May 28 'ది ఎన్టీఆర్' 97 వ జయంతి. వెండితెర వేల్పు, సినిమా రంగంలో అజాతశత్రువు, రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించిన నాయకుణ్ణి గురించి కొత్తగా చెప్పటం కష్టం. అయినా ఆయన కుమారుడు, నటుడు బాలకృష్ణతో పూర్వం చేసిన ఈ ముఖాముఖీలో కొన్ని ఆసక్తికర, హాస్యభరిత విషయాలను మీరు వింటారు.
ఎటువంటివంటే,
- ఎన్టీఆర్ అనగానే అందరూ ముందుగా చెప్పేది ఆయన సమయపాలనా క్రమశిక్షణ గురించి. ఆ గుణాల కారణంగానే బాలకృష్ణ మీద కన్నెర్ర జేసిన సందర్భం, దాని పర్యవసానం.
- ఎన్టీఆర్ ను తండ్రిగా కన్నా నటుడిగానే ఎందుకు ఎక్కువ చూడవలసి వచ్చింది.
- ‘జగదేకవీరుని కథ’లో శివశంకరి పాట బాలకృష్ణ కరీర్ లో ఏ పాటకు స్ఫూర్తి నిచ్చింది.
- ఎన్టీఆర్ సినిమా ప్రొజెక్షన్ ను బాలకృష్ణ మోహనకృష్ణ తమ థియేటర్లోనే ఎందుకు అడ్డుకున్నారు.
- ఇతర నిర్మాతలపట్ల ఎన్టీఆర్ ఎందుకు అంత బాధ్యతగా ఉండేవారు.
ఎన్టీఆర్-బాలకృష్ణ ల సంబంధం గురించి వింటుంటే, సినిమా పరిశ్రమలు, నటన శైలులు వేరైనా, రాజకపూర్-రిషికపూర్ లు గుర్తురాకమానరు. రాజ్ కపూర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ సినీ లెజెండ్లే. ఇద్దరికీ సినిమా రంగంలోని అన్నీ విభాగాలపై మంచి అవగాహన ఉంది. అందుకే, ఇద్దరూ నటులుగా, నిర్మాతలుగా, దర్శకులుగా విజయం సాధించారు. ఇద్దరూ తమ కుమారులని లేత వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం చేశారు. కుమారులు ఇద్దరూ కథానాయకులు గా చేసిన మొదటి సినిమాతోనే విజయం సాధించారు. బాలకృష్ణ రిషి కపూర్ ఇద్దరు కూడా తమ తండ్రులని తండ్రిగా కంటే ఒక కళాకారుడిగా, గురువుగా ఎక్కువ చూశామని చెప్తారు. ఇటువంటి ఆసక్తికర సామ్యాలు మనకి కనిపిస్తాయి.
వినండి. నందమూరి బాలకృష్ణ తో ముఖాముఖీ.
ఇక ఈ వారం…
గిరిజా కళ్యాణం రెండవ ఆఖరి భాగం తో పాటు, కాశీ మజిలీ కథలు మూడవ సంపుటం విదులయ్యింది.
కాశీ మజీలీ కథలు 19వ మజిలీ నుంచి 30 వ మజిలీ వరకూ ఉన్న ఈ మూడవ సంపుటంలో, మణి సిద్ధుడు, గోపాలుడు కోరిన అనేక ఆసక్తికరమైన కథలు చెపుతాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్ట దిగ్గజకవులలో ప్రముఖుడైన తెనాలి రామకృష్ణ ప్రసక్తి కూడా ఈ సంపుటంలోనే వస్తుంది. ఈ కవిని గురించి ఇతర గ్రంధాలలో ఉన్న ప్రస్తావనకు భిన్నంగానూ, వినూత్నంగానూ ఉండటం మనం గమనిస్తాము. ఇదే కాకుండా కందర్పుని కథ, విద్యావతి కథ, దుష్ట వర్మ, వీరప్రతాపుడు మొదలైన కథలు మనోరంజకంగా చెప్పబడ్డాయి. వింటే తప్పక ఆనందిస్తారు.