పాటల విశ్లేషణతో మంత్రం వేసిన సౌజన్య మాడభూషి

Lakshmi Prabha
March 6, 2023

మల్లీశ్వరి సినిమాలో "ఆకాశవీధిలో...", "మనసున మల్లెల..." రెండు పాటలలో "హాయి" అనే పదం ఉంటుంది. ఆ రెండు పలికిన తీరులో వ్యత్యాసం మీరెప్పుడైనా గమనించారా? "ఆకాశవీధి" పాటలో హాయిగా అనడంలో ఒక నిష్ఠూరం ఉంది. "మనసున మల్లెల" పాటలో ‘హాయి’ అనుభవైక్యమైన భావన ఉంది. ఆ విభిన్న భావాలను భానుమతి గారు చాలా స్పష్టంగా పలికించారు. ఇటువంటి subtle nuances వివరిస్తూ...

"ఆకాశవీధి" పాటలో హాయిగా అనడంలో ఒక నిష్ఠూరం ఉంది. 

"మనసున మల్లెల" పాటలో ‘హాయి’ అనుభవైక్యమైన భావన ఉంది. 

ఆ విభిన్న భావాలను భానుమతి గారు చాలా స్పష్టంగా పలికించారు. 

ఇటువంటి subtle nuances వివరిస్తూ దాదాపు 2.30 గం. ల పాటు, సమయం తెలియకుండా సాగిపోయింది శ్రీమతి సౌజన్య గారి ప్రసంగం. ఈ కార్యక్రమం లైవ్ లో చూడలేని వారికోసం రికార్డింగ్ లింకు పైన ఉంది చూడండి

ఒక గాయకుడికి మంచి గళం (గాత్రం) ఉంటే సరిపోదు. పదాలు పలకడంలో స్పష్టత, ఉచ్ఛారణ దోషం లేకుండా పలకడం, చివరి పదాన్ని కూడా మింగకుండా ఆసాంతం పలకడం ముఖ్యం. నేను ఈ సంస్థలో వాయిస్ ఆర్టిస్టుగా చేరినప్పుడు తులసీదాసుగారు నాకు ఈ విషయాలు చెప్పారు. ఇంకా  సౌజన్యగారు చెప్పినట్టు ౘ, ౙ లను ఉపయోగించడంలో అందం గురించి కూడా చెప్పారు. అవి పాడే వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అని అనుకున్నా ఆయన చెప్పినప్పుడు. 

ఈ సంస్థలో ఎడిటర్‌గా చేస్తున్నప్పుడు ఆ తేడా బాగా గమనించా. చాలా మంది ళ, ల లు తేడా బేధం లేకుండా మాట్లాడినప్పుడు మాత్రమే మనకి తేడాగా అనిపిస్తుంది. కానీ ౘ, ౙ లు పలకడంలో ఉన్న అందం అర్ధమైంది. అంతేకాక నటీ, నటులకి ఒక వేదిక మీదో, తెరమీదో వాళ్ళ హావభావాలు ముఖంలో కనిపించేలా చేయడం చాలా కష్టం అనుకున్న. నిజంగా SVR, ANR, NTR ఇలా పాతతరం వాళ్ళు ఆయా పాత్రలకి వాళ్ళ నటనతో ప్రాణం పోస్తే, మధ్య మధ్యలో మన సరదాలకు కాస్త విరామం కోసం చేసే ఈ పాటలు రక్తి కట్టాలంటే గాయకుడికి అది కత్తి మీద సాములాంటిది అని సౌజన్యగారు వివరించాక అర్ధమైంది. 

వారి నటనకి ఆ పాటల్లో అంతటి అందం వచ్చిందంటే గాయకుల, గాయనీమణులు గాత్రం ఎంతో ముఖ్యం. సౌజన్యగారు వివరించినట్టు "అచ్చా జీ మే హారీ ఛలో మాన్ జావోనా" పాటలో భావం పాడడంలో ఉంది. తులసిదాసుగారు చెప్పినట్టు నవలలో హీరోయిన్ ఏడిస్తే మనం ఏడుస్తూ చదవక్కరలేదు. ఆ భావం పలకాలి. అవి పదాలు నొక్కి పలకడంలో, గ్యాప్ ఇచ్చి చదవడంలో తేడా చూపించాలి. కచ్చితంగా ఆ స్పష్టత వినపడుతుంది. ఈ కార్యక్రమంలో ఒక్క పాటనే  కాదు మాటని కూడా (పదాలు పలకడంలో తేడా) చాలా గమనించాము. ఎన్నో నేర్చుకున్నాము. మనసు "హాయిగా" ఉండడానికి పాట మంత్రమే.

“ఈనాటి చర్చ వింటుంటే చాలాకాలం క్రితం రేడియోలో శ్రీ చిత్తరంజన్ గారు మరొకరితో (వారి పేరు తెలీదు) చేసిన ఇటువంటి కార్యక్రమం గుర్తుకొచ్చింది. అందులో చిత్తరంజన్ గారు కొన్ని సినీగీతాలను స్వరపరిచిన రాగాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ వాటిననుసరించి వివిధ భాషలలోని ఆపాతమధురాలను మధ్యలో వారుకూడా కొన్ని ఆలపిస్తూ రేడియోలో ప్రసారం చేయటం జరిగింది.

ఈనాటి కార్యక్రమంలో సౌజన్య మాడభూషి గారు సంగీత దర్శకుల, గాయనీ గాయకుల ప్రతిభ (ఈ మాట సరిపోదేమో), వాటి వలన అజరామరంగా నిలిచిపోయిన కొన్ని తెలుగు, హిందీ గీతాలను అద్భుత విశ్లేషణలతో వారి అమృత గళంలో వినిపించటం చాలా బావుంది. సంగీత సాహిత్యాలలో వారికున్న పట్టును ఈ కార్యక్రమం చాటింది. 

పాటలోని సాహిత్యాన్ని అవగతం చేసుకుంటూ, ఆ సంగీతాన్ని, దానిని ఆలపించిన వారి గళమాధుర్యాన్ని ఆస్వాదిస్తే మనకి కలిగే అలౌకిక ఆనందంతో పాటు ఆ గీత రచయిత, స్వరకర్త, గాయనీ గాయకులు తదితరులందరికీ న్యాయం చేసినట్లవుతుందని నా అభిప్రాయం.  ఒక్కమాటలో చెప్పాలంటే ఇది దాసుభాషితం సమర్పించిన ఒక స్వరరాగ గంగాప్రవాహం.” అంటూ దాసుభాషితం శ్రోత ‘శ్రీ పొనుగుపాటి పతంజలి’ గారి ఈ స్పందన వింటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి ఆనందానుభూతిని అర్ధం చేసుకోవచ్చు.

మంగళహారతి ఇవ్వడం అనేది మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. దేవునికి ఇచ్చే హారతికి ఎంతటి పవిత్రత, ప్రాముఖ్యత ఉన్నాయో, ఎన్నో సందర్భాలలో మానుషులకు ఇచ్చే హారతికి కూడా అంతే విశిష్టత ఉంటుంది. పుట్టినరోజులు, వివాహాలు, పూజలు వంటి శుభకార్యక్రమాలలో ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలు ముచ్చటగా హారతి పాటలు పాడుతూ, వారిని దీవిస్తూ ఇచ్చే హారతి మనందరి మనః ఫలకాలలోనూ భద్రమే కదా. అలాంటి మంగళహారతులకు ప్రచారం కల్పించడంలో ఇలాంటి కృషి ఇంతకు ముందెన్నడూ జరగలేదేమో అనిపిస్తుంది.

ఆ క్రమంలో వచ్చినవే శ్రీమతి తెలికచర్ల కందాళై సీతమ్మ గారు రచించిన మంగళహారతులు. వీరి వంశానికే చెందిన శ్రీమతి మాడభూషి సౌజన్య, తమ కుటుంబంలో సంగీతంలో ప్రావీణ్యం ఉన్నపెద్దలు స్వరపరచిన వీటిని సామాన్యులు సైతం పాడుకునే వీలుగా తన విస్తృత కుటుంబ సభ్యులతో  మధురంగా గానం చేసి, తాము స్థాపించిన అజంతా ఆర్ట్స్ అకాడెమీ ద్వారా ప్రచారంలోకి తేవడంలో విశేషమైన కృషి చేస్తున్నారు. 

‘దాసుభాషితం ప్రసంగాలు’ పాటే మంత్రము శీర్షిక క్రింద శ్రీమతి సౌజన్య వక్తగా విచ్చేసిన నేపథ్యంలో వారి “మంగళ హారతులు” సంచిక వీడియోను మీతో పంచుకుంటున్నాను. 

Tap to Watch

సుమారు నాలుగేళ్ల క్రితం శరన్నవరాత్రుల సందర్భంగా విడుదలైన ఈ సంగీత సంచిక శ్రవణ రూపం ఇప్పటికే దాసుభాషితం యాప్ లో ఉంది. 

Tap to Listen

అభినందనలతో,

లక్ష్మీప్రభ పొనుగుపాటి.


Image Courtesy :