ఈ వారం మా టీం అంతా కలుద్దాం అని హైదరాబాద్ వెళ్ళాను. చాలాసేపు మా మీటింగ్ పూర్తి అయిన తరువాత, తన పని పూర్తి చేసుకుని మావారు కూడా మా మీటింగ్ లో చేరారు. ఏదో మాటల మధ్య మా చదువులు, చిన్నప్పుడు మా కెరీర్ ఆలోచనల గురించి వచ్చింది. నాకు లెక్కలు అంటే ఎంత భయం చెప్తున్నాను. ‘తారే జమీన్ పర్’ సినిమాలో పిల్లాడికి అక్షరాలు గాల్లో ఎగురుతున్నట్టు కనిపించినట్టు, నాకు అంకెలు అలా కనిపించేవి. నాకు లెక్కలు అంటే విపరీతమైన భయం, చిరాకు. అందరు ఉపాధ్యాయులకీ నేను చాలా ఇష్టమైన విదార్ధిని. అన్నిట్లోనూ 90పైనే మార్కులు వచ్చేవి. ఒక్క లెక్కల్లో తప్ప. అది మాత్రం పాస్ అయితే చాలు అన్నట్టు ఉండేది పరిస్థితి. లెక్కల మాస్టర్లకి నేనంటే నచ్చేది కాదు’. అని నా ఉపోద్ఘాతం చెప్తున్నాను.
వెంటనే మా ఇంటాయన ‘లెక్కలంటే అంత భయపడేదానివి, ఇంటర్లో ఎం.పి.సి, బిటెక్ ఎందుకు చదివావు, అసలు ఎలా చదవగలిగావు’ అని అడిగారు. నిజానికి అంతకన్నా పెద్ద options నాకు లేవు. సరిగ్గా నేను ఇంటర్ లోకి అడుగుపెట్టే సంవత్సరమే మా ఊళ్ళో అన్ని కాలేజీల్లోనూ బై.పి.సి తీసేశారు. పెద్దగా విద్యార్ధులు ఉండట్లేదు అని. తిరిగి నేను రెండవ సంవత్సరానికి రాగానే పెట్టేశారు. అదేం విచిత్రమో. ఇక ఇంటర్ తరువాత ఎం.పి.సి అంటే అయితే డిగ్రీ, లేకపోతే బిటెక్. డిగ్రీ వలన పెద్ద ఉపయోగాలు ఉండవు అని మా నాన్నగారు చెప్తే, విధి లేక బీటెక్ లో చేరా.
అసలు బీటెక్ లో ఏ ఏ బ్రాంచ్ లు ఉంటాయో, నాకు ఏది సరిపోతుందో కూడా నాకు తెలీదు. మా మేనత్త గారి అబ్బాయి బీటెక్ చదువుతుంటే, తనకి ఫోన్ చేసి అడిగాను. నీ మార్కులకి సి.ఈ.సి, ఈ.సి.ఈ గట్రా రావు కానీ, ఐటి అయితే సి.ఈ.సితో సమానమైనా కోర్సు సులభంగా ఉంటుంది అది ఎంచుకో అన్నాడు. అలా మొదలైంది నా బీటెక్ పర్వం. ఏదో చదివాం అంటే చదివాం అన్నట్టు సాగింది. తరువాత ఏమిటి అన్న ఆలోచన చేసే అంత సామర్ధ్యం కూడా లేదు అప్పటికి.
అలా ఎక్కడో మునిగి, ఇక్కడ దాసుభాషితంలో నా అదృష్టం కొద్దీ తేలాను. ఇప్పుడు అర్ధం అవుతోంది, నేను ఆర్ట్స్ తీసుకుని, తెలుగుపై చదువుకుని ఉంటే బాగుండేది అని. కానీ ఏం లాభం, బంగారం లాంటి సమయం గడిచిపోయింది. నా కన్నా ముందు తరాల వాళ్ళు, నా తరువాతి తరాలలోని వాళ్ళు కూడా తాము ఏమి అవ్వాలి అనే విషయంపై నిశ్చితమైన అభిప్రాయం, ఒక goal ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరికీ తమ కెరీర్ పై అవగాహన ఉండదు అని కాదు కానీ, చాలా ఎక్కువ శాతం మందికి పూర్తి అవగాహన లేదు అన్నది నిజం. గాలి ఎటు తీసుకువెళ్తే అటు కొట్టుకుపోతూ, ఆ మార్గమధ్యంలో తమకు నచ్చిన చోట ఆగిపోయి, దానినే కెరీర్ అనుకునేవాళ్ళు కోకొల్లలు.
తమకు ఉన్న skills గురించి, వాటిని కెరీర్ గా మార్చుకోగలిగిన ఆలోచనా ధోరణిని తరుణ వయస్కుల్లో పెంపొందించడం చాలా అవసరం. అందులోనూ ముఖ్యంగా ఆంత్రపెన్యూరల్ ఆలోచనా విధానాన్ని వాళ్ళల్లో పెంచడం ఇంకా అవసరం. తమ సామర్ధ్యాలపై ఆధారపడి, తమకే కాక మరో నలుగురికి ఉపాధిని కల్పించగలగడం, తద్వారా సమాజానికి ఉపయోగపడే విధమైన మైండ్ సెట్ ను యువతలో తీసుకురావడం కోసం ఈ కాలంలో ఎందరో ప్రయత్నిస్తున్నారు.
తరువాతి తరం తమ కాళ్ళపై తాము నిలవడమే కాక, మరొకరికి ఉపాధి కల్పించడంతో పాటు, మిగిలినవారికి గొప్ప ఉదాహరణకు నిలవడానికి వారిని తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నవారిలో ప్రముఖ వ్యాపారవేత్త, ఆంత్రపెన్యూర్, సోషల్ వెంచర్స్ పార్టనర్ సంస్థలో పార్టనర్, డాట్ ఎక్స్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శారద అక్కినేని ఒకరు. ఈ సారి వీరు మన ప్రసంగాలు కార్యక్రమానికి విచ్చేయనున్నారు. తరుణ వయస్కులు(young adults)లో ఆంత్రపెన్యూర్ ఆలోచనా విధానాన్ని ఎలా పెంచాలి అనే విషయంపై మాట్లాడనున్నారు.
సెప్టెంబరు మొదటి శనివారం వినాయక చవితి కావడంతో ప్రసంగాలు కార్యక్రమాన్ని ముందుకు జరిపాం. సెప్టెంబరు మొదటి ఆదివారం, 1వతేదీ ఉదయం 9.30గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇది ముఖ్యంగా పిల్లలు, యువత చూడాల్సిన కార్యక్రమం కాబట్టే, ఆదివారం పెట్టాం. కాబట్టీ, మీ పిల్లలు, మీకు తెలిసినవారి పిల్లలకు ఈ ప్రసంగాన్ని తప్పకుండా చూపించండి. కుదిరితే, వారిని ఈ ప్రసంగానికి హాజరయ్యేలా చూడండి. ప్రశ్నోత్తరాల సమయంలో వారికి ఉన్న ప్రశ్నలకు నేరుగా శారద గారే సమాధనం చెప్పేందుకు వీలు ఉంటుంది. వస్తారు, తీసుకువస్తారు కదూ..
అభినందనలు,
మీనా యోగీశ్వర్.