‘తింటే గానీ రుచి తెలియదు, దిగితే గానీ లోతు తెలియదు’ అంటుండేది మా అమ్మ. నాకు కొత్తవి ఏవి ప్రయత్నించాలన్నా ఒక రకమైన అయిష్టం. ఏమో అవి నాకు నచ్చకపోతే? లేదంటే ఆ కొత్త పని నేను నేర్చుకోలేకపోతే? అందరి ముందూ మాట్లాడలేకపోతే? ఇలా ఉండేవి నా భయాలు. అందుకే తినేవాటిలో కొత్తవి ప్రయత్నించడం కన్నా అలవాటైనవి తినడానికే ఇష్టపడేదాన్ని. ఏమో అది తింటే నాకు నచ్చకపోతే ఇప్పుడు మూడ్ అంతా పాడవుతుంది అనిపిస్తుండేది.
నా ఆరవ క్లాసులో ఒకసారి జిల్లాస్థాయి వక్తృత్వ పోటీలు(Elocution) నిర్వహించారు. నేను మొదట అసలు నమోదు చేసుకోవడానికి నాలుగు రోజులు పట్టింది. ఒకసారి నమోదు చేశాకా, చాలా బాగా తయారయ్యాను. నా అంతట నేను వ్యాసం రాసుకుని, మా నాన్నగారి చేత దిద్దించుకుని, ప్రాక్టీస్ చేశాను. సరిగ్గా పోటీ గంట ఉందనగా, నేను స్టేజి ఎక్కనని మొండికేశాను. ఏమో పైకెళ్ళాకా నేను మాట్లాడలేకపోతే ఏంటి గతి? అమ్మో నేను ఓడిపోతే? అదీ ఇంతమందిలో నావల్ల కాదు అనేశాను.
ఎప్పుడు కొత్తది తినాలన్నా నేను మారాం చేస్తే అమ్మ చెప్పే పై సామెత, అప్పుడు కూడా చెప్పింది. నాకు చిరాకేసింది. ఊరుకోమ్మా ఎప్పుడు చూడు అదే సామెత. దానికీ, ఈ సందర్భానికి సంబంధం ఏమిటి? అది కూడా మనకి చిరాగ్గా ఉన్నప్పుడు పాడుతున్నట్టు లయబద్ధంగా చెప్తావు అని విసుక్కున్నాను. అప్పుడు మా అమ్మ చెప్పిన మాట ఈనాటికీ నాకు గుర్తే.
‘చూడు గాయత్రి, ఏదైనా ప్రయత్నిస్తేగానీ అందులో నీకు అభిరుచి ఉందో లేదో నీకు తెలియదు. చిన్నప్పుడు అన్నప్రాశన రోజున పాప చూడు తల్లి పాలను దాటి వేరేది తినడానికి ముందు ఒప్పుకోదు. కానీ నోటి మీద పాయసం పడగానే చక్కగా చప్పరిస్తుంది. అలా, ప్రయత్నించకపోతే నీకు నచ్చుతుందో లేదు, అందులో నువ్వు రాణించగలవో లేదో ఎలా తెలుస్తుంది? ఏమో ఇప్పుడు వక్తృత్వపోటీలో పాల్గొనాలంటే భయపడుతున్నావు, రేపు నువ్వు కూడా మీ నాన్నగారిలాగా కార్యక్రమాలు నిర్వహించడమే ప్రవృత్తిగానో, అసలు వృత్తిగానో ఎంచుకుంటావేమో. అందులో రాణిస్తావేమో. అది తెలుసుకునే అవకాశాన్ని నీ నుండి నువ్వే లాగేసుకుంటే ఎలా?’ అని అడిగింది. మా అమ్మ చెప్పింది నిజమైంది. ఆరోజు నాకు జిల్లాస్థాయిలో మూడవ బహుమతి వచ్చింది. నేడు నా ఉద్యోగ బాధ్యతల్లో ముఖ్యమైన వాటిలో ప్రసంగాలు నిర్వహించడం ఒకటి.
అయితే, ఈ కథలో ఒక మలుపు ఉంది. అదే నేటి నా నిర్వహకత్వానికి ఉపయోగపడేది. మొదటిసారే మూడవ స్థానం పొందిన నేను. రెండవసారి చిత్తుగా ఓడిపోయాను. స్టేజి ఎక్కి ఒక్క లైను కూడా పూర్తి చేయకుండా ఏడుస్తూ కిందకి దిగిపోయాను. తల కొట్టేసినట్టైపోయింది. ఓడిపోయాననే బాధ. నేను ఏ విషయంలో గెలిచినా మా నాన్నాగారు నా కోసం రవ్వదోశ తేవడం అలవాటు. ఆరోజు కూడా తెచ్చారు. అది చూసి నా బాధ కట్టలు తెంచుకుంది. అప్పుడు చెప్పారు ఆయన ‘ ఓడిపోతానేమో అనే భయం లేకుండా స్టేజిపైకి వెళ్ళడం వరకూ నువ్వు చూపిన ధైర్యమే ముఖ్యం. గెలుపు, ఓటములు కాదు. పని చేయడం వరకే నీ పని, ఫలితం నీ చేతిలో లేదు అనే భగవద్గీత వాక్యం ఎప్పుడూ గుర్తుపెట్టుకో’ అని చెప్పారు.
ఒక గెలుపు, ఒక ఓటమి నేడు నా public speaking వెనుక ఉన్న ధైర్యం. ఇది చాలామందిలో లోపిస్తుంది. ఓడిపోతానేమోనన్న భయం వారిని ముందే ఆపేస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో తమ తోటి వారు, చుట్టాల పిల్లలతో తమ వారిని పోల్చుకోవడం, పిల్లల విజయాలలో తమ పెంపకపు విజయం వెతుక్కోవడం వలన ఈ సమస్య ఇంకా పెరిగిపోతోంది. అసలు, తమ పిల్లలు మార్కుల వెంటపడడం తప్ప, మరేమీ చేయనవసరం లేదనీ, అసలు వేరేవి ప్రయత్నించి ఓడిపోతే తమ పరువు పోతుందనే ఆలోచనా ధోరణి మరింత బాధాకరం.
దానికి ఈ కాలపు కారణాలతో పాటు, తరుణ వయస్కుల్లో మనం పెంపొందించాల్సిన లక్షణాలను గురించి, life skills గురించి ఎంతో చక్కగా వివరించారు ఈ నాటి ప్రసంగకర్త శారద అక్కినేని గారు. సాధారణంగా రామాయణ, మహాభారతాలు మన పిల్లలకు చెప్పడం అనే అలవాటు మన ఇళ్ళల్లో ఉంది. రాముడికే తప్పలేదు కష్టాలు, ధర్మరాజంతటివాడే అవమానాలు పడ్డాడు వంటి వాక్యాలు మన నిత్య జీవనంలో అలవాటే. వాళ్ళతో పోల్చుకుని, మన కష్టాలకు సమాధానాలు వెతుక్కోవడం మనకు తరతరాల నుండి వస్తున్న ఆస్తి.
దానిని కొనసాగిస్తూ ఈ రోజు ఆమె చెప్పిన ఒక ఉదాహరణ నా మనసుని బాగా హత్తుకుంది. ‘సాధారణంగా ధైర్య, సాహసాలకు, విజయానికి హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం మనం. ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన నామం తలచుకుంటాం. అలాంటిది సీతమ్మని వెతికే క్రమంలో ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్నిసార్లు ఓటమిని చవి చూశాడో తెలుసా? ఆఖరికి ఆయన కూడా ఒక సమయంలో Depressionకు లోనై, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆయన నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, తిరిగి నిలబడ్డాడు, తన బాధను దాటాడు, ఓటమి నుండి నేర్చుకుని విజయం సాధించాడు. అంతటి మనో, శరీర బలవంతుడికే ఇవన్నీ తప్పలేదంటే మనమెంత అన్నది నేర్చుకోవాలి. ఆయనలా ఓటమిని గౌరవించడం నేర్చుకోవాలి’ అని చెప్పారు.
నిజంగా ఈ మాటలు నాకు ఎంత బలాన్ని ఇచ్చాయో చెప్పలేను. ఓటమిని దాటడం అనే కోణంలో సుందరకాండను ఇంతవరకూ అంత ప్రత్యేకంగా నేను అర్ధం చేసుకోలేదు. ఇలాంటి ఎన్నో మంచి ఉదాహరణలు, DotX సంస్థ తరఫున వారు చేస్తున్న పనిని వివరించారు శారద గారు. ఇలాంటి ఒక సంస్థ ఉంది అని, వారు ఇంత unique పని చేస్తున్నారు అని తెలుసుకుని ఎంత ఆనందం అనిపించిందో. ఎందుకంటే ఎక్కువగా మన సమాజంలో నిర్లక్ష్యానికి గురయ్యేది తరుణ వయస్కులే. శారీరికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, కెరీర్ పరంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలబడే సమయం అది. అలాంటి సమయంలో వారిని నడిపే ఒక వెలుగు ముఖ్యం. అలాంటి సహాయం ఈ సంస్థ ద్వారా మనం అందుకోవచ్చు. వాటి లింకులు, ఈ ప్రసంగం వీడియో త్వరలో యూట్యూబ్ లో చూడవచ్చు.
ఈ ప్రసంగం విన్నాకా, గొప్ప వారందరి విజయానికి కారణం వారి ఓటములే అని అర్ధం అయింది. అందుకే పైన అన్నాను ఓసారైనా ఓడిపోదాం అని. ఓడిపోయి చూద్దాం, అది ఎటు తీసుకువెళ్తుందో మనని.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.