారు. అలా ఈ పుస్తకంలో తరచూ మనకు కనిపించే, అప్పటి తిరుపతి అడిషనల్ ఎస్పీ, విశ్రాంత IPS అధికారి, పోలీస్ సాక్షిగా - ఉద్యోగ విజయాలు పుస్తక రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు గారు, ప్రసాద్ గారితో ఏళ్ళ అనుబంధం, కలిసి పని చేసిన అనుభవం కలిగిన మాజీ CRPF, SSB Director General, విశ్రాంత IPS అధికారి శ్రీ ఎం.వి.కృష్ణారావు గార్లను సంప్రదించాను. వారు కూడా ప్రసాద్ గారి పేరు వింటూనే ఎంతో ఆనందంగా మా ఆహ్వానాన్ని మన్నించారు. నేను పిలిచేందుకు ఫోన్ చేసినప్పుడే ప్రసాద్ గారిని తలుచుకుని, వారితో గడిపిన ఎన్నో సందర్భాలను వివరించారు కృష్ణారావు గారు.

ఇక మన సర్వజ్ఞ సభ్యులను అలరించడానికి మరో కార్యక్రమం రూపొందించాలి అని అనుకుంటుండగా, శ్రీ పవన్ సంతోష్, శ్రీ అలోక్ నంద ప్రసాద్ గార్లు క్విజ్ కార్యక్రమం బాగుంటుందని సూచించారు. మన pilot కార్యక్రమాన్ని ఈ పుస్తకంతోనే చేస్తే మరింత బాగుంటుందని కిరణ్ గారు అన్నారు. అలా నేను, శ్రీమతి ప్రత్యూష గారు, శ్రీ అలోక్ నంద ప్రసాద్ గారు, శ్రీ పవన్ సంతోష్ గార్లతో ఒక Editorial Team రూపొందించబడింది. నేను అడిగిన వెంటనే ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రశ్నలు పంపారు వారు. అలా ఆ pilot quiz కూడా ఈరోజే ఏర్పాటైంది.

ఇందరు పెద్దవారు, బహు పాఠకాదరణ పొందిన పుస్తకంపై మాట్లాడుతుండగా, ఈ కార్యక్రమంతో పాటు, క్విజ్ కూడా నేను నిర్వహించాల్సి రావడం నాకు చాలా tension తెచ్చింది. సరిగ్గా అనుకున్నట్టుగా కార్యక్రమం నడుస్తుందా? మధ్యలో ఏమైనా technical ఇబ్బందులు వస్తాయా? నేను ఎక్కడైనా పొరపాటుగా మాట్లాడతానా? క్విజ్ ను engaging గా నడపగలనా? ఇలా ఎన్నో ప్రశ్నలు. అయితే ఈ పుస్తకం నేర్పిన ఒక మంత్రం ఉందిగా అదే జపించి, కార్యక్రమంలో కూర్చున్నాను. అదే ‘నాహం కర్తా, హరిః కర్తా’. నాదేం లేదు, అంతా ఆయనే నడిపిస్తారు. ఈ పుస్తకంపై ఏదో ఒక కార్యక్రమం అనుకున్న దాన్ని, గోపికమ్మగారు, వల్లీశ్వర్ గారు, సీతారామారావు గారు, కృష్ణారావు గారు, క్విజ్ ఇలా దాని scale ను ఎవరైతే పెంచుకుంటూ వెళ్ళారో, వాళ్ళే దానిని safe landing చేస్తారనిపించింది.

అలాగే నేను ఎలా మాట్లాడినా సహృదయతతో తీసుకున్న మీ అందరి వలనా ఈ కార్యక్రమం చాలా బాగా నడిచింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శనం సామాన్య భక్తునికి ఎంత నాణ్యతతో అందించగలనా అని నిరంతరం తపించిన ప్రసాద్ గారి గురించి ఈ పుస్తకంలో మనం చాలా తెలుసుకున్నా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వలన వారి పూర్తిస్థాయి వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలిగాం. ఇంతకన్నా ఈ కార్యక్రమం గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పను. వచ్చే వారం ఈ కార్యక్రమం పూర్తి వీడియోను విడుదల చేస్తాం. ఆ వారం విడుదలయ్యే Newsletterలో మరిన్ని వివరాలను మీతో పంచుకుంటాం.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :